pizza
Vishvanata Saamraagni title presentation to B Saroja Devi
ప్రముఖ నటి బి.సరోజాదేవి కి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు ప్రదానం
You are at idlebrain.com > News > Functions
Follow Us


4 March 2019
Hyderabad

‘‘నేనెక్కడ కనిపించినా తెలుగు ప్రేక్షకులు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’
పాటని గుర్తు చేస్తుంటారు. ‘కృష్ణార్జునయుద్ధం’లో నేను ఎన్టీఆర్‌ని చిన్నన్నయ్యా అంటుంటాను. ఆ సంభాషణని గుర్తు చేసి ఒకసారి చెప్పండని అడుగుతుంటారు. మరోసారి ఈ వేదికపై ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు ప్రముఖ నటి బి.సరోజాదేవి. ఆమెకి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విశాఖపట్నంలో ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదుని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘టి.సుబ్బరామిరెడ్డికి కళలన్నా, కళాకారులన్నా ఎంతో గౌరవం. శివరాత్రి రోజున ఈ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంద’’న్నారు.‘‘ఆ రోజుల్లో హీరోల్ని మించి పారితోషికం అందుకొన్న కథానాయిక బి.సరోజాదేవి. ఆమెకి తెలుగు ప్రజల తరఫున ప్రదానం చేసిన బిరుదు... ‘విశ్వనట సామ్రాజ్ఞి’’ అన్నారు టి.సుబ్బరామిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ద్రోణంరాజు శ్రీనివాస్‌, పడాల అరుణ, నటుడు, ఎంపీ మురళీమోహన్‌ నటీమణులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, గాయని పి.సుశీల తదితరులు పాల్గొన్నారు.

శివనామ స్మరణతో సోమవారం విశాఖ సాగరతీరం మార్మోగింది. సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఏటా సాగరతీరంలో నిర్వహించే మహా కుంభాభిషేకం ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు సాగరతీరానికి తరలివచ్చారు. దీంతో తీరం వెంబడి భక్తుల శివనామ స్మరణతో మార్మోగింది. కోటి లింగాలకు కుంభాభిషేకం, యాగం నిర్వహించడానికి ప్రత్యేకంగా యాగశాలను నిర్మించారు. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కోటి లింగాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రధమ పూజను డాక్టర్‌ టి.సుబ్బరామిరెడ్డి నిర్వహించగా అక్కడి నుంచి మంత్రి గంటా, ముక్కాముల స్వామీ, సినీ ప్రముఖులు జమున, వాణిశ్రీ, గీతాంజలి, మురళీ మోహన్‌ తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు మాట్లాడుతూ శివ భక్తుడైన డాక్టర్‌ సుబ్బరామిరెడ్డి లోక కళ్యాణార్ధం ప్రతీఏటా బీచ్‌ వద్ద కోటి లింగాలను ఏర్పాటుచేసి పూజలు నిర్వహించడం దీనికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని కల్పించడం అభినందనీయమన్నారు. వేలాదిమంది భక్తులు తరలి వచ్చినా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేని విధంగా నగర పోలీసులు ఏర్పాట్లు చేయడం శుభపరిణామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్‌, పీసీసీ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, పెద్దఎత్తున పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. పరమేశ్వరుని దర్శించుకునేందుకు వీలుగా తెల్లవారుజామున 5.30 గంటల నుంచీ వీలు కల్పించినట్టు డాక్టర్‌ సుబ్బరామిరెడ్డి తెలిపారు. పూజా కార్యక్రమాలు అనంతరం భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు.


Photo Gallery (photos by G Narasaiah)

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved