pizza
Jathi Ratnalu Success Meet
వారే నిజమైన ‘జాతి రత్నాలు’.. సక్సెస్ మీట్‌లో హీరో నవీన్ పొలిశెట్టి.
You are at idlebrain.com > News > Functions
Follow Us


18 March -2021
Hyderabad

నవీన్ పోలిశెట్టి - రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం 'జాతిరత్నాలు`. అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ నిర్మాత‌గా ప‌రిచ‌య మ‌వుతున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో చిత్రయూనిట్ విజయోత్సవ కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్‌లో జరిగిన జాతిరత్నాలు సక్సెస్ మీట్‌లో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, నరేష్, ఫరియా, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మాతలు ఒప్పుకోలేదు.
దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ... ‘సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. పిలిచి మరీ సినిమా ఆఫర్ ఇచ్చినందుకు నాగ్ అశ్విన్, స్వప్నా, ప్రియాంకలకు థ్యాంక్స్. నవీన్, ప్రియదర్శి, రాహుల్ అందరూ కూడా ఎంతో సహకరించారు. డీఓపీ, ఆర్ట్ డైరెక్టర్ అందరికీ థ్యాంక్స్. ఓటీటీ టైంలో సినిమాకు చాలా పెద్ద ఆఫర్ వచ్చింది. నిర్మాతలు మాత్రం దానికి ఒప్పుకోలేదు. థియేటర్లలో నవ్వులు పూయించేందుకు చేసిన మా ప్రయత్నం ఫలించింది. రదన్ గారు మంచి సంగీతాన్ని ఇచ్చాడు. స్క్రిప్ట్‌లో నవీన్ చాలా డెవలప్ చేశాడు. కానీ క్రెడిట్ మాత్రం నాకు దక్కింది. మీరు ఇలా థియేటర్లో ఈ సినిమాను ఎంజాయ్ చేస్తుంటే నాకు అద్భుతమైన ఫీలింగ్ కలుగుతోంది’ అని అన్నారు.

ఇది నా విజయం కాదు..
సంగీత దర్శకుడు రదన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నేను చేయడానికి ముఖ్య కారణం నాగ్ అశ్విన్, ప్రియాంక, స్వప్నా. అనుదీప్ మొదటి సారిగా కలిసినప్పుడు ఆయన అమాయకత్వం నచ్చింది. కథ చెప్పినప్పుడే ప్రతీ సాంగ్‌ను డిజైన్ చేశాం.. రూలర్‌ ఏరియాకు వెళ్లి ఇలా కావాలని అన్నారు. నేను చేసింది తక్కువే. నటీనటులు అదరగొట్టేశారు. వారు చేసిన దానికి నేను చాలా తక్కువ చేశాను అని ఫీల్ అయ్యాను. ప్రతీ ఒక్కరూ ఇది కూడా తమ సినిమా అని ఫీలై చేశారు. రామ్ మిర్యాల వల్లే చిట్టి అనే పాట హిట్ అయింది. ఇది నా విజయం కాదు.. ఇది మనందరిది. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

ఆఫర్ ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్..
హీరోయిన్ ఫరియా మాట్లాడుతూ.. ‘మీరంతా (ఆడియెన్స్) ఇక్కడికి వచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు నా అభిమానుల ముందు ఉన్నాను. నన్ను ఈ సినిమాలో తీసుకున్నందుకు.. నవీన్, ప్రియదర్శి, రాహుల్‌లతో సమాన పాత్ర ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. నేను ఓ ఆర్టిస్ట్‌ను. నాకు నటన అంటే చాలా ఇష్టం. నాకు ఉన్న ఆ ఆసక్తిని తెలుసుకుని చాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. నన్ను ఇంతలా ఎంకరేజ్ చేసినందుకు, సినిమాను సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్. మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే ఇంకా మరిన్ని మంచి సినిమాలు చేస్తాం’ అని అన్నారు.

దానికి కారణం నిర్మాతలే.
డీఓపీ మనోహర్ మాట్లాడుతూ. సినిమాను హిట్ చేసినందుకు ఆడియెన్స్‌కు థ్యాంక్స్. పగలూ రాత్రి పని చేశాం. ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. నాగ్ అశ్విన్ తన సినిమాల కంటే ఎక్కువగా కష్టపడ్డాడు. ఇది ఇంత హిట్ అయిందంటే దానికి కారణం నిర్మాతలే. ఇప్పుడు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు.

అది మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను
నరేష్ మాట్లాడుతూ.. ‘నటుడికి ఇలాంటి పాత్ర, సినిమా రావడం అదృష్టం. యూత్ సినిమా అని ముద్ర వేశారు కానీ ఇది కచ్చితంగా ఫ్యామిలీ సినిమా. 16 నుంచి 86 వరకు అందరూ కూడా ఇలాంటి వేషాలు పడ్డవారే. చిత్రం భళారే విచిత్రం విడుదలైనప్పుడు వచ్చిన క్రేజ్ మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను. నాగ్ అశ్విన్, ప్రియాంక, స్వప్నా, అనుదీప్ జాతిరత్నాలు వీరే నాలుగు స్థంబాలు. కథ చెప్పినప్పుడే సూపర్ హిట్ అవుతుందని చెప్పాను. సినిమా షూటింగ్ మొత్తంలో నవ్వుతూనే ఉన్నాను. జనాలు ఇంకా నవ్వుతూనే ఉన్నారు. అద్భుతమైన నటుడే కాకుండా అద్భుతమైన రచయిత. రాహుల్, ప్రియదర్శి గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లోనే పొడుగు సుందరి ఫరియా. ఒక్కొక్క సీన్.. ఒక్కొక్క ఫ్రేమ్ పండించిన సినిమా ఇది. సినిమాను సక్సెస్ చేసిన అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

మళ్లీ వరంగల్‌లో ప్రోగ్రాం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ.. ‘జాతి రత్నాలు సినిమా గురించి చాలా మంది స్నేహితులు ఫోన్ చేసి చూడమంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల చూడలేకపోయాను. రేపు కచ్చితంగా చూస్తాను. మళ్లీ వరంగల్‌లో ప్రోగ్రాం పెట్టిస్తాను. నవీన్, ప్రియదర్శి, రాహుల్ దగ్గర ఎంతో కళ ఉంది. వారికి సమయం వచ్చింది. అద్భుతంగా నటిస్తుంటారు. ఈ సినిమాకు అందరూ కలిసి పని చేశారు. అద్భుతమైన కామెడీతో ఉన్న సినిమాను అందించినందుకు థ్యాంక్స్’ అని అన్నారు.

మేం ముగ్గురం ఎప్పటికీ ఇలానే ఉంటాం.
ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘నాలుగేండ్ల ముందు పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఇలాంటి కామెడీ సినిమా ఇంకా వస్తదా? అనుకున్నాను. కానీ జాతిరత్నాలు సినిమా వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా పెళ్లాం కంటే ఎక్కువగా రాహుల్‌తో కలిసి ఉంటున్నాను. సినిమా కోసం మేం ఎంత కష్టపడ్డామన్నది మీకు (ఆడియెన్స్) అనవసరం. మీకు సంతోషకరమైన క్షణాలు ఇవ్వాలనే ఎంతో మంది కష్టపడుతుంటారు. ఈ సినిమాను నిర్మించిన స్వప్నా, ప్రియాంక, నాగ్ అశ్విన్‌లకు థ్యాంక్స్. అమెరికాలో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కు కూడా చెబుతున్నాం. న్యూయార్క్‌కు వస్తున్నాం. మేం ముగ్గురం కలిసి ఎప్పటికీ ఇలానే ఉంటాం. అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

సినిమా హిట్ అవ్వడానికి అదే కారణం..
రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం అనుదీప్. ఈయన ప్రభావం మా జీవితాలపై చాలా పడింది. మధ్యలో కరోనా వచ్చింది. మనం అసలు ఇక నవ్వుతామో లేదో అనుకున్నా. సీటు చింపుకునేలా నవ్వుతారని వరంగల్ ఈవెంట్‌లో చెప్పాను. అలానే జరుగుతోంది. థియేటర్ ఓనర్లు ఫోన్ చేసి నన్ను డబ్బులు అడుగుతున్నారు. సినిమాకు పని చేసినప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. సినిమాను ఇంత సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని అన్నారు.

ఈ ప్రేమ, సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి.
నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ‘మీ రెస్పాన్స్ చూసి నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి. ప్రమోషన్స్‌లో మేమే కనిపిస్తాం. మేం కనిపించే జాతి రత్నాలు. కానీ నాగ్ అశ్విన్, ప్రియాంక, స్వప్నాలే నిజమైన జాతి రత్నాలు. అనుదీప్ జీవితాన్ని చదివాడు. చాలా గట్టిగా మానవత్వం నేర్చుకున్నాడు. దాని కంటే పెద్ద డిగ్రీ లేదు. ఇది మా అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. దర్శకుడు అనుదీప్ నాకు ఓ సోదరుడు లాంటివాడు. మొదటి సినిమానే అయినా కూడా ఫరియా అద్భుతంగా నటించింది. నరేష్ గారిని చూసి ఎంతో నేర్చుకున్నాం. మా సినిమాలో భాగస్వామి అయినందుకు నరేష్ గారికి థ్యాంక్స్. రదన్ తన సంగీతంతో ప్రాణం పోశాడు. చాలా రోజుల తరువాత ఎంతో నవ్వామని ఎయిర్ పోర్ట్‌లో ఓ సెక్యూరిటీ గార్డ్ చెప్పిన మాటలకంటే పెద్ద బ్లాక్ బస్టర్ ఏది ఉండదు. ఎంతో మంది ఆశీస్సులతో ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఏజెంట్‌గా ఒప్పుకున్నారు.. చిచోరేలో యాసిడ్ అంటే ఒప్పుకున్నారు.. ఇప్పుడు జోగిపేట్ శ్రీకాంత్ అంటే కూడా ఓకే అన్నారు. ఈ ప్రేమ, సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. హీరోది ఏ ఫ్యామిలీ అంటే మీ(ఆడియెన్స్) ఫ్యామిలీ అని చెప్పండి. ’ అని అన్నారు. ఇక స్టేజ్ మీదే దర్శకుడు, హీరోలు అందరూ కలిసి జాతి రత్నాలు సీక్వెల్ గురించి ప్రకటించేశారు. త్వరలోనే జాతి రత్నాలు సీక్వెల్ ఉంటుందని తెలిపారు.

 

Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved