pizza
Telugu Film Director's Association felicitates K Viswanath for Winning Dada Saheb Phalke Award
కళాతపస్విని సన్మానించిన తెలుగు సినిమా దర్శకుల సంఘం - కళా కార్మికునికి చిత్రసీమ ప్రణామమ్‌ వేడుక
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 May 2017
Hyderabad

కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారకాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు సినీ దర్శకుల సంఘం కె.విశ్వనాథ్‌ను సన్మానించింది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇంకా ఈ కార్యకక్రమంలో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు,అల్లు అరవింద్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, దిల్‌రాజు, కొరటాల శివ, పైడిపల్లి వంశీ, కె.ఎస్‌.రామారావు, కోడి రామకృష్ణ, మా అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీ రాజా, కార్యదర్శి సీనియర్‌ నరేష్‌, తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షులు సి.కళ్యాణ్‌, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌, కార్యదర్శి మద్దినేని రమేష్‌, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు బూరుగుపల్లి శివరామకృష్ణ, కార్యదర్శులు తుమ్మల ప్రసన్నకుమార్‌, తెలంగాణ ఫిలించాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పి.రామ్మోహన్‌రావు, కార్యదర్శి కె.మురళీమోహనరావు ,తెలుగు ఎంప్లాయ్‌మెంట్‌ అధ్యక్షుడు కొమర వెంకటేష్‌, తమ్మారెడ్డి భరద్వాజ, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, ఎన్‌.శంకర్‌, ప్రసాద్‌ల్యాబ్స్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌, తనికెళ్ళ భరణి, ఏడిద శ్రీరాం, గిరిబాబు, డా.కె.వెంకటేశ్వరరావు, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

అతిథులందరూ కె.విశ్వనాథ్‌ను సన్మానించారు. అలాగే తెలుగు చిత్రసీమ రచయిత సంఘంవారు కూడా కె.విశ్వనాథ్‌ను సన్మానించారు. తెలుగు సినీ గాయనీ గాయకులు కె.విశ్వనాథ్‌ సినిమాలోని పాటలను పాడి ప్రేక్షకులను అలరించారు.

2016 సంవత్సరానికిగానూ జాతీయ అవార్డులు దక్కించుకున్న నిర్మాత దిల్‌రాజు, దర్శ రచయిత తరుణ్‌ భాస్కర్‌ను గవర్నర్‌ నరసింహన్‌ సత్కరించారు. ఈ సందర్భంగా..

ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ మాట్లాడుతూ - ''సాధారణంగా ఏదైనా సినిమాకు వెళ్ళాలనుకుంటే హీరో ఎవరని ప్రేక్షకులు అడిగి వెళతారు. కానీ కె.విశ్వనాథ్‌గారు దర్శకత్వం వహించిన సినిమా అంటే ఏ ప్రశ్న వేయకుండా సినిమా చూడాలనుకుంటారు. అది ఆయన గొప్పతనం. మాసాల్లో మార్గళి మాసం, పువ్వుల్లో మల్లెపువ్వ ఎంత గొప్పవో కళల్లో విశ్వనాథ్‌గారు అంత గొప్పవారు. నీ నుండి ఎంతో నేర్చుకోవాలి, నువ్వు తెలుగు సినీ ఇండస్ట్రీకీ మార్గదర్శకత్వం వహించాలి. సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. మన సంగీతాన్ని, సంస్కృతిని ఎందుకు కాపాడుకోకూడదని శంకరాభరణం సినిమాతో నిరూపించావు. బాహుబలి ఎన్నో రికార్డులను సాధించింది. ప్రతి సినిమా దానికంటూ ప్రత్యేకతను సాధించుకున్నా, శంకరాభరణం మాత్రం తెలుగు సినిమాకు అభరణంలా నిలుస్తుంది. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి కె.విశ్వనాథ్‌గారు ఒక అభరణం'' అన్నారు.

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - ''కళాతపస్వికి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ రావడం దేశానికే గర్వకారణం. కాశీవిశ్వనాథుడే, ఈయన ప్రవేశించి కళా ఖండాలు తీయించారు. ఇండియన్‌ సినిమాల్లో అవార్డులు వచ్చిన సినిమాలకు డబ్బులు రావు కానీ విశ్వనాథ్‌గారి సినిమాలన్నీ కళాఖండాలే కాదు, మ్యూజికల్‌ హిట్‌తో పాటు నిర్మాతలకు డబ్బులను కూడా తెచ్చిపెట్టాయి. ఇండియాలో ఏ దర్శకుడికి ఈ క్రెడిట్‌ లేదు. ఈరోజుకు కూడా ఆయన సినిమాలు చూసినా, పాటలు విన్నా తన్మయత్వం చెందుతాం. ఇది ఇంకే దర్శకుడు చేయలేడు'' అన్నారు.

రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు మాట్లాడుతూ - ''కె.విశ్వనాథ్‌ మహాముని, గొప్పవాడు. ఆయనకు, నాకు మంచి రిలేషన్‌ ఉంది. మేం కలిసి షటిల్‌ ఆడేవాళ్ళం. ఇటువంటి గొప్ప దర్శకుడు మన తెలుగువాడు కావడం మన అదృష్టం. దర్శకుల్లో విశ్వనాథ్‌గారు మహర్షి. ఆయనకున్న కోట్ల మంది అభిమానుల్లో నేను ఒకడ్ని. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

కోడి రామకృష్ణ మాట్లాడుతూ - ''విశ్వనాథ్‌గారి క్రియేషన్‌కు నేను పాదాభివందనం చేస్తున్నాను. ఆయన క్రియేషన్‌ ఇప్పటి తరాలకు ఆదర్శం. సినిమా ఎలా ఉండాలి అని డిక్షనరీ తిరగేస్తే విశ్వనాథ్‌గారి సినిమాలా ఉండాలని తెలుస్తుంది. తెలుగు చలన చిత్ర చరిత్రలో ప్రతి పేజీలో ఆయన మార్కు ఉంటుంది. యువ తరానికి ఆయన ఆదర్శం. ఆయనకు దొరికిన గౌరవం తెలుగు సినిమాకు, తెలుగు సినిమా దర్శకులకు దొరికిన గౌరవం'' అన్నారు.

కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ - ''నా సినిమాలన్నీ ప్లాష్‌బ్యాక్‌తో స్టార్ట్‌ అవుతాయి. 50 ఏళ్ళ క్రితం నేను మద్రాసులో ఉండగా రచయితల ప్రభంజనం సునామీలా ఏర్పడింది. అది పరుచూరి సోదరుల ప్రభంజనం. అప్పుడు పరుచూరి గోపాలకృష్ణగారు ఒక సభలో ఒక పిట్ట కథ చెప్పారు. ఆ కథ ఏంటంటే.. ఇద్దరు భార్యభర్తలు వడపళనిలో దేవాలయానికి వెళ్ళి వస్తుండగా ఒక వ్యక్తి గుడి బయట గునపంతో తవ్వుతూ కనిపించాడు. మళ్ళీ పార్థసారథి గుడికి వెళ్ళిన వారికి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అదే వ్యక్తి గునపంతో తవ్వుతూ కనిపించాడు. మైలాపూర్‌లో కబాలీశ్వరుడు గుడికి వెళ్ళి, బయటకు వచ్చినప్పుడు కూడా వారికి మళ్ళీ అదే వ్యక్తి కనపడ్డాడట. వారెంతో కుతూహలంగా ఆ వ్యక్తిని ఎందుకు తవ్వుతున్నావని అడిగితే నేను బావిని తవ్వుతున్నాను అని చెప్పాడట. మరి ఇన్నిచోట్ల తవ్వితే నీరు ఎలా వస్తుందని వారు అడిగితే, మరి మీరు కూడా ఒక దైవాన్ని నమ్ముకోకుండా ఇన్ని గుళ్ళు తిరుగుతున్నారెందుకు అని అడిగాడట. అది పరుచూరి గోపాలకృష్ణగారు చెప్పిన కథ. ఆయన కథలో చెప్పినట్లు నేను ఒక గునపంతో ఒక క్షేత్రాన్ని తవ్వుకుంటూ వచ్చాను. తవ్వగా, తవ్వగా మంచి నీరు పడింది. ఇంకా తవ్వితే జల వచ్చింది. దాన్ని అందరూ శంకరాభరణం అన్నారు. తర్వా
త మే 3న పాతాళగంగే వచ్చింది. అది ఢిల్లీలో దొరికింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఒక దాన్నే నమ్ముకున్నాను. నాకు అవార్డు ఆలస్యంగా వచ్చిందని నాపై అభిమానంతో అంటుంటారు. కానీ భగవంతుడు ఆలస్యం చేస్తాడేమో కానీ ఎవరికీ అన్యాయం చేయడు. మనం ఒకటి నమ్ముకోవాలి, కార్యదీక్ష ఉండాలి. ఈరోజు నా సక్సెస్‌లో భాగమైన ఏడిద నాగేశ్వరరావు, సోమయాజులు, వేటూరి వంటి వారు లేరు. వారి లేని లోటు బాగా కనిపిస్తుంది. నాకు ఇంత గొప్ప సన్మానం చేసిన అందరికీ రుణపడి ఉంటాను. కార్యదీక్ష, నమ్మకం ఉంటే ఇలాంటి అచీవ్‌మెంట్స్‌ ఎవరైనా సాధించగలరు. నాలాంటి దర్శకుడిని నమ్మినందుకు అశేష ప్రజానీకానికి థాంక్స్‌ చెప్పుకుంటున్నాను'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved