pizza
Celebrities condolence to Pasupuleti Rama Rao
You are at idlebrain.com > news today >
Follow Us

11 February 2020
Hyderabad

ఈరోజు ఉదయం మృతిచెందిన సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు గారి భౌతిక కాయం వద్ద మెగాస్టార్ చిరంజీవి పూలమాల ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. రామారావు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు కళ్యాణ్ నాగ చిరంజీవి ని పరామర్శించారు. రామారావు పార్థివ దేహం మధ్యాహ్నం హైదరాబాద్ ఇందిరానగర్ లోని ఇంటికి చేరగానే చిరంజీవి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సినీప్రముఖులు ఎస్.వి. కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి, బీవీఎస్ఎన్ ప్రసాద్, మాదాల రవి. సి.వి. రెడ్డి తదితరులు కూడా అక్కడికి చేరుకుని రామారావు భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు.

నిబద్ధతకు మారుపేరు పసుపులేటి రామారావు - రెబల్ స్టార్ కృష్ణంరాజు
సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఆకస్మిక మరణం పట్ల రెబల్ స్టార్ కృష్ణంరాజు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. పసుపులేటి రామారావుతో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కృష్ణంరాజు...“ నిబద్ధతకు మారుపేరైన పసుపులేటి రామారావు నాకు ఎంతో సన్నిహితుడు. మా గోపీకృష్ణ మూవీస్ ప్రారంభం నుండి నాతోను, మా సంస్థ తోనూ ఆయనకు చక్కని అనుబంధం ఏర్పడింది. నలభై ఐదు సంవత్సరాలుగా సినిమా జర్నలిస్టుగా మా అందరికీ సుపరిచితులైన రామారావు మరణం వ్యక్తిగతంగా నన్నే కాకుండా యావత్ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. తన నిజాయితీ, నిరాడంబరత, కష్టపడి పని చేసే తత్వంతో పరిశ్రమలో అందరికీ ఆప్తుడు అయ్యాడు రామారావు. ఎప్పుడూ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, భుజాన సంచి.. ఇదీ రామారావు శాశ్విత ఆహార్యం. తను కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడని తెలుసుగాని ఇంత హఠాత్తుగా ఈ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. రామారావు మరణంతో తెలుగు ఫిలిం జర్నలిజంలో ఒక తరం అంతరించి నట్లు అయింది. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి , తెలుగు సినీ పాత్రికేయ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. ఆయన ఆత్మకు శాంతిని ఆకాంక్షిస్తున్నాను " అన్నారు.

పసుపులేటి రామారావు మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు - మోహన్ బాబు ఎం.
"నాకు సన్నిహితుడైన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను నటుడిగా పరిచయమైనప్పటుంచీ ఆయనతో నాకు స్నేహం ఉంది. మద్రాసులో ఎంత సన్నిహితంగా ఉన్నామో, హైదరాబాద్ కు వచ్చాక కూడా అదే సానిహిత్యం మా మధ్య కొనసాగింది. అప్పుడూ, ఇప్పుడూ తెల్లటి దుస్తులు, భుజాన కాటన్ సంచీ.. ఇదే ఆయన ఆహార్యం. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎన్నోసార్లు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూల్లో తనకు కావాల్సిన ఎన్నో విషయాలు రాబట్టుకొనేవారు. సినిమా జర్నలిస్టుగా చిత్రసీమకు ఆయనెంతో సేవచేశారు. ఒక తరం సినీ జర్నలిస్టులకు మార్గదర్శిగా నిలిచిన ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను."

శ్రీ పసుపులేటి రామారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కల్యాణ్, అధ్యక్షులు, జనసేన
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ శ్రీ పసుపులేటి రామారావు గారు కన్నుమూశారనే వార్త నన్ను బాధకు గురి చేసింది. వ్యక్తిగతంగా వారితో నా చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. వామపక్ష భావాలు కలిగిన శ్రీ రామారావు గారు మృదు స్వభావి. తెలుగు సినిమాపై పలు రచనలు చేసి సినీ చరిత్రకు అక్షర రూపమీయడంలో తన వంతు పాత్రను పోషించారు. శ్రీ రామారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

సినీ జర్నలిజానికి, సినీ పరిశ్రమకు పసుపులేటి రామారావు గారి సేవలు వెలకట్టలేనివి - హీరో నితిన్
"నాలుగున్నర దశాబ్దాల పాటు సినీ జర్నలిజానికి పర్యాయపదంగా నిలిచిన పసుపులేటి రామారావు గారు మృతి చెందడం అత్యంత బాధాకరం.. ఎప్పుడూ తెల్లటి దుస్తులు, భుజాన సంచీతో కనిపించేవారు. నన్ను పలుమార్లు ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆయన పెద్దవారైనా యువకుల్లోని ఉత్సాహం కనిపించేది. సినీ జర్నలిజానికి, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. ఆయన మృతికి సంతాపం తెలూపుతూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను."

ఆయన కుటుంబసభ్యులకు మా సానుభూతి ప్రకటిస్తున్నాం." - డి. సురేష్ బాబు, వెంకటేష్, రానా దగ్గుబాటి
"సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు గారి ఆకస్మిక మృతి అత్యంత బాధాకరం. ఇండస్ట్రీలో ఆయన పేరు తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. సినీ జర్నలిజమే జీవితంగా బతికిన ఆయన మృతి జర్నలిస్టులకే కాకుండా యావత్ చిత్రసీమకూ తీరని లోటు. ఆయనతో మాకూ, మా సంస్థకూ ఎంతో అనుబంధం ఉంది. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నాం.

పసుపులేటి రామారావు గారు ఇంకా నా ముందు ఉన్నట్లుగానే ఉంది: నాగశౌర్య
"పసుపులేటి రామారావు గారు మృతిచెందారనే వార్త నాకు ఆలస్యంగా తెలిసింది. వార్త వినగానే నమ్మలేకపోయాను. తెల్లటి దుస్తుల్లో ఇప్పటికీ ఆయన నా ముందున్నట్లుగానే ఉంది. నేను నా మొదటి సినిమా చేసినప్పట్నుంచే ఆయనతో నాకు పరిచయం ఉంది. కలిసినప్పుడల్లా చాలా బాగా మాట్లాడేవారు. కెరీర్‌లో ఎదుగుతావంటూ ఆశీర్వదించేవారు. మంచి మంచి సలహాలిచ్చేవారు. ఎంతో పెద్దవారైనా జర్నలిస్టుగా ఆయనలోని చురుకుదనం నన్ను ఆశ్చర్యపరిచేది. ఒక గురువులాగా కనిపించే ఆయన ఇలా అర్ధంతరంగా వెళ్లిపోవడం వ్యక్తిగతంగా నన్ను బాధిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను."

 

శ్రీ పసుపులేటి రామారావు గారికి ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ సంతాపం
తొలితరం సీనియర్ సినీ పాత్రికేయుడు శ్రీ పసుపులేటి రామారావు గారి మృతి ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ సభ్యులకు తీరనిలోటు. 45 సంవత్సరాల నుండి సినిమా పాత్రికేయుడుగా అనుభువం ఉన్న రామారావు గారు మా అసోసియేషన్ గౌరవ సభ్యులుగా కొనసాగుతూ మాకు ఎప్పటి కప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మమ్ములను ముందుండి నడిపిస్తున్న శ్రీ పసుపులేటి రామారావు గారు ఇలా అకాల మరణం చెందటం మాకు తీవ్ర ద్రిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఫిలిం న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved