pizza
Nani interview (Telugu) about Awe
నిద్ర లేకపోయినా సినిమా ఇచ్చే కిక్‌ గ్రేట్‌! - నాని
You are at idlebrain.com > news today >
Follow Us

15 February 2018
Hyderabad

‘అష్టాచమ్మా’తో తెలుగు తెరకు పరిచయమైన హీరో నాని. హీరోగా వరుస హిట్లు అందుకుంటున్నారు. తాజాగా ‘అ!’తో ఆయన మరో బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. నిర్మాతగా మారారు. ఈ సినిమా గురించి, నిర్మాతగా తన అనుభవాలను గురించి గురువారం ప్రెస్‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

నాకు నా సినిమా చూసేటప్పుడు ఎలాంటి నెర్వస్‌ ఉందో.. సేమ్‌ ఫీలింగ్‌. రిలీజ్‌ అన్నది అలవాటు మాత్రం కాదు. ఎప్పటికప్పుడు కొత్తే, ఎప్పటికప్పుడు టెన్షనే.

* నిర్మాత కూడా మీరే అయ్యాక మరింత టెన్షన్‌ ఉంటుందేమో?
- అదే మరి.. నా సినిమా నేను ఓన్‌ చేసుకోనా ఏంటి? ప్రతి విషయంలోనూ మనమీద ఉన్న బాధ్యత, అందరితో క్రియేట్‌ చేసుకున్న కనెక్ట్‌... మొత్తం రిస్కే కదా. ఇక మరింత రిస్క్‌ ఏంటంటే.. ఇప్పుడేంటి? వీడికి ఇది అవసరమా? అని అనకుంటారు కదా.. అప్పుడేమో, ఆ యాంగిల్‌ కూడా వస్తుందేమో తప్పితే.. రిలీజ్‌ ముందు ఉండే టెన్షన్‌ మామూలే.

* సినిమా చేస్తున్నప్పుడు ఇది అవసరమా అని అనిపించిందా?
- అవసరం అనిపించబట్టే ఈ సినిమాను చేయడానికి అంగీకరించా. ఈ సినిమా పరిశ్రమకి తప్పకుండా అవసరమేనని అనిపించింది. ఇలాంటి సినిమాలు రావడం అవసరం అనిపించింది. ఇలాంటి సినిమాలను ఎవరైనా చేస్తారా? అని ఆలోచించాను. అయితే ఇలాంటి సినిమాలను ఎవరో ఎందుకు చేయాలి? ఎవరో ఒకళ్లు చేస్తానని ఎందుకు ఎదురుచూడడాలి? నేనే చేస్తే పోతుంది కదా అని అనుకున్నా.

* ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నప్పుడు నిర్మాతగా మారడం కష్టం అనిపించలేదా?
- చాలా కష్టమైంది. అన్ని ఫోన్లమీదే చేశాను. ‘అ’కి సంబంధించి నాలుగైదు గ్రూపులున్నాయి. వాటన్నిటిలోనూ ప్రతిసారీ అప్‌డేట్స్‌ చూస్తూనే ఉన్నా. దీనికి తోడు ఇప్పుడు ‘కృష్ణార్జునయుద్ధం’ గోవాలో షూటింగ్‌ జరుగుతోంది. అక్కడ షిప్‌లో ఎక్కడో షూటింగ్‌ చేస్తున్నాం. సిగ్నల్స్‌ అందవు. మరోవైపు ‘అ!’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అందువల్ల ఎక్కడో సిగ్నల్స్‌ అందితే వాటిని పట్టుకుని ఫోన్లు చేసి మాట్లాడుతున్నా. షూటింగ్‌ పూర్తి చేసుకుని మొన్న రాత్రి 12.30కి హైదరాబాద్‌కి చేరుకున్నా. అక్కడి నుంచి ల్యాబ్‌కెళ్లి కాపీ చూసుకుని ఇంటికెళ్లి పడుకున్నా. నిన్న ఉదయం నుంచి రెండు ప్రమోషనల్‌ షూట్స్‌ చేశా. ఆ తర్వాత మరలా రాత్రి షో వేశా. ఇదిగో ఇప్పుడు మళ్లీ బిజీగా ఉన్నా. నిద్ర లేకుండా పని చేస్తున్నప్పటికీ అది ఇస్తున్న కిక్‌ ఇంకో రేంజ్‌లో ఉంది.

* నిర్మాతల మీద గౌరవం పెరిగిందా?
- నాకు ఎప్పుడూ గౌరవం ఉంటూనే ఉందండీ. కాకపోతే నిర్మాతలు పడే ఇబ్బందులు, చేసే పనులు కొంతవరకు మనకు తెలుస్తాయి కానీ, అన్ని సందర్భాల్లోనూ అవి మనకు తెలియవు. ఈ సినిమాతో నాకు తెలిశాయి.

* సినిమా బిజినెస్‌ తెలుస్తోందన్నమాట?
- సినిమా తప్పకుండా ఆర్ట్‌ ఫార్మ్‌. బిజినెస్‌ కలిసిన ఆర్ట్‌ ఫార్మ్‌. మామూలుగా ఒక పెయింటర్‌ ఉన్నాడనుకుందాం. తనకు నచ్చిన విధంగా పెయింటింగ్‌ చేసి అమ్మకానికి ఉంచుతాడు. అది నచ్చినవాళ్లు కొనుగోలు చేస్తారు. కానీ సినిమా పరంగా వచ్చేసరికి సినిమా తీసేటప్పుడే.. ఇది నచ్చుతుందా? నచ్చాలంటే ఏం చేయాలి? అని ముందే ఒకసారి అనుకుంటారు. దాని వల్ల సినిమా మరింత ఎక్కువగా బిజినెస్‌ యాంగిల్‌ వచ్చేసింది. మనకి సినిమా ఏమయిందంటే.. ఈ డైరక్టర్‌, ఈ హీరో కలిస్తే ఎక్కువకి కొంటారు.. అని ఫిక్సవుతున్నాం. దీనికి నేను ఎవర్నీ కారణంగానూ చూపను. కాకపోతే ఇలాంటి సినిమా తీశాక నాకు పేరు ఉంది కాబట్టి డిసి్ట్రబ్యూటర్లు నా మీద నమ్మకంతో వస్తారు .ఆ రిస్క్‌ని నేను తప్పించుకుని, నేను రిస్క్‌ని నేనే ఫేస్‌ చేయాలి. అప్పుడే నిజాయతీగా కొత్త చిత్రాలు చేయగలం. అలా కాకుండా ఎప్పుడైతే ప్రెజర్‌కి లొంగామో.. వాళ్లకోసమని, వీళ్లకోసమని.. సినిమాలు తీయసాగామో.. అప్పుడే మనకున్న ఆ నిజాయతీ పోసాగుతుంది. ఒక ప్లేట్‌లో పాస్తాను, పప్పన్నాన్ని, బిర్యానీని, మజ్జిగని కలుపుకుని తింటే.. కడుపులో ఏదో అవుతుంది కదా.. సినిమా కూడడా అలాగే తయారవుతుంది.

* ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చుకుంటారా?
- తప్పకుండా మెచ్చుకుంటారు. అయితే రిలీజ్‌ రోజా? ఏడాది తర్వాతా? ఇంకెప్పుడైనానా అనేది నాకు తెలియదు. కానీ తప్పకుండా మెచ్చుకుంటారు.

* ఎటో వెళ్లిపోయింది మనసు తరహా చిత్రమవుతుందా?
- లేదండీ. అది మనకు తెలిసిన ఎమోషన్‌. సేలబుల్‌ పాయింట్‌. కానీ ఈ సినిమా వేరు. ఇన్‌స్పయిర్డ్‌ బై ట్రూ ఈవెంట్స్‌. ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది.

* ఈ దర్శకుడు కొత్త. అతని మీద మీకు ఎలా నమ్మకం కలిగింది?
- హైదరాబాద్‌లో మణికొండలో కూర్చుని ఇలాంటి కథ రాయగలిగాడంటేనే అతను అందరిలాంటి వాడని మనకు తెలుస్తుందండీ. అతని ఆలోచనా విధానంలోనే అతను ఎంత డిఫరెంటో నాకు తెలిసింది. తనకు సరైన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఇచ్చా. అతను కథ చెప్పినప్పుడు ఇచ్చిన ఇమేజ్‌కన్నా నాకు బాగా నచ్చింది.

interview gallery



* రెజనీ, కాజల్‌.. వీళ్లందరూ మీకోసం చేశారా?
- ప్రాపర్‌గా కథను నమ్మి చేశారు. వాళ్లు కోట్‌ చేసిన రెమ్యూనిరేషన్లను ఇచ్చేశాం. ఫేవర్లు లాంటివి లేవు. నేను నిర్మాతగానే ఉన్నా. వాళ్లు నటీనటులుగానే ఉన్నారు. ఎవరి లెక్కలు వాళ్లకు సరిపోయాయి.

* నటుడిగా మీ బ్యాన‌ర్‌లోనే కంటిన్యూ అవుతారా?
- లేదండీ. అలాంటిదేమీ లేదు. ఎందుకంటే నేను ఇంత‌టివాటిని అయ్యానంటే అందుకు కార‌ణం నిర్మాత‌లు. న‌న్ను న‌మ్మి నా కెరీర్ ప్రారంభం నుంచి ఎంతో మంది నిర్మాత‌లు సినిమాలు చేశారు. వాళ్లంద‌రికీ నేను అందుబాటులో ఉంటాను. మ‌రీ కొత్త‌గా అనిపించిన‌ప్పుడు మాత్ర‌మే నా ప్రొడ‌క్ష‌న్‌లో నేను సినిమాలు చేస్తాను.

* ఎందుకని అలా ఫిక్స‌య్యారు?
- 10-20 ఏళ్ల త‌ర్వాత న్యూ ఏజ్ సినిమా గురించి ఎవ‌రైనా మాట్లాడుకున్న‌ప్పుడు నా సినిమాల గురించి ప్రస్తావ‌నకు తెచ్చి, నా వాల్ పోస్ట‌ర్ సినిమా గురించి మాట్లాడితే అంత‌క‌న్నా ఆనందం నాకు ఇంకేమీ ఉండ‌దండీ.

* ఇప్పుడు నిర్మాత‌గా కూడా మారారు. క్యూబ్ ల గురించి గొడ‌వ జ‌రుగుతోందిగా?
- అంత‌వ‌ర‌కు ఇంకా రాలేదండీ. త్వ‌ర‌లోనే తెలుస్తుంది. క్యూబ్‌ల వ‌ల్ల నిజంగా న‌ష్ట‌పోతున్నాడంటే నాకు ఒక ర‌కంగా ఇబ్బంది. క్యూబ్‌ల‌కు వ్య‌తిరేకంగా నిర్మాత‌లు అంద‌రూ క‌లిసి స్ట్రైక్ చేసినా నాకు మ‌రోలా ఇబ్బంది క‌లుగుతుంది. ఎందుకంటే అప్ప‌టికి నా సినిమా థియేట‌ర్ల‌లో ఉంటుంది కాబ‌ట్టి.

* ఈ జ‌ర్నీలో మీకు రియ‌ల్ ఫ్రెండ్స్ ఎవ‌రనే విష‌యం తెలిసిందా?
- నేను చాలా బిజీగా ఉన్నానండీ. అవ‌న్నీ ప‌ట్టించుకునే తీరిక లేదు. అయినా మ‌న‌వాళ్లు ఎవ‌రో, కానిది ఎవ‌రో ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుందండీ.

* పిల్మ్ ఫెస్టివ‌ల్స్ కి పంప‌పుతున్నారా?
- ఆ ప్ర‌య‌త్నాల‌న్నీ జ‌రుగుతూనే ఉన్నాయండీ. త‌మిళంలో ఈ మ‌ధ్య `అరువి` అనే సినిమాను పంపించారు. అలాగే `అ!` కూడా త‌ప్ప‌కుండా వెళ్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved