pizza
Bellamkonda Sai Srinivas interview (Telugu) about Jaya Janaki Nayaka
'జయ జానకి నాయక' ..అన్ని కమర్షియల్‌ హంగులున్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ - బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌
You are at idlebrain.com > news today >
Follow Us

05 August 2017
Hyderabad

మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యంగ్‌ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'జయజానకినాయక'. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఇంటర్వ్యూ....

జానకి నాయక ఎలా ఉంటాడు?
- జానకి నాయకుడు కొత్తగా ఉంటూ బోయపాటి హీరోలా ఉంటాడు. సినిమా ఫస్టాఫ్‌ అంతా హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ. బోయపాటిగారు ప్రేమకథను కొత్త ప్రెజంట్‌ చేశారు. నేను, రకుల్‌ కాలేజ్‌ స్టూడెంట్స్‌ కనపడతాం. సినిమాలో మా క్యారెక్టర్స్‌ అలా స్టార్ట్‌ అవుతాయి. సినిమా టైటిల్‌ 'జయజానకినాయక' అంటే లంకలోని సీతాదేవిని గెలుచుకున్న శ్రీరాముడు అని అర్థం. మరి ఈసినిమాలో లంక ఏదని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సినిమాలో జగపతిబాబుగారి విలనిజం కొత్తగా ఉంటుంది. రెండు వందల శాతం బోయపాటిగారు ఇప్పటి వరకు టచ్‌ చేయని ఓ పాయింట్‌ను ఇందులో టచ్‌ చేసి చూపించారు. ఒక మంచి ప్రేమకథ, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కాంబినేషన్‌లో రావడం అనేది రేర్‌గా జరుగుతుంది. నా మూడో సినిమాకే లవ్‌ స్టోరీ విత్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కుదరడం నా అదృష్టం అనొచ్చు.

సినిమాపై భారీ అంచనాలుండటం వల్ల టెన్షన్‌ ఫీల్‌ అవుతున్నారా?
- టెన్షన్‌ ఏం లేదండి...సినిమాపై హైప్స్‌ రావడం మంచిదే కదండి. ఇంత అంచనాలతో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు వందకు వేయి శాతం శాటిస్పాక్షన్‌ పొందుతాడు. నేను, బోయపాటిగారు మాత్రమే సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

ఈ సినిమాలో కొత్తగా నేర్చుకున్న విషయాలేంటి?
- నేర్చుకోవడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. నేను రేపు వంద సినిమాలు చేసినా, తర్వాత సినిమాకు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. ఇక 'జయజానకినాయక' సినిమా విషయానికి వస్తే, ఫిజిక్‌గా కొత్తగా కనపడతాను. నటుడిగా ఇంకా బెటర్‌ పెర్ఫామెన్స్‌ ఇవ్వడానికి ప్రయత్నించాను. క్యారెక్టర్‌ పరంగా మంచి ఎమోషన్స్‌ను క్యారీ చేశాను. రేపు సినిమా చూసిన తర్వాత ఆడియెన్స్‌ తప్పకుండా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు.

బోయపాటితో రెండో సినిమానే చేయాల్సింది కదా..ఎందుకు గ్యాప్‌ వచ్చింది?
- కేవలం మంచి కథ కుదరకపోవడంతోనే, రెండో సినిమాగా స్పీడున్నోడు సినిమా చేశాను. నా రెండో సినిమా ఫిభ్రవరిలో రిలీజ్‌ అయితే బోయపాటిగారి సినిమా ఏప్రిల్‌లో రిలీజ్‌ అయ్యింది. తర్వాత మంచి కథ కోసం బోయపాటిగారు ఓ మూడు నెలలు పాటు వర్క్‌ చేశారు. నవంబర్‌లో సినిమా స్టార్టయ్యింది. సినిమాలను ఏదో త్వరత్వరగా చేసేయాలనే ఆలోచనలేవీ లేవు. రెండేళ్లకు ఓ సినిమా చేసినా, మంచి కథలతోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాను.

మాస్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలని చేసే ప్రయత్నం ఎంత వరకు కరెక్ట్‌ అనుకుంటున్నారు?
- బోయపాటిగారు మాస్‌ ఇమేజ్‌ను ఉన్న డైరెక్టర్‌. ఆయన సినిమాలో కేవలం మాస్‌ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్‌ కంటెంట్‌ కూడా ఉంటుంది. ఈ సినిమాలో కూడా లవ్‌స్టోరీ ప్రధానంగా సాగుతుంది. ఇక నా విషయానికి వస్తే నేను యాక్షన్‌, డ్యాన్సుల పరంగా బాగా ట్రయినింగ్‌ తీసుకున్నాను. కాబట్టి నేను యాక్షన్‌ సినిమాలు చేయడంలో తప్పులేదనిపించింది. రేపు భవిష్యత్‌లో ప్యూర్‌ లవ్‌స్టోరీ వచ్చినా చేయడానికి నేను రెడీ.

క్యారెక్టర్‌ పరంగా ఎలాంటి కేర్‌ తీసుకున్నారు?
- పాత్ర లుక్‌ కోసం పాతిక కిలోలు వరకు పెరిగాను. తర్వాత పది కిలోలు వరకు తగ్గాను.

'స్పీడున్నోడు' పరాజయం ఎలాంటి ప్రభావం చూపింది?
- నేను సాధారణంగా ఏడవను. కానీ 'స్పీడున్నోడు' పరాజయం నన్ను బాగా క్రుంగదీసింది. దాంతో బాగా ఏడ్చేశాను. కానీ నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంతగానో సపోర్ట్‌ చేశారు.

మీ నాన్న మీ కెరీర్‌ పట్ల చాలా కేర్‌ తీసుకుంటునట్టున్నారు?
- హీరో కావాలనేది నా కల. నా కలను ఆయన కలలాగా తీసుకుని పూర్తి చేయడంలో సపోర్ట్‌ చేస్తున్నారు. మంచి కథల ఎంపికలో తన అభిప్రాయాలను చెబుతున్నారు. సినిమా రంగంలోనే కాదు, ఏ రంగంలో కూడా మా నాన్నంత మంచి నాన్న ఉంటారనుకోవడం లేదు. నా స్నేహితులు ఈ విషయంలో నన్ను చూసి ఈర్ష్య పడుతుంటారు. మా నాన్నగారి ప్రొడక్షన్‌లో వేరే హీరోలతో ఈ ఏడాది సినిమా ఉంటుంది. రెండు కథలు కూడా ఫైనలైజ్‌ అయ్యాయి.

బోయపాటి శ్రీనుతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఎలా ఉంది?
- బోయపాటిగారు నా స్వంత అన్నలా నన్ను ట్రీట్‌ చేశారు. ఈ సినిమా విషయంలో ఆయనిచ్చిన కాన్ఫిడెన్స్‌ మరచిపోలేను. అంత పెద్ద డైరెక్టర్‌కు నా గురించి ఇంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకేం కాదు, నీ వెనుక నేనున్నాను. నీతో మరో సినిమా కూడా చేస్తానని ధైర్యం ఇచ్చారు. నాలో అంతగా ఆయనకేం నచ్చిందో నాకు అర్థం కావడం లేదు.

రకుల్‌, సమంత వంటి స్టార్‌ హీరోయిన్స్‌, జగపతిబాబు, శరత్‌కుమార్‌ వంటి సీనియర్‌ నటీనటులతో చేయడం ఎలా అనిపించింది?
- రకుల్‌, సమంత, జగపతిబాబుగారు, శరత్‌కుమార్‌గారు ఇలా అందరూ మంచి పెర్ఫార్మర్స్‌. ఎదుటివాళ్లు బాగా చేసినప్పుడు మనం కూడా బాగా చేయాలనిపిస్తుంది. సీనియర్స్‌ అందరూ నాకు కంఫర్ట్‌ జోన్‌ ఇచ్చారు. సినిమాలో క్యాథరిన్‌ స్పెషల్‌ సాంగ్‌ చేసింది. అలాగే ప్రగ్యా చాలా కీలక పాత్ర చేసింది.

తదుపరి చిత్రం గురించి?
- నెక్ట్స్‌ మూవీ శ్రీవాస్‌గారి దర్శకత్వంలో అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో చేస్తున్నాను. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో రాని డిఫరెంట్‌ జోనర్‌లోని సినిమా. అలాగే ఇప్పటి వరకు రాని యాక్షన్‌ ఎలిమెంట్స్‌ సినిమాలో ఉంటాయి. పీటర్‌ హెయిన్స్‌గారు యాక్షన్‌ సన్నివేశాలను కంపోజ్‌ చేస్తున్నారు. ఇంతకు ముందు చెప్పినట్లు రెండేళ్లు అయినా మంచి కథలుంటేనే సినిమా చేయాలనుకున్నాను, కానీ శ్రీవాస్‌గారు కథ చెప్పగానే వెంటనే చేయడానికి రెడీ అయిపోయాను. ఈ నెల 17 నుండి ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్‌ ప్రారంభం అవుతుంది.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved