pizza
Koratala Siva interview about Janatha Garage
కలెక్షన్స్ అనేవి  నెంబర్స్ మాత్రమే. దాని గురించి హీరోలెవ్వరూ ఆలోచించరు
 – కొరటాల శివ
You are at idlebrain.com > news today >
Follow Us

31 August 2016
Hyderaba

మిర్చి, శ్రీమంతుడు వంటి వరుస విజయాలు తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో సెప్టెంబర్ 1న విడుదలవుతున్న చిత్రం `జనతాగ్యారేజ్`. ఎన్టీఆర్‌, సమంత, నిత్యామీనన్‌ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'జనతాగ్యారేజ్‌'. సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివతో ఇంటర్వ్యూ....

జనతా గ్యారేజ్‌..ఇద్దరు వ్యక్తులు...
- ఈ ప్రపంచంలోని ఇద్దరు వ్యక్తులను గురించి చూపిస్తున్నాను. ప్రకృతిలోని అందాలను తనలో ఇముడ్చుకున్న భూమిని ఇష్టపడే యువకుడు ఒకరైతే. భూమిపై ఉండే మనషులను ప్రేమించే వ్యక్తి మరొకరు. ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి చేసిన ప్రయాణమే ఈ చిత్రం. ఇక 1980-90 ల్లో జనతా థియేటర్ అని, అలాగే జనతా పేరుతో పలు సంస్థల పేర్లను చూసేవాడిని. అలా ఆ పేరంటే ఓ ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టంలో నుండే ఈ టైటిల్ పుట్టింది.

ప్రతిదీ తొలి చిత్రమే....
- నేను చేసే ప్రతి సినిమాను నా తొలి సినిమాగానే భావించి చేస్తాను. అయితే టెన్షన్ ఉండదా అంటే ..ఉంటుంది. సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందోననే భయమే మంచి సినిమాలను చేయాలనే ఆలోచనను ఇస్తుంది.

హీరోకు సమానమైన ప్రాముఖ్యత....
- నా రెండు సినిమాలను చూస్తే మిర్చిలో సత్యరాజ్, శ్రీమంతుడులో జగపతి బాబు పాత్రలను చూస్తే హీరోకు సమానంగా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అలాగే ఈ చిత్రంలో మోహన్ లాల్ గారి పాత్ర అలానే ఉంటుంది. ఆయన్ను దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నాను. కథ రాసుకునేటప్పుడే డిఫరెంట్ ఇమేజ్ ఉంటే బావుంటుందని, అలాంటి వారే న్యాయం చేస్తారని నమ్మాను. అందుకే మోహన్ లాల్ గారిని తీసుకున్నాను. ముందుగా ఆయనకు చెబితే ఏమంటారోనని తెగ ఆలోచించాను. అయితే ఆయన ఓ షూటింగ్ లో ఉన్నప్పుడు కథ విన్నారు. ఐదు నిమిషాలు విన్న తర్వాత ఓ షాట్ చేసొచ్చారు. రాగానే ఈ సినిమా నేను చేస్తాను..అని అన్నారు.

హీరోయిజం కథలో భాగమే....
- నా సినిమాల్లో హీరోయిజం అనేది కథలో భాగంగానే ఉంటుంది. కమర్షియల్ సినిమాల్లో కూడా సోసైటీకి ఏదైనా ఉపయోగపడే విషయం చెప్పాలనుకుంటాను. చాలా మంది దర్శకుల ఆలోచన కూడా అదే. నా ఆలోచన తీరు సామాజిక కోణంలో ఉంటుంది. నా కథలను కూడా నేను మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకునే రాసుకుంటాను.

అతీతమైన బంధం...
- ఎన్టీఆర్ గారితో ఈ సినిమా కంటే ముందు నుండి అంటే ఆయన నటించిన బృందావనం, ఊసరవెల్లి సినిమాలకు రచయితగా పనిచేశాను. అప్పటి నుండి మా మధ్య మంచి అనుబంధం ఉంది. ఓ రకంగా చెప్పాలంటే మా మధ్య అతీతమైన బంధం ఉందని చెప్పగలను. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ ను బట్టే రిలేషన్స్ ఆధారపడి ఉంటాయి. జనతాగ్యారేజ్ సమయంలోనే ఎన్టీఆర్ తో ఉన్న రిలేషన్ దృష్ట్యా సినిమా చేయడం కరెక్టా అని ఆలోచించాను. అయితే నేను రాసుకున్న కథకు ఎన్టీఆర్ గారే బెస్ట్ ఛాయిస్. ఆయన మాత్రమే చేయదగ్గ సినిమా ఇది.

Koratala Siva interview gallery

బలవంతంగా సినిమా చేయాల్సిన అవసరం....
- ఎన్టీఆర్‌ స్టార్ హీరో. ఆయనకున్న ఇమేజ్ చాలా డిఫరెంట్. అలాంటప్పుడు ఆయనతో బలవంతంగా సినిమా చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. నిజానికి శ్రీమంతుడు కంటే ముందుగానే అనుకుని తయారు చేసుకున్న కథ ఇది. మధ్యలో శ్రీమంతుడు చేశాను. తర్వాత ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నప్పుడు మార్పులు కూడా చేయకుండానే సినిమా చేశాం. ఇక మలయాళ వెర్షన్ విషయానికి వస్తే తెలుగులో ఏం చెప్పాలనుకున్నానో దాన్నే మలయాళంలో కూడా చూపిస్తున్నాను. ఒక ట్రెండు చిన్న చిన్న మార్పులు తప్ప పెద్ద తేడాలేవీ ఉండవు.

వాటి గురించి ఎవరూ ఆలోచించరు.....
- కలెక్షన్స్ అనేవి నెంబర్స్ మాత్రమే. దాన్ని ఇంకేవరైనా ఇవ్వాలే కానీ హీరోలు ఎవరూ ఆలోచించరు. అందరూ కథ,ఎలాగుంది..., పాత్ర ఎలా ఉంటుందనేదే ఆలోచిస్తున్నారంతే. ఇక నెంబర్స్ గురించి పట్టించుకోరు. కాలానికి అనుగుణంగా సినిమాల తీరుతెన్నుల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు సినిమాల్ని వంద రోజులు ఆడించేవారు. ఆ తర్వాత అది అయిదు, ఆరు వారాలకు పరిమితమైంది. ఇప్పుడు షేర్స్, కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. అభిమానులే ప్రతి రోజు సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేదాన్ని ప్రతిపాదికగా తీసుకుంటున్నారు. సినిమా ట్రెండ్ మారుతూ వస్తుంది.

ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి....
-జనతాగ్యారేజ్ లో ఎన్టీఆర్ రోల్ ఎఫెక్టివ్ గా కనపడుతుంది. అందరూ ఎన్టీఆర్ గారిని మాస్ హీరో అంటారే కానీ నిజానికి ఆయన చాలా స్టైలిష్ గా ఉంటారు. చిన్న చిన్న ఎమోషన్స్ ను కూడా దర్శకుడి, కథకు తగినట్టు ఇమిడిపోయి నటిస్తారు.

ఆ విషయంలో తాపత్రయపడ్డాను...
-ఏదో రాసేసి దాన్ని స్క్రీన్ పై ప్రెజెంట్ చేసేసి గొప్ప డైరెక్టర్ అనిపించుకోవాలనుకోను. నా కథ ఏం డిమాండ్ చేస్తుందో అంతే రాస్తాను. నా దృష్టిలో రచన, దర్శకత్వం సమానమే. రచయితగా ఉన్నప్పుడు కథ అనుకుని దాన్ని రెడీ చేసి ఇచ్చేస్తే నా పని పూర్తయ్యేది. కానీ డైరెక్టర్ అయిన తర్వాత దర్శకుడిగా మారిన తర్వాత పేరు, డబ్బు, సక్సెస్‌లతో పాటు బాధ్యత కూడా పెరిగింది.

కాజల్ స్పెషల్ సాంగ్ గురించి....
-కథ ప్రకారం ఓ స్పెషల్ సాంగ్ వస్తుంది. దాంట్లో ఓ హీరోయిన్ నటిస్తే బావుంటుందనిపించింది. ఎవరూ చేస్తే బావుంటుందోనని ఆలోచించి కాజల్ అగర్వాల్ తో స్పెషల్ సాంగ్ చేయించాం. ఆ నిర్ణయం అంతా నిర్మాతలదే.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్....
-డి.వి.వి.దానయ్య నిర్మాతగా మహేష్‌బాబుతో మరో సినిమా ఉంటుంది. కొత్త కథతోనే సినిమా చేస్తాను. అలాగే అందరి హీరోలతో వారి డేట్స్ ను బట్టి తప్పకుండా సినిమాలు చేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved