pizza
Geetha Govindam Success Celebrations
`గీత గోవిందం` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


18 August 2018
Hyderabad

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికా మంద‌న్నా జంట‌గా న‌టించిన సినిమా `గీత గోవిందం`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గీతా ఆర్ట్స్ ప‌తాకంపై రూపొందింది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పించారు. బ‌న్నీ వాస్ నిర్మించారు. ఆగ‌స్ట్ 15న విడుద‌లైన ఈ సినిమా ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమా స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్ లో ఆదివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

బ‌న్నీ వాస్ మాట్లాడుతూ ``ప్రేక్ష‌కుల‌ను చూసి ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు. నేను మొద‌ట థాంక్స్ చెప్పేది మెగాస్టార్ చిరంజీవిగారికి. ప్ర‌తి ఇంట్లోనూ ఏదైనా పూజ చేసుకునేట‌ప్పుడు గ‌ణ‌ప‌తిని స్మ‌రించుకుంటాం. అలాగే మెగాస్టార్‌ను స్మ‌రించుకుంటాం. నా సోల్, నా బ్రీత్ బ‌న్నీకి కూడా థాంక్స్. నా లైఫ్‌లో మ‌రింత గొప్ప స్థాయికి వెళ్లిన‌ప్పుడు అర‌వింద్‌గారి గురించి మాట్లాడాల‌నుకుంటాను. ఇప్పుడు కూడా మాట్లాడ‌ను. ఇంకా నేను ఎదిగిన త‌ర్వాత ఆయ‌న గురించి మాట్లాడ‌తాను. ఈ సినిమాకు సంబంధించి ఒక విష‌యం ఆయ‌న గురించి చెప్పాలి. ఆయ‌న ఒక సినిమా తీసేట‌ప్పుడు బిజినెస్‌లో కేల్కులేష‌న్స్ ఉంటాయి అని అంద‌రూ అనుకుంటారు. కానీ ఆయ‌న సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఆయ‌న బిజినెస్‌ని, బ‌డ్జెట్‌ని ఎప్పుడూ కేల్కులేట్ చేయ‌రు. ఆయ‌న సినిమాకు ఏం కావాలో అంతా ఖ‌ర్చుపెడ‌తారు. ఏరోజూ కూడా ఎంత అవుతుంద‌ని అడ‌గ‌రు. రేపు సినిమా రిలీజ్ అంటే ముందు రోజు మాత్ర‌మే లెక్క‌లు చూస్తారు. ఆయ‌న సినిమాల‌ను చాలా వ‌ర‌కు ఓన్‌గా రిలీజ్ చేసుకుంటారు. కొన్ని ఏరియాలే అమ్ముతారు. రెండోది... ఆయ‌న స‌క్సెస్ ఏంటంటే... సినిమా ద‌ర్శ‌కుడికి శాటిస్‌ఫై అయ్యేవ‌ర‌కు, ఆయ‌న శాటిస్‌ఫై అయ్యేవ‌ర‌కు సినిమాను తీస్తూనే ఉంటారు. ఆ విష‌యాన్ని మా క‌న్నా మా బుజ్జి బాగా చెబుతారు. అదే నేను అర‌వింద్‌గారి నుంచి నేను నేర్చుకున్నాను. 100 ప‌ర్సెంట్ ల‌వ్‌గానీ, భలే భ‌లే మ‌గాడివోయ్‌గానీ, పిల్లా నువ్వు లేని జీవితం... కూడా స‌క్సెస్ అయింది. చిన్న‌ప్ప‌టి నుంచి పాల‌కొల్లులో సినిమాలు చూస్తూ పెరిగిన నాకు చిరంజీవిగారంటే పిచ్చి. ఆయ‌న మా సినిమాలో ఒక్కొక్క సీన్ గురించి మాట్లాడుతుంటే మాకు అంత‌క‌న్నా ఏం కావాలి.. ఆ గంట‌లో ఆయ‌న‌తో క‌లిపి తాగిన కాఫీ.. బెస్ట్ కాఫీ ఇన్ మై లైఫ్‌. ఇక‌పై ఆయ‌న‌తో క‌లిసి ఇలాగే మెప్పుకోలు పొందుతాను`` అని అన్నారు.

అన్న‌పూర్ణ‌మ్మ మాట్లాడుతూ ``ఈ సినిమాలో చేయ‌డం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఫ‌స్ట్ ఆ కేర‌క్ట‌ర్ చేసేట‌ప్పుడు కాస్త భ‌య‌ప‌డ్డా. ద‌ర్శ‌కుడు అలా కాద‌మ్మా.. ఇలా చేయి అని అన్నారు. ఇందులో ప్రేక్ష‌కులు మెచ్చుకున్న‌వ‌న్నీ డైర‌క్ట‌ర్‌గారివి. మెచ్చుకోనివ‌న్నీ నావి`` అని అన్నారు.

సుబ్బ‌రాజు మాట్లాడుతూ ``గీత గోవిందం అద్భుత‌మైన విజ‌యం సాధించ‌డానికి కార‌ణ‌మైన ప్రేక్ష‌కులు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. మా టీమ్‌కి అభినంద‌న‌లు`` అని చెప్పారు.

వెన్నెల కిశోర్ మాట్లాడుతూ ``అన్న‌పూర్ణ‌మ్మ‌గారికి నేను సారీ చెప్పాలి. ఆమెను సినిమాలో ఐదుసార్లు గొంతు పట్టుకున్నా. విజ‌య్ యాటిట్యూడ్ చాలా స్పెష‌ల్‌. ఏదైనా బ‌ట్ట‌బ‌య‌లు పెడ‌తాడు. త‌ర్వాత బ‌ట్ట‌ల షాపు పెడ‌తాడు`` అని అన్నారు.

రాహుల్ రామ‌కృష్ణ మాట్లాడుతూ ``ద‌ర్శ‌కుడు ఏం చెబితే అదే చేశాం`` అని చెప్పారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ``కేర‌ళ‌లో ఫ్ల‌డ్స్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మా సంస్థ త‌ర‌ఫున రూ.10ల‌క్ష‌ల‌ను ప్ర‌క‌టిస్తున్నాం. ఒక పాట విడుద‌ల చేస్తేనే కొన్ని మిలియ‌న్స్ మంది చూశారు. ఈ విష‌యంలోనూ అంద‌రూ స్పందించాలి. వాళ్ల‌కు చేయూత‌నివ్వాలి. ఇంకో రెండు రోజుల్లో `బాస్‌` సెల‌బ్రేష‌న్స్ స్టార్ట్ కానున్నాయి. ఆ రోజు చిన్న టీజ‌ర్ ఇస్తారు. దాన్ని చూసి మ‌నం ఎనిమిది నెల‌లు వెయిట్ చేస్తాం. అల్లు అర‌వింద్‌గారిని నేను 15 ఏళ్లుగా చూస్తున్నా. స‌క్సెస్‌, ఫ్లాప్‌ల‌లోనూ అలాగే ఉంటారు. బ‌న్నీ వాస్ నా ద‌గ్గ‌రికి వ‌చ్చి `ఆర్య‌` స‌మ‌యం అప్పుడు పాల‌కొల్లులో ఒక థియేట‌ర్ కావాల‌ని అడిగాడు. థియేట‌ర్ ఎందుకు.. ఆ జిల్లా మొత్తం నువ్వే చేసుకో అని అన్నా. ఇప్పుడు నా స్థాయికి ఎదిగాడు. సినిమాని న‌మ్ముకుని క‌ష్ట‌ప‌డితే స‌క్సెస్ వ‌స్తుంద‌ని అర‌వింద్‌గారి త‌ర్వాత వాస్ నిరూపించాడు. ప‌ర‌శురామ్ 11 ఏళ్ల క్రితం మా `ప‌రుగు`కి అసిస్టెంట్ గా ప‌నిచేశాడు. కొడైకాన‌ల్‌లో నాకు ఓ క‌థ చెప్పాడు. ఈ 11 ఏళ్ల‌లో ట్రెండ్ సెట్టింగ్ సినిమాను ఇచ్చాడు. నేను 15 ఏళ్ల‌లో చ‌ర‌ణ్‌, మ‌హేష్‌, బ‌న్నీ, ఎన్టీఆర్ అంద‌రూ స్టార్స్ అయ్యాడు. క‌రెక్ట్ గా 20 ఏళ్ల క్రితం `తొలిప్రేమ‌`తో యూత్ మొత్తం ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారికి అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు అది విజ‌య్‌లో కనిపిస్తోంది. ఒక సినిమాకు అంత ఉంటుంద‌ని అప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారి ద్వారా తెలిసింది. ఈ మ‌ధ్య `అర్జున్ రెడ్డి` తో కొట్టేశాడని అనుకున్నాం. స్టార్ హీరోల దారిలో ప‌డ్డాడు. ఈ సినిమాతో విజ‌య్ పెద్ద స్టార్ హీరో కావాలి`` అని అన్నారు.

ప‌ర‌శురామ్ మాట్లాడుతూ ``మెగాస్టార్ చిరంజీవిగారు సినిమా చూసి, నాతో మాట్లాడిన మాట‌లు నాకు భ‌గ‌వ‌ద్గీత లాంటివి. స‌క్సెస్ వ‌చ్చిన‌ప్పుడు ఎంత పేషెన్స్ తో ఉండాల‌ని చిరంజీవిగారు చెప్పిన మాట‌లు నాకు మ‌న‌సులో ఉన్నాయి. అర్జున్‌రెడ్డిలాంటి మాసివ్ హిట్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌న్ను న‌మ్మి సినిమా చేసినందుకు ధ‌న్య‌వాదాలు. అల్లు అర‌వింద్‌గారు నాకు తండ్రి స‌మానులు. బ‌న్నీ వాసు నాకు సోద‌రుడు. నేను స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ క‌థ‌ను గీతా ఆర్ట్స్ వాళ్లు న‌మ్మ‌డానికి కార‌ణం బ‌న్నీగారు. ఈ క‌థ విని బ‌న్నీగారు ఈ సినిమాను త‌ప్ప‌కుండా చేయాల‌ని చెప్ప‌డం, వాళ్లు అంతే ఫ్రీడ‌మ్ ఇచ్చి న‌న్ను చేయ‌మ‌న‌డం చాలా ఆనందంగా ఉంది. ప‌క్క‌నోడు ఎదుగుతుంటే కాళ్లు ప‌ట్టి లాగుతున్న ఈ రోజుల్లో... విజ‌య్‌దేవ‌ర‌కొండ‌లాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని హీరో ఎదుగుతూ ఉంటే ప్రోత్స‌హిస్తోన్న చిరంజీవిగారికి హ్యాట్సాఫ్‌. మెగా హీరోల‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నాను`` అని అన్నారు.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ ``మేం ఏది చేసినా, మా విజ‌యంలో పాలుపంచుకుంటారు చిరంజీవిగారు. మా జీవితంలోన ఆయ‌న పాలుపంచుకున్నారు. ఆయ‌న వేసిన బాట‌లో అనేక మంది హీరోలు న‌డుస్తున్నారు. ఆయ‌న మాత్రం శ్రీకృష్ణుడిలాగా పైన కూర్చుని చిదానందంతో ఉన్న‌ట్టుంటారు. కానీ ప్ర‌తి సినిమా విడుద‌ల‌కు ముందు ఆయ‌న చేసే ఎంక్వ‌య‌రీ, ప‌డే తాప‌త్ర‌యం గ్రేట్‌. మంచి సినిమా ప్ర‌జ‌ల‌కు న‌చ్చితే నెత్తిన పెట్టుకుంటారు. ఈ సినిమా విడుద‌ల‌కు నాలుగు రోజుల ముందు లీకైంద‌ని టెన్ష‌న్ మొద‌లైంది. నేను వైజాగ్‌లో త‌క్కువ మాట్లాడాను. పైర‌సీ చేసిన వాళ్ల‌నే ఎక్కువ వార్న్ చేశా. ప‌ర‌శురామ్ చాలా మంచి ర‌చ‌యిత‌. త‌న పెన్ను చాలా షార్ప్. మ‌నం ఏం చెప్పినా, ఏం చేసినా దాన్ని తీసుకుంటాడు. యారొగెంట్ బిహేవియ‌ర్ లేదు అత‌నికి. వెన్నెల కిశోర్ లాస్ట్ లో వ‌చ్చి సినిమాను ద‌డ‌ద‌డలాడించాడు. విజ‌య్ గొప్ప యాక్ట‌ర్ అని చెబితే మామూలే. అర్జున్ రెడ్డిలో అత‌న్ని అంద‌రూ అంతా చూశారు. నేను విజ‌య్‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి పోలుద్దామ‌ని అనుకున్నా. అదీ అయిపోయింది. విజ‌య్ ఇన్‌స్టెంట్ ప‌ర్స‌న్‌. చిరంజీవిగారికి, విజ‌య్‌కి కొన్ని కామ‌న్ పోలిక‌లున్నాయి. చాలా క్యాజువ‌ల్‌గా క‌నిపించి, అవ‌త‌లివాళ్లు చెప్పింది `అవునా` అని ఊకొట్టి, త‌న‌లో తాను ఆలోచ‌న చేస్తాడు. విజ‌య్ ముదురు. అంటే అది నెగ‌టివ్ కాదు. మంచి వాడు. తెలివైన వాడు. అత‌ను పాడిన పాట న‌చ్చ‌లేద‌ని అంద‌రూ ట్రోల్ చేస్తే, వాట‌న్నిటినీ తెచ్చి ప‌బ్లిసిటీకి వాడాడు. విజ‌య్‌లో నేను స్టార్‌ని చూస్తున్నాను. వాళ్ల త‌ల్లిదండ్రుల ఆనందం నాకు తెలుసు`` అని అన్నారు.

విజ‌య్ మాట్లాడుతూ ``నేను సినిమా సినిమాకీ స‌ర్‌ప్రైజ్ చేద్దామ‌నుకుంటే, ప్ర‌తి సినిమాకూ ఆడియ‌న్స్ నాకు షాక్ ఇస్తున్నారు. ఈ స‌క్సెస్ వెన‌కాల ముగ్గురు ముఖ్య‌మైన వారున్నారు. వాసుగారు న‌న్ను పిలిపించి క‌థ విన‌మ‌ని చెప్పి, నేను ఆలోచిస్తూ ఉంటే `బాసూ.. ఇది యూనివ‌ర్శ‌ల్ సినిమా` అని అన్నారు. ఇందులో నేను చేసిన పెర్సార్మెన్స్ కి కార‌ణం బుజ్జిగారే. `అర్జున్ రెడ్డి` త‌ర్వాత నేను ఇంత బాగా పెర్ఫార్మ్ చేశానంటే అందుకు కార‌ణం బుజ్జిగారు. అర‌వింద్‌గారు రెండు, మూడు సార్లు లంచ్‌కి వ‌చ్చారు. షూటింగ్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో ఆయ‌న చాలా కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. సినిమాను ఆగ‌స్ట్ 15కి విడుద‌ల చేయ‌డానికి కూడా ఆయ‌నే కార‌ణం. నాకు సినిమాల గురించి చాలా త‌క్కువ తెలుసు. ఎంతో హిస్ట‌రీ ఉన్న గీతా ఆర్ట్స్ ప్ర‌మోష‌న్‌లో నా వంతు న‌న్ను చేయ‌నిచ్చారు. న‌టుడికి చాలా కంఫ‌ర్ట్ ఇచ్చారు. యాక్ట‌ర్‌గా నా జాబ్ చేశాను. సినిమా ప్రాసెస్‌లో ఉన్న‌ప్పుడు ఎవ‌రికీ ఎన‌ర్జీ రాదు. ఆడియ‌న్స్ చూస్తున్న‌ప్పుడే నాకు ఎన‌ర్జీ. ఆడియ‌న్స్ చ‌ప్ప‌ట్లు కొడుతూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మెగాస్టార్‌గారు గంట సేపు మాతో కూర్చుని డైలాగులు, యాక్ష‌న్లు, రియాక్ష‌న్లు చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆయ‌న‌తో ఎన్ని సార్లు ఉన్నా.. నాకు ఏమ‌వుతుందో, నాలో ఏమ‌వుతుందో అర్థంకాదు. `సైరా` షూటింగ్‌ను మా కోసం కేన్సిల్ చేసుకుని వ‌చ్చారు. ఆయ‌న హృద‌యం ఎంత పెద్ద‌దో అర్థ‌మ‌వుతోంది. నెక్స్ట్ ఇంకో కొత్త ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకో మంచి సినిమా చేస్తా`` అని చెప్పారు.

చిరంజీవి మాట్లాడుతూ ``చాలా ఫంక్ష‌న్ల‌కు ఈ మ‌ధ్య వెళ్లాను. అయితే ఇక్కడున్న వైబ్రేష‌న్స్ చూస్తుంటే ఇది మాదా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌దా? అనేది అర్థం కాలేదు. ఈ సినిమా స‌క్సెస్ మీట్లో అంద‌రినీ క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది. విజ‌య్ చాలా హుషారైన హీరో. సినిమా చూసిన త‌ర్వాత నా ఆనందాన్ని వ్య‌క్తం చేశా. దాంతో చాల‌ద‌న్న‌ట్టుగా ఈ చిత్ర యూనిట్ వ‌చ్చి `స‌క్సెస్ మీట్‌కి రావాలి` అని ఆహ్వానించారు. నేను వ‌స్తే వారి ఆనందం ప‌రాకాష్ట‌కు చేరుకుంటుంద‌ని అన్నారు. నిజానికి ఈ రోజు షూటింగ్ ఉంది. నిన్న రాత్రి కూడా 2 గంట‌ల వ‌ర‌కు కొన్ని వంద‌ల మందితో షూటింగ్ చేశాం. ఈ రోజూ ఉంది. అయితే వీరంద‌రినీ చూసిన త‌ర్వాత ఏమ‌నిపించిందంటే.. `షూటింగ్ ఒక‌రోజు ఆగినంత మాత్రాన ఏమీ జ‌రగ‌దు` అని. వ‌ర్షం ప‌డుతున్న‌ప్పుడు కూడా ఆపేస్తుంటామ‌నిపించింది. ఇలాంటి వేడుక‌లో పాల్గొన‌డం వ‌ల్ల నాకు ఆనందంగా ఉంటుంది. ఇంత ఆనందం మాకు ప్రేక్ష‌కులే ఇచ్చారు. వాళ్ల ఆశీస్సుల‌తో మాత్ర‌మే ఇది ద‌క్కింది. సినిమా బావుందంటే బ‌డ్జెట్ గురించి ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోరు. ఈ సినిమా అల‌రించింది కాబ‌ట్టి ఆద‌రించారు. ఈ మ‌ధ్య గ‌త రెండేళ్లుగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. ప్రోత్సాహంగా ముందుకెళ్తోంది. సినిమాల్లో చిన్న‌, పెద్ద తేడా లేదు. బ‌డ్జెట్ ఎంతైనా సినిమాలు చాలా పెద్ద స‌క్సెస్ సాధిస్తున్నాయి. ఆ ర‌కంగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ ముందుకు వెళ్ల‌డం ఆనందంగా ఉంది. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కు ఎప్పుడూ కృత‌జ్ఞులై ఉంటాం. ఈ మ‌ధ్య అల్లు అర‌వింద్‌గారు క‌లిసిన‌ప్పుడు ఏ సినిమా చేస్తున్నార‌ని అడిగితే `విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప‌రశురామ్‌తో ఓ సినిమా చేస్తున్నాం. కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ `అర్జున్ రెడ్డి`లో చాలా ఎన‌ర్జిటిక్‌గా, ఎరాటిక్‌గా చేశాడు. కానీ మా సినిమా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. హీరోయిన్ ద‌గ్గ‌ర చేతులు క‌ట్టుకుని, లేకుంటే కాళ్ల మీద ప‌డిపోయే పాత్ర‌. మేడ‌మ్ మేడ‌మ్ అంటూ ఉండే పాత్ర. అలాంటి పాత్ర‌ను ప్రేక్ష‌కులు ఎలా ఆద‌రిస్తారో అనే టెన్ష‌న్ ఉంది` అని అన్నారు. ఆ స‌మ‌యంలో నాకు ఇదే గీతా ఆర్ట్స్ లో తెర‌కెక్కిన `విజేత‌` గుర్తుకొచ్చింది. ఆ సమ‌యంలోనేను అటు `ఖైదీ`గానీ, ఇటు `అడ‌వి దొంగ‌`, `చ‌ట్టంతో పోరాటం`, `చ‌ట్టానికి క‌ళ్లులేవు` అంటూ యాక్ష‌న్ హీరోగా నేను దూసుకుపోతున్నాను. అప్పుడు `విజేత‌`లో అల్లారుముద్దుగా, ఇంట్లో చిన్న‌వాడిగా, అల్లారుముద్దుగా పెరిగే కుర్రాడిగా యాక్ష‌న్ లేన‌టువంటి సినిమా చేశా. అప్పుడు ఆ సినిమాను ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని నేను, అల్లు అర‌వింద్‌గారు అనుమానించాం. కానీ ఆ సినిమా న‌న్ను ఆల్ క్లాస్ హీరోగా నిల‌బెట్టింది. అలాగే ఈ రోజున `గీతా గోవిందం` విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు అదే విధంగా ఆల్ క్లాస్ హీరోగా, కుటుంబ స‌భ్యుల అభిమానాన్ని చూర‌గొనే విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ స‌మ‌యంలో విజ‌య్‌కి ఇంత మంచి సినిమా రావ‌డం చాలా సంతోషాన్ని క‌లిగించే విష‌యం. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ప‌ర‌శురామ్‌గురించి ఆలోచించాలి. అత‌ని మ‌న‌సులో ప‌డ్డ ఆలోచ‌న చాలా మంచిది. సినిమాను రెండున్న‌ర గంట‌ల పాటు చాలా ఉత్కంఠ‌గా, లైట్ హార్టెడ్‌గా సినిమా చేశాడు. క‌థ‌కుడిగా, స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా, డైర‌క్ట‌ర్‌గా ప‌ర‌శురామ్ స‌క్సెస్ సాధించాడు. మా బ‌న్నీవాసుకు నిర్మాత‌గా ఇచ్చారు. బ‌న్నీ వాసు అల్లు అర్జున్‌కి ఫ్రెండ్‌గా ఈ సంస్థ‌లో ప‌రిచ‌య‌మ‌య్యాడు. త‌ను ఒక క‌థ వింటున్న‌ప్పుడు తెర మీద ఎలా ఉంటుందో జ‌డ్జి చేయ‌డంలో అత‌ను చాలా గ్రేట్ అని అంటుండ‌టం నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింద‌. అలా అత‌ను సంస్థ‌లో ఉంటూ, నిర్మాణ బాధ్య‌త‌ల‌ను వెన‌కుండి న‌డిపిస్తూ, ఈ రోజున నిర్మాత స్థాయికి ఎదిగిన బ‌న్నీ వాసును మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నా. విజ‌య్‌ని క‌న్విన్స్ చేశానంటే అత‌నికి ఎంత న‌మ్మ‌కం ఉండాలి ఈ సినిమా మీద‌. నిర్మాతగా అత‌న్ని ఎంక‌రేజ్ చేస్తున్న అర‌వింద్‌గారిని మెప్పించాలి. `అర్జున్ రెడ్డి`కి, `గీత గోవిందం`కి విజ‌య్ లో ఉన్న మార్పును చూశా. `అర్జున్ రెడ్డి` యాక్సిడెంట్‌గా హిట్ అయిందా? మ‌రోటా అని అనుకున్నాను. అది అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకోలేద‌న్న‌ది నిజం. నిద్ర‌పోతున్న అమ్మాయితో సెల్పీ తీసుకోవ‌డానికి తాప‌త్ర‌య‌ప‌డే కుర్రాడు అనుకోకుండా లిప్‌లాక్ చేసిన అబ్బాయిగా, ప్ర‌తి సన్నివేశంలోనూ చాలా బాగా చేశాడు. సినిమాలో యాక్టింగ్ చాలా బాగా చేశాడు. అత‌నికి చాలా భ‌విష్య‌త్తు ఉంది. ఈ సినిమాతో విజ‌య్‌కి స్టార్ స్టేట‌స్ వ‌చ్చింది. నాక్కూడా 1978 నుంచి 30 సినిమాలు దాకా చేసినా స‌రే `ఖైదీ` నాకు స్టార్ స్టేట‌స్ ఇచ్చింది. ఈ సినిమా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఓ స్టార్ స్టేట‌స్‌ని క‌ల‌గ‌జేసింది. ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ స్టార్ల‌లో విజ‌య్ ఒక‌డు. అత‌న్ని నేను వెల్క‌మ్ చేస్తున్నా. ప్ర‌తి అడుగునూ ఆచితూచి వేసుకో. ఆడియ‌న్స్ ఉత్సాహం మ‌న‌కు ఎన‌ర్జీని ఇస్తుంది. దాన్ని కావాల‌ని విజ‌య్ కోరుకుంటున్నాడు. దాన్ని త‌ల‌లో కాకుండా, మ‌న‌సులో పెట్టుకుంటే ఆడియెన్స్ కూడా గుండెల్లో పెట్టుకుంటారు. ఇండ‌స్ట్రీకి దొరికిన అరుదైన స్టార్ విజ‌య్‌. వాళ్ల అమ్మా నాన్న‌లు కూడా నాకు తెలుసు. వెన్నెల‌కిశోర్ చివ‌ర్లో వ‌చ్చినా చ‌మ్మ‌క్ అనిపించాడు. త‌న ధోర‌ణిలో త‌ను ఉంటూ, చాలా కిక్ ఇచ్చాడు. తింగ‌రిత‌న‌మైన యాక్టింగ్ అత‌నిది. రాహుల్ రామ‌కృష్ణ కూడా చాలా స‌ర‌దాగా చేశాడు. సినిమా చివ‌రి వ‌ర‌కు ర‌క్తి క‌ట్టించ‌డానికి వీళ్ల కేర‌క్ట‌ర్లు కూడా దోహ‌ద‌ప‌డ్డాయి. సుబ్బ‌రాజుగారిని చూస్తుంటే ఆ ట్రిమ్నెస్ న‌న్ను ఆక‌ట్టుకుంటుంది. వాళ్ల నాన్న‌గారు కూడా నాకు తెలుసు. అన్న‌పూర్ణ‌మ్మ నాకు తల్లి. చాలా ఏళ్లు అయింది ఆవిడ‌ను చూసి. మా కాంబినేష‌న్ స‌క్సెస్ అయింది. ఈ సినిమాలో ఆమె విజృంభించారు. ర‌ష్మిక బ్యాంకాక్‌లో ఉన్నారు. అందుకే రాలేక‌పోయారు. త‌ను కూడా చాలా చ‌క్క‌గా న‌టించింది. హీరో గ‌నుక నిల‌బ‌డ‌క‌పోతే డామినేట్ చేసే కేర‌క్ట‌ర్‌. అలాంటిది ఆ అమ్మాయి చాలా కంపోజ్డ్ గా క‌ళ్ల‌తోనే కోపం చూపించి వావ్ అనేలా చేసింది. కొన్నాళ్ల క్రితం అర‌వింద్‌గారిని క‌లిసిన‌ప్పుడు గంట‌న్న‌ర సినిమా లీక్ అయింద‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో మాన‌సికంగా డిస్ట‌ర్బ్ అయి ఉన్నారు. `మీరేం వ‌ర్రీ కాకండీ. మా త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా `అత్తారింటికి దారేది` కూడా ఇలాగే గంట‌న్న‌ర కంటెంట్ బ‌య‌టికి వెళ్లిపోయింది. దాని వ‌ల్ల స‌క్సెస్‌కి ఏమాత్రం ఆటంకం లేదు. అందువ‌ల్ల ఆ ర‌కంగా సెంటిమెంట్ అనుకోండి` అని అన్నాను. ఈ మాట‌ల‌ను ఆయ‌న‌కు ఊర‌ట క‌లిగించాల‌ని లైట‌ర్ వెయిన్‌లో అన్నాను. కానీ ఇన్ని కోట్లు వెచ్చించి సినిమా చేసిన త‌ర్వాత ఆ కంటెంట్‌ని ఏదో కుర్ర‌త‌నంగానో, వేరే దురుద్దేశాలు ఉండో.. దాన్ని య‌థాలాపంగా త‌స్క‌రించి, చోరీ చేసి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవ‌డం ఏం న్యాయం? ఎంత వ‌ర‌కు స‌బ‌బు? సినిమా ప‌రిశ్ర‌మ ఎంతో మందికి భోజ‌నం పెట్టే త‌ల్లిలాంటిది. ఇక్క‌డ ప‌నిచేసే టెక్నీషియ‌న్స్ వాళ్ల ఫ్రెండ్స్ ద్వారా షేర్ చేస్తున్నారు. అలాంటి వారు త‌ల్లి పాలు తాగి రొమ్ము గుద్దేర‌కాలు.. త‌ప్పు చేసిన వారు ఊచ‌లు లెక్క‌బెడుతున్నారు. వాళ్ల వ‌ల్ల ఒక ఆవేద‌న‌, బాధ వాళ్ల త‌ల్లిదండ్రుల‌కు క‌ల‌గాలా? ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ హెచ్చ‌రిస్తున్నాను. కింది స్థాయి టెక్నీషియ‌న్స్ నుంచి ఎవ‌రైనా బాధ్య‌తా ర‌హితంగా బిహేవ్ చేస్తే తల్లి పాలు తాగి రొమ్మును గుద్దిన‌ట్టేన‌ని అర్థం చేసుకోండి. కెమెరామేన్ నీల‌కంఠంగారికి, సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్‌గారికి, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు... ప్ర‌తి ఒక్క‌రికీ నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. ఇంత స‌క్సెస్ చేసినందుకు ప్రేక్ష‌కుల‌కు నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు`` అని అన్నారు.

 


 

 

Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved