pizza
Harinath Policharla interview (Telugu) about Captain Rana Pratap
ఆ ఘ‌ట‌న మాకు ప్ల‌స్ అవుతుంది - హ‌రినాథ్ పొలిచెర్ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

25 June 2019
Hyderabad

'చంద్రహాస్‌' వంటి విభిన్న కథా చిత్రంతో నటుడుగా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డా. హరినాథ్‌ పొలిచెర్ల. రీసెంట్‌గా డ్రీమ్‌ టీమ్‌ బ్యానర్‌పై డా. హరినాథ్‌ పొలిచెర్ల ఒక పవర్‌ఫుల్‌ ఆర్మీ ఆఫీసర్‌గా టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం 'కెప్టెన్‌ రాణాప్రతాప్‌'. 'ఎ జవాన్‌ స్టోరి' అనేది క్యాప్షన్‌. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కి, ఆడియోకి విశేష స్పందన లభిస్తోంది. జూన్‌ 28 అత్యంత గ్రాండ్‌గా సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా దర్శకుడు, నిర్మాత డా. హరినాథ్‌ పొలిచెర్ల ఇంటర్వ్యూ.

'కెప్టెన్‌ రాణాప్రతాప్‌' లాంటి ఒక పవర్‌ఫుల్‌ టైటిల్‌తో వస్తున్నారు కదా? ఎలా అనిపిస్తోంది?
- గత రెండుమూడేళ్లుగా మన దేశ శాంతి భద్రతలకు అఘాతం కలిగిస్తున్న, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఒక విషయాన్ని తీసుకొని సాధారణంగా మిలటరీ ఆఫీసర్స్‌ చేసే ఒక కోవర్ట్‌ ఆపరేషన్‌ని బేస్‌ చేసుకొని ఎంతో అద్భుతంగా రాసుకున్న కథే 'కెప్టెన్‌ రాణా ప్రతాప్‌'. మనం ఈ మధ్యకాలంలో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. చైనా సిల్క్‌ రోడ్‌ అనే ఒక ప్రాజెక్టుని స్టార్ట్‌ చేసి పాకిస్థాన్‌ ద్వారా బెలూచిస్థాన్‌ అనే ప్రాంతంలో ఉన్న వాగర్‌ అనే ఒక ఫిషింగ్‌ ల్యాండ్‌ని 50 సంవత్సరాలు లీజ్‌కి తీసుకొని అక్కడ ఒక పెద్ద సీ-పోర్ట్‌ని నిర్మిస్తోంది. దానికి కాపలాగా మిలటరీని కూడా ఏర్పాటు చేసింది. అలాంటి ఒక దేశ భద్రతకు సంబంధించిన అంశాన్ని భారత్‌ ఎలా ఒక కోవర్ట్‌ ఆపరేషన్‌ ద్వారా తెలుసుకుందో దానిని బేస్‌ చేసుకొని ఎంతో పవర్‌ఫుల్‌గా రాసుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కింది.

ఇలాంటి దేశ రహస్యాలకు సంబంధించిన అంశం అంటే బాగా రీసర్చ్‌ అవసరమవుతోంది కదా!
- రీసర్చ్‌ అంటే... నాకు ఉన్న పరిచయాల ద్వారా కొంతమంది మిలటరీ ఆఫీసర్స్‌ని వారి దగ్గరకి వెళ్లి కలవడం, ఫోన్‌లో వాకబు చేయడం జరిగింది. అలాగే ఇటీవల ప్రచురితమైన వార్త పత్రికలోని ఆర్టికల్స్‌, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్‌ తీసుకున్నాకే ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం.

మీ క్యారెక్టర్‌ గురించి చెప్పండి?
- ఇందులో నా క్యారెక్టర్‌ పేరు 'కెప్టెన్‌ రాణా ప్రతాప్‌'. ఒక మిలటరీ ఆఫీసర్‌. ఒకసారి అనుకోకుండా పాకిస్థాన్‌కి వెళ్లడం జరుగుతుంది. ఇండియన్‌ మిలటరీ ఆఫీసర్‌ పాకిస్థాన్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లి ఏం చేసాడు.. అన్నదే కథ.

ఈ మధ్య కాలంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది కదా?
- అవునండి! అభినందన్‌ అనే ఆర్మీ పైలెట్‌ పాకిస్థాన్‌ ఆర్మీకి చిక్కి సురక్షితంగా మళ్ళీ మన దేశం వచ్చిన సంగతి తెలిసిందే. అది జరిగి కొన్ని నెలలు మాత్రమే అయింది. అయితే నేను ఈ కథ రాసుకొని దాదాపు రెండు సంవత్సరాలు అయింది. వారు వెళ్లే ఉద్దేశ్యం కూడా విభిన్నంగా ఉంటుంది. దానికి, ఈ సినిమా స్టోరీకి సంబంధం ఉండదు. అయితే ఆ ఘటన మా సినిమాకు మంచి ప్లస్‌ అవుతుందనే అనుకుంటున్నాను.

ఈ సినిమాలో మీరే హీరోగా నటించడానికి ప్రత్యేక కారణం ఉందా?
- లేదండి. ఈకథ నేనే రాశాను. చిన్న చిన్న మైన్యూట్‌ పాయింట్‌లను కూడా తీసుకొని ఎంతో ప్రేమగా ఈ కథ రెడీ చేశాను. నేను ఏ సినిమా చేస్తున్నా కూడా నేను ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తానని మా దర్శకులు చెబుతుండేవారు. నేను 'చంద్రహాస్‌' సినిమా చేస్తున్నపుడు కీరవాణి తండ్రి శివ శక్తి దత్తగారు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. అందులోనూ ఈ క్యారెక్టర్‌ కోసం చాలా ఫిట్‌గా ఉండాలి. నేను గత పదిహేను ఏళ్లుగా మార్షల్‌ ఆర్ట్స్‌ చేస్తున్నాను. ప్రతి రోజు ఒక గంటన్నర జిమ్‌ కూడా చేస్తాను. నాది చాలా ఫిట్‌ బాడీ కనుకనే ఈ క్యారెక్టర్‌ చేయడానికి సిద్దమయ్యాను.

మీరు ప్రొఫెషనల్‌గా మంచి పేరున్న డాక్టర్‌ కదా! ప్రొఫెషన్‌ని, యాక్టింగ్‌ని ఎలా బేలెన్స్‌ చేయగలుగుతున్నారు?

- నేను నా జీవితంలో ఫిఫ్టీ పర్సెంట్‌ సమయాన్ని వ త్తి ధర్మంగా నా వైద్యవృత్తికి కేటాయిస్తాను. మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్‌ మాత్రమే నటన, ప్రొడక్షన్‌కి కేటాయిస్తాను. అలా రెండింటిని బేలన్స్‌ చేస్తూ వస్తున్నాను. మా గురువుగారు ఎన్‌. శివ ప్రసాద్‌గారు నన్ను చిన్నప్పటి నుండి నాటకాల్లో నటింపజేశారు. ఎన్నో సన్మాన పత్రాలు, అవార్డులు అందుకున్నాను. అలా నా మనోధర్మం ప్రకారం రెండిటినీ సమన్వయ పరుచుకుంటున్నాను.

ఏఏ లొకేషన్స్‌లో షూటింగ్‌ జరిపారు?
- ఈ సినిమా ఎక్కువభాగం హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ జరిపాం. కొంత భాగం వికారాబాద్‌ ఫారెస్ట్‌లో చిత్రీకరించాం. ఇంకా కృష్ణపట్నం పోర్ట్‌ లోని అద్భుతమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ చేశాం. కృష్ణపట్నం పోర్ట్‌లో ఇంతవరకూ ఎవరూ చూపించని ఫ్రెష్‌ లొకేషన్స్‌ ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తాయి.

మీరు హీరో కదా! దర్శకుడు, నిర్మాత అవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?
- మనసుగా, ఆత్మగా నేనొక యాక్టర్‌ని. దానిని ఆపద్ధర్మంగా పెట్టుకొని దర్శకుడినయ్యాను. ఎందుకంటే నాలోని నటుడిని శాటిస్‌ఫై చేయాలంటే అంతే విజన్‌ ఉన్న డైరెక్టర్‌ ఉండాలి. అలాగే కాంప్రమైజ్‌ అవ్వని ప్రొడ్యూసర్‌ ఉండాలి. అందుకే ఈ సినిమాకు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతల్ని స్వీకరించాను.

ఈ సినిమాలో హీరో సుమన్‌ కీలక పాత్రలో కనిపిస్తున్నారు కదా! ఆయన గురించి చెప్పండి?
- సుమన్‌గారు 500 సినిమాల్లో నటించారు. ఆయనతో నేను నటించినందుకు చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ఆయన ఎక్కువగా పోలీస్‌ ఆఫీసర్‌, మేజర్‌ క్యారెక్టర్స్‌ చేశారు. ఈ క్యారెక్టర్‌ వినగానే వెంటనే ఒప్పుకున్నారు. ఈ సినిమాల్లో నన్ను లీడ్‌ చేసే మేజర్‌ క్యారెక్టర్‌. క్లైమాక్స్‌లో ఆయన యాక్షన్‌ ఎపిసోడ్‌ కూడా ఉంటుంది. అది కూడా సినిమాకు ప్లస్‌ అవుతుంది.

మీరే ఓన్‌ రిలీజ్‌ చేస్తున్నారా?
- మా సినిమా విడుదలకి మైత్రి మూవీ మేకర్స్‌ సహాయం చేస్తున్నారు. నవీన్‌ ఎర్నేనిగారు నాకు చాలా క్లోజ్‌ ఫ్రెండ్‌. మాకు ఇరవై ఏళ్ళ పరిచయం ఉంది. మంచి సినిమా మీ హెల్ప్‌ కావాలి.. అనగానే ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. డెఫినెట్‌గా అన్ని చోట్ల మంచి థియేటర్స్‌ వస్తున్నాయి. జూన్‌ 28 గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దేశభక్తి, ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌ లాంటి మంచి అంశాలతో తెరకెక్కింది. తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ గురించి?
- ఒక సున్నితమైన హిస్టారికల్‌ అంశం మీద సినిమా తీద్దాం అనుకుంటున్నాను. నిజాంకాలంలో రజాకార్ల ఉద్యమం గురించి మీ అందరికీ తెలిసిందే. అప్పటి నిజాం అబ్దుల్‌ రజాక్‌ నాజ్వి, అతని అనుచరులు చేసిన ఘోరాల వల్ల ఒక కుటుంబం ఎలా కష్టపడింది? అనే పీరియాడిక్‌ ఫిలిం ప్లాన్‌ చేస్తున్నాను. దీనిని సరిగ్గా హేండిల్‌ చేయగల దర్శకుడు దొరకగానే వివరాలు మీడియాకి వెల్లడిస్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు డా. హరినాథ్‌ పొలిచెర్ల.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved