pizza
అ ఆలు - అక్కినేని ఆలోచనలు by Srinivas Kanchibhotla
You are at idlebrain.com > news today >
Follow Us

23 January 2014
Hyderabad

నిజం చెప్పాలంటే నాయుకుడికి ఉండవలసిన ప్రాధమిక లక్షణాలు ఏవీ ఆయనకి తగు మోతాదుల్లో లేవు. స్ఫురథ్రూపం, కంచు కంఠం, ఆరడుగుల ఎత్తూ, అజానుబాహువులు ఏవీ ఆయన సొత్తు కావు. ఆయన చిత్ర సీమ లో పాదం మోపిన సమయం చలనచిత్రం అప్పుడప్పుడే వడివడిగా నడక నేర్చుకుంటున్న రోజులు. ఆ తొలి నాళ్ళలో నిర్మింపబడ్డ జానపద, పౌరాణిక సినిమాల్లో సహాయక పాత్రలకే పరిమితమవ్వాల్సిన శారీరిక సౌష్టవం. దానికి తోడు ఆయన చుట్టూ అప్పటికే పరిశ్రమలో పాతుకుపోయిన మేరు నగధీరుల (ఆకారాల్లో కూడా) నడుమ ఆయనది చిట్టెలుక పరిమాణం. దృశ్య మాధ్యమానికి అత్యంత ఆవశ్యకమైన (కనీసం ఆ రోజుల్లో) రూపం, గాత్రం ఆయనను వరించలేదు, కనికరించలేదు. పెట్టుబడన్నా, పరిమితులన్నా, ఉన్నవి అవి. అటువంటి ఆ అర్భకప్రాణి కాలానుక్రమంలో సకల శక్తులూ కూడదీసుకుని సినీరంగ జీవితపు షష్టిపూర్తి చేసుకుంటాడన్నది ఎవరూ ఊహించ(లే)ని విషయం. వేయని వేషం లేదు, పోషించని పాత్ర లేదు, మెప్పించని జనం లేరు, పుచ్చుకోని పట్టం లేదు. ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు ఊరు పేరు మోసిన అనేక సంఘాలూ, సంస్థలూ, వ్యక్తులూ, వ్యవస్థల నుంచి అందుకున్నా, బ్రతుకు అందించే అరుదైన 'జీవితపు పరిపూర్ణత్వం' అవార్డు, ఘనమైన 'జన్మ సాఫల్యం' రివార్డు అందుకోగలిగిన బహు కొద్ది మందిలో ఈ చిరు జీవి ఒకరు. ఉన్న బలాన్ని తెలుసుకుని ప్రదర్శించడం వీరోచితం కావచ్చు, ఉన్న బలహీనతలని తెలుసుకుని మసులుకోగలగడం మాత్రం ముమ్మాటికి వివేకవంతుల లక్షణం. ఆ విషయంలో అక్కినేనిని మించిన అపర 'చాణక్యుడు' చిత్రసీమలో నభూతో నభవిష్యతి.

తన ప్రస్థానపు తొలి అడుగుల్లో దుక్కిపాటి గారు చేసిన 'ఒళ్ళు దగ్గరుంచుకో' హెచ్చరిక తారక మంత్రం చేసుకుని తన జీవితపు నడకలోనూ, నడతలోనూ చివరి వరకూ ఆచరణలో పెట్టిన అక్కినేనికి ఆ సలహా పరమార్ధం, గూడార్ధం త్వరగానే బోధపడి ఉంటాయి. 'అబ్బాయీ, కొమ్ములున్నాయి కదా అని కొండతో కలబడకు ' అన్న వారింపు ఒక వైపు, 'నాయనా, ఆరోగ్యమే భోగం భాగ్యం' అన్న హితవాక్యం మరొక వైపు పొదువుకున్న ఆ 'మామూలు ' సందేశంలో అక్కినేని ఆలోచనా సరళి, ప్రవర్తనా నియమావళి ప్రతిబింబిస్తాయి. అదే ఆయన ఆరోగ్యం రహస్యం, సాఫల్య సిద్ధాంతం. నేల విడిచిన సాములు బహుశా తను చేసిన చిత్రాల్లో వినోదాత్మక విన్యాసాలుగా విరివిగా ఉండవచ్చుగాని, నిజ జీవితంలో తన కీర్తి ఆకాశన్నంటినా తను ఎన్నడూ నేలను వదిలింది లేదు. 'భారీ సినిమాలూ', 'క్రేజీ కాంబినేషన్లూ', 'ఔట్డోర్ షూటింగ్లూ', 'లేవిష్ సెట్టింగ్లూ' అన్న పరిశ్రమ పడికట్టు పదాలు తనను నమ్ముకుని తీసిన సినిమాల్లో కాని, తను నమ్మి తీసిన వాటిలోకాని లేకుండా జాగ్రత్తపడిన అక్కినేనికి మార్గదర్శక సూత్రం, అదుగో ఆ పై 'ఒళ్ళు దగ్గరుంచుకో'నే. వెలిగిపోయే రోజుల్లో సూర్యుడిగా, ప్రభ తగ్గిన రోజున చంద్రుడిగా, ఎలా ఉన్న సరే, ఎలగైనా సరే, ఉబ్బు మంత్రాలు పాడి తమ పబ్బం గడుపుకునే భజంత్రీ మేళం, భట్రాజు బృందం నిత్యం కొలువు తీరే విచిత్ర పరిశ్రమలో, తన అరవయ్యేళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో, వ్యాపారంలోనూ, వ్యవహారంలోనూ ఒక్క తప్పటడుగు వేయని గొప్పతనం అక్కినేనికే సొంతం. ఆయన చేసిన ఎన్నో ఉత్తమ, ఉదాత్త, ఉన్నత సినిమాలు ఆయన సందేశాలు కావు, ఎందుకంటే సినిమాలు కవుల గళం, దర్శకుల వాణి, నటులు కేవలం మాధ్యమం. గాంధీగారన్నట్టు My life is my message, అక్కినేని క్రమశిక్షణే ఆయన బోధించే ఆదర్శం, అక్కినేని నిబద్ధతే ఆయన నేర్పే గుణపాఠం.

ఒక జీవితకాలం ఒకే వృత్తిలో గడిపే సందర్భంలో చేసిన పనికి సత్కారల కంటే చీత్కారాలు, ఆదరణకంటే తిరస్కారాలే హెచ్చుగా ఉంటాయి. అది లోకరీతి, ప్రకృతి నీతి. అలాగే 60 యేళ్ళ ప్రయాణంలో, వృత్తి పరంగా వేసిన ప్రతి అడుగూకూ మడుగులొత్త బడలేదు. నలుపూ తెలుపుల నుండి సప్తవర్ణాల్లోకి చిత్రసీమ ఎప్పుడైతే రంగు మార్చుకుందో, నలుపు తెలుపుల్లో అప్పటి వరకూ కనపడని కొత్త వింత వికృత పోకడలు కలర్లో సాక్షాత్కరించినాయి. అక్కినేని చిత్రాలు అందుకు మినహాయింపు కావు. 60వ దశకం ముందు వరకు అక్కినేని కీర్తి కిరీటంలో ఎన్ని గొప్ప చిత్రాలు కలికితురాయిలుగా ఎంచబడతాయో, అందులో పదో వంతు కూడా కలర్లో కనపడవు. నలుపు తెలుపులలో నటుడు కాస్త కలర్లో స్టార్ అయిపోయాడు. అందుకే 90వ దశకం మొత్తానికి ఓ 'సీతారమయ్యగారి మనవరలూ, ఓ 'సూత్రధారులు ', 80వ యుగం లో ఒక 'మేఘసందేశం', ఓ 'ప్రేమాభిషేకం ' తప్ప చరిత్రలోనూ, హృదయాల్లోనూ మిగిలిపోయే ముద్రలు బహు అరుదు. కాని 50వ, 60వ దశకాల్లో అక్కినేని సముపార్జించుకున్న ఖ్యాతి, కీర్థి, ఆ తరువాత 4 దశకాలకూ సరిపడేంత సంపత్తిని సమకూర్చి పెట్టాయి. నటన అంటే సరైన అవగాహన కలిగిన ఆ రోజుల్లో, నటించ గలిగిన నేర్పు కలిగిన కళాకారులతో కళకళ లాడిపోయిన ఆ యుగంలో, ప్రతి నటుడి ఖాతాలో మిగిలిపోయే పాత్రాలు కొన్నైనా జమ కాబడ్డాయి; ఆ నటుడు, చిరు నటుడైనా, లేక లబ్ద ప్రతిష్టుడైనా. NTR, SVR, జగయ్య, రేలంగి, సావిత్రి, నాగయ్య.....ఇందులో ప్రతి ఒకరికీ ఆ రెండు దశాబ్దాల్లో కనీసం ఓ పది ఇరవయి చిత్రాలు ఇక పేరు శాశ్వతంగా మిగిలిపోయే విధంగా 'పడ్డాయి '. నేడీ తెలుగు చలన చరిత్ర మాహా సౌధానికి పునాది రాళ్ళు నాడు అక్కడే పడ్డాయి. అందులో అక్కినేని ఇతోధిక వంతు లేకపోలేదు.

భక్తి పాత్రలు వప్పినట్టుగా, సాంఘిక భూమికలు నప్పినట్టుగా అక్కినేనికి ఇతర శైలులు (genre) అంత అబ్బలేదు. కాని ఒక విప్రనారాయణ, ఒక జయదేవ, ఒక కాళిదాసు (శ్యామలా దండకంతో శక్తి సాక్షాత్కార దృశ్యం వర్ణనాతీతం), ఓ జక్కన, కొండకొచో ఓ తెనాలి రామలింగడు, ఓ నారద పాత్రలలో అక్కినేని కనపరచిన ప్రతిభా ప్రదర్శన నటన పట్ల ఆసక్తి, అనురక్తి ఉన్నవారికి పెద్ద బాల శిక్షలు. అలాగే సాంఘిక పాత్రలల్లో ఇటు హుందాతనం, అటు కొంటెతనం, ఇటు త్యాగం, అటు అనురాగం, ఇటు సౌలభ్యం, అటు క్లిష్టం... ఇలా చెప్పుకుంటూ పోతే అక్కినేని భరించని కష్టం లేదు, కలిగించని హాయి లేదు. ఒక నటుడికి, మరొక వైపు ఒక ప్రేక్షకుడికి ఇంతకంటే కావల్సిన విందు భోజనం లేదు. అక్కినేని ఒక గొప్ప నటుడు అని చెప్పడం సముద్రం చాలా పెద్దది, సూర్యుడి తేజం తీక్షణం అని చెప్పడం లాంటిడి. ప్రాకృతిక సత్యాలకి సాక్ష్యాలు, ప్రామాణ్యాలూ అవసరం లేదు.

వ్యక్థి మరణించ వచ్చు, అతని విచారాలకీ, విధానాలకీ మరణం ఉండదు. అవి అనుసరణీయాలు, చిరస్మరణీయాలూ. కాదా అక్కినేని ఒక 'అమరజీవీ?

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved