అడివిశేష్, శోభితా ధూళిపాళ హీరో హీరోయిన్‌గా అభిషేక్ పిక్చర్స్, విస్తా డ్రీమ్ మర్చంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో.. శశి కిరణ్ తిక్క దర్శకుడిగా.. అభిషేక్ నామ, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం `గూఢచారి`. ఆగస్ట్ 3న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో అడివిశేష్ ఇంటర్వ్యూ...
* ఎలా ఉన్నారు? గూఢచారి గురించి చెప్పండి?
- చాలా బావున్నాను. ప్రశాంతంగా ఉన్నాను. ఈ మధ్యనే అన్నపూర్ణలో ఓ 50-60 మందిని పిలిచి షో వేశాం. అందరికీ నచ్చింది. అది నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ప్రశాంతంగా ఉన్నాను. ఇంతకు ముందు నా సినిమాలు విడుదలవుతుంటే ఒకరకమైన నెర్వస్‌సెస్ ఉండేది. ఇప్పుడు అది నాలో లేదు.
* సినిమా మీద కాన్ఫిడెన్సా?
- అంటే మా సినిమా తోపు అని ఈ మధ్య చాలా మంది కాలర్ ఎగరేయడాలు చూస్తూనే ఉన్నాం. అలా అనుకోకండి. కానీ నాది జెన్యూన్ కాన్ఫిడెన్సే.
* `గూఢచారి` ఎలా మొదలైంది?
- క్షణం విడుదలైన 20 రోజుల్లోపు ఈ సినిమాకు సంతకం చేశా. అప్పుడెప్పుడో నేను రాసుకున్న కథ ఒకటి శశికిరణ్‌కి ఇచ్చా. అతను ఈ జనరేషన్‌కి పనికి రాదన్నారు. వెంటనే అందులోని థీమ్ తీసుకుని ఇప్పుడు 2018కి తగ్గట్టు ఈ కథను రాశాం. స్క్రీన్‌ప్లే విషయంలో శశితో పాటు రాహుల్ అని ఒకతను సాయం చేశాడు. క్షణం క్లైమాక్స్ ని ఎడిట్ చేసింది కూడా రాహులే.
* జేమ్స్ బాండ్ కైండ్ స్టోరీనా?
- అదేం లేదండీ. ఇది జేమ్స్ బాండ్ తరహా కాదు. కాకపోతే గచ్చిబౌలి ఐఎస్‌బీలో ఎంబీఏ చదివే ఓ కుర్రాడు.. సరదాగా కాఫీ షాప్‌లో అమ్మాయికి బీట్ వేసుకునే కుర్రాడు ఎలా రాలోని త్రినేత్ర విభాగానికి వెళ్లాడు అనే జర్నీ మీద నాకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది. చాలా రీసెర్చ్ చేశాం. అందులో తేలింది ఏంటంటే, `రా` మన రాజ్యాంగానికి కట్టుబడి ఉండదు. వాళ్లు పీఎం ఆఫీస్ కి రిపోర్ట్ చేస్తారు. పైగా విదేశాలకు సంబంధించి పనిచేస్తుంది.
* ఇలాంటి విషయాలన్నీ సామాన్యుడికి అర్థమవుతాయా?
- అర్థమయ్యేలాగానే చెప్పాం. నేను చేసే సినిమా మా తాతకి, మా తండ్రికి, నాకు, నా ఫ్రెండ్స్ కీ అర్థం కావాలన్నదే నా కాన్సెప్ట్. మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ముద్దుల నుంచి అన్నీ జెన్యూన్‌గా ఉంటాయి. మూడు దేశాల్లో 168 లొకేషన్లలో ఈ సినిమాను తెరకెక్కించాం.
* పాత గూఢచారికి సంబంధం ఉంటుందా?
- అసలు అలాంటివేమీ ఉండవు. కాకపోతే కథ కి ఆ టైటిల్ పెట్టడానికి ఆ ఇన్‌స్పిరేషన్ ఏమో. నేను ఇందులో ఓ పాత్రను చేయమని కృష్ణగారిని వెళ్లి కలిశాను. ఆయన ఇప్పుడు నటించడం లేదని, కావాలంటే తన పాత సినిమాలోని సీన్లను వాడుకోమని అన్నారు. టైటిల్ వాడుకుంటానని చెప్పా.
interview gallery
* డైరక్షన్ ఎప్పుడు?
- లేదండీ. నేను యాక్టింగ్, డైరక్షన్ కలిపి చేయను. దర్శకత్వానికి ఇంకాస్త మెచ్యూరిటీ కావాలి. అది వచ్చాక చేస్తా. ప్రస్తుతం నటిస్తున్నాను. అది చాలు.
* మధ్యలో కొన్ని సినిమాలు వదిలేసుకున్నారట..
- నిజమే. నాకు నచ్చిన పని మాత్రమే చేయాలని అనుకున్నా. ఓ నిర్మాత ఈ విషయంలో నా మీద కోప్పడ్డారు. అయినా నేను ఆయనకు శాంతంగానే విషయాన్ని వివరించా.
* మీ అన్నయ్య సాయికిరణ్ అడివితో సినిమా ఉందా? లేదా?
- అనుకున్నాం. కానీ కుదరలేదు. ఇప్పుడు నేను ఇంకో రెండు సినిమాలు చేస్తున్నా. అందులో ఒకటి 2 స్టేట్స్ రీమేక్. మరొకటి పీవీపీ సంస్థలో. రామ్‌జీ అని కొత్త దర్శకుడు చేస్తున్నాడు ఆ సినిమాను.
* మీ ఫ్రెండ్ రాహుల్ సినిమా, మీ సినిమా ఒకే రిలీజ్ డేట్‌కి వస్తున్నాయి..
- తనకి దర్శకత్వం అంటే చాలా ఇష్టం. మా ఇద్దరి కలలు నెరవేరుతున్నాయి. ఒకే రోజు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. వెన్నెలకిశోర్‌కి నిజమైన పండగ. తను రెండు సినిమాల్లోనూ ఉన్నాడు.