pizza
Harish Shankar about EVV
You are at idlebrain.com > news today >
Follow Us

11 June 2021
Hyderabad


నా సినిమాల్లో ఎంటర్ టైన్మెంట్ బాగుంటది, నా సినిమాల్లో డైలాగ్స్ బాగుంటాయ్, పాటలు బాగుంటాయ్ అంటే అందుకు కారణం నా మీద ఉండే EVV గారి ప్రభావమే.

EVV గారు ఎంత కమాండ్ ఉన్న డైరెక్టర్ అంటే, మనం EVV గారి సినిమాలు చూస్తే చాలు ఆ విషయం తెలుస్తుంది. ఉదాహరణకి హలో బ్రదర్ సినిమాలో రమ్యకృష్ణ గారు ఒక సీన్ లో పోలీస్ డ్రెస్ లో వచ్చి నాగార్జున గారిని ఏదో అడుగుతారు. అడగ్గానే నాగార్జున గారి డైలాగ్ ఎలా ఉంటుందంటే, ఏంటే? ప్రొఫైల్ లో నుంచి కటింగ్ ఇచ్చేస్తున్నావ్ ? అంటాడు. నిజంగా ఆ షాట్ ప్రొఫైల్ లోనే ఉంటుంది. ఇది ఏ రైటర్ రాయడు.షాట్ పెట్టిన తరువాత డైరెక్టర్ అప్పటికప్పుడు రమ్యకృష్ణ గారు ప్రొఫైల్ లోకి వచ్చారు కాబట్టి ఇలా మారిస్తే బాగుంటుందన్నట్టుగా రాశారు.

EVV గారు ఎంత మగాడంటే ! ‘ఆలీ బాబా అరడజను దొంగలు’ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ‘నువ్వు ఇంటర్వెల్ బిఫోర్ వచ్చిన క్యారెక్టర్ కదా!’ అంటది ఇంకో క్యారెక్టర్ని. సినిమా చూస్తున్న మీరు, ఇది సినిమా అని, అయినా సరే నా సినిమా చూస్తారు అని అంత కాన్ఫిడెంట్ గా ఆయన సినిమాలు తీసేవారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ‘నీ పని సెకండాఫ్ లో చెప్తా’ అంటాడు కరెక్ట్ గా ఇంటర్వెల్ బిఫోర్. ఇలా మనం చూస్తున్నది సినిమా అని చెప్పడానికి ఒక రచయితకి, దర్శకునికి తన క్రాఫ్ట్ మీద ఎంత కమాండ్ ఉండాలో... EVV గారు ఎంత ఫాస్ట్ గా అడాప్షన్ చేస్తారో చెప్పుకోవాలి అంటే ఇలాంటివి ఎన్నో ఎన్నో ఉంటాయి.

EVV గారి సినిమా టైటిల్స్ నుంచే ఆయన మార్క్ చూపిస్తారు. నిర్మాతని డబ్బులు పెట్టినోడు అని పేరేయడం, మ్యూజిక్ డైరెక్టర్ ని డప్పులు కొట్టినోడు అని పేరేయడం, కూతకూసినోడు,రాత రాసినోడు అని టైటిల్స్ నుంచే ఒక ట్రెండ్ సెట్ చేశారు.

ఇప్పుడు పబ్లిసిటీ చేయాలంటే మార్కెటింగ్ వాళ్ళని పెట్టుకుని , కార్పోరేట్ కంపెనీలతో టై అప్ అయ్యి, PR టీం తో డిస్కషన్ పెట్టి తల బద్దలు కొట్టుకోవాలి. EVV గారి పబ్లిసిటీ ఏ రేంజ్ లో ఉండేది అంటే ఒక పేపర్ లో వంద యాడ్స్ ఉంటే అయన సినిమా యాడ్ మీదకే మన చూపు వెళ్ళేలా ‘మా సినిమా గురించి ఓ దరువేస్తున్న జనాలందరికీ మా థ్యాంక్స్’ అని వేస్తారు ఆయన. నా కాలేజ్ రోజుల్లో SR నగర్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పబ్లిసిటీని ఎంత వినూత్నంగా చేశారంటే “ఎవరీ అబ్బాయి ?” అని చిన్న బ్రిక్స్ మీద రాసి ఉన్న పోస్టర్ చూసి అస్సలు ఇదేంట్రా బాబు! ఏదో సినిమా వచ్చేస్తుంది. EVV గారు ఏదో చేసేస్తున్నారు అనే ఆసక్తి రేకెత్తించగలిగారు.

EVV గారి దగ్గర ఎప్పుడూ 10 మంది రైటర్స్ కూర్చుంటారంట, ఆయన దగ్గర యాక్టివ్ రైటర్ గా కాకపోయినా నేను 11 వ రైటర్ లేదా 15 వ రైటర్ గా అయినా జాయిన్ అయినా చాలు ఈ జన్మ ధన్యం అయిపోద్ది అనుకుని నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చాను. అయన దగ్గర అలా జాయిన్ అయ్యి ఎప్పటికైనా ఆయన సినిమాల్లో ఒక్క లైన్ రాసినా చాలు అనుకునే వాణ్ని. కానీ అది కుదరలేదు. అదృష్ట వశాత్తు ఆయన దగ్గర పని చేసిన రమేష్ రెడ్డి Ramesh Reddy సతీష్ వేగేశ్నVegesna Sathish వంటి వాళ్ళతో పని చేసే అవకాశం వచ్చింది.

EVV గారిని మొదటిసారి సంజీవయ్య పార్క్ లో కళ్యాణ్ గారి సినిమా ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ షూటింగ్ ఓపెనింగ్ లో చూశాను. తర్వాత ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. ఒక ఫ్లోర్ లో తాళి సినిమా వర్క్, ఒక ఫ్లోర్ లో చిలక్కొట్టుడు ప్యాచ్ వర్క్, ఇంకో ఫ్లోర్ లో అదిరింది అల్లుడు / వీడెవడండి బాబు వర్క్ జరుగుతుంది. మూడు ఫ్లోర్లల్లో మూడు EVV గారి సినిమాలే జరుగుతున్నాయి. చిన్నప్పుడు చదివేవాళ్ళం దాసరి గారివి ఒకేసారి అయిదారు సినిమాల షూటింగ్ లు జరుగుతుండేవని,ఆయన తర్వాత అంత ఘనత ఒక్క EVV గారికే దక్కింది. ఆరోజు నేను మర్చిపోలేనిది.

నేను దుర్గా ఆర్ట్స్ లో పని చేస్తున్నప్పుడు EVVగారిని ఒక సారి కలిసే అవకాశం వచ్చింది. నా ఫ్రెండ్ ఉదయ్ (నిఖిల్ శంకరాభరణం డైరెక్టర్) ఒక కథ చెప్తే ఆ కథ ఆయనకి చెప్పడానికి ఫిలిం నగర్ లో ఆయన ఇంటికి వెళ్ళాను. రెండు గంటలు ఆయనకి కథ చెప్పాను. నా గొంతు వణుకుతున్నఆయన మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. మిరపకాయ్ హిట్ కొట్టడం, మొదటి సారి పవన్ కళ్యాణ్ గారిని కలవడం,గబ్బర్ సింగ్ హిట్ కొట్టడం లాగానే EVV గారికి కథ నేరేట్ చేయడం అనేది జీవితాంతం గుర్తుండిపోతుంది.

‘షాక్’ సినిమా ప్రీమియర్ కి వచ్చి సినిమా అయ్యాక, మొదటి సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు కాబట్టి నెగిటివ్ గా ఏమి చెప్పకుండా, నాగబాబు పోర్షన్ బాగుంది, కామెడీ ట్రాక్ బాగుంది, పాటలు బాగున్నాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. అది నాకు చాలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది. ఇదే విషయం ఆయన కలిసినప్పుడు కూడా చెప్పాను. కామెడీని ఆరాధించే మనిషి, రవితేజని ఇష్టపడే మనిషి EVV ఆయనకి నా మిరపకాయ్ సినిమా చూపించలేకపోయాను అనే రిగ్రేట్ మాత్రం ఉంది.

డబల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఎంతో కామిక్ వే లో సెన్సార్ కత్తెరకి చిక్కకుండా ఆడియన్స్ ని మెప్పించడం ఆయనకే చెల్లింది.

‘అల్లుడా మజాకా’ సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమా షూటింగ్ చెన్నై దగ్గర గోపి చెట్టి పాలెం దగ్గర జరుగుతుంది ఆ షూటింగ్ కవరేజ్ విశేషాలు తెలుసుకోవాలని సూపర్ హిట్ మ్యాగజైన్ కోసం టీ షాప్స్,బస్టాప్ దగ్గర గంటల తరబడి నిలబడే వాళ్ళం. అలాంటి సినిమా సంధ్య ధియేటర్ లో 127 రోజులు ఆడింది.

EVV గారికి కామెడీ అనుకుంటారు కానీ, డ్రామా మీద ఆయనకున్న పట్టు వేరు. ‘ఆమె’, అమ్మో ఒకటో తారీఖు, కన్యాదానం సినిమాలే అందుకు నిదర్శనం. అంత ఎమోషనల్ సినిమాల్లో కూడా కామెడీ పుట్టించ గలిగిన వ్యక్తి EVV.

EVV గారి నుంచి ఈ కాలం దర్శకులు నేర్చుకోవాల్సింది క్రెడిట్ ఇవ్వడం. ఆయన సినిమాకి డైలాగ్స్ బాగా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిన ఒక్కరికి డైలాగ్స్ క్రెడిట్ ఇవ్వడం, మిగిలిన రచయితలకు రచనా సహకారం అని క్రెడిట్ ఇస్తారు. ఇదే నేను అయన నుంచి నేర్చుకున్నాను, ‘గబ్బర్ సింగ్’ సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ “రికవరీ రంజిత్ కుమార్” ఓపెనింగ్ లో ‘ఆయుధాలతో చంపనురా, వాయిదాలతో చంపుతా’ అనే డైలాగ్ రాజశేఖర్ అనే కో-డైరెక్టర్ కాంట్రిబ్యూట్ చేశాడు. అందుకోసం నేను రచనా సహకారం అని రాజశేఖర్ కి క్రెడిట్ ఇచ్చాను.

ఆయన పుట్టినరోజు నాడు ఆయన్ని మరొక్క మారు తలుచుకుంటూ, నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసిన ఆయనకు మరొక్క మారు

నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved