pizza
Choosi Choodangane pre release function
ఎమోషనల్ గా, గ్రాండ్ గా జరిగిన 'చూసీ చూడంగానే' ప్రి రిలీజ్ ఈవెంట్
You are at idlebrain.com > News > Functions
Follow Us


28 January 2020
Hyderabad


తెలుగు సినిమా ఘనతను దేశవ్యాప్తంగా చాటిన కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలు 'పెళ్లిచూపులు', 'మెంటల్ మదిలో' లను నిర్మించిన ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి తన తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'చూసీ చూడంగానే'. శేషసింధూ రావు దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ మూవీలో వర్ష బొల్లమ్మ, మాళవిక హీరోయిన్లు. జనవరి 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మంగళవారం రాత్రి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ మూవీ ఆడియో బిగ్ సీడీని హీరో అడివి శేష్ లాంచ్ చేశారు. హీరోలు నిఖిల్, శ్రీవిష్ణు కలిసి బిగ్ టికెట్ ను కొనుగోలు చేశారు. డైరెక్టర్లు జీవితా రాజశేఖర్, నందినీరెడ్డి, తరుణ్ భాస్కర్, వివేక్ ఆత్రేయ, మహా, నటులు కార్తికేయ, రేణు దేశాయ్, అవసరాల శ్రీనివాస్, శ్రీవిష్ణు, నిఖిల్, నందు, సుధాకర్, ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలోని పాటలను ఆవిష్కరించారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ, "శివని చూస్తుంటే నాకు కాంపిటిషన్ వచ్చాడు అనిపించింది. 'ఆర్ఎక్స్ 100' సినిమా రిలీజ్ తర్వాత నేను ఒకసారి రాజ్ కందుకూరి గారి ఆఫీస్ కి వెళ్ళాను. ఆయన శివని పిలిచి 'మై సన్' అని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు 'ఏంటి.. ఇంత బాగున్నాడు.. సినిమాల్లోకి వస్తాడా, నాకు కాంపిటీషన్ అవుతాడా' అనుకున్నాను. ఒక సంవత్సరంలోనే నా భయం నిజమైంది. అతను పెద్ద హీరో అవుతాడని ఆశిస్తున్నాను. రాజ్ గారు శివను చాలా బాగా ఈ సినిమాలో ప్రజెంట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. రాజ్ గారిని ఇంతదాకా 'పెళ్లిచూపులు ప్రొడ్యూసర్' అంటూ ఉంటారు. ఈ సినిమా నుంచి 'చూసీ చూడంగానే ప్రొడ్యూసర్' అని పిలుస్తారని ఆశిస్తున్నాను. డైరెక్టర్ శేష సింధు రావుకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను" అన్నారు.

డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ, "నేను గోపీసుందర్ మ్యూజిక్ కి పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో పని చేయాలని నేను కోరుకుంటున్నాను. రాజ్ గారు మంచి కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వస్తుంటారు. అలాంటి ఫాదర్ ఉన్నందుకు శివ చాలా లక్కీ. అతనికి, డైరెక్టర్ శేష సింధుకు ఇది ఫెంటాస్టిక్ డెబ్యూ అవుతుందని ఆశిస్తున్నాను. మరో ఐదేళ్ళలో లేడీ డైరెక్టర్ అనే ట్యాగ్ పోయి డైరెక్టర్ అని మాత్రమే మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను. రోజురోజుకు ఇండస్ట్రీలోకి ఉమెన్ టెక్నీషియన్స్ వస్తూ ఉండటం చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పారు.

జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ, "శివను, మా పిల్లలు శివానీ శివాత్మికలను ఎలా లాంచ్ చేయాలని నేను, రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్ చాలా రోజులు మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు శివ లాంచ్ అవుతున్న సినిమా విడుదలకు రెడీ అవుతోంది. నా పిల్లల సినిమా రిలీజ్ అయితే ఎంత ఆనందాన్ని అనుభవిస్తానో, ఈ సినిమా రిలీజ్ అవుతుంటే అంత ఆనందంగా ఉంది. శివను ప్రజలు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో చాలా మంది లేడీ డైరెక్టర్స్ వస్తారు. ద పవర్ ఆఫ్ ఉమెన్ ఏమిటో మనందరికీ తెలుసు. గోపీసుందర్ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. 'చూసీ చూడంగానే' పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు.

నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ, "శివను చూసినప్పుడు అతన్ని హీరోగా లాంచ్ చేయాలని నాకు దుర్బుద్ధి పుట్టింది కానీ.. ఆ ఛాన్స్ సింధు కొట్టేసింది. శివను స్క్రీన్ మీద చూస్తూ ఉంటే నాకు రణబీర్ కపూర్ గుర్తుకొచ్చాడు. అతనికి అంత మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను" అన్నారు.

నటి, దర్శకురాలు రేణు దేశాయ్ మాట్లాడుతూ, "ఇండస్ట్రీలోకి ఉమెన్ టెక్నీషియన్స్ ఎక్కువమంది రావాలని కోరుకుంటున్నాను. ఏదో ఒకనాటికి మేల్, ఫిమేల్ డైరెక్టర్ అనే భేదం పోయి డైరెక్టర్ అని మాత్రమే మాట్లాడుకోవాలి. ఏ ఫిమేల్ టెక్నీషియన్ అన్న హ్యాపీగా పని చేసుకోగల నైస్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు. ఆయన నాకు ఈ సినిమాలో మదర్ రోల్ ఆఫర్ చేశారు, ఐ లవ్ ద రోల్. కానీ నాకు ఒంట్లో బాగా లేకపోవడం వల్ల చేయలేకపోయాను. నెక్స్ట్ ఫిలింలో అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను. ఈ సినిమా కచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, "కొత్తగా సినిమా చేద్దాం అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళ కంటే వెక్కిరించే వాళ్లే ఎక్కువ. అలాంటిది నా కథను నమ్మి ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండి నాకు జీవితాన్ని ఇచ్చారు రాజ్ కందుకూరి. 'పెళ్లిచూపులు' అనేది ఒక మిరాకిల్. ఆయన దేవుడు లాంటి వాడు. నేనిప్పుడు ఇలా ఉన్నానంటే కారణం ఆయనే. అలాంటి దేవుడిని తండ్రిగా కలిగి ఉండటం శివ అదృష్టం. శివ మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి .శేష సింధు గారు ఈ సినిమాని చాలా బాగా తీశారు అని వినిపిస్తోంది" అన్నారు.

అడివి శేష్ మాట్లాడుతూ, "ట్రైలర్ ప్రామిసింగ్ ఉంది. సాంగ్స్ బాగున్నాయి. రాజ్ గారు నాకు గుడ్ ఫ్రెండ్, శ్రేయోభిలాషి, మెంటార్ కూడా. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని, శివకు గ్రాండ్ సక్సెస్ రావాల్ని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ మాట్లాడుతూ, "నిర్మాత రాజ్ కందుకూరి చాలా మ్యూజిక్ టేస్ట్ ఉన్న వ్యక్తి. ఈ సినిమాకు బ్యూటిఫుల్ మెలోడీస్ ఇవ్వటానికి ఆస్కారం ఇచ్చారు. శివ డెబ్యూ ఫిలింకు పని చేసినందుకు హ్యాపీగా ఉంది. మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నా మ్యూజిక్ ను యాక్సెప్ట్ చేసినందుకు సంతోషంగా ఉంది" అన్నారు.ఈ మూవీతో తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉందనీ, సినిమాలో చాలా మంచి పాత్రలు చేశామనీ హీరోయిన్లు వర్ష, మాళవిక చెప్పారు.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ, "రాజ్ గారు నాకు 'మెంటల్ మదిలో' లాంటి సినిమా నిర్మించి ఇచ్చారు. ఆ టైంలో శివ యాక్టింగ్ క్లాసులకు వెళుతున్నాడు. ఈ సినిమాలో చాలా బాగా చేశాడు. హీరోయిన్ వర్షకు నేను ఫ్యాన్ ని. శేష సింధుకు ఆల్ ద బెస్ట్" అన్నారు.

డైరెక్టర్ మహా మాట్లాడుతూ "నేను 'కేరాఫ్ కంచరపాలెం' స్టోరీ రాస్తున్నప్పుడు శేష సింధు ఈ స్టోరీని డెవలప్ చేస్తోంది. అప్పట్నుంచి ఇప్పటి దాకా తను చేస్తూ వచ్చిన స్ట్రగుల్ మామూలుది కాదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మేల్ డైరెక్టర్, ఫిమేల్ డైరెక్టర్ అనే టెర్మినాలజీ తీసేద్దాం. డైరెక్టర్ శేష సింధు, రైటర్ పద్మావతి ఈ సినిమాకి బాడీ అండ్ సోల్ లాంటివాళ్ళు. శేష సింధు చెప్పిన కథని ఓకే చేసి ఆ కథలో శివను హీరోగా లాంచ్ చేద్దామని రాజ్ గారు చెప్పినప్పుడు తను పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ రోజు మేము చాలా పెద్ద పార్టీ చేసుకున్నాం. వర్ష, మాళవిక గ్రేట్ పర్ఫార్మర్స్" అని చెప్పారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, "ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శివను పరిచయం చేస్తూ రాజ్ గారు సినిమా చేయడం చాలా హ్యాపీ. కమర్షియల్ సినిమాలు తీసే వాళ్ళు, స్టార్లతో సినిమాలు తీసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మంచి తెలుగు సినిమా తీసే వాళ్ళు తెలుగులో చాలా అరుదుగా ఉన్నారు. వారిలో ఫస్ట్ ప్లేస్ రాజ్ కందుకూరి గారిదే. నేను ధర్మపథ క్రియేషన్స్ లో చేశానని చాలా గర్వంగా ఉంటుంది. 'చూసీ చూడంగానే' మంచి సినిమా అవుతుందని, కచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

హీరో నిఖిల్ మాట్లాడుతూ, "ఈ కథను నేను సంవత్సరం క్రితం విన్నాను. అమేజింగ్ స్టోరీ. 'చూసీ చూడంగానే' అనేది ఫెంటాస్టిక్ ఫిలిం. రేపు మీరు థియేటర్లో సినిమా చూసినప్పుడు నేను చెప్పిన మాటలు నిజమని అనుకుంటారు. ఈ స్టొరీని ఎవరు తీస్తారా అని నేను అనుకుంటూ ఉంటే రాజ్ కందుకూరి గారు వచ్చారు. ఆయన అమేజింగ్ స్టోరీస్ ని పట్టుకోవడంలో ఎక్సుపర్ట్. శివకు ఈ సబ్జెక్ట్ సరిగ్గా సరిపోతుంది. శేష సింధు ఈ సినిమాను చాలా బాగా తీసిందని టాక్ వచ్చేసింది. రాజ్ గారికి మరో హిట్ గ్యారెంటీ" అని చెప్పారు.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ, "నేను ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళతో ఒక సినిమా చేస్తున్నాను. అలా అందరూ కొత్తవాళ్లతో కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తూ కొత్త టీం తో నేను చేస్తున్న సినిమాలో యాదృచ్చికంగా మా అబ్బాయి శివ ఒక క్యారెక్టర్ చేశాడు. అంతే కానీ తనని పెట్టుకుని తన చుట్టూ అల్లిన కథ కాదిది. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చివరలో వచ్చి జాయిన్ అయ్యాడు. అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ ఇవ్వలేదు. ఒక మంచి ప్రాజెక్టులో తన ఒక భాగం అయితే చాలు అని అనుకున్నాను. ఎప్పట్నుంచో నాకు ఒక లేడీ డైరెక్టర్ ని లాంచ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఆ క్రమంలో నేను ఎన్నో కథలు వింటూ ఉండగా శేష సింధు ఒక మంచి కథ చెప్పింది. పాయింట్ కొత్తగా ఉండటంతో నేను కన్విన్స్ అయ్యాను. ఎందుకు ఆమెను లాచ్ చేయకూడదు అనిపించింది. అలా మొదలైన అందమైన ప్రాజెక్టుకు గోపీసుందర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి మాక్సిమం స్ట్రెంత్ మ్యూజిక్. ఫస్టాఫ్ బబ్లీగా, సెకండాఫ్ ఎమోషనల్ గా వెళ్లే ఈ స్టోరీకి మ్యూజిక్ చాలా కీలకం. గోపి అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. పద్మ చాలా మంచి డైలాగ్స్ రాశారు. వర్ష, మాళవిక హీరోయిన్లుగా చాలా బాగా చేశారు. ఈ అందమైన కథలో శివ ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. అతనికి ఇది మంచి లాంచ్ అవుతుంది. నా స్నేహితుడు మధుర శ్రీధర్ ద్వారా సాంగ్స్ రిలీజ్ చేశాం. ప్రతి సాంగ్ మిలియన్ల వ్యూస్ రీచ్ అయింది. నేను ఏ సినిమా తీసినా నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న సురేష్ బాబు గారు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఒక మ్యాజిక్ చేసి, హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని చెప్పారు.

హీరోగా పరిచయమవుతున్న శివ కందుకూరి మాట్లాడుతూ, "ఇది ఒక నేచురల్ సినిమా. ఇందులోని ప్రతి క్యారెక్టర్ కి, ప్రతి ఎమోషన్ కి, నేను పర్సనల్ గా కనెక్ట్ అయ్యాను. ఆడియన్స్ కూడా ఈ సినిమాలోని ఎమోషన్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. నేను హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాకి ఇంత కంటే మంచి స్క్రిప్టు, ఇంతకంటే మంచి క్యారెక్టర్ ఆశించలేను. అందుకు డైరెక్టర్ సింధుకు థాంక్స్. భవిష్యత్తులో నేను ఎన్ని సినిమాలు చేసినా సింధుని ఒక స్పెషల్ డైరెక్టర్ గా గుర్తుంచుకుంటాను. రైటర్ పద్మ చాలా బాగా డైలాగ్స్ రాశారు. కొత్త వాళ్లతో పాటు చాలా మంచి సీనియర్ ఆర్టిస్టులతో కూడా పనిచేసే అవకాశం లభించింది. ఈ సినిమాలో శృతి అనే క్యారెక్టరను వర్ష తప్ప ఇంకెవరూ చేయలేరు. ఈ సినిమాలోని మూలస్తంభాలులో వర్షం ఒకరు. మాళవిక ఒకవైపు ట్వల్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తూ ఈ సినిమా చేసింది. తను టెర్రిఫిక్ యాక్టర్. గోపీసుందర్ గారి డిడికేషన్ ఆయన మ్యూజిక్ లో కనిపిస్తుంది. ఆయన మ్యూజిక్ ఇవ్వడం వల్లే 'చూససీ చూడంగానే' మరో లెవెల్ కి వెళ్ళింది అనిపిస్తోంది. వేద రామన్ సినిమాటోగ్రఫీ ఒక ఎసెట్. మా డాడీకి థాంక్స్. ఆయన ఒక అమేజింగ్ ఫాదర్, అంతకు మించి మంచి ప్రొడ్యూసర్. యాక్టర్ కావాలి అనే కల నాకు ఎప్పటినుంచో ఉండేది. అదే చాలా ఖరీదైన డ్రీమ్ అని నాకు తెలుసు. ఈ ప్రాజెక్ట్ లో ఒక భాగం కావాలని నేను అడిగినప్పుడు ఆయన ఒప్పుకొని ఈ సినిమా చేశారు. భవిష్యత్తులో నేనెన్ని సినిమాలు చేసినా ఆయన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చేస్తాను అని ప్రామిస్ చేస్తున్నాను. ఈ సినిమాకు ఒక పిల్లర్ గా ఉన్న సురేష్ బాబు గారికి థాంక్స్. చాలామంది స్ట్రుగిలింగ్ ఆర్టిస్ట్స్ కంటే ఈ అవకాశం నాకు త్వరగా వచ్చింది. ఆ విషయాన్ని నేనెప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. నెక్స్ట్ సినిమాకి మరింత ఎక్కువ కష్టపడతాను. ఇది నాకు చాలా చాలా స్పెషల్ ఫిలిం" అని చెప్పారు.

దర్శకురాలు శేష సింధు రావు మాట్లాడుతూ, "నేను కథ చెప్పగానే ఏ డౌట్ లేకుండా ఈ సినిమా తీయడానికి ఒప్పుకున్న రాజ్ గారికి చాలా థాంక్స్. నేను ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ ఆయనే. శాంతి రావు, సుమాంజలి నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయితే పద్మ నా వెన్నెముక. రాజ్ గారు మా అందరికీ ఒక షెల్టర్. ఈ సినిమాలో క్యారెక్టర్స్ తక్కువే. వాటికి యాక్టర్లందరూ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ప్రతి క్యారెక్టర్ కు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. శివ వెరీ డిసిప్లిన్డ్ బాయ్, చాలా మంచోడు. ఈ సినిమాకి మేం పెట్టిన ఎఫర్టును మీరంతా గుర్తిస్తారని ఆశిస్తున్నాను. మా నాన్న సినిమాలు చూడటం ఎప్పుడో మానేశారు. మళ్లీ నా సినిమాతోనే చూడటం మొదలు పెడతానని చెప్పారు. నా సినిమా పిచ్చి చూసి మా అమ్మ 'సినిమాల వల్ల ఏం వస్తుంది' ఎని ఎప్పుడూ అడిగేది. కొంచెం ఆలస్యంగా నైనా ఈ సినిమా తీశాను. నా ఫస్ట్ ఫిలిం కి గోపీసుందర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ దొరకటం హ్యాపీ.సాంగ్స్ తో పాటు చాలా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన రాజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నా ఫస్ట్ ఫిలిం కి సురేష్ బాబు గారు లాంటి డిస్ట్రిబ్యూటర్ లభించడం చాలా సంతోషం. ఇంతకంటే నేను ఎక్కువ కోరుకోను. నేను ఇండస్ట్రీలోనే ఉండి సినిమాలు తీస్తూ ఉంటాను" అని చెప్పారు.

ఈ ఈవెంట్లో నటులు నందు, సుధాకర్, ఆనంద్ దేవరకొండ, అశోక్ కుమార్, కళామందిర్ కళ్యాణ్, డైరెక్టర్ శశికిరణ్, గేయ రచయితలు రామజోగయ్య శాస్త్రి, విశ్వా, అనంతశ్రీరామ్ , సంభాషణల రచయిత పద్మావతి మాట్లాడారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved