`అవును`, `సీమటపాకాయ్` చిత్రాల ఫేమ్ హీరోయిన్ పూర్ణ నటించిన తాజా చిత్రం `జయమ్ము నిశ్చయమ్మురా` . శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాయిక పూర్ణ హైదరాబాద్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..
* జయమ్ము నిశ్చయమ్మురా గురించి చెప్పండి?
- ఈ సినిమా నాకు చాలా డిఫరెంట్ చిత్రం. దాదాపు ఒకటిన్నర నుంచి ఈ సినిమాతో ట్రావెల్ చేస్తున్నాను. నేను యాక్షన్ ఫిలిమ్స్ చాలా చేశాను. వాటన్నిటికీ భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. దర్శకుడు శివాజీగారు ఈ సినిమాను చాలా వైవిధ్యంగా తెరకెక్కించారు.
*దర్శకుడు శివరాజ్ కనుమూరి గురించి చెప్పండి?
- ఆయన మా ఫ్యామిలీ మెంబర్‌లాగా అయిపోయారు. నేనిప్పుడు ఆయన్ని అన్న అని పిలుస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అయితే ఆ పూర్తి క్రెడిట్ శివరాజ్ గారికి దక్కుతుంది. పాప పుట్టినప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అలా ఈ సినిమాలోని ప్రతి విషయాన్ని ఆయన చాలా కేర్ తీసుకుని చేశారు. తనే ఈ సినిమాను కూడా నిర్మించారు. నేను ఇంతకు ముందు ఎక్స్ పీరియన్స్డ్ డైరక్టర్లతో చేశాను. కొత్తవారితో చేశాను. కానీ శివాజీతో పనిచేయడం నాకు లెజెండ్‌తో చేసినట్టు అనిపించింది.
* మీ పాత్ర గురించి చెప్పండి?
- ఇందులో రాణి అనే పాత్రను చేశాను. అది నాకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. నేను చాలా టాకిటివ్. ఎప్పుడూ మాట్లడుతూనే ఉంటాను. కానీ రాణి అనే కేరక్టర్ అలా కాదు. ఫక్తు పల్లెటూరి అమ్మాయి. పువ్వులను అమితంగా ఇష్టపడుతుంది. నర్సరీ పెంచుతుంది.
ఎప్పుడైనా సెట్లో నేను రాణిలాగా కాకుండా పూర్ణలాగా కనిపిస్తే వెంటనే మా దర్శకుడు నన్ను కంట్రోల్ చేసేవారు. రాణిలాగానే కనిపించమని సూచించేవారు. నాకు పూర్ణ స్క్రీన్ మీద కనిపించకూడదని చెప్పేవారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. కొన్నిసార్లు సెట్లో మూడు కెమెరాలు కూడా ఉండేవంటే ఎంత గ్రాండ్‌గా సినిమా తీశారో అర్థం చేసుకోవచ్చు.
* గోదావరి లొకేషన్లు ఎలా అనిపించాయి?
- నేను కేరళ అమ్మాయిని. ప్రపంచంలో ఉన్న పచ్చదనమంతా మా దగ్గరే ఉంటుందనే గర్వం నాకు చాలా ఉండేది. కానీ ఈ సినిమా కోసం నేను గోదావరి పరిసరాల్లో ట్రావెల్ చేశాను. ఇంత అందమైన ప్రదేశాలు ఇక్కడ ఉంటాయా? అని ఆశ్చర్యపోయాను. అంత గొప్పగా ఉన్నాయి. వంటలు కూడా చాలా రుచికరంగా అనిపించాయి.
Poorna interview gallery
* శ్రీనివాసరెడ్డిని గురించి చెప్పండి?
- శ్రీనివాసరెడ్డిగారితో ఇంతకు ముందే చేయాల్సింది. రెండు సినిమాలు మిస్ అయ్యాయి. అయితే ఈ సినిమాను కూడా చేయొద్దని చాలా మంది చెప్పారు. కానీ నాకు కథ బాగా నచ్చింది. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా చేశాను. ఆయనతో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. నేనిప్పటి వరకు చాలా మంది హీరోలతో పనిచేశాను. అయితే శ్రీనివాస్‌గారు చాలా సెట్లో చాలా హెల్ప్ చేశారు. డైలాగులు, డిక్షన్ నుంచి చాలా చెప్పారు.
* మీరు చాలా మాటకారి కదా. ఇందులోనేమో నెమ్మదస్తురాలిగా కనిపించాలి. రెండింటినీ ఎలా బ్యాలన్స్ చేశారు?
- కాస్త శ్రమపడ్డమాట వాస్తవమే. ఇక్కడో విషయం చెప్పాలి. `నువ్వలా నేనిలా` అనే సినిమా చేసినప్పుడు `పూర్ణ ఓవర్ యాక్టింగ్ చేసింది` అని రివ్యూలు రాశారు. కానీ అందులో నా తప్పేంటో నాకు అర్థం కాలేదు. నేను ఒరిజినల్‌గా నాలాగే ఉంటాను. కానీ ఆయా పాత్రలకు తగ్గట్టు మలచుకోవాల్సింది దర్శకులే. దర్శకులు ఎలా చెప్తే నేను అలా చేస్తాను. `అవును` టైమ్ లో రవిబాబు సార్‌కి నేను ఎలా చేస్తే బావుంటుందో తెలుసు కాబట్టి అలాగే చేయించుకున్నారు. అలాగే ఈ సినిమాలో శివాజీగారు అలా చేయించుకున్నారు. ఈ సినిమాలో నేను నర్సరీ అంటే ఇష్టం ఉన్న అమ్మాయిగా నటించాను. మా ఇంట్లో నాకు గార్డెన్ ఉంది. మా అమ్మ మా ఇంటి చుట్టూ పంటలు పండిస్తుంది. మా ఇంట్లో పండిన కూరగాయలనే మేం తింటాం.
* మీకు సినిమా ఇష్టమా? డ్యాన్స్ అంటే ఇష్టమా?
- రెండూ నాకు కీలకం. సినిమాల్లో డ్యాన్స్ చేసే అవకాశం వస్తే చాలా ఆనందంగా చూస్తాను. కానీ అది ఐటమ్ సాంగ్ కాకూడదు. `శ్రీమంతుడు` తర్వాత ఐటమ్ సాంగ్స్ చేయమని చాలా అవకాశాలు వచ్చాయి. అయితే నేను అంగీకరించలేదు. నాకు పర్సనల్‌గా వెస్టర్న్ వేర్ అంటే ఇష్టమే. కానీ తెరమీద చీరల్లోనూ, లంగాఓణీల్లోనూ, సల్వార్ కమీజ్‌ల్లోనూ బావుంటాను. అలాంటప్పుడు వెస్టర్న్ కాస్ట్యూమ్స్ వేసుకోవడం ఎందుకు? అందుకే చేయలేదు. ఐటమ్ సాంగ్స్ చేయడం తప్పు అని నేననడంలేదు. కానీ నాకు ఇష్టం ఉండదు. నేను స్పెషల్ సాంగ్ చేస్తే అది సినిమాలో స్పెషల్‌గా ఉండాలి అప్పుడే చేస్తాను.
* తెలుగులో ఇంకేం చేస్తున్నారు?
- మూడు జనరేషన్లకు సంబంధించిన కథతో ఓ సినిమా చేస్తున్నా. అందులో మూడు గెటప్పుల్లో కనిపిస్తా. అందులో ఒకటి ముసలి పాత్ర. ఇంకోటి తల్లి . మూడోది మోడ్రన్ యువతి పాత్ర. ఇలా మూడు పాత్రల్లో చేస్తున్నా.