pizza
A. Mahesh Reddy interview about Om Namo Venkatesaya
హాథీరాం బాబా క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించిన నాగార్జున చరిత్రలో నిలిచిపోతారు - నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

2 February 2017
Hyderabad

వ్యాపార రంగంలో అంచెలంచెలగా ఎదిగి ఎ.ఎం.ఆర్‌. గ్రూప్‌ సంస్థను స్థాపించి నాలుగు వేల మందికి పైగా జీవనోపాధిని కల్పిస్తూ సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మేన్‌గా రాణిస్తున్నారు ఎ.ఎం.ఆర్‌. గ్రూప్‌ అధినేత ఎ.మహేష్‌రెడ్డి. స్వతహాగా బాబాకి పరమ భక్తుడైన మహేష్‌రెడ్డి తొలిసారి నిర్మాతగా మారి అక్కినేని నాగార్జున-దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో 'షిరిడిసాయి' చిత్రాన్ని నిర్మించారు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సాధించి నిర్మాతగా మహేష్‌రెడ్డి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కొంత విరామం తర్వాత అక్కినేని నాగార్జున-కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌ రిపీట్‌ చేస్తూ హాథీరాం బాబా జీవిత కథతో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. అధినేత ఎ.మహేష్‌రెడ్డితో ఇంటర్వ్యూ.

ఈ సినిమా ముఖ్య కథాంశం ఏమిటి?
- గోవిందుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి మహాభక్తుడైన హాథీరామ్‌ బాబాజీ పుణ్య చరిత్రే ఈ సినిమా మెయిన్‌ కథాంశం. వేంకటేశ్వర స్వామికి హాథీరామ్‌ బాబాజీకి మధ్య జరిగే డ్రామాని ఈ సినిమాలో చూపించాం. ఆయనతో పాటు కృష్ణమ్మ చరిత్రను కూడా ఈసినిమాలో ఎలా వుంటుందో చూపించాం. తిరుపతి కొండపైన హాథీరాం బాబా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసారు? పూజలు, పునస్కారాలు, వెన్నతో దీపం వెలిగించడం, అక్కడ అడ్మినిస్ట్రేషన్‌ ఎలా వుంటుందనేది సినిమాలో క్లియర్‌గా చూపించాం. ఆయనకి హాథీరాం బాబా అనే పేరు ఎలా వచ్చింది? అనేది సినిమా చూసి తెల్సుకోవాల్సిందే.

ఈ ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయ్యింది?
- ఈ కథని ఫస్ట్‌ జె.కె.భారవిగారు రాఘవేంద్రరావుగారికి చెప్పారు. ఆయనకి బాగా నచ్చడంతో సినిమా తియ్యాలనుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి నాకు చెప్పగానే వెంటనే ఇమ్మీడియెట్‌గా నేను తీస్తాను అని చెప్పాను. బాబా భక్తుడైన నేను నాగార్జున-రాఘవేంద్రరావుగారి కాంబినేషన్‌లో 'షిరిడిసాయి' చిత్రాన్ని నిర్మించాను. ఆ చిత్రంతో నేను, నాగార్జున బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. మా కుల దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సినిమా తియ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నా కోరిక ఈ సినిమాతో తీరింది.

ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది?
- నేను పెద్దగా సెట్‌కి వెళ్లలేదు. నా ఫ్రెండ్‌ విక్రమ్‌ ఈ సినిమా అంతా చూసుకున్నాడు. నిజ జీవితంలో ప్రతి ఒక్కరూ రోజువారి పనుల్లో బిజీగా గడిపేస్తున్నాం. వేంకటేశ్వర స్వామి గురించి అందరికీ తెల్సు. ఇప్పుడున్న యంగ్‌ జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు. తిరుపతిలో కొండపై జరిగే పూజలు అందరికీ తెలియాలి. హాథీరాం బాబా జీవితం గురించి కొంతమందికే తెల్సు. ఈ సినిమా రిలీజ్‌ ప్రపంచమంతా తెలుస్తుంది. సినిమా రిలీజ్‌ తర్వాత ఎన్నో వేల మంది తిరుపతికి వెళ్తారు అనేది మా ఉద్దేశం. టైటిల్‌ పైన హాథీరాం బాబా అని ఎందుకు పెట్టలేదు అని నన్ను చాలామంది అడిగారు. కానీ 'ఓం నమో వేంకటేశాయ' అనేది సినిమాలో చిన్న బీజియంలా వస్తుంది. అది ఎన్నిసార్లు పలికితే అంత మంచి జరుగుతుంది. అందుకే 'ఓం నమో వేంకటేశాయ' అని టైటిల్‌ పెట్టాం.

రష్‌ చూసి మీరు ఎలా ఫీలయ్యారు?
- రీ-రికార్డింగ్‌ లేకుండా నేను సినిమా చూశాను. చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా చూస్తుంటే నా కళ్లవెంట నీళ్లు వచ్చాయి. ఇలాంటి అద్భుతమైన చిత్రానికి నేను నిర్మాతనైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను.

టెక్నికల్‌గా ఈ చిత్రం ఎలా వుంటుంది?
- 500 సంవత్సరాల క్రితం తిరుపతి ఎలా ఉండేదో అలా నేచురల్‌గా షూటింగ్‌ చేయడానికి టెక్నికల్‌గా చాలా జాగ్రత్యలు తీసుకున్నాం. ముఖ్యంగా గోపాల్‌రెడ్డిగారు చిక్‌ మంగళూరులోని స్మాల్‌ విలేజెస్‌లో లొకేషన్స్‌ ఫైనల్‌ చేశారు. ఆ గోవిందుడు మా యందు ఉండి షూటింగ్‌ అంతా చక్కగా జరిపించుకున్నాడు. వాటర్‌ ఫాల్స్‌, చిన్న చిన్న సీన్స్‌లో సి.జి. వర్క్‌ వుంటుంది తప్ప ఎక్కువగా గ్రాఫిక్స్‌ వుండవు. అంత నేచురల్‌గా సినిమా వుంటుంది.

నాగార్జునతో 'షిరిడిసాయి', ఇప్పుడు 'ఓం నమో వేంకటేశాయ' చేశారు?
- అవునండీ. 'మనం', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' వంటి బిగ్‌ కమర్షియల్‌ హిట్స్‌ సాధించి కూడా నాగార్జున ఈ సినిమా చేయడం మా అదృష్టం. ఆయన గొప్పతనం. భక్తి సినిమాలు చేయడం ఆయనకి చాలా ఈజీ. ఈ సినిమాని చాలా నిక్కచ్చిగా ఆహారపు అలవాట్లు అన్నీ పాటిస్తూ భక్తి శ్రద్ధలతో చేశాను. ఏ సినిమా ఒప్పుకోకుండా గెడ్డం పెంచి ఈ సినిమాకే వర్క్‌ చేశారు ఆయన.

రాఘవేంద్రరావుగారితో వర్క్‌ చేయడం ఎలా వుంది?
- గ్రేట్‌ డైరెక్టర్‌ రాఘవేంద్రరావుగారితో మా గురువు 'షిరిడిసాయి' సినిమా తీశాను. ఇప్పుడు మా కులదైవం వేంకటేశ్వర స్వామి సినిమా తీసే అవకాశం కల్పించిన రాఘవేంద్రరావుగారికి, నాగార్జునగారికి జీవితాంతం రుణపడి వుంటాను. వ్యాపార పరంగా కాకుండా సినిమాల విషయంలో ఒక భక్తుడిగా శాటిస్‌ఫై అవుతాను. జనరల్‌గా కమర్షియల్‌ సినిమాలకి తప్ప దేవుడి సినిమాలకి ఇంత ఎక్కువ ఎవరూ ఖర్చు పెట్టరు. కానీ క్వాలిటీ పరంగా, ఆర్టిస్ట్‌లు పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ సినిమా తీశాం.

ఈ సినిమా మీకు ఎలాంటి గుర్తింపు తెస్తుందని అనుకుంటున్నారు?
- మా ఎ.ఎం.ఆర్‌. గ్రూప్‌ సంస్థలో 4000 మంది వర్క్‌ చేస్తారు. అయినా పెద్దగా గుర్తింపు రాలేదు. 'షిరిడిసాయి' తర్వాత ఎక్కడికి వెళ్లినా గుర్తు పట్టి పలకరించారు. టీవిల్లో సినిమా బాగా ఆడింది. ఆ సినిమా వచ్చినప్పుడల్లా 50,60 ఫోన్‌ కాల్స్‌ ఇప్పటికీ వస్తాయి. 'ఓం నమో వేంకటేశాయ' తర్వాత కూడా ఎక్కువ రెస్పాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నాను.

వేంకటేశ్వర స్వామి క్యారెక్టర్‌లో సౌరభ్‌ జైన్‌ని ఎంపిక చేయడానికి రీజన్‌?
- చాలామందిని అనుకున్న తర్వాత గోపాల్‌రెడ్డిగారు సౌరభ్‌ జైన్‌ని తీసుకొచ్చాడు. అతను నేను కమర్షియల్‌ చేస్తున్నాను. నాకు మంచి నేమ్‌ వుంది. దేవుడిగా చెయ్యను అన్నారు. అప్పుడు నాగార్జునగారు మూడు కమర్షియల్‌ హిట్స్‌ తర్వాత నేను ఈ సినిమా చేస్తున్నాను. నీకు మంచి పేరు వస్తుంది. ఆ తర్వాత కమర్షియల్‌ సినిమాలు చేయొచ్చు అని చెప్పగానే ఇమ్మీడియెట్‌గా చేస్తాను అని ఒప్పుకున్నాడు సౌరభ్‌. వేంకటేశ్వర స్వామిగా చాలా యంగ్‌గా అందంగా నటించాడు.

ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుంది?
- నాగార్జున-రాఘవేంద్రరావు, కీరవాణిలది మ్యూజికల్‌ హిట్‌ కాంబినేషన్‌. వారి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు అన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అయ్యాయి. ఒక ప్రక్క 'బాహుబలి-2'కి వర్క్‌ చేస్తూ కూడా ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్‌ని కంపోజ్‌ చేశారు. రీ-రికార్డింగ్‌ మహాద్భుతంగా చేశారు. ఆడియో విన్నాక కీరవాణిగారికి లైఫ్‌లాంగ్‌ రుణపడి వుంటాను సార్‌ అని చెప్పాను. ఒక భక్తి భావంతో ఆయన పాటల్ని కంపోజ్‌ చేశారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved