pizza
Manasuku Nachindi pre release function
మంజుల డైరెక్షన్ చేస్తుందని తెలిసి గర్వపడ్డాను !! - సూపర్ స్టార్ మహేష్ బాబు
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

14 February 2018
Hyderabad

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్-ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్-పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "మనసుకు నచ్చింది". సందీప్ కిషన్-అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతుండడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, సాంగ్స్ విశేషమైన రీతిలో ప్రేక్షకులను అలరించగా చిత్రాన్ని ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు స్వరూప్, పి.కిరణ్, దర్శకురాలు మంజుల ఘట్టమనేని, చిత్ర కథానాయకుడు సందీప్ కిషన్, కథానాయకి అమైరా దస్తూర్, ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన మంజుల తనయ జాన్వి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన సూపర్ స్టార్ మాహేష్ బాబు మాట్లాడుతూ.. "మంజుల డైరెక్షన్ చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఒకసారి హాలీడేస్ టైమ్ లో తను ఏదో రాసుకొంటుంటే.. ఏదైనా పోయెట్రీ రాసుకొంటుందేమో అనుకొన్నాను. కానీ సినిమా కోసం కథ రాసుకొంటుంది అని మాత్రం అనుకోలేదు. అయితే.. తను కథ ప్రిపేర్ చేసుకొని, సినిమా చేయబోతున్నాను అని చెప్పినప్పుడు మాత్రం నేను షాక్ అయ్యాను. ఒకరకంగా ప్రౌడ్ ఫీల్ అయ్యాను కూడా. ఈ సినిమాకి నేను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. విజువల్స్ నాకు బాగా నచ్చాయి. మా కిరణ్ గారి సపోర్ట్ & గైడెన్స్ ఉండడం సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. సినిమా తప్పకుండా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. భవిష్యత్ లో మా అక్క మంజులతో సినిమా కూడా చేస్తానేమో" అన్నారు.

చిత్ర దర్శకురాలు మంజుల ఘట్టమనేని మాట్లాడుతూ.. ""మనసుకు నచ్చింది" సినిమా కథ రాయడం మొదలుకొని, సినిమా పూర్తి చేయడం వరకూ కూడా ఒక నేచురల్ ప్రొసెస్ లా జరిగింది. మా తమ్ముడు మహేష్, మా నాన్నగారు గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా కోసం వాయిస్ ఓవర్ చెప్పరా అని అడిగితే ఒప్పుకొన్నాడు. కానీ.. రెండు మూడు వేరియేషన్స్ లో చెప్పమంటేనేమో "వేరే వాళ్ళతో చెప్పించుకో" అనేవాడు. ఒకానొక సందర్భంలో మహేష్ బాబు కొడుకు గౌతమ్ వెళ్ళి "నాన్న మంజుల ఆంటీ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేస్తావ్?" అని అడిగితే చాలా సింపుల్ గా "అదే నా ఆఖరి సినిమా అవుతుంది" అన్నాడట (నవ్వుతూ..). రవియాదవ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. దినేష్ మాస్టర్ కంపోజ్ చేసిన సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉంటుంది. సందీప్ అద్భుతంగా నటించాడు, ఇక టైట్ క్లోజ్ షాట్స్ లో అమైరా కనిపించినంత అందంగా వేరే ఏ హీరోయిన్ కూడా కనిపించదేమో. కిరణ్ గారి సపోర్ట్ లేకుండా "మనసుకు నచ్చింది" సినిమా అవుట్ పుట్ ఈ స్థాయిలో ఉండేది కాదు. ఆయన సహకారానికి ఎప్పటికీ ఋణపడి ఉంటాను" అన్నారు.

చిత్ర కథానాయకుడు సందీప్ కిషన్ మాట్లాడుతూ.. "నేను సెట్స్ లో ప్రతి ఒక్కరితో చాలా హుందాగా ఆటపట్టిస్తూ ఉండేవాడ్ని. అలా చేసినప్పుడల్లా "అచ్చు మహేష్ కూడా ఇలాగే చేసేవాడు" అనేవారు. మంజుల గారి దర్శకత్వంలో హీరోగా చేయడం, అది ఆమె పరిచయ చిత్రం అవ్వడం నా అదృష్టం. మా ప్రీరిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు గారు విచ్చేసి మా యూనిట్ కి విషెస్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది" అన్నారు.

చిత్ర కథానాయకి అమైరా దస్తూర్ మాట్లాడుతూ.. "నా వేలంటైన్స్ డేని సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక మంజులగారితో వర్క్ చేయడం చాలా సరదాగా ఉండేది. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకొనేవారు. సందీప్ చాలా మంచి కో ఆర్టిస్ట్. చాలా సపోర్ట్ చేసేవాడు" అన్నారు.

మంజుల కుమార్తె మరియు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించిన జాన్వి మాట్లాడుతూ.. "ఇంట్లో ప్రతి విషయాన్ని మా నాన్న డైరెక్ట్ చేసేవారు. కానీ సెట్లో అమ్మ డైరెక్ట్ చేస్తుంటే చాలా కొత్తగా అనిపించేది. షూటింగ్ మొత్తానికి నాకు నచ్చని ఒకే ఒక్క విషయం ఏంటంటే.. "మా అమ్మ సినిమా మొత్తానికి నాకు నచ్చిన మేకప్ ఒక్కసారి కూడా వేసుకోనివ్వలేదు". కానీ.. ప్రతి సీన్ ని చాలా క్లియర్ గా చెప్పేది. అందుకే నాకున్న అయిదారు సన్నివేశాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించగలిగాను" అన్నారు.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన పి.కిరణ్ మాట్లాడుతూ.. "సినిమా చూశాక మంజులకి ఇదే మొదటి సినిమా అంటే ఎవరూ నమ్మరు. ఆ స్థాయిలో ఉంటుంది సినిమా. మహేష్ గారు మా ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావడం, సినిమా యూనిట్ ని బ్లెస్ చేయడం మా యూనిట్ మెంబర్స్ అందరికీ మాంచి బూస్ట్ ఇచ్చింది. ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న మా "మనసుకి నచ్చింది" ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చుతుందని భావిస్తున్నాం" అన్నారు.

సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి, ప్రియదర్శి, పునర్నవి భూపాలం, నాజర్, అరుణ్ ఆదిత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాధన్, ఎడిటర్: సతీష్ సూర్య, కళ: హరివర్మ, సినిమాటోగ్రఫీ: రవి యాదవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: పి.కిరణ్-సంజయ్ స్వరూప్, రచన-దర్శకత్వం: మంజుల ఘట్టమనేని.



 
Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved