pizza
Dasari Narayana Rao is no more
చుక్క‌ల్లోకెక్కిన‌ ద‌ర్శ‌క‌దిగ్గ‌జం..
You are at idlebrain.com > news today >
Follow Us

30 May 2017
Hyderabad

ద‌ర్శ‌క దిగ్గ‌జం ద‌ర్శ‌కర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు..ఇక సెల‌వంటూ వీడ్కోలు తీసుకున్నారు. 151 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిన దాస‌రి విల‌క్ష‌ణ‌మైన సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌నెంటో ప్రూవ్ చేసుకున్నారు. ఎంతో మంది శిష్య‌గ‌ణాన్ని తెలుగు చిత్రసీమకు అందించిన మార్గ‌ద‌ర్శి ..తెలుగు చిత్ర‌సీమ‌కే గురువుగా అంద‌రి నేనున్నానంటూ భ‌రోసానిచ్చిన శిఖ‌రం నేల‌కొరిగింది. చుక్క‌ల్లోకి ఎగ‌సి నింగిలో త‌ళుక్కుమంటో్ంది.

కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న దాస‌రినారాయ‌ణ‌రావుకు అన్న‌వాహిక శ‌స్త్ర‌చికిత్స జ‌రిగింది. కొంత‌కాలం రెస్ట్ అనంత‌రం మార్చి 29న ఇంటికి వ‌చ్చేసిన దాస‌రి మ‌ళ్ళీ అనారోగ్యం బారిన ప‌డ‌టంతో మే 17న మళ్ళీ కిమ్స్‌లో జాయిన్ చేశారు. ఇన్‌ఫెక్ష‌న్ సోక‌డంతో తీవ్ర అనారోగ్యానికి గురైన దాస‌రి నారాయ‌ణ‌రావు కిమ్స్‌లోనే చికిత్స పొందుతూ, చికిత్స ఫ‌లించ‌క‌ మ‌ర‌ణించారు.

1942 మే 4న పాల‌కొల్లులో జ‌న్మించిన దాస‌రి నాట‌క రంగం నుండి సినీ రంగ ప్ర‌వేశం చేశారు. `తాత మ‌న‌వ‌డు` సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన ఆయ‌న ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 151 చిత్రాల‌తో ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో ఏ ద‌ర్శ‌కుడు తీయ‌లేనన్ని సినిమాల‌ను డైర‌క్ట్ చేశారు. ఒక త‌ర‌హా సినిమాల‌నే కాదు, ఆయ‌న ట‌చ్ చేయ‌ని జోన‌ర్ లేదు. తెలుగు క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌గా ఎన్నో కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను అందుకున్నారు దాస‌రి. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

నిత్య కృషీవ‌లుడు..
రోజుకు 18 గంటలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ ఎన్నో దృశ్య కావ్యాలు, ఎన్నో సందేశాత్మక చిత్రాలు, మరెన్నో వినోదాత్మక చిత్రాలు చేశారు.
స్టార్‌ హీరోతో చేసినా, కొత్త నటీనటులతో చేసినా కథనే నమ్ముకొని, కథే హీరో అనుకొని సినిమాలు చేస్తూ ఎన్నో శతదినోత్సవ చిత్రాలు, రజతోత్సవ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్నారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకొని ప్రపంచ సినీ చరిత్రలో ఎవరూ సాధించని రికార్డును తన సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు, దర్శకుడుగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా ఇప్పటికీ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దర్శకుడిగా తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకున్నారు. సినిమాకు కెప్టెన్ ఆఫ్ ద షిప్ ద‌ర్శ‌కుడే అని త‌న వాణిని బ‌లంగా వినిపించారు.

ఆల్‌ రౌండర్‌..
తెలుగు చలన చిత్రసీమలో అందరూ ఆయన్ను అప్యాయంగా గురువుగారు అని పిలుచు కుంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాంటూ అండగా నిలబడే నాయకుడు. కష్టం తెలిసిన నిర్మాత. మాటలతో, పాటలతో సినిమాలకు ప్రాణం పోసిన తిరుగులేని రచయిత. ఎంతోమంది నటీనటులు, టెక్నిషియన్స్‌కి ప్రాణం పోసిన బ్రహ్మ. ఎందరో దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మేటి దర్శకుడు. అన్నింటినీ మించి గొప్ప మార్గదర్శకుడు. తెలుగు చిత్రాలను తన దర్శకత్వ ప్రతిభతో కొత్త పుంతలు తొక్కించిన ధీశాలి. అన్నీ విభాగాలపై గ్రిప్‌ ఉన్న ఆల్‌రౌండర్‌.

దర్శత్వానికే వన్నె తెచ్చిన వ్యక్తి..
దర్శకుడే సినిమాకి కెప్టెన్‌ అని, దర్శకుడే సినిమాకి తన ఆలోచనలతో ప్రాణం పోస్తాడని చెప్పిన దర్శక రత్నం డా|| దాసరి నారాయణరావు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డ దిగ్ధర్శకుడు. దర్శకులకు పాఠాలు చెప్పిన గురువు. హీరోల స్థాయిలో దర్శకులకు స్టార్‌ డమ్‌ తీసుకొచ్చిన స్టార్‌ డైరెక్టర్‌. ఇలా అయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. రైటర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారం భించి 'తాత మనవడు'తో దర్శ కుడుగా అవతరించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 151 చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఘనుడు.

తనకు తానే సాటి..
దర్శకరత్న డా.దాసరి నారాయణరావు డైరెక్ట్‌ చేసిన సినిమా ల్లోని నవ్యత ఆయనలోని సత్తాని తెలియ జేస్తాయి. డైరెక్టర్‌గా ఉంటూనే ఎన్నో చిత్రాలకు కథలు అందించి, పాటలను రాశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను, సెంటిమెంట్స్‌ను హృద యానికి హత్తుకునేలా తీసి మెప్పించిన నేర్పరి. అందుకే ఆయన డైరెక్ట్‌ చేసిన తాత-మనవడు, స్వర్గం-నరకం, తూర్పు పడమర, గోరింటాకు, ఆది దంపతులు, ఏడడుగుల బంధం, స్వయం వరం, సీతారాములు వంటి ఎన్నో సినిమాలు సగటు మనిషి జీవితానికి అద్దం పట్టాయి. నటరత్న ఎన్‌.టి.రామారావుతో 'బొబ్బిలిపులి', 'సర్దార్‌ పాపారాయుడు' బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తీసి కమర్షియల్‌ డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావుతో 'ప్రేమాభిషేకం', 'మేఘసందేశం' వంటి మరపురాని ప్రేమకథా చిత్రాలనే కాకుండా దేవదాసు మళ్లీ పుట్టాడు అనే చిత్రాన్ని డైరెక్ట్‌ చేసి అందులో పునర్జన్మలు, సంస్కారాలను శాస్త్రీయకోణంలో చూపించడం ఆయనకే చెల్లింది. తండ్రి నాగేశ్వరరావుతోనే కాకుండా ఆయన తనయుడు అక్కినేని నాగార్జునతో సైతం మజ్ను వంటి లవ్‌స్టోరిని తీసి ప్రేమకథా చిత్రాలను డైరెక్ట్‌ చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. కటకటాల రుద్రయ్య, రంగూన్‌ రౌడీ, బ్రహ్మా నాయుడు వంటి చిత్రాలతో కృష్ణంరాజును రెబెల్‌స్టార్‌ను చేశారు. సూపర్‌స్టార్‌ కృష్ణతో రాధమ్మ పెళ్లి, కృష్ణార్జునులు, బండోడు- గుండమ్మ వంటి సాంఘిక చిత్రాలే కాకుండా విశ్వనాథనాయ కుడు వంటి భారీ చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించి తిరుగులేని విజయాని సాధించారు. శోభన్‌బాబుతో గోరింటాకు, స్వయంవరం, బలిపీఠం, ధర్మపీఠం దద్దరిల్లింది వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించారు. స్వర్గం-నరకం చిత్రంతో మోహన్‌బాబు వంటి విలక్షణ నటుడ్ని తెలుగు తెరకు పరిచయం చేశారు. మెగాస్టార్ చిరంజీవితో లంకేశ్వ‌రుడు, నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ప‌ర‌మ‌వీర చ‌క్ర‌, విక్టరీ వెంకటేష్‌తో బ్రహ్మపుత్రుడు, టూ టౌన్‌ రౌడీ, నాగార్జున‌తో మ‌జ్నువంటి చిత్రాలను చేశారు. ఇలా ఒకటేమిటి అందరి హీరోలతో హిట్‌ చిత్రాలను రూపొందిం చారు. ఆయన చిత్రాల్లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ తో పాటు మెసేజ్‌ను అంతర్లీనంగా చొప్పించి మనసుకు హత్తుకునేలా చూపుతారు. కులవ్యవస్థ కు వ్యతిరేకంగా పాడవోయి భారతీయుడా, ఒసేయ్‌...రాములమ్మ వంటి చిత్రాలను, కార్మిక వ్యవస్థను ఉత్తేజపరిచే ఓ మనిషీ తిరిగి చూడు, ఒరేయ్‌ రిక్షా వంటి అద్భుతమైన చిత్రాలను డైరెక్ట్‌ చేశారు. కేవలం తెలుగు చిత్రాలనే కాకుండా బాలీవుడ్‌కి కూడా తన దర్శకత్వ ప్రతభను చాటి చెప్పారు. తెెలుగులో ఉన్నతస్థాయికి చేరుకున్న దాసరి తన పత్రిభతో 13 హిందీ చిత్రాలను డైరెక్ట్‌ చేసి ఉత్తరాదిన కూడా తెలుగువారు గర్వపడేలా చేశారు. అంతే కాకుండా రెండు కన్నడ చిత్రాలను కూడా డైరెక్ట్‌ చేసిన ఘనత దాసరికి సొంతం.

అందరినీ మెప్పించిన నటుడు కూడా..
దర్శకుడిగానే కాకుండా నటుడుగా మామగారు, మేస్త్రి చిత్రాలకు ఉత్తమ నటుడుగా నంది అవార్డుల‌ను అందుకున్నారు. కంటే కూతూర్నే కనాలి చిత్రానికి నేషనల్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకున్నారు. దర్శకుడిగా మేఘసందేశం చిత్రానికి బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డు, గోరింటాకు, ప్రేమాభిషేకం, ఒసేయ్‌ రాములమ్మా చిత్రాలకు బెస్ట్‌ డైరెక్టర్‌గా ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు. సినిమా రంగానికి చేసిన సేవలకుగాను ఎన్‌.టి.ఆర్‌. నేషనల్‌ అవార్డు, రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డులను కూడా పొందారు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అల్లు రామ‌లింగ‌య్య జాతీయ పుర‌స్కారాన్ని స్వీక‌రించారు. ఆయ‌న కీర్తి కిరీటంలోకి చేరిన ఆఖ‌రి పుర‌స్కారం అదే. దర్శకుడిగానేే కాకుండా రచయితగా, నిర్మాతగా, నటుడిగా తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చిన దర్శకరత్న డా||దాసరి నారాయణరావు మ‌ర‌ణం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తీర‌నిలోటు. తిరిగిరాని లోకాల‌కు వెళ్లిన ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ... ఐడిల్ బ్రెయిన్ టీమ్‌

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved