pizza
Nagarjuna interview (Telugu) about Om Namo Venkatesaya
తొందర లేదు..నచ్చిన కథలతోనే సినిమాలు చేస్తాను - అక్కినేని నాగార్జున
You are at idlebrain.com > news today >
Follow Us

31 January 2017
Hyderabad

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్‌పై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగార్జునతో ఇంటర్వ్యూ....

ముందు వద్దన్నాను...
- డైరెక్టర్‌ రాఘవేంద్రరావుగారు, భారవిగారు కథ వినమన్నప్పుడు, అన్నమయ్య సినిమా కూడా వెంకటేశ్వరస్వామిపై తీసిందే కదా..మళ్ళీ అలాంటి కథే చేస్తే ఎలా ఉంటుందోనని అనుకుని ముందు వద్దులెండి..అన్నాను. అయితే వాళ్ళు ముందు కథ విని చెప్పండి అన్నారు. సరేనని కథ విన్నాను. అన్నమయ్యకు, ఈ సినిమాకు చాలా తేడా వుంది. అన్నమయ్య సినిమాలో దేవుడు, భగవంతుడు కలయిక చివరలో జరుగుతుంది. అయితే ఓం నమోవేంకటేశాయ చిత్రంలో భగవంతుడు, భక్తుడు స్నేహితుల్లా మెలుగుతారు. పురాణాల్లో దేవుడు, భక్తుడు కలిసి పాచిలాడుతారనే దానిపై మంచి సన్నివేశాలు రాసుకున్నారు.

పెద్దగా తెలియదు...
- అన్నమయ్య గురించి సాహిత్య ప్రేమికులకు, సంగీతాభిమానులకు తప్ప సామాన్య జనాలకు పెద్దగా తెలియదు. అందుకే మన దగ్గరున్న విషయాలను ఆధారంగా చేసుకుని సినిమాగా చేసి పాపులర్‌ చేశారు. అలాగే వెంకటేశ్వరస్వామిపై మరో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు హథీరాంబాబా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. గూగుల్‌లో కూడా ఆయన గురించిన వివరాలు ఒక పేజీ దొరకొచ్చు అంతే..మనకు ఉన్న విషయాలను ఆధారంగా చేసుకుని కొంత ఫిక్షన్‌ను కూడా కలిపి ఈ సినిమాను రూపొందించాం.

అలాంటి సెంటిమెంట్స్‌ను నమ్మం..
అనుష్కను తీసుకుంటే సినిమా హిట్‌ అయిపోతుంది..లేదంటే లేదు..అనే సెంటిమెంట్స్‌ను బేస్‌ చేసుకుని కృష్ణమ్మ క్యారెక్టర్‌కు అనుష్కను తీసుకోలేదు. మేమే కాదు, ఇండస్ట్రీలో ఎవరు సెంటిమెంట్స్‌ను బేస్‌ చేసుకుని సినిమాలు తీయరు. అనుష్క మంచి పాపులర్‌ నటి. కృష్ణమ్మ క్యారెక్టర్‌కు తనైతే చక్కగా సరిపోతుందనిపించి తీసుకున్నాం. శ్రీరామదాసు సినిమాలో శ్రీరామదాసును గురువులా నడిపించే ఓ క్యారెక్టర్‌ను కావాలనుకున్నప్పుడు నాన్నగారిని తీసుకున్నాం. అలాగే ఓం నమోవేంకటేశాయ చిత్రంలో హథీరాంబాబా తిరుపతి చేరుకున్న తర్వాత దేవుడిని ఎలా కలుసుకున్నాడు..ఏం చేశాడనే దానిపై అతన్ని గైడ్‌ చేసే క్యారెక్టర్‌ ఉండాలనుకున్నప్పుడు కృష్ణమ్మ క్యారెక్టర్‌ కోసం అనుష్కను తీసుకున్నాం. మీరాబాయి కృష్ణుడుకి అంకితమైపోయినట్లే, కృష్ణమ్మ కూడా వెంకటేశ్వరస్వామికి అంకితమైపోయి ఉంటుంది. హథీరాంబాబాకు ఓ స్థలమిచ్చి, తనకు తిరుమల చరిత్ర గురించి చెప్పే క్యారెక్టర్‌.

అంతర్లీనంగా మార్పు ఉంటుంది..
- ఇలాంటి భక్తిరస చిత్రంలో నటించినప్పుడు అంతర్లీనంగా ఎక్కడో మనకు తెలియని మార్పు అయితే ఉంటుంది. ఈ తరహ సినిమాలు చేసేటప్పుడు ఫిలాసిఫికల్‌ డైలాగ్స్‌ వింటుంటాం. ఆ డైలాగ్స్‌కు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ సినిమా పాటలు కూడా మామూలు సాంగ్స్‌ పోల్చితే డిఫరెంట్‌గా ఉంటాయి. మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఏదైనా చాలా కొత్తగా ఉంటుంది. నడక తీరు, మాట్లాడే తీరు సహా అందరిలో ఓ రకమైన మార్పును తీసుకొస్తాయి.

కీరవాణి మ్యూజిక్‌ గురించి..
- ఇలాంటి భక్తి రస చిత్రాలకు సంగీతం లేకుంటే చాలా కష్టం. సినిమాలోని సన్నివేశాలను మ్యూజిక్‌ బాగా ఎలివేట్‌ చేస్తుంది. కథ, రాఘవేంద్రరావుగారి దర్శకత్వం ఎంత ముఖ్యమైనవో, కీరవాణిగారి సంగీతం అలాంటి ప్రాముఖ్యతతోనే ఉంటుంది. కొన్ని చోట్ల డైలాగ్స్‌ ఉండవు. అలాంటి సన్నివేశాలను మ్యూజిక్‌తోనే మేనేజ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా.. అనే పాట బాగా ఇష్టం. క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేసే పాత్ర. హై పిచ్‌లో ఉంటుంది. వెంకటేశ్వరస్వామికి ఎన్ని పువ్వులిష్టం, ఆయనకు ప్రతిరోజూ ఎన్ని పువ్వులతో పూజ చేస్తారు అన్ని ఈ సాంగ్‌లో చూపిస్తాం.

నచ్చినవే చేస్తున్నాను..
- చాలా నెమ్మదిగా, రిలాక్స్‌డ్‌గా ఆలోచించి, నాకు నచ్చిన కథలతోనే సినిమాలు చేస్తున్నాను..చేస్తాను. ఎలాంటి 50 కోట్ల క్లబ్‌లోనో, వందకోట్ల క్లబ్‌లోనే చేరాలని సినిమాల చేయడం లేదు. డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌, నిర్మాతలు అందరూ లాభపడే సినిమాలు చేయాలని ఆలోచనతో సినిమా చేస్తున్నాను.

రాఘవేంద్రరావు గురించి...
- రాఘవేంద్రరావుగారితో నాకు మంచి వైబ్రేషన్‌ ఉంది. ఎలా నడవాలి, ఎక్కడ ఎలా చూడాలి ఇలా ఆయన సీన్‌ ఎలా చేయాలో కూడా చక్కగా వివరిస్తారు. ఆయనకు ఏదైనా సరిగా రాలేదని అనిపిస్తే, వచ్చి మానిటర్‌ చూడు అని చెప్పి, ఎక్కడైనా కరెక్షన్‌ ఉంటే చెబుతారు. ఆయనకు ఏం కావాలో అనే దానిపై చాలా క్లారిటీతో ఉంటారు. ఉదాహరణ చెప్పాలంటే ఓం నమో వేంకటేశాయలో షూటింగ్‌లో క్లైమాక్స్‌కు ముందు 20-30 షాట్స్‌ ముందుండే సీన్‌ను ఫస్ట్‌షాట్‌గా డైరెక్ట్‌ చేశారు.

Nagarjuna interview gallery

ఆయన సినిమాలు చేయకపోవచ్చు...
- రాఘవేంద్రరావుగారు సినిమాలు చేయకపోవచ్చు. ఎందుకంటే ఆయనలో ఆధ్యాత్మిక భావన ఎక్కువైపోయింది. ముఖ్యంగా టి.టి.డి సభ్యుడైన తర్వాత ఎక్కువ సమయం తిరుమలలోనే ఉంటున్నారు. చాలా వరకు అన్నమయ్య కీర్తనలు వెలుగులోకి రానివి ఉన్నాయి. వాటిని కొత్త సింగర్స్‌తో తిరిగి పాడిస్తున్నారు.

నిర్మాత వర్క్‌ చేసిన అనుభవం..
- మహేష్‌రెడ్డిగారు నిర్మాత కాదు. ఇంతకు ముందు నాతో శిరిడీసాయి సినిమా చేశారు. ఈ సినిమా చేస్తున్నామని తెలియగానే నేను సినిమాను నిర్మిస్తానని అన్నారు. ఎలాంటి కమర్షియల్‌ ఆలోచన లేకుండా ఈ సినిమాను నిర్మించారు.

అఖిల్‌ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ వివరాలు..
- అఖిల్‌ తదుపరి చిత్రం విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలోనే ఉంటుంది. ముందు ఒక స్క్రిప్ట్‌ తయారైంది కానీ ఆ స్క్రిప్ట్‌కు సంబంధించి డిస్కస్‌ చేస్తున్నప్పుడు నాకు, విక్రమ్‌కు చాలా డౌట్స్‌ వచ్చాయి. సరేనని విక్రమ్‌ ఇప్పుడు మరో స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు. ఈ స్క్రిప్ట్‌ వర్క్‌ ఎండింగ్‌లో ఉంది. నేను కానీ, అఖిల్‌ కానీ తొందరపడదలుచుకోలేదు. కొత్త జోనర్‌లో సినిమా ఉండేలా చూస్తున్నాం. యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ సినిమాను నిర్మిస్తాం. బాలీవుడ్‌లోని అఖిల్‌ వెళతాడా లేదా..అనేది అఖిల్‌ ఇష్టం.

పర్టికులర్‌ రీజన్‌ లేదు...
- 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగో సీజన్‌ నుండి తప్పుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. మూడు సీజన్స్‌లో చేయడం, ప్రేక్షులు మోనాటనీగా భావించకూడదు. అలాగని బోర్‌ కొట్టిందని చెప్పలేను. ఓ స్పేస్‌ను మెయిన్‌టెయిన్‌ చేయలేననిపించింది. ఇప్పుడు చిరంజీవిగారు చేస్తున్నారు. ఈ షో చేయాలని ఆయన్ను అడగ్గానే, ఆయన ముందు నాకే కాల్‌ చేసి ఇలా మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేస్తున్నానని చెప్పగానే, మీలాంటి స్ట్రేచర్‌ ఉన్న వ్యక్తి చేయడం చాలా హ్యాపీగా ఉందండి అని అన్నాను. చిరంజీవిగారు ఆడియెన్స్‌తో బాగా ఇంటరాక్ట్‌ అవుతారు. ఆయనకు మాస్‌ పల్స్‌ బాగా తెలుసు.

భవిష్యత్‌ ప్రణాళికలు..
- నిర్మాతగా చూస్తే మా అన్నపూర్ణ బ్యానర్‌లో నాగచైతన్య, కళ్యాణ్‌కృష్ణ కాంబినేషన్‌లో మూవీ యాబై శాతం పూర్తయ్యింది. మార్చి ఎండింగ్‌లో చిత్రీకరణ పూర్తవుతుంది. అలాగే అఖిల్‌, చైతు సినిమాను నిర్మించబోతున్నాను. ఇక యాక్టర్‌గా చూస్తే..'రాజుగారి గది2' లో నా పోర్షన్‌లో స్టార్ట్‌ కాబోతుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved