pizza
Peta pre release function
`పేట‌` ప్రీ రిలీజ్ వేడుక‌
You are at idlebrain.com > News > Functions
Follow Us6 January 2019
Hyderabad

ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `పేట‌`. సిమ్ర‌న్‌, త్రిష నాయిక‌లు. కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌కుడు. అశోక్ వ‌ల్ల‌భ‌నేని నిర్మాత‌. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అంబికా కృష్ణ‌, జెమిని కిర‌ణ్‌, వైవీయ‌స్ చౌద‌రి తుమ్మ‌ల ప్ర‌స‌న్నకుమార్‌ క‌లిసి ఫ‌స్ట్ టికెట్‌ను విడుద‌ల చేశారు.

భాస్క‌ర‌భ‌ట్ల మాట్లాడుతూ ``నేను రోబో 2.0లో రాశా. సూప‌ర్‌స్టార్ సినిమాకు ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న పెదాల మీద నా ప‌దాలు ప‌ల‌క‌డం చాలా ఆనందంగా ఉంది. అనిరుద్ అంటే నాకు చాలా ఇష్టం. కార్తిక్ సుబ్బ‌రాజ్‌గారి ప్ర‌తి సినిమా నాకు ఇష్టం. అన్నీ చూశా. ర‌జ‌నీకాంత్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాను. నేను రాసిన పాట మాంటేజ్ సాంగ్‌. లిప్‌సింక్ లేదు. అచ్చ తెలుగు పాట‌లా ఉంటుంది. వెళ్లిపోయింద‌నుకున్న ఆనందం తిరిగివ‌చ్చిన‌ప్పుడు ఒక మనిషి ఎంత‌టి ఆనందాన్ని పొందుతాడో, అది ఈ పాట‌లో రాశాను. ర‌చ‌యిత‌గా సంతృప్తి పొందే లైన్లు ఇందులో రాశాను. లిప్ సింక్ లైన్లు రాయ‌డం నాకు పెద్ద‌గా ఇష్టం ఉండ‌దు`` అని చెప్పారు.

జెమిని కిర‌ణ్ మాట్లాడుతూ ``రోబోను అప్పుడు నేనే చేశాను. ఇప్పుడు పండ‌గ సీజ‌న్‌లో ఈ సినిమా విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. కార్తిక్ సుబ్బ‌రాయ‌న్ పీజాలో ఎన్ని ర‌కాలుంటాయో.. అన్ని ఇందులో ఉండాల‌ని కోరుకుంటున్నా`` అని అన్నారు.

అశోక్ వ‌ల్ల‌భ‌నేని మాట్లాడుతూ ``వ‌చ్చిన వాళ్లంద‌రికీ ధ‌న్య‌వాదాలు. పిలిచినా వ‌స్తాన‌ని రాకుండా మ‌మ్మ‌ల్ని ఆనంద‌ప‌ర‌చిన మ‌హానుభావుల‌కు రెండు వంద‌నాలు. నేను ఓన్ రిలీజ్ చేయ‌డానికి డిసైడ్ అయి `పేట‌`ను తీసుకున్నా. ఫ‌స్ట్ డేకి వ‌చ్చిన టాక్తో అయినా మా సినిమాకు ఎక్కువ థియేట‌ర్లు ఇస్తార‌ని ఆశిస్తున్నా. ఒంట్లో బాగోలేక‌పోయినా నా కోసం వ‌చ్చిన శ్రీకాంత్‌గారికి, వైవీయ‌స్ చౌద‌రిగారికి, జెమిని కిర‌ణ్‌గారికి, ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌గారికి, అనిరుద్‌గారికి, హీరోయిన్ల‌కు ధ‌న్య‌వాదాలు. యువీ క్రియేష‌న్స్, దిల్‌రాజు, అల్లు అర‌వింద్ వంటివారంద‌రూ థియేట‌ర్ల‌తోనే పుట్టిన‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. థియేట‌ర్లు ఇవ్వ‌డానికి వీరికేంటి నొప్పి? ఇలాంటి కుక్క‌ల‌కు బుద్ధి చెప్పి ప్ర‌భుత్వాలు మాకు థియేట‌ర్ల‌ను ఇచ్చేలా చేయాలి. న‌యీమ్‌లాంటి వారిని చంపేశారు. ఇలాంటి వారిని ఎందుకు షూట్ చేయ‌రు? కేసీఆర్‌గారు, చంద్ర‌బాబుగారు ఆలోచించాలి `` అని చెప్పారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ ``అశోక్ వ‌ల్ల‌భ‌నేని నా ఫ్రెండ్‌. ఆయ‌న చాలా డేర్ ప‌ర్స‌న్‌. ఇటీవ‌లే స‌ర్కార్ విడుద‌ల చేశారు. ఈ సంక్రాంతి బ‌రిలో పెద్ద పెద్ద సినిమాల మ‌ధ్య త‌న పెద్ద సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఆ సినిమాల‌తో పోటీగా ఈ సినిమా కూడా ఆడాలి. కార్తిక్ సుబ్బ‌రాయ‌ణ్‌ని మెర్క్యురి టైమ్‌లో క‌లిశా. ర‌జ‌నీకాంత్‌గారిని చూస్తూ పెరిగాను. చిరంజీవిగారు, ర‌జ‌నీకాంత్‌గారు మా ఆర్టిస్టుల‌కు స్ఫూర్తి. ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నందుకు చాలా హ్యాపీ``అని చెప్పారు.

తుమ్మ‌ల ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ ``సినిమా క‌ళ‌కు కులం, ప్రాంతం, మ‌తం వంటివేమీ ఉండ‌వ‌ని నిరూపించిన వ్య‌క్తి ర‌జ‌నీకాంత్‌. మ‌హ‌రాష్ట్రియ‌న్‌గా పుట్టి, క‌ర్ణాట‌క‌లో కండ‌క్ట‌ర్‌గా చేసి, ఇవాళ ప్ర‌పంచ ప్ర‌సిద్ధి సాధించాడు. అత‌నికి పూర్వ చ‌రిత్ర లేదు. అత‌నే ఒక చ‌రిత్ర‌. అలాగే ఎన్టీరామారావుగారు చ‌రిత్రను ఆయ‌నే సృష్టించుకున్నారు. అలాగే శ్రీకాంత్‌. స్వ‌యం శ‌క్తితో ఎదిగి వచ్చాడు. అంద‌రితో బావుంటాడు. అంద‌రితోనూ క‌లిసి న‌డిస్తాడు. అంద‌రితోనూ స‌ఖ్య‌తతో ఉన్న శ్రీకాంత్ వ‌చ్చి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం చాలా ఆనంద‌క‌రం. సినిమా బావుంటే ఎవ్వ‌డూ ఆప‌లేడు. ఇవాళ ఎలా ఉందంటే థియేట‌ర్ మాఫియా... మాఫియా డాన్ల క‌న్నా దారుణాతి దారుణంగా ఉంది. ముగ్గురు న‌లుగురు వాళ్లు చేసే సినిమాల‌ను మాత్ర‌మే విడుద‌ల చేస్తున్నారు. సంక్రాంతికి ఆరు నుంచి ఏడు సినిమాలు విడుద‌లైన సంద‌ర్భాలు మ‌న ద‌గ్గ‌ర ఉన్నాయి. చూడాల‌నుకునే ప్రేక్ష‌కులు ఉన్నారు. అయితే కొన్ని ఏరియాల్లో కేవ‌లం ఒక‌టీ, రెండు సినిమాల‌కే థియేట‌ర్ల‌ను కేటాయించారు. అదొక మాఫియాలాగా త‌యారైంది. అలాంటి మాఫియా ఎండ్ అయ్యే ప‌రిస్థితి వ‌స్తుంది. టెక్నీషియ‌న్ల‌ను వాళ్లు బ‌త‌క‌నివ్వ‌డం లేదు. కొత్త వాళ్ల‌ని రానిచ్చే ప‌రిస్థితి లేదు. తెలంగాణ‌లో కేసీఆర్‌గారికి, కేటీఆర్‌గారికి, ఆంధ్ర‌లో చంద్ర‌బాబునాయుడుగారికి చెప్తాం. మాఫియాకు కూడా కులం, మ‌తం, ప్రాంతం లేదు. తెలంగాణ ఆయ‌న తెలంగాణ‌లోనూ, వైజాగ్‌లోనూ మాఫియా చేస్తాడు. వాళ్ల సినిమాలే ఆడాల‌ని చూస్తున్నారు. మిగిలిన వాళ్ల‌నే తొక్కేస్తున్నారు. ఇంకే టెక్నీషియ‌న్‌ని ఎద‌గ‌నివ్వ‌డం లేదు. ఇది మంచిది కాదు. వాళ్ల సినిమాలు మాత్ర‌మే ఉండాల‌నుకోవ‌డం మంచిది కాదు. ద‌య‌చేసి మీరు విజ్ఞ‌ప్తి అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. వార్నింగ్ అనుకోండి. చాలా మంది ఆకాశం నుంచి ఆకాశంలోనే పోయారు. మీరు కూడా పోతార‌మ్మా... కాస్త తెలుసుకుని ప‌ద్ధ‌తిగా ఉండండి. ఇక సినిమా గురించి వ‌స్తే ప్ర‌తి సినిమా ఆడాల‌నే కోరుకుంటాం. కానీ ప్రేక్ష‌కుడు బావున్న సినిమాల‌నే ఆడిస్తాడు. ప‌దో తారీఖు ఎన్టీఆర్ విడుద‌లైన త‌ర్వాత నుంచి అదీ. పేటా ఆడుతాయి. ర‌జ‌నీకాంత్‌గారు రాఘ‌వేంద్ర‌స్వామి కాళ్ల‌కు, బ‌తికున్న ఎన్టీఆర్ కాళ్ల‌కు మాత్ర‌మే ద‌ణ్ణం పెట్టేవాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం. పేటా చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం. మిగిలిన వాళ్లు చూసుకోండి.. మీ ఇష్టం. పందులు గుంపులుగా వ‌స్తాయ‌మ్మా.. సింహం సింగిల్‌గా వ‌స్తుంది. మీ అరాచ‌కాల‌ను పైన దేవుడు చూస్తాడు. ఇక‌నైనా మ‌నుషులుగా మారండి.ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే కార్తిక్ సుబ్బ‌రాజ్ `పీజా` తీసిన రోజున ఆ సినిమాకు హీరో ద‌ర్శ‌కుడు మాత్ర‌మే. ఆయ‌న ర‌జ‌నీకాంత్‌గారి మీద ప్రేమ‌గా, అభిమానిగా `బాషా` రేంజ్‌లో తీసిన సినిమా ఇది. ర‌జ‌నీకాంత్‌గారి కెరీర్లో జ‌న‌వ‌రిలో పొంగ‌ల్‌కి అప్ప‌ట్లో బాషా, ఇప్పుడు పేటా వ‌చ్చాయి. అనిరుద్ కొల‌వెరి కొల‌వెరి అని అంద‌రి చేతా డ్యాన్స్ చేయించాడు. ఆల్ ఇండియా టాప్ 20 ఫిల్మ్స్ ఆడియోలో 11వ స్థానంలో ఉంది పేటా. విజ‌య్ సేతుప‌తి కంటిన్యూ హిట్స్ ఉండి కూడా ర‌జ‌నీకాంత్‌గారితో చేయాల‌ని ఇందులో విల‌న్‌గా న‌టించారు. ఇందులో న‌వాజుద్దీన్ సిద్ధికి ఉన్నారు. చాలా మంచి కేస్టింగ్ ఉంది. త్రిష‌, సిమ్ర‌న్ ఉన్నారు. ఈ ఫంక్ష‌న్‌కి వ‌చ్చిన వారంద‌రూ సినిమాను ప్రేమించే సినిమా ల‌వ‌ర్స్. వాళ్లంద‌రూ స‌క్సెస్ కావాలి. ఈ 18వ తారీఖు త‌ర్వాత ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, పేట మాత్ర‌మే మిగులుతాయి`` అని చెప్పారు.

అంబికా కృష్ణ మాట్లాడుతూ ``చ‌రిత్ర‌కు గెలుపు ఓట‌ములు ఉండ‌వు. చ‌రిత్రే చ‌రిత్ర‌. య‌న్‌.టి.ఆర్ సినిమా క‌థానాయ‌కుడు 9న విడుద‌ల‌వుతోంది. ఆ త‌ర్వాత పేటా విడుద‌ల‌వుతోంది. జ‌పాన్‌లో తొలిసారి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సౌతిండియ‌న్‌ హీరో ర‌జ‌నీకాంత్‌. ఆయ‌న సినిమాలు, స్టైల్ వ్య‌వ‌హారం చూస్తూ పెరిగాను. ఆయ‌న సినిమా పేటాను వ‌ల్ల‌భ‌నేని విడుద‌ల చేస్తున్నారు. 18 తారీఖు త‌ర్వాత అన్ని థియేట‌ర్ల‌లోనూ పేట ఉంటుందేమో. అంత పెద్ద సినిమా అవుతుంది ఇది. ద‌ర్శ‌కుడు కార్తిక్ సినిమాలను నేను గుండెతో, మ‌న‌సుతో చూస్తాను. చాలా మంచి ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. ఏదో సినిమాకు వ‌చ్చామ‌న్న‌ట్టు కాకుండా, మ‌న‌సుతో పాటు సినిమాను ఇంటికి తీసుకెళ్తాం. అలాంటి ద‌మ్మున్న సినిమాను ఆయ‌న తీశాడు. అనిరుద్ అన్ని ర‌కాల పాట‌ల‌ను అందించారు. విజ‌య్ సేతుప‌తి న‌టించిన 96 ఈ మ‌ధ్య‌నే చూశా. మ‌న‌సు నిండుగా ఇంటికెళ్తాం. విచిత్ర‌మైన నెరేష‌న్‌తో తీశాడు ద‌ర్శ‌కుడు. అలాంటి పెద్ద హీరో ర‌జ‌నీకాంత్‌గారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి యాక్ట్ చేస్తుండ‌టం చాలా గొప్ప‌. ర‌జ‌నీకాంత్‌లోని వ్య‌క్తిత్వం వ‌ల్లే ఇదంతా సాధ్య‌మ‌వుతుంది. ఎన్టీఆర్‌, ర‌జ‌నీకాంత్ దైవాంశ సంభూతులు. పేట సినిమా పేట పేట‌లో పేటలో ఉన్న‌వారంద‌రూ చూసి పేటా పేటా అని అర‌వాలి. సాయికిర‌ణ్‌తో పాటు మిగిలిన వాళ్లంద‌రూ చాలా బాగా రాశారు. సాహిత్యం రాసిన వారంద‌రూ చాలా గొప్ప‌వాళ్లు. కాగితం మీద క‌లం పెట్ట‌గానే అక్ష‌రాలు వెళ్ల‌డం ఈ క‌వుల‌కే సాధ్యం. ఆ ర‌చ‌యిత‌లు ఉన్నంత కాలం అన్నీ మంచే జ‌రుగుతాయి. వాళ్ల మాట‌లు వింటే కొత్త శ‌క్తి వ‌స్తుంది`` అని చెప్పారు. చ‌రిత్ర‌లో విప్ల‌వాలు, విప్ల‌వ సంగీతం ర‌చ‌యిత‌ల నుంచే వ‌చ్చింది. యుద్ధాన్ని ఆపే శ‌క్తి కూడా ర‌చ‌యిత‌ల‌కే ఉంటుంది`` అని అన్నారు.

సాయికిర‌ణ్ మాట్లాడుతూ ``ర‌జ‌నీకాంత్‌గారి సినిమాలో పాట రాసినందుకు ఆనందంగా ఉంది. దీనికి కార‌ణ‌మైన నిర్మాణ సంస్థ‌కు, అనిరుద్‌గారికి థాంక్స్. యు ట‌ర్న్అనే పాట త‌ర్వాత‌ నేను ఈ సినిమాలో రాశాను`` అని చెప్పారు.

రామ‌జోగ‌య్య‌శాస్త్రి మాట్లాడుతూ ``చాలా ఇష్ట‌ప‌డి రాశాను ఈ పాట‌ను. ఎన‌ర్జిటిక్ సాంగ్ ఇది. ర‌జ‌నీకాంత్‌గారి సినిమాకు ఈ పాట‌ను రాయ‌డం ఆనందంగా ఉంది. 10న ఈ సినిమా విడుద‌ల కానుంది. లిప్ రిస్ట్రిక్ష‌న్ ఉంద‌ని ఈ పాట‌ను నాకు చూపించారు. మంచి డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి`` అని చెప్పారు.

వైవీయ‌స్ చౌద‌రి మాట్లాడుతూ ``మా నాన్న‌గారు లారీ డ్రైవ‌ర్‌. లారీలో స‌మ్మ‌ర్ హాలీడేస్‌కు న‌న్ను మ‌ద్రాసుకు తీసుకెళ్లారు. అప్పుడు నేను చూసిన క‌టౌట్ ర‌జ‌నీకాంత్‌గారిది. పెద్ద క‌టౌట్‌లో మ‌హామ‌నిషిని చూశా. కూలీ గెట‌ప్‌లో ఉన్నాడు. చిన్న బీడీ పెట్టుకుని, పెట్టెను మోసే స్టిల్ అది. ఆ సినిమా పేరు తీ. తెలుగులో అన్న‌గారు మ‌గాడు అని చేశారు. ఆయ‌న్ని చూసిన త‌ర్వాత ఆయ‌న‌తో వేదిక‌ను షేర్ చేసుకుని అవ‌కాశం నాకు ఎన్టీఆర్‌గారి వ‌ల్ల క‌లిగింది. పేట నిర్మాత అశోక్ వ‌ల్ల‌భ‌నేని న‌డుస్తున్న డైన‌మైట్. నిర్మాత అన‌గానే లెక్క‌లు, బిజినెస్ చేస్తారు. ఈయ‌న‌లో కాలిక్యులేష‌న్స్ తో పాటు సాహ‌సం కూడా ఉంటుంది. దీనికి ఉదాహ‌ర‌ణ న‌వాబ్‌. అప్పుడు కూడా న‌వాబ్ సినిమాకు థియేట‌ర్లు లేవు. అప్పుడు కూడా ఆయ‌న సాహ‌సానికి డ‌బ్బులు వ‌చ్చాయి. రెండో సినిమా స‌ర్కార్ సినిమా. అది వ‌చ్చే స‌మ‌యానికి థియేట‌ర్లు దొరికే ప‌రిస్థితి లేదు. అలాంటి మాన‌సిక ఒత్తిడిని ఖాత‌రు చేయకుండా న‌మ్మ‌కంతో ఆయ‌న సినిమాను తీస్తున్నారు. అంద‌రూ ఆయ‌న్ని అభినందించాలి. స‌హ‌క‌రించాలి. సాయం చేయాలి. న‌వాబ్‌, స‌ర్కార్‌లను మించిన సినిమా పేటా. ఈ సినిమాలో ద‌మ్మున్న‌ద‌నే విష‌యం మంచి పాత్ర‌ల‌ను బ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ట్రైల‌ర్ చూడ‌గానే ఆ విష‌యం అర్థమైంది. మాస్‌, క్లాస్‌, మెలోడీ ఉంది అనిరుద్ పాట‌ల్లో. నాకు సంగీత‌మంటే చాలా ఇష్టం. సంక్రాంతికి సినిమా విడుద‌ల చేయ‌డం ఎంతో క‌ష్టం. ఇలాంటి సిచ్యువేష‌న్‌లో ర‌జ‌నీకాంత్ సినిమా విడుద‌ల చేయ‌డానికే ఇబ్బందిగా ఉన్న‌ప్పుడు మిగిలిన సినిమాల ప‌రిస్థితి ఏంట‌నేది ఆలోచించుకోవాలి. ఈ సినిమాతో నాకున్న క‌నెక్టివిటీ సిమ్రాన్‌గారు. నాకు న‌చ్చిన హీరోయిన్ శ్రీదేవి. ఆ త‌ర్వాత న‌చ్చిన నాయిక సిమ్రాన్‌గారు. ఆవిడ‌తో ప‌నిచేశాను. ఆవిడ నాకు సీత‌య్య సినిమాలో రెండు సెన్సేష‌న‌ల్ సాంగ్స్ కు ఆక్సిజ‌న్ ఇచ్చారు. చంద్ర‌ముఖిలో జ్యోతిక వేసిన పాత్ర‌ను ఈవిడ చేయాల్సింద‌ట‌. అప్పుడు ర‌జ‌నీకాంత్ సినిమాను వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని బాధ‌ప‌డేవారు. ఇప్పుడు మ‌ర‌లా ఈ అవ‌కాశం రావ‌డం చాలా ఆనందంగా ఉంది. 9న మా అన్న‌గారి బ‌యోపిక్ విడుద‌ల‌వుతుంది. 10న పేట విడుద‌ల కానుంది`` అని తెలిపారు.

అనిరుద్ మాట్లాడుతూ ``పేట మా డ్రీమ్ ప్రాజెక్ట్. కార్తిక్ సుబ్బ‌రాజ్ చాలా మంచి డైర‌క్ట‌ర్‌. ఆయ‌న ర‌జ‌నీకాంత్ ఫ్యాన్‌. ఈ సినిమాను ర‌జ‌నీ అభిమాని, ర‌జ‌నీ అభిమానుల కోసం తెర‌కెక్కించారు. ఈ సంగీతం విన్న‌ప్పుడు తెలుగు పాట‌లు న‌చ్చాయి`` అని అన్నారు.

మేఘా ఆకాష్ మాట్లాడుతూ ``మంచి అవ‌కాశం ఇది`` అని చెప్పారు.

బాబీ మాట్లాడుతూ ``షార్ట్ ఫిలిమ్స్ నుంచి కార్తిక్ పేట వ‌ర‌కు వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమా త‌ప్ప‌కుండా బాగా ఆడుతుంది``అని తెలిపారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``నా తొలి సినిమా పిజ్జా. తెలుగులో బాగా ఆడింది. ఈ సారి త‌లైవా సినిమా కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చాను. మా అంద‌రికీ డ్రీమ్ ప్రాజెక్ట్. స‌న్ పిక్చ‌ర్స్ కి ధ‌న్యవాదాలు. అశోక్‌గారు ఈ సినిమాను ఇక్క‌డ విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ స్టోరీ ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా ఇది. ర‌జ‌నీగారి మొమెంట్స్ ఇందులో చాలా ఉంటాయి. ఇది ఫెస్టివ‌ల్ సినిమా. ఇక్క‌డ హెవీ కాంపిటిష‌న్ ఉంది. వాళ్ల‌కి కూడా ఆల్ ది బెస్ట్. మంచి సినిమాల‌కు ఎప్పుడూ విజ‌యం ఉంటుంది`` అని తెలిపారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved