pizza
Tholubommalata press meet
నా టాప్ ఫైవ్ సినిమాల్లో కచ్చితంగా ‘తోలుబొమ్మలాట’ ఉంటుంది - నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్
You are at idlebrain.com > News > Functions
Follow Us


13 October 2019
Hyderabad

మనం ఎక్కడినుంచి వచ్చామో ఏమేం చేశామో మన మూలాలు ఏమిటో తెలియజెప్పడానికైనా ఓ మంచి సినిమా ఉండాలి, ఆ లోటును తీర్చే సినిమా కచ్చితంగా ‘తోలుబొమ్మలాట’ అవుతుంది అన్నారు నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్. రాజేంద్రప్రసాద్, విశ్వంత్, ‘వెన్నెల’ కిశోర్, హర్షిత ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. విశ్వనాథ్‌ మాగంటి దర్శకత్వంలో దుర్గా ప్రసాద్‌ మాగంటి నిర్మించారు. నవంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది .

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 42 సంవత్సరాల తన నటజీవితంలో మొదటి ఐదు సినిమాల వరుసలో నిలిచే చిత్రం తోలుబొమ్మలాట అవుతుందన్నారు. ఐదు పైసలతో సోడాలు తాగిన రోజులను ఈ సినిమా గుర్తుచేసిందన్నారు. ఇందులో సోడాల రాజు పాత్రలో తను నటించినట్లు చెప్పారు. మనిషికీ మనిషికీ ఉండే సంబంధాలను, జీవితంలో స్నేహానికి ఉండే గొప్పతనాన్ని ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చన్నారు. ‘సాధారణంగా ఇలాంటి కథ 50 సినిమాలు చేసిన అనుభవం ఉన్న దర్శకుడు చేయాల్సింది. కానీ ఒక కుర్ర దర్శకుడు ఈ కథ చెప్పడం నాకే ఆశ్చర్యం కలిగించింది. ముఖేముఖే సరస్వతి అంటారు. ఆ మాట ఈ దర్శకుడు విశ్వనాధ్ కు అక్షరాల వర్తిస్తుంది. ‘ఆ నలుగురు’ సినిమా చేశాక ఇంతకంటే ఇంకేముంటుందిలే అనుకున్నా. ఒళ్లు దగ్గర పెట్టుకో అని నన్ను మళ్లీ హెచ్చరించిన కథ ఇది. నటుడు నారాయణరావుకు నాకు 45 ఏళ్ల స్నేహం. ఈరోజు వరకు అది అలాగే కొనసాగుతోంది. స్నేహం విలువ ఏమిటో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎవరైనా ఏ పాత్ర అయినా చేయాలనుకుంటే ఆ పాత్రకు సంబంధించిన అవగాహన ఉండాలి. ఇందులో సజీవ పాత్రలు ఉన్నాయి. ఎవరూ నటించకూడదు అని అందరికీ చెప్పాను. నటిస్తే సినిమా బాగుండదు అందుకే పాత్రలకు తగ్గట్టుగా అందరూ అందులో జీవించారు. కథనుబట్టి పాత్రలు, పాత్రను బట్టి నటన ఉంటుందని నమ్మేవాడిని నేను. నా నటజీవితంలో మరుపురాని సినిమా ఈ తోలుబొమ్మలాట అవుతుంది’ అన్నారు. ఇది విషాద కథ కాదని, ఆఫ్ బీట్ కథాంశానికి ఆధునిక ట్రీట్ మెంట్ ఇచ్చిన సినమా అన్నారు. కామెడీ, విరహం, ప్రేమ... ఇలా అన్ని రసాలు మేళవించిన సినిమాగా చెప్పారు. ఇందులో ఉన్న ఐదు పాత్రలూ చాలా గొప్పగా ఉంటాయన్నారు.

దర్శకుడు విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ కథను రాసుకుని రాజేంద్రప్రసాద్ దగ్గరకు వెళ్లినపుడు తనను గురువులా ప్రోత్సహించారన్నారు. కథకు ప్రధానంగా నిలిచే సోమరాజు పాత్రలో రాజేంద్రప్రసాద్‌ నటించారు. సినిమాలో సోమరాజుకు గోలీ సోడాలంటే ఇష్టం. కాబట్టి అందరూ ఆయన్ని సోడాల్రాజు అని పిలుస్తారని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి అయ్యిందని ,నవంబర్ లో విడుదల చేస్తామని తెలిపారు .

హీరో విశ్వంత్ మాట్లాడుతూ దర్శకుడు విశ్వనాథ్ తో ‘కేరింత’ సినిమా నుంచి తమ జర్నీ ప్రారంభమైందన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమా తెరకెక్కిందన్నారు.

సీనియర్ నటుడు నారాయణరావు మాట్లాడుతూ ఇందులో తను సోడాలరాజు స్నేహితునిగా నటించినట్లు చెప్పారు. మొదటిసారిగా మంచుపల్లకి తో తమ సినీ ప్రయాణం మొదలైందన్నారు. స్నేహానికి అర్థంచెప్పే అద్భుతమైన కథగా చెప్పారు.

ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన నటుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ గొప్ప నటుడు రాజేంద్రప్రసాద్ తో కలిసి నటించడం, అలాగే మరో సీనియర్ నటుడు నారాయణరావుతో నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దర్శకుడు మంచి డెప్త్ ఉన్న కథను ఎంచుకున్నట్లు చెప్పారు.

పాటల రచయిత చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ ఆ నలుగురు తర్వాత మళ్లీ ఇందులో అన్ని పాటలనూ రాసినట్లు చెప్పారు.

హీరోయిన్ హర్షితా చౌదరి, నర్రా శ్రీనివాస్, కల్పన, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, కెమెరామన్ సతీష్ ముత్యాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ నూకవల్లి , ఆర్ట్ డైరెక్టర్ మోహన్ కే తాళ్లూరి తదితరులు పాల్లొన్నారు.

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved