డా.మంచు మోహన్‌బాబు నటిస్తూ అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పణలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం `గాయత్రి`. మదన్ దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్‌మీట్‌లో...
డా.మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ ``నిర్మాతగా నా హృదయం ఎడుస్తుంది. నాలాంటివాళ్లు చాలా మంది సినీ పరిశ్రమలో ఉన్నారు. కానీ బయటకు రాలేకపోతున్నారు. సినిమా రిలీజైన వెంటనే ఇంటర్నెట్‌లో పెట్టారు. సినిమా తీసిన వారికి కుటుంబం ఉంటుంది. తొమ్మిది మాసాలు కష్టపడ్డాను. చేతికి, మోకాలికి ఆపరేషన్ జరిగింది. షూటింగ్ సమయంలో ఎంత కష్టపడ్డామో.. నా దర్శకుడికి, టెక్నీషియన్స్‌కి తెలుసు. రిస్క్ తీసుకుని ఫైట్స్ చేశాను. నేను నటుడిగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు చల్లగా చూడటం వల్ల నా కుటుంబం మంచి స్థితిలో ఉంది. ఇంటిలో పెద్దను బట్టే కుటుంబం నడుస్తుంది. మనం బాగుండాలంటే మన కుటుంబం బాగుండాలి. రాష్ట్రం బాగుండాలంటే ముఖ్యమంత్రి, దేశం బాగుండాలంటే ప్రధానమంత్రి బాగుండాలి. వారికి మన తోడ్పాటు అందించాలి. కానీ చెడు చేసేవారికి తోడ్పాటుని అందించకూడదు. పైరసీ సీడీలను చూడొద్దని కోరుతున్నాను. ఎదుటివాడి చెడిపోవాలని కోరుకుంటే.. మనమే పాడైపోతాం. సినిమా రిలీజైన రోజే సినిమా పైరసీ విడుదల కావడం బాధాకరం. ఇక మరో విషయమేమంటే.. `గాయత్రి` సినిమాలో మంచు విష్ణు నటనకు నటుడిగా మంచి పేరొచ్చింది. విష్ణు తనదైన ఇన్‌వాల్వ్‌మెంట్‌తో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. కలెక్షన్స్ ఒకచోట ఎక్కువగా , మరో చోట తక్కువగా ఉండొచ్చు. కానీ నిర్మాతగా సేఫ్ అయ్యాను. తండ్రి, కూతురి మధ్య అనుబంధాన్ని తెలియజేసే సినిమా ఇది. ఇంతకు ముందు చాలా హిట్స్ వచ్చినా.. ఈ సినిమాకు వచ్చిన అభినందన మరో సినిమాకు రాలేదు. ప్రేక్షకుల అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
చిత్ర దర్శకుడు మదన్ మాట్లాడుతూ - ``సినిమాకు చాలా మంచి ఆదరణ లభించింది. సినిమా చూసిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫోన్ చేసి అప్రిసియేట్ చేస్తున్నారు. మోహన్‌బాబుగారి వంటి సీనియర్ నటులు స్క్రిప్ట్‌కు ప్రాధాన్యతనిచ్చి నటించారు. మా ఫిలిం కెరీర్‌లో `గాయత్రి` అద్భుతమైన చిత్రం. మాటలు అందించిన పరుచూరి బ్రదర్స్, రత్నంగారు ఎంతో డిస్కస్ చేసుకుని డైలాగ్స్ అందించారు. సినిమా సెట్స్‌కు వెళ్లడానికి ముందే ఆత్మ విమర్శ చేసుకుని గర్వపడేలా సినిమా చేశాం`` అన్నారు.
డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ - ``మంచి చేస్తే మనకు కూడా మంచే జరగుతుందనే కాన్సెప్ట్‌తో ఓ మంచి టీమ్‌గా మేమంత చేసిన ప్రయత్నమే `గాయత్రి` చిత్రం. పరుచూరిగారు కూడా స్క్రిప్ట్ కు తమ మంతు సహకారం అందించారు. అందరూ మంచిగా ఆలోచించేలా డైలాగ్స్‌ను రాశాం. వారానికి ఎక్కువగా సినిమాలు విడుదలవుతున్నాయి. సినిమా విడుదలైన రోజునే పైరసీ జరిగిపోతుంది. నిర్మాత పరిస్థితి ఘోరంగా తయారైంది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజా రవీంద్ర, గీతా సింగ్ తదితరులు పాల్గొన్నారు.