pizza
Balakrishna interview (Telugu) about Gautamiputra Satakarni
`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` వంటి సినిమా చేయ‌డం నా పూర్వ‌జ‌న్మ సుకృతం - నంద‌మూరి బాల‌కృష్ణ‌
You are at idlebrain.com > news today >
Follow Us

10 January 2017
Hyderaba
d

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా హీరో నంద‌మూరి బాల‌కృష్ణ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి గురించి పాత్రికేయుల‌తో మాట్లాడారు.....

యాదృచ్చికంగా జ‌రిగిందే....
-ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా ఎర్ప‌డిన త‌ర్వాత అమ‌రావ‌తిని రాజ‌ధానిగా చేసుకుని పాలించిన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయ‌న గురించి చ‌రిత్ర చాలా మందికి తెలియ‌దు. ఈ సినిమాను నేను క‌థ న‌చ్చి చేయ‌డానికి రెడీ అయ్యానే త‌ప్ప‌ నేను కావాలని వందో సినిమాగా ప్లాన్ చేసింది కాదు. వందో సినిమా అంటే ప్రత్యేకంగా ఉండాలని చాలా కథలు విన్నా. అందులో క్రిష్ చెప్పిన ఈ కథ ఎందుకో విపరీతంగా నచ్చింది. తెలుగుజాతికి ఖ్యాతిని తెచ్చిన కాన‌రాని భాస్క‌రుడే గౌత‌మిపుత్ర‌శాత‌క‌ర్ణి. అలాంటి ఒక గొప్ప వ్యక్తి కథ చెప్తున్నామన్న ఆలోచన కలగగానే వెంటనే ఒప్పేసుకున్నా. నిజానికి ఇలాంటి ఒక ప్రత్యేక సినిమా నా వందో సినిమా కావడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తా.

ఆ న‌మ్మ‌కంతో ఉన్నాం....
- కచ్చితంగా నా వందో సినిమా స్థాయికి తగ్గ సినిమాగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని చెప్పుకోవచ్చు. సినిమా చూసిన మేమంతా ఒక మంచి సినిమా తీశామన్న నమ్మకంతో, విజయంపై ధీమాగా ఉన్నాం. 2 గంటల 15 నిమిషాల్లో కథకు అవసరమయ్యే అన్ని అంశాలతో క్రిష్ ఒక గొప్ప సినిమా తీశాడు. సినిమాకు ఏది అవసరమో దాన్నే చెప్పడానికి అందరినీ ఒప్పించడంలో క్రిష్ చూపిన ప్రతిభ వల్లే ఇది సాధ్యమైందనుకుంటున్నా.

క్రెడిట్ టీంకే ద‌క్కుతుంది....
- ఇంత పెద్ద సినిమాను ఇంత త్వ‌ర‌గా పూర్తి చేశామంటే ఆ క్రెడిట్ అంతా టీమ్ ప్లానింగ్‌కు దక్కాలి. ఒక మంచి పనిచేస్తున్నపుడు పంచ భూతాలన్నీ మనకు సహకరిస్తాయంటారు. అలా ఈ సినిమా షూటింగ్ జార్జియా, మొరాకో లాంటి ప్రాంతాల్లో చేసినప్పుడు కూడా మాకు ఏ ఇబ్బంది కలగలేదు. జార్జియాలో అయితే అంతటా వర్షం పడేది కానీ, మా షూటింగ్ ప్రాంతం మాత్రం మామూలుగా ఉండేది. ఇవన్నీ మన పనికి సహకరించేవిగానే చెప్పుకోవచ్చు.

రిస్క్ అనిపించ‌లేదు.....
- కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయాల‌నుకున్న‌ప్పుడు ఎప్పుడూ నేను రిస్క్ అనుకోను. ఎప్పుడైనా ధైర్యంగా ముందడుగు వేస్తేనా ఏదైనా సాధించగలం. మేమందరం ఈ సినిమాను మొదట్నుంచీ బలంగా నమ్మాం. ఇప్పుడు ఫైనల్ ఔట్‌పుట్ చూశాక విజయంపై అంతే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

నాన్న‌గారు చేయాల్సిన క‌థ..
- నిజానికి క‌థ‌తో నాన్న‌గారు సినిమా చేద్దామ‌నుకున్నారు. కానీ ఆయ‌న బిజీ అయిపోవ‌డంతో ఆయ‌న ఈ క‌థ‌తో సినిమా చేయ‌లేక‌పోయారు. ఓ ర‌కంగా అలాంటి సినిమాలో నేను న‌టించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరు శాతకర్ణి. అలాంటి వ్యక్తి కథ ఎంతమందికి తెలుసు? అలాంటి వ్యక్తి జీవితంలోని రకరకాల భావోద్వేగాలు ఎంతమందికి తెలుసు... ఇవన్నీ ఆలోచించడంతోనే నాకు చాలా ఉత్సాహం వచ్చేసింది. ఇలాంటి సినిమా చేయ‌డం కూడా క నాన్నగారు, అభిమానుల ఆశీర్వాదం అని కూడా అనుకుంటాను.

అవే న‌న్ను న‌డిపించాయి....
- గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి పాత్ర‌ను చేయ‌డానికి ఎలాంటి రెఫ‌రెన్స్‌లు లేవు. అప్ప‌టి కొన్ని శాస‌నాలు, చిత్రాల‌ను ఆధారంగా చేసుకున్నాం. అలాగే గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి పాత్ర కోసం కసరత్తులు ఏమీ చేయ‌లేదు. చేయడం అంటూ ఏమీ లేదు. దర్శకుడు క్రిష్ గారి విజన్, నాన్నగారు కూడా ఈ సినిమా చేయాలనుకొని ఉండడం లాంటివన్నీ నన్ను ముందుకు నడిపించాయి. సినిమా చేస్తున్నంత కాలం నాన్నగారు ఎక్కడో ఓ అదృశ్య శక్తిలా నన్ను నడిపించారని అనిపిస్తూంటుంది. బహుశా ఆయన ప్రేరణ లేకపోతే ఈ సినిమా ఇంత సులువుగా చేయగలిగేవాడిని కాదేమో. గుర్రపు స్వారీ, కత్తి తిప్పడం లాంటివి నేనెప్పుడూ నేర్చుకోలేదు. ఆదిత్య 369, భైరవద్వీపం ఆ సమయంలో సినిమాకు అవసరం అంటే చేసేశా. అదే ఉత్సాహంతో ఇప్పుడూ ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు.

అదే నాలో ఉత్సాహాన్ని నింపింది....
- క్రిష్ ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన గతంలో చేసిన ఐదు సినిమాలూ వేటికవే ప్రత్యేకమైనవి. నా దగ్గరకు వచ్చే దర్శకులు చాలామంది ఒకే రకమైన మూస కథలను పట్టుకొస్తూ ఉంటారు. క్రిష్ ఇలాంటి కొత్త కథను తీసుకురావడమే నాకు ఉత్సాహాన్నిచ్చింది. నన్నడిగితే ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో క్రిష్‌ను పోల్చవచ్చు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉండే స్పీల్‌బర్గ్‌తో క్రిష్‌ను పోల్చానంటే ఆలోచించండి.

టీమ్ గురించి....
- ఈ సినిమా విషయంలో ముందే చెప్పినట్టు మాకు అన్నీ సహకరించాయి. హేమా మాలిని లాంటి గొప్ప నటి మా సినిమాలో నటించారు. నాన్నగారి సినిమాలో ఒకసారి నటించారామె. మళ్ళీ ఇన్నేళ్ళకు తెలుగులో ఒక బలమైన పాత్రతో మెప్పించనున్నారు. ఇక శ్రియ చాలా తెలివైన నటి. ఆమె ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. కబీర్ బేడి కూడా విలన్‌గా చాలా బాగా చేశారు.అలాగే చిరంత‌న్ భ‌ట్ సంగీతం, నేప‌థ్య సంగీతం, జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ల‌స్ అయ్యాయి.

రెండూ స‌క్సెస్ కావాలి....
- సంక్రాంతి పండుగ‌కు సినిమాల మధ్య పోటీ ఉండడం అనేది ఇప్పుడు కాదు...ఈ పోటీ ఎప్ప‌టి నుండో ఉంటున్న‌దే....చిరంజీవి గారికి, నాకూ ఇప్పుడొస్తున్న సినిమాలు ప్రతిష్టాత్మకమైనవి. రెండు సినిమాలూ విజయం సాధించాలని కోరుకుంటున్నా.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌...
- డైరెక్ట‌ర్ కృష్ణవంశీతో ఓ సినిమా విషయమై చర్చలు జరుగుతున్నాయి. 100వ సినిమా తర్వాత కెరీర్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేయాలనుకుంటున్నాను. ఈ క్రమంలోనే ఇకపై వచ్చే నా సినిమాల్లో కొత్త బాలకృష్ణను చూస్తారు. ఇకనుంచి బాలకృష్ణ శకం మొదలవుతుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved