pizza
Nani interview (Telugu) about MCA
ఆడియెన్సే నాకు పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌ - నాని
You are at idlebrain.com > news today >
Follow Us

19 December 2017
Hyderabad

నాని, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'ఎంసీఏ'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీరామ్‌ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్‌ 21న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో నాని ఇంటర్వ్యూ...

కథల ఎంపికలో మార్పేం లేదు...
- నేను ప్రారంభం నుండి.. ఎప్పుడు కథలను ఎంపిక చేసుకున్నా, నాకున్న చాయిస్‌ల్లో ఏది బెస్ట్‌ అనిపిస్తే దాన్ని సెలక్ట్‌ చేసుకుంటూ వస్తున్నాను. అలాగని నేను చేస్తున్న సినిమాలన్నీ బెస్ట్‌ అవుతున్నాయని చెప్పడం లేదు. కానీ..ఆ మూమెంట్‌లో నాకు ఏది బెస్ట్‌ అనిపిస్తుందో..ఏ కథను విని ఎంజాయ్‌ చేస్తానో అలాంటి కథలనే సెలక్ట్‌ చేసుకుంటున్నాను.

టెన్షన్‌గానే ఉంది...
- నా తొలి సినిమా సమయంలో ఎంత టెన్షన్‌ పడ్డానో ఇప్పుడు కూడా అంతే టెన్షన్‌ పడుతున్నాను.

'ఎంసీఏ' గురించి...
- మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి సినిమాలో హీరో క్యారెక్టర్‌ మన పక్కింటి కుర్రాడిలాంటి క్యారెక్టర్‌ అనిపిస్తుంది. సాధారణంగా మన సినిమాలో హీరోల క్యారెక్టర్‌ లార్జర్‌ దేన్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌గా అనిపిస్తాయి. కానీ 'ఎంసీఏ' సినిమా దీనికి భిన్నంగా ఉంటుంది. మధ్య తరగతి మెంటాలిటీ ఉన్న కుర్రాడు అన్నయ్యపై అలగడం, వదినను అపార్థం చేసుకోవడం ఇలా మనం రెగ్యులర్‌గా చూసే ఎమోషన్స్‌ ఇందులో కనపడతాయి. సిచ్యువేషన్‌ వస్తే, ఆ మిడిల్‌క్లాస్‌ అబ్బాయే ఎలా హీరోగా మారాడనేదే ఈ సినిమా.

నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవచ్చు...
- ఆడియెన్సే నాకు పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌. ఎంసీఏ ట్రైలర్‌ చూసినవాళ్లు ఇది రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలా ఉందనే అన్నారు. కానీ ఈరోజు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తే, ఆడియెన్స్‌ సినిమా గురించి, ఎంత ఎగ్జయిటెడ్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఓ రకంగా మనకు బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడం చాలా ప్లస్‌. ఎటువంటి ప్రెషర్‌ ఉండదు. నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోవచ్చు.

ఆడియెన్స్‌కు నచ్చేలా...
- సాయిపల్లవి అద్భుతంగా నటించింది. తను, నేను కలిసి నటించిన సీన్స్‌ ఈ సినిమా చూసిన ఆడియెన్స్‌కు ఫేవరేట్‌ సీన్స్‌ అవుతాయనడంలో సందేహం లేదు. అలాగే భూమికగారి పాత్ర, నా పాత్ర రియాలిటీకి దగ్గరగా ఉండటం వల్ల ఆడియెన్స్‌కు ఎంతగానో నచ్చుతాయి.

ఆ గాసిప్‌ నన్నెంతో బాధించింది..
- గాసిప్స్‌ రెగ్యులర్‌గా వస్తుంటాయి. కానీ 'ఎంసీఏ' షూటింగ్‌ సమయంలో..నేను, సాయిపల్లవి గొడవ పడ్డామనే గాసిప్‌ చాలా పాపులర్‌ అయ్యింది. ఓ గాసిప్‌ ఇంతలా పాపులర్‌ అవుతుందని అనుకోలేదు. అలాగే ఈరోజు అంత పాపులర్‌ కానీ వెబైస్‌ట్‌లో.. ఓ గాసిప్‌ చూశాను. ఆ లింక్‌ను నా ఫ్రెండ్‌ ఒకడు పంపితే చదివాను. చదవగానే చాలా బాధపడ్డాను. ఎంత దిగజారిపోయారో అనిపించింది. నేను సినిమా బాగా చేయలేదనో, రెమ్యునరేషన్‌ పెంచేశాడనో, నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడనో ఆర్టికల్‌ రాయవచ్చు. కానీ అలా కాకుండా వ్యక్తిగత జీవితంలోకి వెళ్లిపోయి ఆర్టికల్‌ రాసేశారు. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. వరుస సినిమాలు చేస్తున్నాను. నేనెంటో అందరికీ తెలుసు. అలాంటి ఆర్టికల్‌ నాపై రాయడం నన్నెంతో బాధించింది. గాసిప్‌ రాయవచ్చు కానీ, ఏది రాయడానికైనా ఓ లైన్‌ ఉంటుంది. ఆ లైన్‌ను ఎవరూ దాటకూడదు. ఎందుకంటే మనమందరూ సినిమాపైనే బ్రతుకుతున్నాం.

కొత్త కథేం కాదు..
- 'ఎంసీఏ' కథేం కొత్తది కాదు. ఇది కమర్షియల్‌ సినిమా. ప్రతి సినిమాకు ఆడియెన్స్‌ ఉంటారు. మెజారిటీ ఆడియెన్స్‌కు నచ్చే కాన్సెప్ట్‌. దీన్ని ఆడియెన్స్‌కు నచ్చేలా చెప్పామా? లేదా? అనేదే మెయిన్‌ పాయింట్‌.

దర్శకుడి గురించి..
- దర్శకుడు వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో గ్యాప్‌ వచ్చింది. అయినా తను కథను చెప్పిన విధానం, కథ నాకు నచ్చింది. అందుకే తనతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాను.

interview gallery

నిర్మాతగా చేయాలనే ఆలోచనే లేకున్నా..
- ఇప్పటి వరకు 'అ!' సినిమాలాంటి కథ ఇండియన్‌ స్క్రీన్‌పై రాలేదు. ఇది వినేవారికి కాస్త ఎక్కువగా చెబుతున్నట్లు ఉండొచ్చు కానీ, రేపు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఐడియా, సెటప్‌ కొత్తగా ఉంటుంది. అలాంటి ఓ సినిమాకు సరైన నిర్మాత, నటీనటులు లేకుంటే ఆడియెన్స్‌కు రీచ్‌ కాదు. ఇలాంటి సినిమాకు మంచి ఆర్టిస్టులతో పాటు ప్రొడక్షన్‌ వైపు నుండి కూడా మంచి ఫ్లాట్‌ ఫామ్‌ కావాలనిపించింది. అందుకే ప్రశాంత్‌ కథ చెప్పగానే నేను ప్రొడ్యూస్‌ చేయడానికి రెడీ అయిపోయాను. ఒక కొత్త ఐడియా విన్నప్పుడు..ఆలోచన బావుంది..కానీ ఇతనికి ప్రొడ్యూసర్‌ దొరకడు అని అనుకుంటే అలాంటి సినిమాను నేనే ప్రొడ్యూస్‌ చేస్తాను.

మల్టీస్టారర్‌..ఫైనల్‌ నెరేషన్‌...
- నాగార్జునగారితో చేయబోయే మల్టీస్టారర్‌ గురించి ఇప్పుడే చెప్పడం భావ్యం కాదు. అయితే కథ విన్నాం. నాకు, నాగార్జునగారికి కథ బాగా నచ్చింది. ఫైనల్‌ నెరేషన్‌ వినాల్సి ఉంది. అంతా ఒకే అయితే అధికారిక సమాచారం వెలువడుతుంది.

- కృష్ణార్జున యుద్ధం సినిమా షూటింగ్‌ దశలో ఉంది. కొత్తగా, కమర్షియల్‌గా ఉంటుంది. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాను.

నాన్న రోల్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాను...
- నాన్న రోల్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాను. ఇది వరకు ఇంటి నుండి బయటకు రాగానే అన్నీ పనులు చూసుకుని ఎప్పుడో కానీ ఇంటికి వెళ్లేవాడిని. కానీ ఇప్పుడలా కాదు, ప్రతి రెండు నిమిషాలకు నా కొడుకే గుర్తుకొస్తున్నాడు. ఒకప్పటితో పోల్చితే నేను చాలా మారిపోయాను.

అవసరాలతో సినిమా చేస్తా..కానీ...
- అవసరాలశ్రీనివాస్‌తో ఇప్పుడు సాయి కొర్రపాటిగారి బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. తనతో నేను కూడా సినిమా చేయాలనుకుంటున్నాను. అయితే ఎప్పుడు చేస్తానో ఇప్పుడే చెప్పలేను. అలాగే హను రాఘవపూడి కూడా మరో సినిమా చేస్తున్నాడు. అది పూర్తి కాగానే నేను, హను కలిసి సినిమా చేస్తాం.

మణిరత్నం సినిమా అందుకే వదులుకున్నా...
- మణిరత్నంగారి సినిమా కోసం ముందు నన్ను అడిగారు. కానీ అందులో చాలా మంది ఆర్టిస్టులు ఉండటంతో డేట్స్‌ ప్రాబ్లమ్‌ వచ్చింది. దాని వల్ల ఆ సినిమాను వదులుకున్నాను. అయితే ఎప్పటికైనా మణిరత్నంగారితో పనిచేయాలనేది నా కల.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved