pizza
Krishna movie Asadhyudu completes 50 years
సూపర్‌స్టార్‌ కృష్ణ 'అసాధ్యుడు' చిత్రానికి 50 వసంతాలు
You are at idlebrain.com > news today >
 
Follow Us

12 January 2017
Hyderabad

సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'అసాధ్యుడు' 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. టైగర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.రామచంద్రరావు దర్శకత్వంలో నెల్లూరు కాంతారావు, ఎస్‌.హెచ్‌.హుస్సేన్మ్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12, 1968న విడుదలైంది. హీరోగా మంచి ఇమేజ్‌ తీసుకొచ్చిన 'గూఢచారి 116' చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ కృష్ణ చేసిన సినిమా ఇది. 'అసాధ్యుడు' చిత్రంలోని క్యారెక్టర్‌కి ఆయన నూటికి నూరు శాతం న్యాయం చేశారు. క్రైమ్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమైనప్పటికీ కథలోని కొత్తదనం వల్ల ఘనవిజయాన్ని అందుకుంది. అడ్వంచర్‌ సినిమాల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన సినిమా 'అసాధ్యుడు'.

'అల్లూరి సీతారామరాజు' చిత్రానికి నాంది
ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఒక బ్యాలేని రూపొందించారు దర్శకుడు రామచంద్రరావు. ఇందులో సూపర్‌స్టార్‌ కృష్ణ తొలిసారి అల్లూరి సీతారామరాజు'గా నటించి అందరి చేత శభాష్‌ అనిపించుకున్నారు. ఈ పాత్ర పోషించాలన్న కోరిక కృష్ణకు అంతకుముందే వుండేది. ఈ చిత్రంలోని బ్యాలేతో అది మరింత బలపడింది. చరిత్ర సృష్టించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్ర రూపకల్పనకు 'అసాధ్యుడు' చిత్రంలోని బ్యాలే నాంది పలికిందని చెప్పొచ్చు.

మొదటి సంక్రాంతి సినిమా
సంక్రాంతికి తొలిసారి విడుదలైన కృష్ణ సినిమా 'అసాధ్యుడు'. 1968 జనవరి 12న ఈ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించడంతో కృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్‌ మొదలైంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.ఎస్‌.ఆర్‌.స్వామి పరిచయం కావడం విశేషం.

'అసాధ్యుడు' చిత్రం విడుదలై 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ ''ఈ జనవరి 12కి 'అసాధ్యుడు' రిలీజ్‌ అయి 50 సంవత్సరాలు పూర్తయింది. మొట్టమొదట సంక్రాంతికి విడుదలైన చిత్రమిదే. అందులోనే 15 నిమిషాలు ఉండే బ్యాలేలో అల్లూరి సీతారామరాజుగా నేను యాక్ట్‌ చేశాను. అప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు ఫుల్‌ పిక్చర్‌ చెయ్యాలని మనసులో ఓ కోరిక వుండేది. ఈ బ్యాలేని దర్శకుడు రామచంద్రరావుగారే పిక్చరైజ్‌ చేశారు. ఆ తర్వాత 'అల్లూరి సీతారామారాజు' చిత్రానికి కూడా ఆయన్నే డైరెక్టర్‌గా సెలెక్ట్‌ చేసుకొని ప్రారంభించడం జరిగింది'' అన్నారు.

సూపర్‌స్టార్‌ కృష్ణ, కె.ఆర్‌. విజయ, రామకృష్ణ, ముక్కామల, చలం, బాలకృష్ణ, నెల్లూరు కాంతారావు, రావికొండలరావు, పెరుమాళ్లు, సంతోష్‌కుమార్‌, రామకృష్ణ (మిస్టర్‌ మద్రాస్‌), రాజారావు, వల్లం నరసింహారావు, ఓఎస్‌ఆర్‌ ఆంజనేయులు, బాలరాజు, వాణిశ్రీ, సంధ్యారాణి, రమాప్రభ, టిజి కమలాదేవి, జ్యోతి, ఉదయలక్ష్మీ, లక్ష్మీకాంతమ్మ, పద్మలత, కోటీశ్వరి, విజయలక్ష్మీ, బేబి రోజా రమణి నటించగా, అతిథి నటులుగా చంద్రమోహన్‌, ప్రభాకరరెడ్డి, టి. చలపతిరావు నటించారు.

ఈ చిత్రానికి కథ, మాటలు: ఆరుద్ర, పాటలు: ఆరుద్ర, శ్రీశ్రీ, నారాయణరెడ్డి, దాశరథి, సంగీతం: తాతినేని చలపతిరావు, ఫొటోగ్రఫీ: వి.ఎస్‌.ఆర్‌. స్వామి, నృత్యాలు: హీరాలాల్‌, పసుమర్తి వేణుగోపాల్‌, చిన్ని-సంపత్‌, కళ: రాజేంద్రకుమార్‌, కూర్పు: ఎ.ఎస్‌.ప్రకాశం, నిర్మాతలు: నెల్లూరు కాంతారావు, ఎస్‌.హెచ్‌. హుస్సేన్‌, దర్శకత్వం: వి. రామచంద్రరావు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved