pizza
కాని లోకానికి మీతో పనివుంది నాగేశ్వర రావు గారు - by Gangaraju Gunnam
You are at idlebrain.com > news today >
Follow Us

23 January 2014
Hyderabad

నిన్న ‘నాకింక లోకం తో పనిఏముంది’ అనేసారు ఏ ఎన్ ఆర్. కోపం తో కాదు. బాధ, నిస్పృహల తో కాదు. పరిపక్వమైన తృప్తి తో. నిండైన ఆయన అసాధారణ జీవితంలో అనితర సాధ్యమైన విజయాలెన్నో. ఐనా కష్టాలూ లేకపోలేదు. సగటు మనిషికి వచ్చే వాటికంటే ఒక పాలు ఎక్కువేనేమో. కాని సగటు మనవుడికి లా ఆయనకు దైవం దాపు లేదు. అక్కినేని గారు నాస్తికులు.

తన జీవితానికి తానే బ్రహ్మ. నలభై సంవత్సరాల క్రితం చనిపోవలసింది. 1974 లో గుండెపోటొచ్చింది. అమెరికా లో ఆపరేషన్ చేసి, డాక్టర్లు ఆయనకి ఇంకా పద్నాలుగు సంవత్సరాల ఆయువు రాసారు. వాళ్లన్నట్లే 1988 లో మళ్ళీ గుండె పోటొచ్చింది. ఈ సారి ఛాతి కోసిన తరవాత, ఇంక గుండె తట్టుకోలేదని మళ్ళీ కుట్టేసి ఏమీ చేయలేమన్నారు. అప్పుడు నాగేశ్వర రావు గారు అనుకున్నరు, ‘డాక్టర్లు, మందుల సహాయం తో పద్నాలుగేళ్ళు బ్రతికాను, ఇప్పుడు ఆత్మబలం తో ఇంకో పద్నాలుగు బ్రతుకుతాను’ అని.

అలాగే ఆహారారోగ్యాల పట్ల నిష్టగా వున్నారు. తెల్లరు ఝామున క్రమం తప్పకుండా నడిచేవారు. ఈసురో మంటూ కాదు. తెల్లగా మెరిసే ఇస్త్రీ దుస్తులలో చక చకా సాగేవారు. ఎదో కఠోర దీక్ష కానిస్తున్నట్టు సాగలేదు ఆ పద్నాలుగేళ్ళు. ఆయన కంటి లో మెరుపు, పెదవి పై చిరునవ్వు, మటలో చెమత్కారం తగ్గలేదు. 2002 లో ఆయనకాయన ఇచ్చుకున్న గడువు కూడా పూర్తైంది. ఆప్పుడే ఒక కొత్త కారు కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్ నంబరు 9. సరే ఇంకో తొమ్ముదేళ్ళు జీవిస్తాననుకున్నారు. అలాగే ఆయన గీత పొడిగిన్చుకున్నట్టే 2011 వచ్చింది! ఆప్పుడనిపించింది నాగెశ్వర రావు గారికి, ‘ఎందుకు ఈ అంకెలు ఆ అంకెల ఆధారంతో బ్రతకటం, అసలే ఆలొచనా లేకుండా బ్రతికేద్దాం.’ ఏ సిలబస్సూ, పరీక్షలూ లేని ఎల్ కే జీ విద్యార్ధి లాగ.

నిన్న కన్ను మూసారు. ఇవేళ అంతిమయాత్రంట. కాని ఇది సత్యం కాదు. ఆయన సాగుతూనే వుంటారు. తెలుగు జాతి ముందర నడుస్తూనే వుంటారు — తెల్లగా మెరిసే వస్త్రాలతో, ఉత్తేజపరుస్తూ. అమరదీపంలా!

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved