pizza
దేవుడు నన్ను ఇక్కడే ఉండమన్నాడు -లారెన్స్
You are at idlebrain.com > news today >
Follow Us

08 May 2015
Hyderabad

నృత్య దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా తనదైన ప్రతిభను చూపిస్తున్నారు రాఘవ లారెన్స్. ముని సీక్వెల్స్ లో భాగంగా ఆయన తెరకెక్కించిన సినిమా గంగ... కాంచన2. ఈ సినిమా గురించి లారెన్స్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు...

గంగ సినిమాకు స్ఫూర్తి ఉందా?
- ఈ సినిమాకు స్ఫూర్తి లేదు. కానీ ముని సినిమాకు స్ఫూర్తి ఉంది. ఆ కథకు స్ఫూర్తి మా అమ్మ చెప్పిన కథలే. నిద్రపోయే సమయంలో మా అమ్మ చెప్పిన పలు కథల స్ఫూర్తితోనే ఆ సినిమాను చేశాను. ఇంట్లో ఒకరు దెయ్యం కథ చెబితే మిగిలినవారు కూడా వారికి తెలిసిన దెయ్యం కథలను చెబుతుంటారు కదా. అలా నాకు తెలిసిన కథలన్నీ కలిపి ముని తీశాను. ఆ సినిమాలో బాత్రూమ్ కి అమ్మని నిద్రలేపి తీసుకెళ్లే సీను నా నిజజీవితంలోనిదే. ఆ సినిమా హిట్ కావడంతో వచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా సీక్వెల్స్ తీస్తున్నాను.

ఇందులో క్లైమాక్స్ పెద్దగా మెప్పించలేకపోయిందని అంటున్నారే?
- ఎవరు చెప్పారు? క్లైమాక్స్ ని తమిళనాడులో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏకంగా డైలాగులే చెప్పేస్తున్నారు. హీమేన్, సూపర్ మేన్ అనేవి చూసి చూసి ఉన్న పిల్లలకు ఈ కథ బాగా నచ్చుతోంది. ఎగ్జయిటింగ్ ఫీలవుతున్నారు.

కథను రాసుకున్నప్పుడే నిత్యామీనన్ ని అనుకున్నారా?
- అవునండీ. ఆ అమ్మాయిని ఇప్పటిదాకా మనం లవర్ గర్ల్ గానే చూశాం. ఇలాంటి డిఫరెంట్ పాత్రలో తను చాలా బాగా ఉంటుందనిపించింది. కథ వినగానే ఒప్పుకుంది. నువ్వేం చెప్తావో అదే చేస్తానని ముందే చెప్పింది. కాకపోతే బ్లాక్, బ్రౌన్ షేడ్స్ వేసేటప్పుడు కాసింత ఇబ్బంది పడింది. కానీ స్క్రీన్ మీద చూసుకున్నాక తను హ్యాపీ.

మీరు బాగా టార్చర్ పెట్టారని వార్తలొచ్చాయి?
- పక్కాగా నడవడం చూపించి, పది సార్లు నడిపించడాన్నే టార్చర్ అంటే నేనేమీ చేయలేను.

మీ తదుపరి సినిమా నాగార్జునగారితోనని అంటున్నారే?
- కాంచన కథను ముందు ఆయనకే చెప్పాను. కథ విని బావుందన్నారు. కాకపోతే ఆ చీరకట్టు ఎలా ఉంటుందోనని ఆలోచించారు. సినిమా చూశాక ఆ పాత్రకి నేనే కరెక్ట్ అని చెప్పారు. డ్యాన్స్ చేయడం తెలుసు కాబట్టి ఆ పాత్రకు నాకన్నా నువ్వే న్యాయం చేయగలిగావనీ అన్నారు.

మీ అమ్మకు గుడి కడుతున్నారట కదా?
- అవును. మా అమ్మకి గుడి కడుతున్నాను. మదర్స్ డే లోపు గుడిని పూర్తి చేయాలనుకుంటున్నా. ముందు అమ్మవారు, మధ్యలో మా అమ్మ, ఆ తర్వాత పరాశక్తి పెద్ద గుడి ఉంటుంది. అంబత్తూరులో నేను కట్టించిన రాఘవేంద్ర స్వామి గుడికి ఎదురుగా ఈ గుడి కడుతున్నా.

తర్వాత సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ లు సిద్ధం చేస్తున్నారా?
- తర్వాత సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేయలేదు. ఓ లైన్ రాసుకున్నా. పవన్ కల్యాణ్ గారికోసం ఆ లైన్ రాసుకున్నా. పూర్తయిన తర్వాత వెళ్లి చెప్తా. అందులో మంచి మెసేజ్ ఉంటుంది.

డ్యాన్స్ డైరక్షన్ ను ఇంకా చేస్తున్నారా?
- డ్యాన్స్ డైరక్షన్ కూడా తప్పకుండా చేస్తాను. అఖిల్ కి డ్యాన్స్ చేయమన్నా కూడా తప్పకుండా చేస్తాను.

ఉచితంగా డ్యాన్సు నేర్పిస్తామని ఆ మధ్య చెప్పినట్టున్నారు?
- చెన్నైలో 60 మందిని చదివిస్తున్నా. ఇక్కడ కూడా త్వరలో ఆ ట్రస్టు తరఫున కార్యకలాపాలను చేపడతాం. అలాగే డ్యాన్సులు కూడా నేర్పిస్తాం.

పటాస్ తమిళ్ లో మీరే చేస్తున్నారట కదా?
- పటాస్ లో తమిళ్లో నేనే హీరో. డైరక్టర్ ని సెలక్ట్ చేస్తున్నాం. నేను డైరక్ట్ చేయను.

ప్రభుదేవాగారు బాలీవుడ్ కి వెళ్లారు. మీకు వెళ్లే ఉద్దేశం లేదా?
- ప్రభుదేవాని దేవుడు అక్కడికి తీసుకెళ్లాడు. నన్ను ఇక్కడే ఉండమని చెప్పాడు. నేనిక్కడే ఉన్నాను. కాంచనను హిందీలో చేయాలని ఉంది. కానీ ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దని, తెలుగు, తమిళంలో కలిపి సినిమాలు చేయమని, ప్రస్తుతం మార్కెట్ బావుందని చాలా మంది చెబుతున్నారు. ప్రస్తుతం ఆ దశగా వెళ్తున్నాను.

రజనీకాంత్ ఆఫర్ ఇచ్చారట కదా?
- అవునండీ. మంచి కథ ఉంటే సిద్ధం చేసుకో. ఫ్యూచర్ లో మంచి ప్రాజెక్ట్ చేద్దాం అని అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved