pizza
D Suresh Babu interview about Ee Nagaraniki Emaindi
క్వాంటీటి కంటే క్వాలిటీయే ముఖ్యం - డి.సురేశ్‌బాబు
You are at idlebrain.com > news today >
Follow Us

23 June 2018
Hyderabad

విశ్వక్‌సేన్‌, సాయి సుశాంత్‌, వెంకట్‌ కాకుమాను, అభినవ్‌ గోమటం, అనీషా అంబ్రోస్‌, సిమ్రాన్‌ చౌదరి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది?'. తరుణ్‌ భాస్కర్‌ దర్శకుడు. డి.సురేశ్‌ బాబు నిర్మాత. ఈ సినిమా జూన్‌ 29న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత డి.సురేశ్‌బాబు ఇంట‌ర్వ్యూ...

కొత్త టాలెంట్‌ కోసం...
సురేశ్‌ ప్రొడక్షన్స్‌ మల్టీ లేయర్‌గా స్మాల్‌ కంటెంట్‌తో చాలా విషయాలు చేయబోతున్నాం. అందువల్ల కొత్త టాలెంట్‌ను ఇండస్ట్రీకి తీసుకు రావచ్చు. అలాగే మంచి ప్రాసెస్‌ను ఇండస్ట్రీలోకి తీసుకురావచ్చు. ఎందుకంటే ప్రతి ఏడాది మన పరిశ్రమలో చాలా చిన్న, పెద్ద సినిమాలు చేస్తున్నాం. క్వాంటీటి పెరుగుతుంది కానీ.. క్వాలిటీ పెరగడం లేదు. క్వాంటీటి కంటే క్వాలిటీయే ముఖ్యం. ఉదాహరణకు ఇండియా మొత్తంగా వెయ్యి సినిమాలు చేస్తే అందులో వందఅయిన క్వాలిటీ సినిమాలున్నాయా? అంటే ఉండవు. దాని వల్ల మనం బాధపడుతున్నాం. సక్సెస్‌ఫుల్‌ సినిమాలు ఉండొచ్చు కానీ క్వాలిటీ సినిమాలు మాత్రం రావడం లేదు. అందుకు కారణం ప్రాసెస్‌ కావడం లేదు. ప్రాసెస్‌ ఫాలో కాకపోవడం అనేది సినిమా పరిశ్రమలోనే కాదు.. ఏ రంగంలోనూ జరగడం లేదు. షార్ట్‌ కట్స్‌లో పనిని పూర్తి చేయాలనుకుంటున్నాం. సరైన పద్ధతిలో పనిని చేయడం లేదు. కొన్ని రంగాల్లో మాత్రమే ప్రాసెస్‌ను ఫాలో అవుతున్నారు. అందువల్ల వాళ్లు నెంబర్‌వన్‌గా రాణిస్తున్నారు. అందుకనే వచ్చే రెండేళ్లలో బెస్ట్‌ ప్రాసెస్‌ను సినీ రంగంలోనికి తీసుకురావాలనేది సురేశ్‌ ప్రొడక్షన్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అంత సులువు కాదనే సంగతి నాకు తెలుసు.

డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ గురించి...
- 'ఈనగరానికి ఏమైంది?' సినిమాలో నిర్మాతగా నాది జీరో ఇన్‌పుట్స్‌. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ కంటే తరుణ్‌భాస్కర్‌పైనే ఎక్కువ ప్రెషర్‌ ఉంటుంది. తనని తాను ఇంకా ప్రూవ్‌ చేసుకోవాలి. ఒక సినిమాతో అది పూర్తి కాదు. ఆ విషయం తనకు తెలుసు. తరుణ్‌ భాస్కర్‌ భవిష్యత్‌తో గొప్ప స్థాయిని చేరుకుంటాడనే నమ్మకం ఉంది. అందుకు కారణం తనకు సినిమాలంటే ఇష్టం. కొత్త కథలను చెప్పడానికి తను ఇష్టపడుతుంటాడు. చాలా మంది పెద్ద హీరోలు తనని సినిమా చేయమని అడిగితే..నేను హ్యాండిల్‌ చేయలేను సార్‌! నేను మరో చిన్న సినిమా చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఎందుకంటే ఓ టెక్నీషియన్‌గా తనని తాను ప్రూవ్‌ చేసుకోవాలనుకోవడమే కారణం. తనలో పొటెన్షియల్‌ ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగపడుతుంది.

ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయితేనే....
- ఇంత మంచి పెర్‌ఫార్‌మెన్‌సెస్‌ ఓ డైరెక్టర్‌ తీసుకుంటాడని తరుణ్‌భాస్కర్‌ని చూస్తే కానీ నాకు తెలియదు. తనకు ఎలా కావాలో అలా నటనను రాబట్టుకుంటాడు. మా జనరేషన్‌లో హెవీ కంటెంట్‌, డ్రమాటిక్‌ ఉండేది. కానీ ఇప్పుడు కంటెంట్‌ సెటిలర్‌గా ఉంటుంది. అలాంటి సెటిలిటీని హ్యాండిల్‌ చేయడం తెలియనప్పుడు అవుట్‌పుట్‌ను రాబట్టుకోలేం. ఉదాహరణకు 'బొబ్బిలిరాజా', 'ప్రేమించుకుందాం..రా' సినిమాలు కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ను సాధించాయి. ఆ సినిమాల్లో హీరో పాత్ర.. మిగిలిన హీరో పాత్రల కంటే సెటిలర్‌గా ఉన్నాయి. అది నాకు బాగా తెలుసు. అది నా దర్శకులకు చెప్పేవాడిని. ఏదీ మన అవసరమో చెప్పేవాడిని. కానీ ఎంత శాతం చెప్పేవాడినో తెలిసేకాదు. అదే తరుణ్‌భాస్కర్‌ విషయానికి వస్తే.. తనకు ఏం కావాలో బాగా తెలుసు. సినిమా అనేది కొన్ని పాత్రల మధ్య జరిగే సంభాషణలు. వాటిని చిత్రీకరించాల్సిన విధంగా చిత్రీకరించకపోతే సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించవు. అందులోని ఎమోషన్స్‌కు ఆడియన్స్‌ కనెక్ట్‌ అయితే ఆటోమెటిక్‌గా సక్సెస్‌ వస్తుంది. రాజమౌళి బేసిక్‌ ఎమోషన్‌ అయిన రివేంజ్‌ను తెరకెక్కిస్తాడు. అయితే తను తెరకెక్కించే విధానం వేరుగా ఉంటుంది. ఆడియన్‌కి డిఫరెంట్‌ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తాడు. కొన్ని సినిమాలు కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చవు. స్టార్‌ హీరో సినిమా ఎలా ఉన్నా చూడటానికి ప్రేక్షకుడు ఇష్టపడతాడు. కానీ చిన్న సినిమా పరిస్థితి అలా ఉండదు. ఏదో ఒక కొత్త విషయం ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఎక్కువ మొత్తంలో ప్రేక్షకులను మెప్పించినప్పుడే అది పెద్ద హిట్‌ మూవీ అవుతుంది.

interview galleryఇండస్ట్రీకి మంచే జరుగుతుంది...
- కమర్షియల్‌ సినిమాలకు సింక్‌ సౌండ్‌ చేయకూడదు అనేంలేదు. బాలీవుడ్‌లో కమర్షియల్‌ సినిమాలన్నీ సింక్‌ సౌండ్‌లోనే చేస్తారు. ఆమిర్‌ఖాన్‌ తన సినిమాలన్నింటినీ సింక్‌ సౌండ్‌లోనే చేస్తాడు. తనకు సింక్‌ సౌండ్‌ వేల్యూ ఏంటో తెలుసు. కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి. మనలో చాలా మంది నటీనటులకు భాష మాట్లాడటం తెలియదు. అవుట్‌డోర్స్‌లో ఎక్కువ షూటింగ్స్‌ చేయడం వల్ల కూడా సింక్‌ సౌండ్‌ వెళ్లిపోయింది. ఒకప్పుడు మిచెల్‌ కెమెరా ఉండేది. అది శబ్దం లేకుండా ఉండేది. తర్వాత కెమెరా, లైట్స్‌ శబ్దం వచ్చేవిగా ఇండస్ట్రీకి రావడంతో సింక్‌ సౌండ్‌ వెళ్లిపోయింది. కానీ సింక్‌ సౌండ్‌లో సినిమా చేసేటప్పుడు లొకేషన్‌ చాలా సైలెంట్‌గా ఉంటుంది. అందరూ ఫోకస్‌డ్‌గా ఉంటారు. అవుట్‌పుట్‌ బాగా వస్తుంది. డబ్బింగ్‌ చెప్పాల్సిన అవసరం లేదు. దీని వల్ల ఇండస్ట్రీకి మంచే తప్ప.. చెడు జరగదు. సింక్‌ సౌండ్‌ వల్ల సినిమా ఆడుతుందా? ఆడదా? అనే విషయాన్ని పక్కన పెడితే క్వాలిటీ పెరుగుతుంది. టెక్నీకల్‌గా ఎంతో ఇంప్రూవ్‌ అవుతున్నాం.

తదుపరి చిత్రాలు...
చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ ఇతర నిర్మాతలతో కలిసి నిర్మించబోతున్నాం. బాబి దర్శకత్వంలో వెంకటేశ్‌, చైతన్య సినిమా వచ్చే మా బ్యానర్‌లో చేస్తున్నాం. నిర్మాణంలో నేను ఒక్కడినే కాదు.. నా ఐడియాస్‌ అర్థం చేసుకున్నవారిని కలుపుకుని పోతాను. రానాతో హిరణ్య సినిమా చేయబోతున్నాం. ఇంటర్నేషనల్‌ క్వాలిటీలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం. 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved