pizza
Oh Baby pre release function
`ఓ బేబీ` ప్రీరిలీజ్ ఈవెంట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


29 June 2019
Hyderabad

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ` ఓ బేబీ`. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మాత‌లు. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూలై 5న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో...

ల‌క్ష్మీ ప్ర‌స‌న్న మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వ‌చ్చింది. స‌మంత ఏం చేసినా లీన‌మైపోయి చేస్తుంది. ట్రైల‌ర్ చాలా బాగా ఉంది. స్ట్రాంగ్ విమెన్ ఓరియంటెడ్ పాత్ర‌లు చేయ‌డం వ‌ల్ల చాలా మందికి ఇంకా అవ‌కాశాలు వ‌స్తాయి. నందినిరెడ్డి ప్ర‌తి సినిమా హిట్ కావాలి`` అని చెప్పారు.

రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ ``రామానాయుడుగారిని నేను మ‌న‌స్ఫూర్తిగా డాడీ అని పిలిచేవాడిని. `అహ‌నా పెళ్లంట‌` త‌ర్వాత నేనింత వ‌ర‌కు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో యాక్ట్ చేయ‌లేదు. ఇప్పుడు చేసిన సినిమా `ఓ బేబీ`. `అహ‌నా పెళ్లంట‌` తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో టాప్‌లో ఉన్న సినిమా. బ‌హుశా అంత‌క‌న్నా మంచి స‌బ్జెక్ట్ దొర‌క్క‌పోవ‌డంతో నేను ఇప్ప‌టిదాకా చేయ‌లేదు. అంత మంచి పాత్ర‌ను `ఓబేబీ`లో యాక్ట్ చేశాన‌ని అర్థం. నాకు తెలిసి ఒక సినిమా మంచి సినిమా కావ‌డానికి ఎవ‌రు కార‌ణ‌మో వాళ్లు తెలుసు. సినిమా ఇంత బాగా అంద‌రి ముందూ ఉన్నందుకు కార‌ణం స‌మంత‌, నందిని. ఈ చిత్రంలో నేను చంటి అనే పాత్ర చేశా. ల‌క్ష్మిగారికిగానీ, స‌మంత‌కుగానీ నేనే బోయ్‌ఫ్రెండ్‌. ఇదొక అద్భుతమైన చిత్రం. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆథంటిక్‌గా నేర్చుకుని చేస్తున్న ఆర్టిస్ట్ ని. నేను 42 ఏళ్లు యాక్ట్ చేసిన త‌ర్వాత‌, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ సిస్ట‌మ్‌ని వాడుతూ న‌టించాను. ఓ హాలీవుడ్ సినిమాలో న‌టించిన ఫీలింగ్ క‌లిగింది నాకు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద‌గా నా గురించి ఆన‌క‌పోవ‌చ్చు. నా బొమ్మ‌లు పెద్ద‌వి వేయ‌క‌పోయినా నేను ప‌ట్టించుకోను. నాకు ప‌ద్మ‌శ్రీలు ఇచ్చారా అనే విష‌యాన్ని ప‌ట్టించుకోను. ఓ బేబీ సినిమాలో న‌టించ‌డం నాకు గ‌ర్వ‌కార‌ణం. సినిమాలు చూసేవారికి నేను గుండెల్లో ఉంటా. ఒక సీన్‌లో స‌మంత న‌న్ను జుట్టుప‌ట్టుకుని త‌న్నుతుంది. మ‌రోసారి గుండెలు పిండేసేలా ఉంటుంది. ఆ సీన్ పండ‌క‌పోతే నేను మ‌ళ్లీ సినిమాల్లో క‌నిపించ‌ను. న‌టుడిగా నాకు చాలెంజ్ ఉన్న సినిమా. క‌మ‌ర్షియ‌ల్ హానెస్ట్ సినిమా ఇది`` అని అన్నారు.

ఇంద్ర చిత్రంలో బాల‌న‌టుడిగా న‌టించిన తేజ మాట్లాడుతూ ``నేను పెద్ద‌య్యాక చేస్తున్న తొలి చిత్రం `ఓ బేబీ`. ఈ సినిమా వేడుక‌లో రాఘ‌వేంద్ర‌రావుగారు ఉండ‌టం ఆనందంగా ఉంది. సురేష్‌బాబుగారు కొత్త‌వాళ్ల‌కు చాలా స‌పోర్ట్ చేస్తారు. న‌న్ను కూడా ఆయ‌న చాలా స‌పోర్ట్ చేస్తున్నారు. నందినిగారికి చాలా థాంక్స్. ఈ సినిమా ఆఫ‌ర్ నాకు పెద్ద గిఫ్ట్. స‌మంతగారిని అంద‌రూ చెన్నైలో త‌లైవి అని పిలుస్తారు. ప్ర‌తి షాట్‌కీ ఆమె టెన్ష‌న్ ప‌డి చేస్తారు`` అని అన్నారు.

రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ ``నందిని నాకు ఏక‌ల‌వ్య శిష్యురాలు. గురువుగారు మీ రూట్లో ఉన్నాన‌ని ఎప్పుడూ చెబుతుంది. చాలా కాంప్లికేటెడ్ సీన్స్ ని బాగా చేసింది. ఎమోష‌న‌ల్ సీన్లు కూడా బాగా తీస్తుంది. నందిని బ‌యోపిక్ కూడా తీసే రోజులు వ‌స్తాయి. సునీత నాకు శిష్యురాలు. వివేక్‌, సురేష్‌... ఇంకో ఇద్ద‌రు క‌లిసి తీశారు. నా తొలి సినిమా హీరోయిన్ ల‌క్ష్మి. నేను ఆమె మీద‌నే తొలి గ్లామ‌ర‌స్ సాంగ్ చేశాను. ఆమె మ‌ళ్లీ ఈ వ‌య‌సులో కూడా చాలా బాగ అద‌ర‌గొట్టింది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, స‌మంత చాలా బాగా చేశారు. నాగ‌శౌర్య ముద్దుగా ఉన్నాడు స్క్రీన్‌మీద‌`` అని అన్నారు.

ల‌క్ష్మీ భూపాల్ మాట్లాడుతూ ``నందినిరెడ్డి కాంబినేష‌న్‌లో నాకు ఓ బేబీ మూడో సినిమా. ఈ సినిమాను కూడా పెద్ద హిట్ చేస్తార‌ని ఆశిస్తున్నా. ఇది రెగ్యుల‌ర్‌గా తీసే సినిమా కాదు. జూలై 5 న విడుద‌ల కానుంది. నేను ఇప్ప‌టిదాకా 50 సినిమాలు రాసినా రాని సంతృప్తి ఈ సినిమాకు వ‌చ్చింది. అందుకు స‌మంత‌కు, నందినికి ధ‌న్య‌వాదాలు. చిన్న‌ప్ప‌టి నుంచి కొన్నేళ్లు రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారిలాగా ఉన్నాన‌ని అనేవారు. కొంత‌కాలానికి నా బాడీ లాంగ్వేజ్‌,మేన‌రిజ‌మ్స్ ఆయ‌న‌లాగా ఉండేవి. ఓబేబీ కేర‌క్ట‌ర్ రాస్తున్న‌ప్పుడు ఆయ‌న కేర‌క్ట‌ర్‌ను క‌ళ్లుమూసుకుని రాశాను. నాకు ఊహ కూడా తెలియ‌ని టైమ్‌లో ల‌క్ష్మిగారి మ‌ల్లెపూవు చూశా. ఆమెకు అంత మంచి పాత్ర రాయ‌డం ఆనందంగా అనిపించింది. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి పూర్త‌యి ఇంటికి వెళ్లే వ‌ర‌కు క‌ళ్ల‌ల్లో ఒక త‌డి ఉంటుంది. క్లైమాక్స్ లో తెలియ‌కుండా క‌న్నీళ్లు వ‌స్తాయి. అలా రాక‌పోతే న‌న్ను టిక్కెట్ డ‌బ్బులు అడ‌గండి`` అని చెప్పారు.

బీవీయ‌స్‌య‌న్ ర‌వి మాట్లాడుతూ ``ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ప్ర‌తి ఆర్టిస్టు అందంతో వ‌స్తారు. కొంత‌మంది 70 శాతం అభిన‌యంతో వ‌స్తారు. అందం, అభిన‌యంతో పాటు ఆనందాన్ని కూడా తీసుకొచ్చే న‌టి స‌మంత‌. చిన్న‌పిల్ల‌ల‌కి ప్ర‌తి స‌మ్మ‌ర్‌కీ ఫేవ‌రేట్ ఆర్టిస్టులు మారుతుంటారు. కానీ మా అమ్మాయికి చిన్న‌ప్ప‌టి నుంచీ స‌మంత అంటే ఇష్టం`` అని అన్నారు.

ప్ర‌గ‌తి మాట్లాడుతూ ``న‌న్ను తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసింది సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ వాళ్లే. నేను వేరియ‌స్ కేర‌క్ట‌ర్స్ చేయ‌గ‌ల‌న‌ని ఐడెంటిటీ ఇచ్చిన నందిని థాంక్స్. నాకు గంగోత్రిలాంటి సినిమాతో లైఫ్ ఇచ్చారు రాఘ‌వేంద్ర‌రావుగారు. స‌మంత‌తో నేను బృందావ‌నం నుంచి ప‌నిచేస్తున్నా. ఆర్టిస్టులు ఎంత ఎదిగితే అంత ఒద‌గాలి అనేదానికి స‌మంత ఎగ్జాంపుల్‌`` అని అన్నారు.

నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ``ఈ మ‌ధ్య కాలంలో తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌తి రెండు, మూడు నెల‌ల‌కు ఓ తెలుగు సినిమా వ‌స్తోంది. కానీ `అలా మొద‌ల‌యింది` స‌మయంలో అలాంటి ప‌రిస్థితి లేదు. ఈ ప‌రిస్థితిలో వ‌స్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. మిక్కీ నాకు తెలిసి చాలా మంచి మ్యూజిక్ డైర‌క్ట‌ర్. అత‌ని సంగీతం అత‌నిలాగా ఉంటుంది. ఇళ‌య‌రాజాగారు, రెహ‌మాన్‌గారి లైన్లు వింటే వాళ్లు చేశార‌ని తెలుస్తుంది. మిక్కీ కూడా అలాంటిదే. స‌మంత ఓబేబీలో చాలా బాగా చేసి ఉంటార‌ని న‌మ్ముతున్నా`` అని అన్నారు.

ప్రొడ్యూస‌ర్ సునీత తాటి మాట్లాడుతూ ``నా కెరీర్ స్టార్ట్ చేసింది సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో. ప‌దేళ్ల త‌ర్వాత ఆయ‌న‌తో క‌లిసి సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. 2016లో నేను స‌మంత‌కు ఈ సినిమాను ప్ర‌పోజ్ చేశాను. 2018లో త‌ను మాటిచ్చింది. నందిని ద‌ర్శ‌క‌త్వం చేయ‌డానికి అంగీక‌రించినందుకు ఆనందంగా ఉంది. త‌ను చాలా బాగా చేసింది. స‌మంత నాకు కొన్నేళ్లుగా తెలుసు. త‌న‌కున్న ప్యాష‌న్‌, డెడికేష‌న్ నాకు బాగా తెలుసు. నాకు చిన్న‌ప్ప‌టి నుంచి వెంక‌టేష్‌గారంటే ఇష్టం. నేను `జ‌యం మ‌న‌దేరా`లో అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా చేశాను. యూర‌ప్‌లో షూటింగ్ చేస్తుంటే వెంక‌టేష్ గారు నాకు ష‌ర్ట్ ఇచ్చి ఐర‌న్ చేస్తావా అని అడిగారు. అప్ప‌టి నుంచి ప‌ది రోజులు నేనే ఐర‌న్ చేశా. రానా చాలా మంచి మ‌న‌సున్న వ్య‌క్తి`` అని అన్నారు.

రానా మాట్లాడుతూ ``ఈ సినిమాలో ప‌నిచేసిన చాలా మందితో నాకు మంచి అనుబంధం ఉంది. నేను ప‌దో త‌ర‌గ‌తి ఫెయిల్ చేసిన‌ప్పుడు ఏ ప‌నీ రాకపోతే మా నాన్న న‌న్ను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా పెట్టారు. అప్పుడు సునీత న‌న్ను ఫిల్మ్స్ గురించి చ‌ద‌వ‌మ‌ని చెప్పారు. ఓబేబీలాంటి సినిమాలు తెలుగులో ప్ర‌తి వారం, ప్రతి రోజూ రావాలి. నా లీడ‌ర్‌, ఏమాయ‌చేసావె ఒకే ఏడాది విడుద‌ల‌య్యాయి. నేను, స‌మంత అప్పుడే తెలుగుకు ప‌రిచ‌య‌మ‌య్యాం. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స్థాపించి 55 ఏళ్లు అయ్యాయి. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో మా స‌మంత ఫొటో ఉన్నందుకు ఆనందంగా ఉంది. జులై 5న సినిమాను విడుద‌ల చేస్తాం. ఈ ఫంక్ష‌న్‌కి రావ‌డానికి పెద్ద కార‌ణం ల‌క్ష్మిగారు. మ‌నం చాలా త‌క్కువ‌సార్లు నాయ‌న‌మ్మ‌ల గురించి, అమ్మ‌ల గురించి మాట్లాడుతుంటాం. వాళ్ల‌కు జీవితం అంతా మ‌న‌తోనే ముడిప‌డి ఉంటుంది. ఈ సినిమాను గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ తో క‌లిసి చూడాలి`` అని అన్నారు.

వెంక‌టేష్ మాట్లాడుతూ ``ఓ బేబీ సినిమా పెద్ద హిట్ కావాలి. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, సునీత‌, వివేక్‌తో క‌లిసి ఈ సినిమా చేశారు. వండ‌ర్‌ఫుల్ స‌బ్జెక్ట్ ఇది. కొత్త ప్ర‌యోగం చేశారు. ప్రాడెక్ట్ చాలా బాగా వ‌చ్చింది. నందిని చాలా బాగా హ్యాండిల్ చేసింది. డిఫ‌రెంట్ ప్ల‌స్ కాంప్లికేటెడ్ సినిమా ఇది. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసింది. నాకు అందుకు చాలా సంతోషంగా ఉంది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, రావు ర‌మేష్‌, ప్ర‌గ‌తి, తేజ అంద‌రూ చాలా బాగా చేశారు. సినిమా చూశా. బేబీ అద‌ర‌గొట్టేసింది. త‌న కెరీర్‌లోనే ఈ సినిమా బెస్ట్ గా ఉంటుంది. త‌ను ఔట్‌స్టాండింగ్‌గా ఉంటుంది. ఎక్స్ ట్రార్డిన‌రీగా అన్నీ ఎక్స్ ప్రెష‌న్స్ పండించింది. స‌మంత చాలెంజింగ్‌గా తీసుకుని చేసింది. ఔట్ స్టాండింగ్ జాబ్ చేసింది. ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తార‌ని అనుకుంటున్నా`` అని అన్నారు.

వివేక్ మాట్లాడుతూ ``సురేష్‌గారు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌గారి త‌ర‌ఫున ఈ సినిమాకు ప‌నిచేసిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. మామూలుగా రామానాయుడు స్టూడియోలో అంద‌రూ ఫీజు క‌ట్టి జాయిన్ అవుతారు. కానీ నేను, సునీత మాత్రం ఫీజు క‌ట్ట‌కుండా ఎన్నో నేర్చుకున్నాం`` అని చెప్పారు.

గోపి మాట్లాడుతూ ``నందినిగారు చాలా బెస్ట్ డైర‌క్ష‌న్ చేశారు`` అని చెప్పారు.

నందిని రెడ్డి మాట్లాడుతూ ``ఈ సినిమాలో ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ రోల్‌ను అంగీక‌రించినందుకు నాగ‌శౌర్య‌కు ధ‌న్య‌వాదాలు. ఈ సినిమాను అంద‌రు అమ్మ‌ల‌కు డెడికేట్ చేస్తున్నాం. కుటుంబంతో చూడాల్సిన సినిమా ఇది. మ‌న అమ్మ‌ల‌కు, నాన్న‌మ్మ‌ల‌కు థాంక్యూ అని త‌క్కువ‌గా చెబుతుంటాం. ఈ సినిమాతో మేం వాళ్ల‌కు థాంక్యూ చెబుతున్నాం. అద్భుత‌మైన టీమ్‌తో స‌గం మార్కులు ముందే కొట్టేశాను. నా నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. సురేష్‌గారు నాకు గైడింగ్ ఫోర్స్ గా ఉన్నారు. నా మ‌న‌సులోని అన్ని మాట‌ల‌ను ల‌క్ష్మీభూపాల్‌గారు పేప‌రు మీద పెడ‌తారు. గోపీమోహ‌న్‌గారు మంచి స్క్రీన్‌ప్లే ఇచ్చారు. మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు దివ్య‌విజ‌య్ ప‌నిచేయ‌డం గ్రేట్‌. స‌మంత, నేను క‌లిసి ఈ జ‌ర్నీని స్టార్ట్ చేశాం. ఒక‌రి త‌ప్పుల‌ను ఒక‌రు గ‌ట్టిగా ముందే చెప్పాల‌నుకున్నాం. స‌మంత ఎలా చేసింద‌నే విష‌యాన్ని జులై 5న ప్రేక్ష‌కులు చెబుతారు. ఆమె ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యారు. స‌మంత న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాన‌నే అనుకుంటున్నా`` అని చెప్పారు.

స‌మంత మాట్లాడుతూ ``హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయ‌డం ఇండ‌స్ట్రీలో చాలా క‌ష్టం. ఈ నిర్మాత‌లు న‌న్ను న‌మ్మి ఈ సినిమా చేశారంటే అందుకు కార‌ణం అభిమానులే. వాళ్లే న‌న్ను ఈ పొజిష‌న్‌లో పెట్టారు. నా కెరీర్‌లో నా బెస్ట్ ఫిల్మ్ ఇచ్చారు వాళ్లు. ఈ క‌థ‌ను మేం సెల‌క్ట్ చేయ‌డం క‌న్నా, ఈ క‌థే మ‌మ్మ‌ల్ని సెల‌క్ట్ చేసుకుంద‌ని న‌మ్ముతున్నా. ఈ సినిమా మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా ప్ర‌తిరోజూ నాకు ఒక సంతోషాన్ని, ఒక చాలెంజ్‌ని ఇచ్చింది. జులై 5నత‌ర్వాత ఈ సినిమా గురించి చాలా మాట్లాడుతాను. ఈ సినిమాలో నేను చాలెంజింగ్ పాత్ర చేశాను. నా కెరీర్‌లో ఇప్ప‌టిదాకా చేసిన రోల్స్ లో ఇదే బెస్ట్ రోల్‌. నందినిగారు నాకు ఒక అక్క‌లాగే. నేను ఆమెను 100 శాతం న‌మ్మాను. ఆ న‌మ్మ‌కం నా పెర్ఫార్మెన్స్ లో తెలుస్తుంది. ఫైన‌ల్ ప్రాడెక్ట్ లో తెలుస్తోంది. రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌గారు నాకు ఫేవ‌రేట్ ప‌ర్స‌న్‌. మా టెక్నీషియ‌న్లు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. మామూలుగా ప్ర‌తి సినిమా చూసిన త‌ర్వాత అంద‌రికీ న‌టీన‌టులు గుర్తుకొస్తారు. కానీ సాంకేతిక నిపుణుల వ‌ల్ల‌నే మేం నిల‌బ‌డగ‌లుగుతాం. అందుకే వారిని నేను మ‌ర్చిపోలేను. కామెడీ విష‌యంలో నాకు రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు రోజూ నేర్పించారు. నాగ‌శౌర్య‌కి చాలా థాంక్స్ చెప్పాలి. సెకండాఫ్లో నాగ‌శౌర్య‌గారి కేర‌క్ట‌ర్ హైలైట్ అవుతుంది. రామానాయుడు ఫ్యామిలీ నుంచి తొలిసారి ఒక‌మ్మాయి వ‌స్తోంది అని సురేష్‌బాబుగారు చెప్పిన‌ప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఆయ‌న చెప్పిన మాట కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను. సినిమాలో ఉన్న‌వారిక‌న్నా, బ‌య‌ట ఉన్న‌వారికే ఎక్కువ తెలుస్తుంది. ఒక్క పోస్ట‌ర్ చూసి, సినిమా ఎంత బాగుందో, ఎంత నిజాయ‌తీగా ఉందో వాళ్లు చెప్ప‌రు. ఈ సినిమా పోస్ట‌ర్లు చూసి ఇప్ప‌టికే అంచ‌నాకు వ‌చ్చేసి ఉంటారు. ఈ సినిమా త‌ప్ప‌కుండా అంద‌రినీ అల‌రిస్తుంది`` అని చెప్పారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved