22 August 2016
Hyderabad
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే సంచలనం. సాధారణ నటుడుగా తెరంగేట్రం చేసి అంచెలంచెలుగా ఎదిగి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి. తెలుగు ప్రజలకు, సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు. తెలుగు సినిమా స్టామినాని ఖండాంతరాలు దాటించిన తిరుగులేని స్టార్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలోకి 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి చిరంజీవికి మైల్ స్టోన్ మూవీ అయిన ఖైదీ పేరు వచ్చేలా ఖైదీ నెం.150 అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ ను చిరు పుట్టినరోజు కానుకగా సోమవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో విడుదల చేశారు. అలాగే చిరంజీవి పుట్టినరోజు(ఆగస్ట్ 22)ను ఘనంగా సెలబ్రేట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అభిమాలను మెగా బ్రదర్ నాగబాబు సత్కరించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా అవుట్ స్టాండింగ్ రక్త దాతలకు అవార్డ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా....
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ``అభిమానుల ప్రేమానురాగాలకు మేం ఎప్పటికీ వారికి రుణపడి ఉంటాం. గత పది రోజులుగా అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలు.. పూజలు..చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అభిమానులు మా కుటుంబ సభ్యులే. సినిమాలు హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కానీ అభిమానం ఎప్పుడూ శాశ్వతంమా బ్యానర్ లో నాన్న గారు ఫస్ట్ హీరో అవ్వడం పూర్వ జన్మసుకృతం. . నేను ఓన్ ప్రొడక్షన్ హౌస్ పెట్టాలని అనుకోలేదు. నాన్నగారు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మామ అరవింద్ గారి నిర్మాణంలో సినిమా చేయాలనుకున్నాం. అయితే మా అమ్మ కోరిక కొణిదెల ప్రొడక్షన్ ప్రారంభించాను. మా వినాయక్ గారితో పని చేసిన తర్వాత వేరే డైరెక్టర్స్ తో చేయడం కష్టం ఎందుకంటే ఆయన తన హీరోను అంత బాగా చూసుకుంటారు. అలాగే బ్రూస్ లీ సినిమా టైంలో ఎన్.వి.ప్రసాద్ గారు తనీ ఒరువన్ సినిమా చూడమని అన్నారు. చూసి చేద్దామని అన్నాను. అదే ధృవ. అలాగే రేసుగుర్రం తర్వాత సురేందర్ రెడ్డిగారిని ఓ సినిమా చేయమని నేను అడిగాను. నేను అడిగానని ఆయన రీమేక్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు`` అన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ `` ప్రపంచంలో ఎంతో మంది పెద్ద హీరోలు ఉండచ్చు. కానీ ఇంత పెద్ద రేంజ్ లో ఫంక్షన్ చేసే అభిమానులు మాత్రం ఎవరికీ ఉండరు. అది చిరంజీవిగారికి మాత్రమే సాధ్యం. ఆయన పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా సెలబ్రేట్ చేస్తున్న అభిమానుంలందరికీ థాంక్స్`` అన్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ మాట్లాడుతూ ``చిరంజీవి గారి 61 పుట్టినరోజు అంటున్నారు కాదు, ఈ ఖైది నెం 150 సినిమా చూసిన తర్వాత ఆయన వయసు 21 అంటారు. అంత బాగా ఉన్నారు. ఒక అభిమానిగా ఆయన సినిమాలో ఏం కావాలని కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. అభిమానులు కోసం ఖైదీ నెం 150వ చిత్రంలో ఓ డైలాగ్ చెబుతున్నాను ఓ సీన్ లో చిరంజీవి గారు... ఓరేయ్ పొగరు నా ఓంట్లో ఉంటది... హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఈ చిత్రంలో ఇలాంటి డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది`` అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ``చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 15 సంవత్సరాలుగా నడుస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడటంతో తన వంతు పాత్రను పోషించింది. అందుకు కారణం మెగాభిమానులే. వారు అందించిన సహకారమే. అందుకని వారిలో ఎక్కువ సార్లు బ్లడ్ డోనేట్ చేసిన వారికి అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సక్సెస్ లో కారణమై వారందరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం`` అన్నారు.
మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ ``ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా సంతోషంగా అన్నయ్య పుట్టినరోజు జరుపుకుంటున్న అభిమానులకు హృదయపూర్వక అభినందనలు`` అన్నారు.
సి.రామచంద్రయ్య మాట్లాడుతూ ``సినిమాల్లో చిరంజీవిగారు హిమాలయాలంత ఎత్తుకు ఎదిగారు. సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకుని తపించే వ్యక్తి ఆయన. ఆయనలాంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. చిరంజీవి గారు చేసే రాజకీయ ప్రక్షాళనకు మీరంతా సహకరించాలి. ఆయన రాజకీయాల్లో ఇంకా ఎత్తుకు ఎదిగేలా అభిమానులు సపోర్ట్ చేయాలి``అన్నారు.
అల్లు శిరీష్ మాట్లాడుతూ ``అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ స్టార్ నటుడు కూడా ఇండియన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒకరే అని అన్నారు. నేను కూడా అదే చెబుతున్నాను. సినిమా ఇండస్ట్రీకి వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవిగారే`` అన్నారు.
హీరోవరుణ్ తేజ్ మాట్లాడుతూ ``నేను పెద్దనాన్నకు పెద్ద ఫ్యాన్ ని. ఆయన సినిమాలు ఆపేసి రాజకీయాలకు వెళతాను అన్నప్పుడు గదిలోకి వెళ్లిపోయి ఏడ్చేశాను. ఆయన్ను నేను సినిమా చేయమని చాలాసార్లు అడిగాను కూడా. అయితే ఆయన 9 ఏళ్ళ తర్వాత సినిమా చేస్తున్నారు. అందుకు నేను కూడా ఆయన అభిమానిగా చాలా సంతోషిస్తున్నాను అలాగే చాలా మందికి చిరంజీవి గారు సినిమాలో ఇంతకు ముందులా డ్యాన్స్ చేయగలడా అని అనుకుంటున్నారు వారందరికీ నా సమాధానం...కాశీకి వెళ్లాడు కాషాయం కట్టాడు తన వరుస మారింది అనుకుంటున్నారేమో...అదే స్పీడు అంటూ డ్యాన్స్ , ఫైట్స్ తో ఆయన అదరగొడతారు`` అన్నారు.
హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ``ఇది ఒక మెగా పండుగ. ఖైదీ నెం 150 ఫస్ట్ లుక్ అదిరిపోయింది`` అన్నారు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ `` నేను చిరంజీవిగారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. చాలా సంతోషంగా ఉంది. బాస్ ఈజ్ బ్యాక్...మీ అందరిలాగే నేను కూడా ఖైదీ నెం 150వ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నాను. ఖైదీ నెం 150 యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్``అన్నారు.







