pizza
బాపు... లే
by Srinivas Kanchibhotla
You are at idlebrain.com > news today >
Follow Us

2 September 2014
Hyderabad

ఒరేయ్ వెధవా! ఓ సత్తిరాజూ! ఎవర్రా నీకు తెలుగు టీచింగ్సు! ఇదేనట్రా నేను నీకు చిన్నప్పుడు దిద్దించింది? ఏమిట్రా నీ అక్షరాలకు ఆ ముట్టె పొగరు? తలలు కొట్టేసిన ఆ తలకట్లు, సాంతం నడవడానికి ఓపికలేని ఏత్వాలూ, ఆ మొక్కుబడి గుళ్ళూ, ఇక క్రావళ్ళు, వట్రసుళ్ళు గురించి చెప్పకు ఫో! అటు వాలిపూతూ, ఇటు సోలిపోతూ, అటు తూలిపోతూ, ఇటు తూగిపోతూ, నీ అక్షరాలకు ఒక కుదురు, ఒక స్థిమితం లేవుట్రా? భమిడిపాటిగారు శలవిచ్చినట్టు, తెలుగు అక్షరాల ప్రాధమిక హక్కు, పక్క అక్షరాన్ని తొక్కడమే, దాని తలకెక్కడమే. అది కాదనట్టు ఏదో పెద్ద సమతావాదివి నువ్వు బయలుదేరావురా, కిందా లేదు, పైనా లేదు, తెలుగు వర్ణమాలలో వర్గ వివక్షలు తావులేదు అన్నట్టు, వత్తులు, ఐత్వాలు తీసుకొచ్చి మూలాక్షరం పక్కనే కూర్చోపెడతావు! చూడరా, శతాబ్దాల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆ చక్కని తెలుగు లిపి చూడరా, ఆ చక్కటి గుండ్రాలని చూడు, సందె గొబ్బెమ్మలు వరుసలో కూర్చోపెట్టినట్టు ఆ రాతలు చూడు, నాడెప్పుడో నన్నయ, పోతన్న వదిలిపోయిన తాళపత్రాలలోని ఆ కుదురు రాత చూడు, అదిరా మన భాష, అదిరా మన రాత! ఇటు నీవి చూడు, కాలరెగరేసి, చక్కగా దువ్వుకున్న దుబ్బు జుట్టులో ఐదు వేళ్ళనీ పోనిచ్చి కావాలని చెరుపేసుకున్నట్టు, చొక్కాని తిరగేసి తొడుకున్నట్టు, ఆ శైలి ఏమిట్రా? రేపు నిన్ను అనర్రా..నన్ను అంటారు, ఎవరు నీకు తెలుగు టీచింగ్సని!

ఒరేయ్ నారాయణా....చిన్న బుచ్చుకున్నావా? మరోలా అనుకోకురా! ఎంతైనా పంతుల్ని కదా! పిల్లల అక్షరకుక్షుల్ని నింపే వృత్తిలో ఉన్నానుగా, నాలుగు వడ్డించటం అలవాటు అయిపోయింది. నలుగురి ఎదురుకుండా నిన్ను తెగిడినా, నిజం ఒప్పుకోవద్దూ, ఏకాంతంలో ఉన్నప్పుడు, నీ అక్షరాలని అలా చూస్తూనే ఉండిపోయేవాడినిరా! వాటిలో పైన చెప్పినట్టు పొగరూ, విసురు కాదురా! నీ అక్షరజాలంలో నాకు పోతన దశమ స్కందం సాక్షాత్కరించేదిరా! ఆ బాలకృష్ణుడి చిలిపితనం, కొంటెతనం, కవ్వింపులు, కేరింతలు, క్రీడలు, సరసాలు, సల్లాపాలు, లీలలు...మోహనం..సమ్మోహనం! నా దగ్గర అక్షరం దిద్దుకున్నందుకు నీ కీర్తిలో నా కృషి కూడా ఇసుమంతన్నా లేకపోలేదు అని అప్పుడప్పుడూ గర్వ పడినా, నిజం నాకూ తెల్సురా. నీ ఈ శిల్పం ఒక వరం, ఒక ప్రసాదం, ఒక కటాక్షం. అందుకునే నిన్ను నలుగురిలో పొగడనురా. ఒరేయ్ బడుద్ధాయిలూ, మీరు కూడా ఆ నారాయడిలాగ వంకర టింకరగా, అక్షరాలని పడుకోబెట్టి, లేకపోతే ఆకాశనికెట్టేసి రాయడం నేర్చుకోండిరా అని నా పిల్లలకి చెప్పను, ఎందుకంటే ఇది చెబితేనో, చూపిస్తేనో వచ్చేదీ కాదు, నేర్చుకునేది కాదు. ఈ ప్రపంచంలో ఒక పేరు మీద ఒక పలుకుబడి రావడం అనేది ఎంత కష్టమో మేష్టారుగా నాకు తెలుసు. అటువంటిది రాత చూడగానే, ఇది ఖచ్చితంగా ఎవరు రాసారో చెప్పగలిగే విధంగా నీ రాతని మలుచుకున్నవంటే దాని వెనక కటాక్షాలే కాదు, నీ దీక్షలు, వరాలే కాదు, నీ పరిశ్రమలూ, ప్రసాదాలే కాదు, నీ ప్రయత్నాలూ ఎన్ని ఉన్నాయో ఊహించగలను. ఐనా ఎవరన్నా అడిగితే ఒక్కసారైనా చెప్పరా, ఎవరు నీకు తెలుగు టీచింగ్సంటే....అదిగో ఫలానా పంతులని!

ఒరేయ్ లక్ష్మీ! నీ చిన్నప్పుడు నేను పాఠం చెబుతుంటే ఆ వెనక బెంచీలో కూర్చుని నా మాట వినకుండా నువ్వు పిచ్చి గీతలు గీస్తున్నావని పట్టరాని కోపం వచ్చి నీ మీద పేంబెత్తం ఎత్తిన దృశ్యం నా కళ్ళళ్ళో ఇంకా కదుల్తోందిరా! ఒరేయ్, ఈ పనికిమాలిన పనులు చేస్తూ ఉంటే రేపు రోడ్ల మీద బొమ్మలు గీసుకుంటూ అడుక్కుని తినిపోతావ్ వెధవా అన్న మాటలు ఇంకా నా చెవుల్లో రింగు మంటున్నాయిరా! ఇదిగో నా ఎదురుగా ఇప్పుడు కొన్ని వందల వేల పుస్తకాలు పడి ఉన్నాయిరా. కొత్తవి, తళతళలాడి పోతున్నాయి, కొన్ని యేళ్ళ, దశాబ్దాల నించీ కొంటూన్నా. కొన్నా వీటిలో ఏ ఒక్క పుస్తకన్నీ తెరిచి చదివిన పాపాన పోలేదు. బజారు కెళ్ళినప్పుడు బడ్డీకొట్టులో తీగ మీద వేళ్ళడదీసిన పుస్తకం మీద నీ బొమ్మ ఉందంటే కొని తీసుకువస్తాను, తెచ్చి కూర్చుని ఇదిగో ఇక ఆ ముఖ చిత్రాన్ని అలా చూస్తూనే మైమరచిపోతాను. గోకులంలో మన్ను తింటూ మట్టి మీద పోసుకునే బాలకృష్ణుడెక్కడ, ఆహవరంగాంలో అర్జునిడిని కర్తవ్యోన్ముఖుని చేసిన గీతాచార్యుడెక్కడ! ఆ రోజు బెత్తం దెబ్బలు తిన్న ఆ చేతులా ఇవి, ఈ రోజు నాకు ఆ జగదానంద కారకుడి విశ్వరూపం కన్నులకు కట్టినట్టుగా గీసి చూపెడుతోంది? చేతులెత్తి దణ్ణం పెడుతున్నానురా! నీ కళలో ఆ దేవుడికి, నీ నిబద్ధతలో ఆ దైవత్వానికి! ఇళ్ళలో, గుళ్ళలో, వాకిళ్ళలో, లోగిళ్ళలో, ఫలనా వారి బొమ్మట అని ఎవరు చెప్పినా పరుగెత్తుకుని వెళ్ళి చూస్తాను, ఇక చూస్తూనే ఉంటాను. చిత్తరువు - చిత్తరువు! ఆ భగవంతుడిని అన్ని వేల లక్షల సార్లు ఊహించుకుంటూ, మురిసిపోతూ, తన్మయత్వంతో పరవశించిపోతూ నువ్వు వేసిన ఈ (ఇహానికి) పనికి రాని బొమ్మలు చూసుకుంటూ ఉండడమే నేను చేసే మానసిక పూజ. దేవుడు గొప్పవాడు కాదు, ఫలాన వాడు దేవుడు అని చెప్పిన గురువు గొప్పవాడు అంటారు. నాయానా లక్ష్మి! ఓం శ్రీ గురుభ్యో నమః!

బాపూ గారు! పర్వాలేదురా! గారు అనేగా అన్నది. మన మాజీ ప్రధాని లాల్ బహదుర్ గారి విద్వత్తుకి కాశీ విశ్వవిద్యాలం వారు గౌరవ 'శాస్త్రి ' (శాస్త్రములు తెలిసిన వాడు) అన్న బిరుదిచ్చి సత్కరించినట్లే, నీకు నేను చేసే సత్కారం ఇది, ఈ 'గారూ కేవలం గౌరవ వాచకం కాదు, నీ తెలుగు పంతులు నీకు ఇచ్చే బిరుదు. ఏమిట్రా ఆ ముత్యాల ముగ్గు! నీ తనివి తీరా తీసుకున్న ఆ రామాయణ రచనలు, ఆ సీతా కల్యాణంలోని ఆ గంగావతరణ ఘట్టం, వాటిలో రాయించుకున్న పాటలు, మాటలు! నాకు తెలుసురా సినిమాల్లో దర్శకుదిడిది ఒక 'సర్వాంతర్యామి సంగ్దిగ్ధం' (God paradox) అని. అన్నింట్లోనూ ఉంటాడు, ఎక్కడా కనపడడు. నువ్వు రాయవు, నువ్వు అభినయించవు, నువ్వు తీయవు, కాని ఇవన్నీ కచ్చితంగా నీ చిత్రాలే, నువ్వు తీసిన చిత్రాలే, నువ్వు మాత్రమే తీసిన, తీయగలిగిన చిత్రాలే. తెలుగు తనానికి నువ్వు పట్టం గట్టిన తీరు అమోఘం. కాటుక కళ్ళలో అంత అందం ఉంటుందని, చీర కట్టుబడిలో అంత సొగసు ఉంటుండని, మునివేళ్ళు ఎత్తి ఎత్తైనది అందుకుంటూ ఉంటూ జీరాడే కుచ్చిళ్ళు, పాదాల వెంబడి రాసుకున్న గోరింటకు ఎరుపులో కలిసిపోయిన పుట్టుమచ్చ నలుపూ, కంటి చూపు కొరడాలు, వాలు జడల వురితాళ్ళు, గోములూ, గోరోజనాలు, అలకలూ-తీర్పులూ, అందానికి ఇవన్నీ నూత్న నిర్వచనాలు. నువ్వు ఇక్కడి నించీ చిన్నప్పుడే ఊరు మారిపోయినా నీ గుండెల్లో మాత్రం మన గోదారి ఉరకలు వేస్తూనే ఉన్నదేం? నది మీద, గట్ల మీద, ఒడ్లలోనూ, రేవులతోనూ, తెప్పల తోటీ, లాంచీలు లాగి, ఆ తల్లిని షోడసోపచారాలతో సేవించుకున్నావు. ఇంతకన్న ఏమి కావాలిరా, ఒక దర్శకుడికి - ఒక పేరు, ఒక మార్కు.

నిన్న చెప్పరురా వచ్చి, నువ్వు పోయావని! నవ్వి ఊరుకున్నా! వీళ్ళ అఙ్ఞానికి, అమాయకత్వానికి, పిచ్చికి. తెలుగు చచ్చిపోయిందిట అన్నంత మూర్ఖంగా ఉంది, బొమ్మ అన్న మాటకు అర్ధం లేదుట అన్నంత అసంబద్ధం ఉంది. దేవుడిక కనిపించడుట అన్నంత అబద్ధంగా ఉంది! భాషలో ఇంకిపోయిన నీ రాత, బొమ్మలో కలిసిపోయిన నీ గీత, చిత్రంలో మమేకమైపోయిన నీ తీత, వీళ్ళకు తెలియదు, బాపు సర్వోపగతుండు, ఎందెందు వెదికినా అందందే కలడు అని. ఉంటా నాన్నా ఇక! శలవు!

వెధవా అన్నాను కదూ, అవును నాయనా వెయ్యేళ్ళు (తరగని) ధనముతో వర్ధిల్లు!

నీ తెలుగు మేష్టారు,
నర్సాపురం. ప.గో. జిల్లా

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved