pizza
Dil Raju interview (Telugu) about Lover
చిన్న సినిమాలు చేయాలంటే భ‌య‌మేస్తుంది - దిల్‌రాజు
You are at idlebrain.com > news today >
Follow Us

18 July 2018
Hyderabad

రాజ్‌తరుణ్‌, రిద్దికుమార్‌ జంటగా అనీశ్‌ కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి నిర్మించిన చిత్రం 'లవర్‌'. జూలై 20న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దిల్‌రాజు పాత్రికేయులతో సినిమా గురించి సంగతులను తెలియజేస్తూ...

'లవర్‌' సిినిమా ప్రారంభమైందిలా...
- 'అలా ఎలా?' సినిమా చూసిన నాకు డైరెక్టర్‌ అనీశ్‌ కృష్ణ సినిమాను బాగా చేశాడనిపించింది. ఓ సందర్భంలో తను నన్ను కలిస్తే.. మంచి స్టోరీ ఉంటే చెప్పు చూద్దాం అని అన్నాను. 2016లో తను ఓ స్టోరీ లైన్‌ను చెప్పాడు. నాకు నచ్చింది. అనీశ్‌ కథను డెవలప్‌ చేశాడు. 2017లో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయలేకపోయాం. మా నెక్స్‌ట్‌ జనరేషన్‌లో హర్షిత్‌ మూడు, నాలుగేళ్లుగా సినిమా నిర్మాణంలో మాతో పాటు ఉంటున్నాడు. తను నాతో 'ఓ సినిమాకు పూర్తిగా అప్పగించండి.. నేను ఎగ్జ్‌క్యూట్‌ చేస్తాను' అన్నాడు. స్టోరీ మొత్తం రెడీ అయిన తర్వాత హర్షిత్‌ను ఓసారి వినమన్నాను. 'నీకు నచ్చితే నేను ఇన్‌వాల్వ్‌ కాను' అన్నాను. హీరో ఎవరు? అని అనుకున్న సమయంలో చాలా రోజులుగా రాజ్‌తరుణ్‌తో సినిమా చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ సినిమా చేద్దామని అనుకున్నాం. నేను ఐదు కోట్ల బడ్జెట్‌ ఇచ్చి సినిమా చేయమని అన్నాను. నేను ఇప్పటి వరకు ఏ సినిమాను ఐదు కోట్లలో నిర్మించలేదు. మ్యూజిక్‌లో నాకు డిఫరెంట్‌గా కావాలని హర్షిత్‌ అనుకున్నాడు. అందుకనే.. బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ పేర్లు చెప్పాడు. నేను షాక్‌ తిన్నాను. మ్యూజిక్‌ మొత్తానికి మనం అంత ఖర్చు పెట్టమని నేను తనకు చెప్పాను. 'నేను అడిగిన రెండు, మూడు నాకు ఇవ్వండి'.. అని హర్షిత్‌ అన్నాడు. అలాగే సమీర్‌ రెడ్డి, ఎ.ఎస్‌.ప్రకాశ్‌ వంటి టెక్నీషియన్స్‌ను అడిగాడు. సరే అని నేను అన్నాను. రాజ్‌తరుణ్‌ అప్‌ కమింగ్‌ హీరో... తనకు రెండు, మూడు సినిమాలు అనుకున్నంత సక్సెస్‌ కాలేదనేది వాస్తవం. తనకు ఈ సినిమాలో ఉన్న క్లైమాక్స్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. అది కూడా బడ్జెట్‌లో అంగీకరించాను. నేను హర్షిత్‌ అడిగినవన్నీ అరెంజ్‌ చేయడంతో తను సినిమాను చక్కగా నిర్మించాడు. సినిమా ఫస్ట్‌ కాపీ చూశాం. అంతా బావుంది. సినిమా విజువల్‌గా బావుందని అంటున్నారు. క్లైమాక్స్‌ బావుందని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. సినిమా అనుకున్న బడ్జెట్‌ కన్నా నలబై శాతం ఎక్కువైంది. ఈరోజుల్లో ఐదు కోట్లలో క్వాలిటీ సినిమా తీయడమంటే చాలా కష్టం. అయితే ఈరోజు తెలుగు సినిమా మార్కెట్‌ పెరగడం వల్ల ఇప్పటికీ అరవై శాతం రెవెన్యూను కవర్‌ చేసేశాం. మేమే స్వంతంగా రిలీజ్‌ చేస్తున్నాం.

'లవర్‌' కథ గురించి...
- సినిమా కథ విషయానికి వస్తే.. ఓ అనాథ కుర్రాడు. వాడు జీవితంలో ఏదైతే ఫ్యామిలీని మిస్‌ అవుతాడో.. తన భార్య, పిల్లలకు అద్భుతమైన లైఫ్‌ను ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. లవ్‌స్టోరీతో పాటు రాయలసీమ అనంతపూర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. ప్రేమకథా చిత్రాలు అన్ని దాదాపు కథ పరంగా ఒకేలానే ఉంటాయి. అయితే ట్రీట్‌మెంట్‌ మారుతుంది.

కాస్త ప్రెషర ఉంది..
- నేను సాధారణంగా ప్రెషర్‌ తీసుకోను. కానీ ఈ సినిమాకు ప్రెషర్‌ తీసుకుంటున్నాను. అందుకు కారణం హర్షిత్‌ నిర్మాతగా చేస్తున్న తొలి సినిమా ఇది. నిర్మాతగా నేను జయాపజయాలను సాధారణంగానే తీసుకుంటాను. సినిమా రేంజ్‌ని సక్సెస్‌ ఫెయిల్యూర్‌ డిసైడ్‌ చేస్తాయి. ఎందుకంటే.. సినిమా హిట్‌ అయితే ఎవరూ బడ్జెట్‌ గురించి ఆలోచించరు.

ఈ ఏడాది మూడు సినిమాలే..
- నిర్మాతగా గత ఏడాది డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన నేను.. ఈసారి మూడు సినిమాలనే నిర్మిస్తున్నాను. నిర్మాతగా ఆరు సినిమాలు చేసి సక్సెస్‌ కొట్టడం సులభం కాదు.. కానీ ఇలాగే ప్రతి ఏడాది ఆరు సినిమాలు చేసి సక్సెస్‌ కొడతాను అనుకోవడం కష్టమే.

interview gallery



ఆ భయం ఉంది
- చిన్న సినిమాలు చేయాలంటే భయమేస్తుంది. ఎందుకంటే చిన్న సినిమాల విషయంలో ప్రేక్షకుడిని థియేటర్‌ వరకు తీసుకు రావాల్సి ఉంటుంది. ఉదాహరణకు 'కేరింత' సినిమా తీశాను. నచ్చలేదు. మళ్లీ తీశాను. విడుదలైన తర్వాత సినిమా బాగున్నా కలెక్షన్స్‌ రాకపోయే సరికి యూనిట్‌తో కలిసి టూర్స్‌ వెళ్లాను. అలా పెట్టిన డబ్బును రాబట్టుకునేసరికి చాలా కష్టమైంది. అదే సమయాన్ని వేరే దానికి ఖర్చు పెడితే ఫలితం వేరేలా ఉంటుంది. అందుకే ఓ మోస్తారు హీరోతో సినిమాలు చేస్తే.. మినిమం ప్రేక్షకుడు థియేటర్‌ వరకు వస్తాడు.

ప్లాన్‌ చేయడం లేదు..
- మల్టీస్టారర్‌ చేయడమనేది ఏదీ ప్లాన్‌ చేసి చేయడం లేదు. కథను బట్టి అలా కుదురుతుంది. ఎఫ్‌2 తోపాటు ఇంద్రగంటిగారి సినిమా రెడీ అవుతుంది. అలాగే హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో 'దాగుడు మూతలు' స్క్రిప్ట్‌ రెడీ అవుతుంది. ఇద్దరికీ నచ్చడం లేదు. మరి అదే సినిమా చేస్తామా? లేక షిఫ్ట్‌ అవుతామా? అని తెలియడానికి మరో వారం, పదిరోజుల సమయం పట్టేలా ఉంది.

మహేశ్‌ సినిమా గురించి...
- మహేశ్‌ 25వ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. తర్వాత గోవా షెడ్యూల్‌.. మళ్లీ హైదరాబాద్‌ షెడ్యూల్‌.. మళ్లీ అమెరికా షెడ్యూల్‌ ఉంటుంది. మహేశ్‌ సినిమా యూరప్‌లో కూడా ఉంటుంది.

తుదపరి చిత్రాలు.. వాటి రిలీజెస్‌...
- శ్రీనివాస కళ్యాణం సినిమాను బొమ్మరిల్లు రిలీజ్‌ డేట్‌ ఆగస్ట్‌ 9నే విడుదల చేస్తున్నాం.. అక్టోబర్‌ 18న హలో గురూ ప్రేమకోసమే రిలీజ్‌.. ఎఫ్‌ 2 సంక్రాంతి రిలీజ్‌.. ఏప్రిల్‌ 5న మహేశ్‌ 25వ సినిమా రిలీజ్‌ కానున్నాయి. గల్లా అశోక్‌ సినిమా సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో స్టార్ట్‌ అవుతుంది. రెండు స్క్రిప్ట్‌లున్నాయి.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved