pizza
NTR launches Kumari 21 F teaser
You are at idlebrain.com > News > Functions
Follow Us

02 October 2015
Hyderabad

‘కుమారి 21 ఎఫ్’ టీజ‌ర్ విడుద‌ల‌

సుకుమార్ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తూ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్’. రాజ్‌తరుణ్, హేభాపటేల్ జంటగా నటిస్తున్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్, పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజ‌ర్ ను శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో ఎన్టీఆర్ విడుద‌ల చేశారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ ``ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే కార‌ణాలు చాలా ఉంటాయి. ద‌ర్శ‌కుడు అలా చేయాల‌నుకున్నాడు, చేయ‌లేక‌పోయాడు. ఇలా చేయాల‌నుకున్నాడు అనే మాట‌లు వినిపిస్తుంటాయి. కానీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఫ్లాప్ కు కూడా ఓ రెస్ప‌క్ట్ ఉంటుంది. అందుకు కార‌ణం ఆయ‌న సినిమాలు అలా ఉండ‌ట‌మే. ఈ సినిమా టీజ‌ర్‌ను చిన్న ప్లేస్‌లో తెర‌కెక్కించారు. కానీ చూడ్డానికి వండ‌ర్‌ఫుల్‌గా ఉంది. రాజ్‌త‌రుణ్ సినిమా ఉయ్యాల జంపాల‌ను మా ఆవిడ చూడ‌మంటే చూశాను. త‌న ఎదుగుద‌ల‌కు ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. దేవిశ్రీప్ర‌సాద్‌, ర‌త్న‌వేలు గురించి ఎంతైనా చెప్పొచ్చు. ఈ సినిమా ద‌ర్శ‌కుడు నాతో సుబ్బు చిత్రానికి ప‌నిచేశాడు`` అని అన్నారు.

థామ‌స్ రెడ్డి మాట్లాడుతూ ``సుక్కుతో టై అప్ అయి ఈ సినిమాను చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. రాజ్‌త‌రుణ్‌కి ఈ సినిమా మంచి బ్రేక్‌నిస్తుంది. టీజ‌ర్ కోస‌మే చిన్న షాట్‌ను రాసి తెర‌కెక్కించారు. అంటే సుక్కుకున్న క్లారిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. షూటింగ్ పూర్తి కావ‌స్తోంది`` అని చెప్పారు.

ర‌త్న‌వేలు మాట్లాడుతూ ``ఈ సినిమాను కేవ‌లం సుక్కు కోస‌మే చేయ‌లేదు. క‌థ చాలా బావుంద‌న్న‌ది కూడా మ‌రో రీజ‌న్‌. దేవిశ్రీ, నేనూ ఇలా మంచి టీమ్ క‌లిశాం. ఈ సినిమా డైర‌క్ట‌ర్‌కి క్లారిటీ ఉంది. అత‌ను కొత్త‌వాడైనా నాకేం ఇబ్బంది అనిపించ‌లేదు. హీరో, హీరోయిన్లు చాలా ఈజ్‌తో న‌టించారు`` అని చెప్పారు.

దేవిశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``రాజ్‌త‌రుణ్ నిజానికి అప్ క‌మింగ్ హీరో. ఈ సినిమాతో అత‌నికి త‌ప్ప‌కుండా మంచి బ్రేక్ వ‌స్తుంది. నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాడు. ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద విజ‌యాన్ని సాధిస్తుంది. సుకుమార్‌, నేనూ క‌లిసి చేస్తామంటే త‌ప్ప‌కుండా క్రేజ్ ఉంటుంది. ఇది కూడా చాలా మంచి సినిమా అవుతుంది. ఎన్టీఆర్ ఈ చిన్న సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి రావ‌డం చాలా ఆనందంగా ఉంది. అది గొప్ప విష‌యం. క‌రెంటు సినిమాకు నేను ఈ ద‌ర్శ‌కుడితో ప‌నిచేశాను. ఆ పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి`` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``సుకుమార్‌గారితో కూర్చోవ‌డ‌మంటే నాకు చాలా ఇష్టం. చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని అన్నీ నేర్పించినంత ఓపిక‌గా నాకు నేర్పించాడు సుకుమార్‌. చాలా బుజ్జగించి చెప్పాడు. నా స్థాయికి మించిన టెక్నీషియ‌న్ల‌ను నాకు ఇచ్చారు. సుబ్బు సినిమాకు కొన్నాళ్ళు అసిస్టెంట్‌గానూ ప‌నిచేశాను. ఎన్టీఆర్‌గారు నాకు అప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా చాలా స‌పోర్టివ్‌గా ఉంటున్నారు. ఈ టీజ‌ర్ విడుద‌ల ఆయ‌న చేతుల మీదుగా జ‌ర‌గ‌డం ఆనందంగా ఉంది. హీరో, హీరోయిన్లు చాలా బాగా న‌టించారు. క్యూట్ ల‌వ్ స్టోరీ ఇది`` అని అన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ ``ఈ క‌థ న‌న్ను ఆరేళ్ళుగా వెంటాడుతోంది. ఒక లైనుతో ఏడాది క్రితం క‌థ చేశాం. ప్ర‌తాప్‌కి చెప్పి డెవ‌ల‌ప్ చేసుకున్నాం. నేను, దేవి, ర‌త్న‌వేలు క‌లిసి చేస్తున్నాం. మేం ఏం చేశామ‌న్న‌ది, వారు నాకు ఎలా స‌హ‌క‌రించార‌న్న‌ది ఆడియో వేడుక‌లో చెబుతాను. ఈ స్క్రిప్ట్ గురించి డిస్క‌ష‌న్ వ‌చ్చిన‌ప్పుడు రాజ్ త‌రుణ్ తానే ఈ పాత్ర‌ను చేస్తాన‌ని చెప్పేశాడు. నేను కాస్త డౌట్ ప‌డ్డాను కానీ మా వాళ్ళంద‌రూ అత‌ను యాప్ట్ అని అన్నారు. హీరోయిన్‌గా ముందు వేరే అమ్మాయిని అనుకున్నాం. కానీ ఈ అమ్మాయి చాలా బాగాచేసింది. రాజ్ త‌రుణ్‌కి ఈ సినిమా త‌ర్వాత అమ్మాయిల ఫాలోయింగ్ పెరుగుతుంది. ఈ సినిమాకు నా మాట‌ల‌కు కొంత బ్రేక్ వ‌స్తే వెంక‌టేష్ చ‌క్క‌గా మాట‌లు రాశాడు`` అని తెలిపారు.

బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``అంద‌రికీ ఆల్ ద బెస్ట్`` అని చెప్పారు. ఈ సినిమాలో న‌టించ‌డం ప‌ట్ల హీరో, హీరోయిన్లు ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

నోయల్, నవీన్, సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: అమర్‌రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved