pizza
Dhavala Satyam's Vangaveeti
వంగవీటి వారి వాస్తవ కథా నేపథ్యంలో
రామ్‌గోపాల్‌ వర్మ వర్సెస్‌ ధవళ సత్యం
You are at idlebrain.com > news today >
Follow Us

 

11 January 2016
Hyderabad

వాస్తవ సంఘటనలను, వ్యక్తుల నిజ జీవిత చరిత్రలను కథాంశాలుగా తీసుకుని నిర్మించిన చిత్రాలు ఎప్పుడూ విజయవంతమవుతూనే ఉంటాయి. ముఖ్యంగా సదరు వ్యక్తులు రాజకీయ రంగానికి చెందిన వారైతే ఆ సినిమా వారి అనుచర, అభిమాన, అస్మదీయ, తస్మదీయ వర్గాల వారందరి దృష్టిని ఆకర్షిస్తుంది.....అద్భుత విజయాన్ని సాధిస్తుంది. ఖచ్చితంగా 28 యేళ్ళ క్రితం వచ్చిన 'చైతన్యరథం' చిత్రం ఘన విజయం సాధించడాన్నే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అప్పటి రాష్ట్ర రాజకీయాలను, ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా కృష్ణాజిల్లా రాజకీయాలను శాసించిన వంగవీటి సోదరుల నిజ జీవిత కథాంశంతో ధవళ సత్యం దర్శకత్వంలో రూపొందిన 'చైతన్యరథం' 26 కేంద్రాలలో శతదినోత్సవ చిత్రంగా సంచలన విజయాన్ని సాధించింది.

కాగా ఇప్పుడు తాజాగా అదే ధవళ సత్యం దర్శకత్వంలో 'వంగవీటి రంగ' నిజ జీవిత చరిత్ర ఆధారంగా మరో బయోగ్రఫీకల్‌ ఫిల్మ్‌ రాబోతుంది. 'రంగా మిత్రమండలి' సమర్పణలో ఎమ్‌ఎస్‌ఆర్‌ క్రియేషన్స్‌ పతాకంపై మంచాల సాయి సుధాకర్‌ నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు ధవళ సత్యం ప్రాథమిక సమాచారాన్ని వెల్లడిస్తూ ''28 యేళ్ళ క్రితం నా దర్శకత్వంలో వచ్చి అద్భుత విజయాన్ని సాధించిన 'చైతన్యరథం' వంగవీటి రాధా-రంగాల నిజ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందింది. రాధా హత్యనాంతరం నాయకత్వ బాధ్యతలు తీసుకున్న రంగా ఎంత పవర్‌ఫుల్‌ లీడర్‌గా ఎదిగాడో అందరికీ తెలిసిందే. రంగా జీవిత చరిత్రలో గొప్ప ధైర్యం, పోరాటం, తెగింపు, త్యాగం, బలిదానం ఉన్నాయి. ఆంధ్రా రాబిన్‌హుడ్‌ లాంటి రంగాను అత్యంత పాశవికంగా హత్య చేసినప్పుడు యావధాంధ్ర దేశం అల్లకల్లోలం అయ్యింది. అలాంటి రంగా జీవిత కథను యథార్థ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నాం. రంగా గారి వీరాభిమాని, రంగా మిత్ర మండలి వ్యవస్థాపకుడైన మంచాల సాయి సుధాకర్‌ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తూ..ఆయన పేరు మీద ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాయి సుధాకర్‌ నాయుడు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 23న విజయవాడలో తెలియజేస్తాము..'' అని తెలిపారు.

చిత్ర నిర్మాత మంచాల సాయి సుధాకర్‌ నాయుడు వివరాలు తెలియజేస్తూ..''వంగవీటి రాధా-రంగాలకు అత్యంత సన్నిహితులు అవ్వడమే కాకుండా, వారి జీవిత నేపథ్యంలో 'చైతన్యరథం' వంటి హిట్‌ చిత్రాన్ని రూపొందించిన ధవళ సత్యంగారినే ఈ చిత్రానికి దర్శకుడిగా ఎన్నుకున్నాం. ఒక విధంగా ఇది 'చైతన్యరథం' పార్ట్‌ 2 అనుకోవచ్చు. రంగా గారి జీవితం తెరిచిన పుస్తకంలాంటిదే కాబట్టి కథాంశం సిద్ధంగానే ఉంది. దానికి తగిన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ కూడా రెడీ అవుతున్నాయి. త్వరలో నటీనట, సాంకేతిక వర్గాన్ని ప్రకటిస్తాం. రంగా గారి సామాజిక వర్గానికే చెందిన ఒక 'పవర్‌ఫుల్‌ స్టార్‌' ను రంగా పాత్ర చేయడానికి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని ఆశిస్తున్నాం'' అని అన్నారు.

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఇప్పటికే 'వంగవీటి' అనే టైటిల్‌తో ఒక చిత్రాన్ని అనౌన్స్‌ చేసి ఉన్న నేపథ్యంలో ఇది దానికి పోటీ చిత్రంగా రూపొందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు కాపులను బీసీలలో చేర్చాలనే ఉద్యమం బలపడుతుండగా, మరోవైపు ప్రభుత్వం కాపు కార్పోరేషన్‌ ఏర్పాటును ప్రకటించిన సమయంలో ఈ పోటీ చిత్రాల ప్రకటనలు రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో వేచిచూడాలి.

 Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved