12 December 2017
Hyderabad
151 సినిమాలకు దర్శకత్వం వహించిన దిక్ దర్శకుడు డా.దాసరి నారాయణరావు జీవిత చరిత్రను `తెర వెనుక దాసరి` అనే పుస్తక రూపంలో తీసుకొచ్చారు..సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో టి.సుబ్బరామిరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, కె.రాఘవేంద్రరావు, మురళీమోహన్, శ్రీకాంత్, ఆర్.నారాయణమూర్తి, ధవళ సత్యం, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, తారక ప్రభు, దాసరి అరుణ్‌కుమార్, ఆలమ్మ, హేమాకుమారి, పద్మ, శివాజీరాజా, సి.కల్యాణ్, దవళసత్యం, డా.రఘునాథ్‌బాబు, ముత్యాల సుబ్బయ్య, నరసింహారవు, కోడి రామకృష్ణ, చక్రపాణి, రోజా రమణి, ఎస్.వి.కృష్ణారెడ్డి, ప్రతాని రామకృష్ణాగౌడ్, పుస్తక రచయిత పసుపులేటి రామారావుతదితరులు పాల్గొన్నారు. తొలి పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. తొలి ప్రతిని టి.సుబ్బరామిరెడ్డి, ద్వితీయ ప్రతిని కె.రాఘవేంద్రరావు అందుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - `` మనిషిలో మాణిక్యం అన్నా, సినినిమా పరిశ్రమలో తలమానికి అన్నా, సినీ కార్మికులకు ఇచ్చే ధైర్యం అన్నా..ఎవరో కాదు..లేట్, గ్రేట్ దాసరి నారాయణరావుగారు. ఆయన దాతగా, దార్శినికుడిగా ఆయన ఆర్జించిన కీర్తి విశేషం. అలాంటి వ్యక్తి ఏ విజయం సాధించినా చరిత్రే. అలాంటి చరిత్రకారుడు దాసరిగారు మన మధ్య లేకపోవడం మనకు పెద్ద లోటు. అలాంటి వ్యక్తికి సంబంధించి తెర వెనుక దాసరి అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి పసుపులేటి రామారావుగారు మట్టిలో మాణిక్యం. రామారావు వంటి వ్యక్తులను అరుదుగా చూస్తుంటాం. అప్పట్లో నా గురించి ఎక్కడో ఓ ఆర్టికల్ రాశారు. నేను అప్పట్లో నా దగ్గరున్న కాస్త డబ్బులు ఇవ్వబోతే ..నాకేం వద్దు. మీలాంటి వారిని ఇండస్ట్రీకి పరిచయం చేయడం అనేది నా బాధ్యత అన్నారు. ఇలాంటి వ్యక్తిని అరుదుగా చూస్తుంటాం. నిజమైన అభ్యుదయవాది. ఈ పుస్తకం ఆయన రాయడం ఆయన గురుభక్తికి, దాసరిగారిపై ఉన్న అచంచల ప్రేమకు నిదర్శనం. ఈ పుస్తకం చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుందనడంలో సందేహం లేదు. కాన్ఫిడెన్స్‌ను, కష్టాన్ని నమ్ముకుని వస్తున్న యువకులకు ఇది ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది. నాకు దాసరిగారు ఇన్‌స్పిరేషన్. పాలకొల్లులో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న, దాన్ని వదలిపెట్టి, తన టాలెంట్‌పై నమ్మకంతో వచ్చారు. ఈరోజు ఎంతో మంది శిష్యులు వచ్చారు. దాసరి ముందు, తర్వాత అనే తరహాలో బ్రిడ్జ్‌లా నిలిచారు. ఎప్పుడైనా నిరుత్సాహానికి లోనైనా ఈ పుస్తకం చదివితే ఉత్సాహం ఇస్తుంది. అలాగే ఏదో సాధించేశామని స్తబ్దతలో ఉండే రాఘవేంద్రరావు, మురళీమోహన్ వంటి మా లాంటి వారికి సాధించిందేమీ లేదు. ఇంకా చాలా ఉందంటూ చెప్పే పుస్తకం ఇది. దాసరిగారి గురించి ఎంతో విషయాన్ని సంగ్రహించి పుస్తక రూపంలో తీసుకొచ్చినందుకు రామారావుగారిని అభినందిస్తున్నాను. ఈ పుస్తకావిష్కరణ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు.
ధవళ సత్యం మాట్లాడుతూ - ``పసుపులేటి రామారావుకి, గురువుగారికి మంచి అనుబంధం ఉంది. గురువుగారి గురించి పుస్తకం రాయగల అర్హత ఉన్న వ్యక్తి పసుపులేటి రామారావు. సినిమా ఉన్నంత కాలం గురువుగారి పేరు అలాగే నిలిచిపోతుంది. నా జీవితానికి దారి చూపిన మహావ్యక్తి`` అన్నారు.
కోడి రామకృష్ణ మాట్లాడుతూ - ``దాసరిగారు చరిత్ర ఉన్నన్ని రోజులు సజీవంగానే ఉంటారు. మీరు నమ్ముకోవాల్సింది కృషిని మాత్రమే అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. పసుపులేటి రామారావుగారిని ఆదర్శంగా తీసుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. చాలా విషయాలను నేర్పించారు. ఆయనంత గొప్పవాళ్లం కాలేము కానీ..ఆయన పేరు నిలబెట్టే శిష్యులవుతామని చెబుతున్నాం`` అన్నారు.
రేలంగి నరసింహారావు మాట్లాడుతూ - ``గురువుగారి గొప్పతనం అందరికీ తెలుసు. అయితే పసుపులేటి రామారావుగారు..గురువుగారికి సంబంధించి మాకు తెలియని విషయాలను తెలియచేయడం గొప్ప విషయం`` అన్నారు.
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ - ``మా గురువుగారు చాలా గొప్ప వ్యక్తి. ఓ సందర్భంలో చిన్న తప్పు కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోతే నన్ను సారీ చెప్పమన్నారు. నేను చెప్పనని అన్నాను. అప్పుడు కోపంతో వెళ్లిపోమ్మని అన్న ఆయన, కొన్ని రోజుల తర్వాత నన్ను పిలిచి నాకు ఆశ్రయమిచ్చారు`` అన్నారు.
ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ``ఇండస్ట్రీలో చాలా మందికి ఆయన ఓ సైన్యంలా అండగా నిలబడ్డారు. ఆయనకు నేను ఏకలవ్య శిష్యుణ్ణి. నేను ఏ ఫంక్షన్ చేసుకున్నా, పిలిస్తే కాదనకుండా వచ్చేవారు. సినిమా ఇండస్ట్రీలో అందరి హృదయాల్లో నిలిచిపోయారు. అలాంటి గొప్ప వ్యక్తి మీద పుస్తకం రాసే అదృష్టం పసుపులేటి రామారావుగారికి దక్కింది. అలాంటి పుస్తకాన్ని చిరంజీవిగారు ఆవిష్కరించనుండటంతో పరిపూర్ణత వచ్చింది`` అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - ``ఇండస్ట్రీలో ఏదైనా సమస్య ఉంటే దాసరిగారి నెత్తిన వేసుకుని ముందుండి సమస్యను పరిష్కరించేవారు. మనసులో ఏదున్నా, సమస్య పరిష్కరానికి కృషి చేసేవారు. ఇప్పుడు చిరంజీవిగారు ఆయన స్థానాన్ని తీసుకుని, ఇండస్ట్రీ సమస్యలుంటే ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను. చిరంజీవిగారు అంత ఓర్పుతో చేస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ - ``గురువుగారు మంచి కార్మిక నాయకుడు. నన్ను మా అధ్యక్షుడు కావాలని ఆయనే చెప్పారు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం`` అన్నారు.
రాజేంద్రకుమార్ మాట్లాడుతూ - ``గురువుగారు చివరి రోజుల్లో చిరంజీవిగారితో మంచి అనుబంధాన్ని కొనసాగించారు. గురువుగారు పాల్గొన్న చివరి సినిమా ఫంక్షన్ కూడా అదే. ఆ సినిమా టైటిల్ నుండి చిరంజీవిగారు విషయాలను గురువుగారికి చెప్పేవారు. సినిమా విడుదలైంది. పెద్ద హిట్ సాధించింది. ఆయన హాస్పిటల్‌లో ఉండగా..చిరంజీవిగారు కలిసి సినిమా సక్సెస్ ఫంక్షన్ చేయాలని అన్నారు. కానీ ఫంక్షన్ చేయలేదు. ఆయన ఆపరేషన్‌కు వెళ్లే సమయంలో అల్లు రామలింగయ్య అవార్డును బహూకరించారు. అల్లు రామలింగయ్యతో అనుబంధాన్ని గుర్తు చేసుకునేలా చేసినందుకు చిరంజీవిగారికి థాంక్స్`` అన్నారు.
సి.కల్యాణ్ మాట్లాడుతూ - ``సినిమా పరిశ్రమలో కార్మికుడి పక్షపాతి దాసరిగారు. ఎదైనా సమస్య అంటే ముందుండేవారు. ఈరోజు ఆయన మన మధ్య లేరు. త్వరలోనే ఆయన విగ్రహాన్ని చిరంజీవిగారి చేతుల మీదుగా ఫిలించాంబర్‌లో ఆవిష్కరింప చేస్తాం. మే 4న సినిమా దినోత్సవంగా పాటించాలని ఓ నిర్ణయం కూడా తీసుకున్నాం`` అన్నారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ - ``నేను ఈరోజు ఇలా నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం దాసరిగారే. ఆయన దర్శకత్వంలో 35-40 సినిమాలు నటించాను. నాలాంటి వారెంతో మందికి ఆయన జీవితాన్ని ఇచ్చారు. ఆయన్ని తలుచుకుని అన్నం తినేవారు ఎంతో మంది ఉన్నారు. పరిశ్రమకి ఏ సమస్య వచ్చినా, తన భుజ స్కంధాలపై వేసుకుని పూర్తిచేసేవారు. ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా బావుండాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ``దర్శకుడికి గౌరవం తెచ్చిన వ్యక్తి దాసరిగారు. దర్శకుడే సుప్రీమ్ అని పదే పదే చెప్పేవారు. కొన్ని వందల వేదికలో నా తరపున కూడా ఆయనే మాట్లాడారు. ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. ఇద్దరి మధ్య ఎంతో అండర్ స్టాండింగ్ ఉండేది. పసుపులేటి రామారావుగారికి హ్యాట్సాఫ్`` అన్నారు.
రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ - ``గురువుగారితో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది. చివరి రోజు వరకు ఆయనకు సేవ చేసుకునే అదృష్టం నాకే కలిగింది. ఆయనపై పుస్తకాన్ని రచించిన పసుపులేటి రామారావుగారికి కృతజ్ఞతలు`` అన్నారు.
దాసరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ - ``గురువుగారి గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఆయన్ను ఈ ఫంక్షన్ ద్వారా మరోసారి గుర్తు చేసిన పసుపులేటి రామారావుగారికి థాంక్స్`` అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - `` నేను చదువు పూర్తి చేసుకున్న తర్వాత..ఓ రోజు పాండి బజార్ ఫ్లాట్ ఫాంపై నేను ఎందుకు నిర్మాతగా మారాలనే విషయాన్ని వివరించారు. తర్వాత ఏడాదికి నేను వెళ్లి ఆయన్ను కలిసి సినిమా చేయమని అడిగాను. ఇప్పటికీ గీతాఆర్ట్స్ పెట్టి 40 సంవత్సరాలైంది. అందులో ఆయనే మొదటి సినిమా దర్శకుడు కావడం నా అదృష్టం`` అన్నారు.
టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - `` దాసరిగారి జన్మ చరితార్థమైంది. ఎంతో మంది శిష్యులను, వారి ప్రేమను . ఆయన సంపాదించుకున్నారు. నాకు 45 సంవత్సరాల నుండి దాసరితో అనుబంధం ఉండేది. ఒక పక్క ఆవేశం..మరో పక్క ఆత్మీయత. ఒక పక్క అక్రోశం..మరో పక్క అనుభూతి ఉండేది. స్టోరీ రైటర్‌గా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్రను వేశారు. పసుపులేటి రామారావుగారు దాసరిగారిపై పుస్తకం రాయడం గొప్ప విషయం. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ఇప్పించడానికి నా వంతుగా ప్రయత్నించాను కానీ కుదరలేదు. రేపు ఆయనకు దాదాసాహెబ్ అవార్డు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాస్తాను. దాసరిగారి పేరు అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆయనలాంటి వ్యక్తి మరొకడు జన్మించడు. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
పుస్తక రచయిత, సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మాట్లాడుతూ - ``గురువు మనల్ని విడిచి పెట్టి వెళ్లిపోయిన తర్వాత చాలా నిరాశలోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో గురువుగారిపై పుస్తకం రాయాలని ఉన్నా, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆర్దికంగా బాలేదు. ఆ సమయంలో నా జర్నలిస్ట్ మిత్రుడు బి.ఎ.రాజుగారు కలిసి `గురువుగారిపై పుస్తకం రాస్తున్నారా? అని అన్నారు. లేదండి..కాస్త ఆర్దికంగా ఇబ్బందిగా ఉందని చెప్పాను. మీరు స్టార్ట్ చేయండి రామారావుగారు మీ వెనుక మేమున్నాం అని అన్నారు. తర్వాత శివాజీరాజాగారు అసోసియేషన్ తరపున పదివేల రూపాయలు ఇచ్చారు. తర్వాత అరవింద్‌గారిని కలవగానే, ఆయన కూడా బ్యాక్ పేజ్ యాడ్ ఇచ్చి ప్రోత్సహించారు. పుస్తకం రెడీ చేసే క్రమంలో చాలా మంది గురువుగారి గురించి ఆర్టికల్స్ ఇచ్చారు. వారిలో ముందు చిరంజీవిగారే ఉన్నారు. పుస్తకం రెడీ అయిన తర్వాత పుస్తకావిష్కరణకు చిరంజీవిగారిని పిలవాలని అనుకున్నాను. అయితే ఆయన బిజీగా ఉంటారని తెలిసినా, చివరకు ఆయనకు ఫోన్ చేస్తే వచ్చి కలవమని అన్నారు. వెళ్లి కలిస్తే ఫంక్షన్‌ని ఎలా చేస్తావని అడిగారు. సింపుల్‌గా చేసేస్తానని అన్నా కూడా ఆయన సురేష్ కొండేటి అన్నీ వ్యవహారాలు చూసుకుంటాడులే అని చెప్పి ఈ వేడుకను ఇంత పెద్దగా జరిగేలా చూశారు`` అన్నారు.