pizza
Ampasayya in Post production work
నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ‘అంపశయ్య’
You are at idlebrain.com > news today >
Follow Us

19 February 2016
Hyderaba
d

‘అమ్మా నీకు వంద‌నం’ చిత్రం ద్వారా అద్దె త‌ల్లుల(స‌రోగేట్ మ‌ద‌ర్స్‌) హృద‌య‌వేద‌న‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ జైని ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య‌ల‌క్ష్మి జైని నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `అంప‌శ‌య్య‌`. న‌వ‌ల పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న సుప్ర‌సిద్ధ ర‌చ‌యిత అంప‌శ‌య్య న‌వీన్ తీర్చిదిద్దిన ఏళ్ళనాటి క‌థ‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌డం ఓ సాహ‌సమే. కొన్ని ద‌శాబ్దాల త‌ర్వాత ఉస్మానియా యూనివ‌ర్సిటిలో అంప‌శయ్య చిత్రం షూటింగ్ జ‌రుపుకుంది. జైనీ క్రియేష‌న్స్‌, ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్యామ్ కుమార్‌, పావ‌ని హీరో హీరోయిన్స్ గా న‌టించారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ చిత్ర విశేషాల గురించి …

చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైని మాట్లాడుతూ " 1960, 70 ప్రాంతంలో తెలంగాణ లోని ఒక గ్రామం నుండి ఉస్మానియా యూనివర్సిటీ కి వచ్చి MA ఫైనల్ చదువుతుంటాడు రవి. అతనికి పరీక్షలు ప్రారంభం కాబోతున్న తరుణంలో, ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కలిగిన అనుభవాలు అతనికి ఎలా కర్తవ్య బోధన చేశాయి? అతనిలోని భయాలు, ఆందోళనలను రూపు మాపి జీవితం అనే యుద్ధ రంగంలోకి ప్రవేశించే ధైర్యాన్నిస్తాయి? ఆ సందర్భంగా రవికి గుర్తొచ్చిన అనేక సంఘటనలు ఏంటి? అనేది కథాంశం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ నవీన్ గారు రచించిన మొదటి నవల ‘అంపశయ్య’. ఈ నవలను సినిమాగా తీయాలనే లక్ష్యం తో చాలా కృషి చేశాం. ఇందులో నటించిన వారందరూ కొత్త నటులే. ఒక గొప్ప నవలను సినిమాగా తీశాం. ‘’అంపశయ్య" 1970ల్లో వచ్చిన నవల. అప్పట్లో, అది గొప్ప సంచలనం సృష్టించింది. ఈ నవలను సినిమాగా తీయాలని చాలామంది ప్రఖ్యాత దర్శకులు ప్రయత్నించారనీ , కానీ ఎందుకో ఆ కల నిజం కాలేదని నవీన్ గారే చెప్పారు. ఈ నేపథ్యంలో, ఈ చిత్రాన్ని నిర్మించాలనే తపనతో నేను బాగా కృషి చేశాను. "అంపశయ్య" నవలకు చిత్రానువాదం చేయడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే, ఈనవలలో కేవలం మానసిక సంఘర్షణ, ఆలోచనలు తప్ప సంఘటనలు లేవు. ఆ సంఘటనలు సృష్టించుకొని కథ నడపాల్సి వచ్చింది. ఆ ప్రయత్నానికే చాలా రోజులు పట్టింది. ఇద్దరు ముగ్గురు వెర్షన్స్ రాసిచ్చినా నవీన్ గారికి నచ్చలేదు. చివరకు నేనే పూనుకుని ఈ ప్రయత్నంలో సఫలీకృతులమయ్యాను. ఈ సినిమాకు నటీనటుల ఎంపిక చాలా క్లిష్టమైన టాస్క్ గా మారింది. ఎందుకంటే, హీరో ఉండాలి... కానీ, ఫార్ములా సినిమా లో లాగా హీరోయిజం ప్రదర్శించే ఛాన్స్ అతనికి లేదు. అయినా యింత బరువైన పాత్రను పోషించే సత్తా ఉండాలి. ఎంతో మంది యువకులను చూసాను. నాకు నచ్చలేదు. చివరకు వైజాగ్ నుంచి శ్యామ్ కుమార్ దొరికాడు. అచ్చుగుద్దినట్టుగా రవి లాగే ఉన్నాడని అందరూ మెచ్చుకున్నారు. ఈ సినిమాలో అత్యంత క్లిష్టమైన పాత్ర రత్తిది. పదహారేళ్ళ వయసు నుండి ఇరవైనాలుగు సంవత్సరాల వయసు వరకు అనేక షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఆమె చేసిన పాత్రకు హీరో మీద చెప్పలేనంత ప్రేమ. కులాలను ధిక్కరిస్తుంది. కానీ, చివరకు హీరో పిరికితనం వలన వేశ్యగా మారుతుంది. హీరో ఆఠానా చేతిలో పెట్టి తన శరీరాన్ని కొనుక్కున్నాడని కుమిలి పోతుంది. చివరకు హత్య చేయబడుతుంది. ఈ పాత్ర చేయడానికి దమ్ము, సత్తా ఉన్న నటి కోసం వెతికి, పావనిని పట్టుకున్నాం. అద్భుతమైన నటన ప్రదర్శించిందని యూనిట్ సభ్యులు మొత్తం అంటున్నారు. ఈ సినిమాలో ఒక ప్రభావవంతమైన పాత్రలో ఆకెళ్ళ రాఘవేంద్ర గారు అద్భుతంగా నటించారు. హీరో మానసిక ఆందోళన లో ఉన్నప్పుడు, అతనికి సరియైన మార్గ నిర్దేశనం చేసే పాత్ర అతనిది. హీరో తల్లి పాత్రలో నా సతీమణి విజయ లక్ష్మి జైని అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఈ సినిమాను పూర్తిగా పీరియడ్ ఫిల్మ్ గా నిర్మించాం.

ఆన్నింటికన్నా కష్టమైన పని ఉస్మానియా యూనివర్సిటీ లో షూటింగ్ జరపడానికి అనుమతి సంపాదించడమే. నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ సినిమాలో ఒకే ఒక సాంగ్, అది కూడా మాంటేజ్ సాంగ్ ఉంది. న‌ర్సాపూర్ అడ‌వులు, వ‌రంగ‌ల్ రామ‌ప్ప గుడి, ఉస్మానియా యూనివర్సిటీ త‌దిత‌ర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేశాం. ఐఏఎస్ అభ్య‌ర్థుల‌కు వ్య‌క్తిత్వ వికాస శిక్ష‌ణ త‌ర‌గ‌తులు చెప్పే సిటీకి చెందిన తెలంగాణ ప్ర‌జా కళాకారుడు కిన్నెర మొట్ల మొగిల‌య్య‌, , స్వాతి నాయుడు, యోగి దివాన్‌, వాల్మీకీ, మోనికా థాంప్స‌న్ స‌హా థియేట‌ర్ ఆర్ట్స్ విద్యార్థులు కొంద‌రు, నేను, నా స‌తీమ‌ణి కూడా ఈ చిత్రంలో న‌టించాం. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జరుపుకుంటోంది’’ అన్నారు.

 

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved