14 January 2022
                            Hyderabad
                          
                            పైలం కొడుకో
                          ఏరుంది నీరుంది పారేటి దారుంది
                            అయినా మూడు పంటల తడి అంటకున్నాది బిడ్డా
                            విత్తుంది ఎరువుంది చల్లేటి మందుంది
                            అయినా మూడు పూటలా కడుపు నిండకున్నాది బిడ్డా
                            లా-ఉంది హామి-ఉంది నేతన్నల నోటి మాటుంది
                            అయినా బండికెత్తిన బస్తా అమ్ముడవకున్నాది బిడ్డా
                            రుణముంది భీముంది అప్పుడప్పుడూ అప్పుమాఫుంది
                            అయినా సాలు కష్టం జేబు నింపకున్నాది బిడ్డా
                            డొక్కుంది గొంతుంది అరిచేటి హక్కుంది
                            అయినా గుండెనిండిన బాధ తగ్గకున్నాది బిడ్డా
                          కడుపు నింపేటోడిని కాలు కింద నొక్కెట్టి
                            రైతన్నదే రాజ్యం అని ఏమార్చింది రాజకీయం
                            అంత కష్టంగా ఉంటే హలం పక్కకు నెట్టి
                            వేరు దారులు చూసుకొండని సలహాలిస్తోంది సభ్య సమాజం
                            నష్టమనుకున్న పనులను కలలోన కూడ
                            తలపెట్టకూడదని పెట్టుబడిదారీల ఆర్ధిక శాస్త్రం
                            వ్యవసాయము వ్యాపారముగా చూడలేక వారసత్వముగా చేయలేక
                            బక్కచిక్కిన రైతు గుండె భగ్గున మండి కన్నెర చేసిండా
                            ఆహార భద్రత మీద కట్టుక్కున్న నాగరికతపు పునాది రాళ్ళు
                            నిలువునా కూలి సమాజానికి పేర్చేను నూతన సమాధి రాళ్ళు