pizza
A Guru Raj interview (Telugu) about Rakshaka Bhatudu
క‌ళామ‌త‌ల్లి మీద ప్రేమ‌తో `ర‌క్ష‌క‌భ‌టుడు` చేశాం - ఎ.గురురాజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

10 April 2017
Hyderabad

వంశీ కృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `ర‌క్షక‌భ‌టుడు`. ఈ సినిమాను మే 5న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా సుఖీభ‌వ మూవీస్‌ ప‌తాకంపై రూపొందుతోంది. ఏప్రిల్ 11న చిత్ర నిర్మాత ఎ.గురురాజ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న హైద‌రాబాద్‌లో సోమ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లండీ...
- చాలా థాంక్సండీ. ఆంజ‌నేయ‌స్వామి మంగ‌ళ‌వారం రోజే సీత‌మ్మ‌వారిని లంక‌నుంచి తీసుకొచ్చార‌ట‌. ఆంజ‌నేయ స్వామి పుట్టిన‌రోజును హ‌నుమ‌త్‌జ‌యంతిగా మ‌నమంతా జ‌రుపుకుంటాం. అదే రోజు నా పుట్టిన‌రోజు కూడా రావ‌డం చాలా ఆనందంగా ఉంది. నేను ఆంజ‌నేయ‌స్వామి ఉపాస‌కుడిని.

* మీ సినిమాలోనూ ఆంజ‌నేయ‌స్వామి ఉన్నారుగా?
- మా సినిమాలో కీల‌క పాత్ర పోషించారు ఆంజ‌నేయ‌స్వామి. ఆయ‌న నాకు ఇష్ట‌దైవం. మా సుఖీభ‌వ సంస్థ‌లో వస్తున్న ఈ సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను.

* ఇంత‌కు ముందు ఏప్రిల్ 7న విడుద‌ల చేస్తామ‌ని అన్న‌ట్టున్నారు?
- అవునండీ. కానీ మేం విడుద‌ల చేయ‌క‌పోవ‌డానికి ఓ కార‌ణం ఉంది. ఆన్‌లైన్ సెన్సార్ వ‌ల్ల మా సినిమాకు ఇంకా సెన్సార్ కాలేదు. క్లైమాక్స్ లో ఆంజ‌నేయ స్వామి పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంది. ఆ పాత్ర‌కు సంబంధించిన గ్రాఫిక్స్ ప‌నుల్లోనూ ఆలస్యం జ‌రిగింది. అందుకే విడుద‌ల తేదీలో వాయిదా ప‌డింది.

* సినిమా ఎలా ఉండ‌బోతోంది?
- మా సంస్థ బ్రాండ్‌కి త‌గిన‌ట్టుగా ఉంటుంది. సుఖీభ‌వ వెంచ‌ర్స్ అన‌గానే రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ఓ న‌మ్మ‌కం ఉంటుంది. అలాగే మా సంస్థ‌ నుంచి వ‌స్తున్న ప్రొడ‌క్ష‌న్‌లోనూ అదే న‌మ్మ‌కం ప్ర‌తిఫ‌లిస్తుంద‌ని ఆశిస్తున్నాను.

* ఏ త‌ర‌హా సినిమా ఇది?
- ఇంటిల్లిపాదీ చూసేలా ఉంటుందీ సినిమా. ఇప్ప‌ట్లో ఏ సినిమాకు ఫ్యామిలీతో వెళ్లే ప‌రిస్థితులు లేవు. కొత్త కొత్త క్రియేటివ్ డైర‌క్ట‌ర్లు, క్రియేట్ చేసే క‌థ‌ల్లో హాస్యం ఎన్ని పాళ్లు ఉంటుందో, శృంగారం ఎన్ని పాళ్లు ఉంటాయో తెలియ‌వు. టీవీలో కూడా కొన్ని యాడ్స్ వ‌చ్చిన‌ప్పుడు చానెల్స్ని మార్చే ప‌రిస్థితి ఉంది. ఎక్కువ శృంగారాన్నిపెట్టి క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ చేయాల‌నుకోవ‌డం త‌ప్పు. గ‌తంలో వ‌చ్చిన సినిమాల్లో శృంగారం కూడా ఉంటూ, కామెడీ వంటివ‌న్నీమిళితం చేసేవారు. ఆ సినిమాలు 500 రోజులు కూడా ఆడిన‌వి ఉన్నాయి. సుఖీభ‌వ సంస్థ మీద వ‌చ్చే సినిమాల‌న్నీ ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉంటాయి. ఒత్తిళ్ల నుంచి ప్రేక్ష‌కులు రిలీఫ్ అయ్యేలాగా ఈ సినిమాను రూపొందించాం. త‌గిన ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఇవ్వ‌గ‌లిగితే 100 శాతం సినిమాలు హిట్ అవుతాయి. అదే కాన్ఫిడెన్స్ తో ఈ సినిమాను నిర్మించాం. తొలి ఫ్రేమ్ నుంచి లాస్ట్ వ‌ర‌కు కామెడీ ఉంటుంది. 20 నిమిషాలు క్లైమాక్స్ మాత్రం హృద‌యానికి హ‌త్తుకునేలా ఉంటుంది. 20 నుంచి 60ఏళ్ల వ‌ర‌కు అంద‌రినీ ఆక‌ట్టుకునే సినిమా ఇది. క‌థే సినిమాకు బ‌లం. క‌థ బాగ‌లేక‌పోతే ప్రేక్ష‌కుడు న‌చ్చ‌డ‌నే విష‌యాన్ని చాలా సార్లు చూశాం. క‌థ‌లో ద‌మ్ము ఉంటే సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని నా న‌మ్మ‌కం. ఈ సినిమా టోట‌ల్‌గా ఇంటిల్లిపాదీ చూసేలా ఉంటుంది. ఈ సినిమాను అనుకున్న‌టువంటి స‌మ‌యంలో విడుద‌ల చేయ‌డానికి రేయింబ‌వ‌ళ్లు ఈ సినిమాకు ప‌నిచేసిన టీమ్‌కి ధ‌న్య‌వాదాలు. అంద‌రూ చూడ‌ద‌గిన చ‌క్క‌నైన సినిమా ఇది. అంద‌రూ వ‌చ్చి ఆశీర్వ‌దిస్తార‌ని అనుకుంటున్నాం.

* ఈ సినిమాను నిర్మించ‌డానికి కార‌ణ‌మేంటి?
- మ‌నం జ‌న‌ర‌ల్‌గా చాలా సినిమాలను చూస్తుంటాం. చాలా వాటిల్లో స‌బ్జెక్ట్ ఒన్ సైడ్‌కి వెళ్తున్న‌ట్టు అనిపిస్తుంది. కానీ ఇందులో అన్ని ర‌కాలుగా ఫ్యామిలీ మొత్తం చూసేలా ఈ క‌థ ఉంటుంది. అందుకే క‌థ న‌చ్చి నిర్మిస్తున్నా. సుఖీభ‌వ సంస్థ బ్రాండ్‌కి త‌గ్గ‌కుండా ఉండేలా ఈ సినిమా ఉంటుంద‌న్న న‌మ్మ‌కంతో ఈ సినిమాను ఎన్నుకున్నాం. ఆంజ‌నేయ స్వామి పాత్ర‌ను మేం ఇంకా రివీల్ చేయ‌లేదు. దాంతో పాటు ఇంకో ఇంపార్టెంట్ పాత్ర‌ను కూడా రివీల్ చేయ‌లేదు. అందులోనూ పెద్ద ఆర్టిస్ట్ ఉంటాడు. ఆంజ‌నేయుడి పాత్ర‌ను ఎవ‌రు చేశార‌ని చాలా మంది అడిగారు... క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు అనే ఆస‌క్తి ఎలా ఉందో, అలాగే మా ఆంజ‌నేయుడి గురించి కూడా అలాగే ఉత్కంఠ‌త కొన‌సాగుతోంది..

* మిగిలిన పాత్ర‌ల గురించి చెప్పండి?
- చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు. అర‌కులోయ‌లో పోలీస్ స్టేష‌న్‌లో జ‌రిగే క‌థ ఇది. ఆ స్టేష‌న్ చుట్టూ అన్ని పాత్ర‌లూ తిరుగుతాయి. అంద‌రికీ ప్రాముఖ్య‌త ఉన్న పాత్ర‌లున్నాయి. బ్ర‌హ్మానందంగారిది చాలా కీల‌క‌మైన వేషం. ఆయ‌న త‌న పాత్ర‌కు ప్రాణం పోశారు. బ్ర‌హ్మాజీ పోలీస్‌గా న‌టించారు. ఆయ‌న పాత్ర కూడా చాలా బాగా వ‌చ్చింది. సుప్రీత్ మెయిన్ విల‌న్ ఇందులో. ఎంక్వ‌యిరీ ఆఫీస‌ర్‌గా బాహుబ‌లి ప్ర‌భాక‌ర్ చేస్తున్నారు. మిగిలిన పాత్ర‌ల‌న్నీ ప్రాముఖ్య‌త ఉన్న‌వే. హాస్యాన్ని పండించేవే. స‌బ్జెక్ట్ లో పూర్తిగా లీనం అయిన పాత్ర‌లే. హాస్యం, సెంటిమెంట్‌, స‌స్పెన్స్, కాస్త భ‌య‌పెట్ట‌డం... అన్నీ ఉన్న సినిమా ఇది.

* హ‌నుమంతుడు ఉన్నాడ‌ని ఒప్పుకున్నారా?
- అంతే కాదండీ. క్లైమాక్స్ లో ఆంజ‌నేయుడి పాత్ర చాలా ఇంపార్టెంట్‌. దాంతో పాటు సినిమా మొత్తం కామెడీ ఉంటుంది. చాలా మంది భ‌క్తి చిత్ర‌మా? అని కూడా అడిగారు. కాదండీ... కామెడీతో సాగుతుంది అని చెప్పాం. ఆంజ‌నేయుడు ఉంటే కామెడీ ఎలా ఉంటుంది? అని అడిగారు. ఆ క‌థ‌కి అలా కుదిరింది... ఉంటుంది అని చెప్పాను.

* ఇందులో హ‌నుమంతుడు పూర్తిగా ఉంటారా?
- లేదండీ. క్లైమాక్స్ లో.

* మీరు కూడా న‌టించారుగా?
- చిన్న పాత్ర‌లో న‌టించాను. నేను అస‌లు హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది న‌టుడిని అవుదామ‌నే. కానీ కాలేక‌పోయాను. అయితే భూత‌ల్లిని న‌మ్ముకుని ఈ స్థాయికి చేరుకున్నాను. నాకు చాలా అవార్డులు కూడా వ‌చ్చాయి. సొంత కంపెనీ పెట్టే స్థాయికి ఎదిగాను. ఎదిగాక ఎయిడ్స్ బాధితుల‌కు, మెంట‌ల్లీ రిటార్డెడ్‌ పిల్ల‌ల‌కు.. ఇలా ఆరు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు డ‌బ్బులు పంపుతున్నాను. వాళ్ల‌కు సేవ‌ చేయ‌డం వ‌ల్ల జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో సేవ‌కుగానూ అవార్డులు ఇచ్చారు. ప‌సిఫిక్ గోల్డ్ స్టార్ అవార్డు బ్యాంకాక్‌లో వ‌చ్చింది. దుబాయ్‌లోనూ ఓ అవార్డు వ‌చ్చింది. క‌ళామ‌త‌ల్లి మీద ప్రేమ పోలేదు కాబ‌ట్టి నిర్మాత‌గా ఎంట‌ర్ అవుతున్నా. సినిమా రంగాన్ని ఎంపిక చేసుకోవ‌డానికి కార‌ణం ఏంటంటే కృష్ణాన‌గ‌ర్ సెంట‌ర్‌లో చాలా రోజులు ప‌స్తులున్నాను. మిడిల్ క్లాస్ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నాకు ఆక‌లి విలువ తెలుసు. నాలాగే కృష్ణాన‌గ‌ర్‌లో ఎంతో మంది ఉంటారు. అలాంటి కొంద‌రికి ఉపాధి క‌ల్పించాల‌న్న‌ది. నా సినిమా ద్వారా రోజు 200, 300 మందికి అన్నం పెట్ట వ‌చ్చ‌నే కోరిక‌తో చేశాను...

* బ‌డ్జెట్ ఎంత అయిందండీ?
- భారీ బ‌డ్జెట్‌లోనే చేశాం. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తాం. టీవీల్లో, థియేట‌ర్ల‌లో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తాం. ఈ మ‌ధ్య ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన‌ప్పుడు ఆన్‌లైన్‌లో ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌స్తున్నాయి. అంటే మా స‌క్సెస్ అక్క‌డ వ్యూస్‌లో తెలుస్తోంది. ఇంకా హ్యాపీగా ఉంది. థియేట‌ర్ల‌కి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఇదే రెస్పాన్స్ వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాం.

* బిజినెస్ ప‌రంగా ఎలా ఉంది?
- చాలా మంది బ‌య్య‌ర్లు అడుగుతున్నారు. కానీ మేం ఇంకా మార్కెట్ స్టార్ట్ చేయ‌లేదు. ఇంకా విడుద‌ల తేదీని మేం ఖ‌రారు చేయ‌లేదు కాబ‌ట్టి స్టార్ట్ చేయ‌లేదు. ఇప్పుడు మే 5 అనుకుంటున్నాం కాబ‌ట్టి ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తాం.

* మీ త‌ర్వాతి ప్రాజెక్టులలో కొత్త‌వారికి అవకాశం ఇస్తారా?
- త‌ప్ప‌కుండా అండీ. చెప్ప‌డం వేరు, చేయ‌డం వేరు. వ్యాపారం కూడా చాలా ముఖ్యం. నాలుగు సినిమాల చేసిన త‌ర్వాత నాకు అనుభ‌వం వ‌స్తుంది కాబ‌ట్టి నేను కొత్త‌వాళ్ల‌కు ఇస్తాను. మా ద‌ర్శ‌కుడు ఇంత‌కు ముందు హిట్ సినిమాలు తీశాడు. ఇది ఆయ‌న‌కు హ్యాట్రిక్ సినిమా కాబ‌ట్టి ఆయ‌నే చాలా జాగ్ర‌త్త‌గా చేస్తారు. అందుకే ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చాను. ప‌రిశ్ర‌మ‌కు ఎప్పుడూ కొత్త‌వారు కావాలి. నాకు అనుభ‌వం వ‌చ్చాక కొత్త‌వారిని ప్రోత్స‌హిస్తాను.

* త‌ర్వాత ప్రాజెక్ట్ ఏంటి?
- ఒక స్టార్ తో డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న్ని అప్రోచ్ అవుతాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved