pizza
Bilalpur Police Station press meet
బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ పాట విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us


13 August 2018
Hyderabad


ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించారు. గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగసాయి మాకం తెరకెక్కించారు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో గోరేటి వెంకన్న పాడిన ప్రచార గీతాన్నిహైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత సుద్దాల అశోక్ తేజ అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాయకుడు గోరేటి వెంకన్న మాట్లాడుతూ..ఈ చిత్రంలో గీత రచయితగా, గాయకుడిగానే కాకుండా నటుడిగా అవకాశం ఇచ్చారు. కథలో ప్రాధాన్యమున్న పాత్రలో నటించాను. చక్కటి సంగీత, సాహిత్య విలువలున్న చిత్రమిది. దర్శకుడు బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రాన్ని స్పష్టతతో తెరకెక్కించారు. కావాల్సినంత వినోదం ఉంటుంది. నేను నిలకడగా ఒక చోట ఉండను. అలాంటిది నాతో కొన్ని రోజుల పాటు షూటింగ్ చేశారు. కష్టాలు వాళ్లే భరిస్తూ నా వరకు ఏదీ రాకుండా చూసుకున్నారు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ మన తెలుగు సినిమాను కొత్త దారిలో తీసుకెెళ్లే చిత్రమవుతుంది. అన్నారు.

సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ....సాహిత్యానికి చిన్న పెద్దా లేదని దర్శక రత్న దాసరి గారు నాతో చెప్పేవారు. చిన్న హీరోకు పాట రాసినా సూపర్ స్టార్ కు రాసినట్లే భావించి పనిచేయాలని అనేవారు. గురువు గారి మాటను నిత్యం పాటిస్తున్నాను. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఓ పాట రాశాను. ఏదో రాసి ఇద్దాం అనుకోకుండా మనసు పెట్టి రచించాను. దర్శక నిర్మాతలు మంచి వాళ్లు. ఓ మంచి చిత్రం చేయాలని ప్రయత్నించారు. వాళ్ల ప్రయత్నాన్ని అందరం ప్రోత్సహించాలి. అన్నారు.

నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ...నేను ఈ చిత్రాన్ని నా ప్యాషన్ కోసం చేయలేదు. వ్యాపారం కోసమే చేశాను. చాలా మంది కొత్త నిర్మాతలు సినిమాను ప్యాషన్ కోసం నిర్మించాం అని చెప్పుకుంటారు. అలా చెప్పుకునే వాళ్లంతా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సినిమాను వ్యాపారం లాగే చేయాలి. అప్పుడే ఎవరి ప్యాషన్ కైనా అర్థం ఉంటుంది. పెట్టిన ఖర్చు తిరిగి రాకుంటే ప్యాషన్ ఉండి ఏం లాభం?. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రాన్ని కొత్త తరహా కథా కథనాలతో రూపొందించాం. పోలీసు కథల్లో ఇలాంటి సినిమా రాలేదని చెప్పగలను. కథను కాల్పనికంగా కాకుండా వాస్తవ సంఘటనలతో రాశాను. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్ర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ....దాదాపు 200 పోలీసు స్టేషన్ లకు వెళ్లి అక్కడి కేసులను పరిశీలించి కథను తయారు చేసుకున్నాము. సినిమాటిక్ గా పనికొచ్చే కేసులన్నీ కథలో చేర్చాము. ఇవన్నీ వినోదాత్మకంగానే ఉంటాయి. బిలాల్ పూర్ అనే ఊరి పోలీసు స్టేషన్ కు వచ్చిన వింత వింత కేసులు నవ్విస్తాయి. సినిమా అంతా గ్రామీణ నేపథ్యంలో ఆహ్లాదకరంగా సాగుతుంది. మా బావ గారే నిర్మాత. ఆయన ప్రోత్సాహంతోనే సినిమా చేశాను. నా సినిమాకు గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ లాంటి దిగ్గజ రచయితలు పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. అన్నారు.

ప్రణవి, ఆర్ ఎస్ నందా, వెంకట్ గోవాడ, మల్లేష్, వైభవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - తోట వి రమణ, ఎడిటింగ్ - ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం - సాబూ వర్గీస్, రీ రికార్డింగ్ - జీబూ, డీటీఎస్ - రాజశేఖర్, పాటలు - గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, రామాంజనేయులు, మౌనిశ్రీ మల్లిక్, నీల నర్సింహా, కథా, నిర్మాత - మహంకాళి శ్రీనివాస్, రచన, దర్శకత్వం - నాగసాయి మాకం.

 

 

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved