28 October 2017
Hyderabad
``నన్ను కన్విన్స్ చేసి, నా పాత్రకున్న ప్రాముఖ్యతను వివరిస్తే గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను`` అని అంటున్నారు అనుపమ పరమేశ్వరన్. ఆమె మహా పాత్రలో నటించిన సినిమా `ఉన్నది ఒకటే జిందగీ`. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ హైదరాబాద్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..
* మీరు నటించిన `మహా` పాత్రకు వస్తున్న స్పందన ఏంటి?
- చాలా మంచి స్పందన వస్తోంది. నేను ఇప్పటికే కొన్ని సినిమాలు చేశాను. వాటికి రాని స్పందన ఈ సినిమాకు రావడం ఆనందంగా ఉంది. ట్విట్టర్‌లోనూ, ఫేస్‌బుక్‌లోనూ నా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాతో ఇంతకుముందు పనిచేసిన దర్శకనిర్మాతలు కూడా ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది.
* ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారట కదా?
- అవునండీ. ఇది నా ఒరిజినల్ పాత్రకి పూర్తిగా భిన్నంగా ఉన్న పాత్ర. దాంతో కష్టపడ్డ మాట వాస్తవమే.
* సినిమా నటి కావాలని కలకన్నారా?
- నేను మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. నాకు నటన అంటే ఇష్టం. అందుకే సినిమాల్లోకి రావాలని అనుకున్నాను. ఇంత మంచి పొజిషన్ నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది.
* ఉన్నది ఒకటే జిందగీ మీకు ఎలా వచ్చింది?
- దర్శకుడు నాకు ఫోన్ చేసి కథ చెప్పారు. మధ్యలో మహా పాత్ర చనిపోతుందని అన్నారు. `వాట్.. ఈజ్ దిస్ ఎ జోక్` అని అన్నా. కాదండీ.. నిజంగానే అని అన్నారు. ఆ పాత్ర చనిపోవడానికిగల కారణాన్ని వివరించారు. ఆ వివరణ నాకు బాగా నచ్చింది.
* సినిమా విడుదలయ్యాక ఏమనిపిస్తోంది?
- చాలా హ్యాపీగా ఉంది. ఆ పాత్రచనిపోయినందుకు ప్రేక్షకులు ఎంతగా బాధపడుతున్నారో అర్థమైంది. ఆ పాత్రతో ఎంతగా ప్రేమలో పడ్డారో అర్థమవుతోంది.
* సినిమా అంగీకరించడానికి ముందు ఏం ఆలోచిస్తారు?
- కథను వింటాను. అదీ శ్రద్ధగా. కథ బావుంటేనే సినిమా హిట్ అవుతుంది. ఆ తర్వాత అందులో నా పాత్ర గురించి ఆలోచిస్తాను. అంతేగానీ కేవలం నా పాత్ర వరకు బావుండాలని అనుకునే రకం కాదు నేను.
* గ్లామర్ పాత్రలు చేయరా?
- చేస్తాను. కానీ నాకు దర్శకుడు క్లియర్‌గా చెప్పాలి. ఆ పాత్ర గ్లామర్‌గా ఎందుకు వ్యవహరించాలో నన్ను కన్విన్స్ చేయగలిగితే మాత్రం తప్పకుండా గ్లామర్ పాత్రలు చేస్తాను.
* ఉన్నది ఒకటే జిందగీ టీమ్ గురించి చెప్పండి?
- నేను షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేశాను. ఒకవేళ నాకు షూటింగ్ లేకుండా అదే ఊర్లో ఉన్నా హోటల్ రూమ్‌లో ఉండేదాన్ని కాదు. స్పాట్‌కు వెళ్లేదాన్ని. అక్కడ మా టీమ్‌తో గడుపుతుంటే చాలా ఆనందంగా అనిపించేది. అంతగా ఇన్వాల్వ్ అయ్యాను ఈ ప్రాజెక్ట్ లో.
* శర్వానంద్ మీకు బెస్ట్ ఫ్రెండ్ అట కదా..
- అవునండీ. పరిశ్రమలో నాకు బెస్ట్ ఫ్రెండ్ శర్వా. సాయిపల్లవితోనూ తరచూ మాట్లాడుతూ ఉంటా. మరికొంతమంది హీరోయిన్స్ తో బాగా మాట్లాడుతుంటాను.
* నెక్స్ట్ మూవీస్ ఏంటి?
- నానితో ఓ సినిమా జరుగుతోంది. గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. సాయిధరమ్‌తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా.