pizza
Raj Kandukuri about Pelli Choopulu
అది నెరవేర్చినందుకు ఆనందంగా ఉంది - రాజ్ కందుకూరి
You are at idlebrain.com > news today >
Follow Us

25 July 2016
Hyderaba
d

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రీతూవ‌ర్మ జంట‌గా న‌టించిన చిత్రం `పెళ్లిచూపులు`. త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డి.సురేశ్‌బాబు స‌మర్పిస్తున్నారు. రాజ్ కందుకూరి నిర్మాత‌. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్ లో రాజ్ కందుకూరి విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

రాజ్ కందుకూరి మాట్లాడుతూ ``దాదాపు ఎనిమిది నెల‌ల క్రితం త‌రుణ్ భాస్క‌ర్ అనే వ్య‌క్తి న‌న్ను క‌లిసి ఈ క‌థ‌ను చెప్పారు. ఆయ‌న అంత‌కు ముందు అర‌గంట, గంట వ్య‌వ‌ధిలోపున్న ల‌ఘు చిత్రాల‌ను తీశారు. అత‌ని గురించి సురేశ్‌బాబు కూడా ఫోన్ చేసి చెప్పారు. త‌న‌కు స్క్రిప్ట్ బావుంద‌ని అన్నారు. నాకు రెండు గంట‌ల సేపు క‌థ చెప్పారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కూడా ఈ క‌థ న‌చ్చింది. వెంట‌నే మొద‌లుపెట్టాం. ఈ చిత్రానికి క‌థే హీరో. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ చాలా బావుంటుంది. స‌ర్‌ప్ర‌యిజ్ ఎలిమెంట్ ఉంటుంది. ఇద్ద‌రి కెరీర్ల మీద సాగే క‌థ ఇది. పెళ్లిచూపుల‌కు వెళ్లిన అమ్మాయి, అబ్బాయి ఒక గ‌దిలో స్ట్ర‌క్ అయిపోతారు. వారిద్ద‌రూ అక్క‌డ ఏం మాట్లాడుకుంటారు? ఆ త‌ర్వాత ఏమైంది అనేది చిత్రంలో కీల‌కం.

యువ‌త‌లో ఉన్న నిగూఢ‌మైన ప్ర‌తిభ‌ను వెలికితీసి, దాన్ని ప్రోత్స‌హించే విధంగా సాగుతుంది చిత్రం.సినిమా బాగా ఆడుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమాకు మ‌ధ్య‌లో మా ఫ్రెండ్ య‌ష్ రంగినేని జాయిన్ అయ్యారు. నాకు `ఆక‌లి రాజ్యం`, `సాగ‌ర సంగ‌మం`, `రుద్ర‌వీణ‌` వంటి మంచి చిత్రాలు తీయాల‌న్న‌ది ఆకాంక్ష‌. నాకు అమెరికాలో గ్రానైట్ బిజినెస్ ఉంది. కానీ మంచి సినిమాలు తీయాల‌న్న ఆశ‌తో ఈ రంగంలో అడుగుపెట్టాను. ఈ సినిమాను మొద‌లుపెట్టిన‌ప్పుడు కూడా చాలా మంది న‌న్ను డిస్క‌రేజ్ చేశారు. కానీ నేను కంటెంట్ మీదున్న న‌మ్మ‌కంతో ముంద‌డుగు వేశాను. కానీ కొన్ని రాత్రులు నిద్ర‌ప‌ట్టేది కాదు. అయినా నాకున్న న‌మ్మ‌కం న‌న్ను ముందుకు న‌డిపించింది. ఈ సినిమా మీదున్న న‌మ్మ‌కంతోనే సురేశ్‌బాబుగారు కూడా మ‌మ్మ‌ల్ని ప్రోత్స‌హిస్తున్నారు. ఈ సినిమాపై త‌న‌కు ఆస‌క్తి ఉంద‌ని ఆస్ట్రేలియా నుంచి దిల్‌రాజుగారు కూడా ఫోన్ చేశారు`` అని అన్నారు. త‌న గురించి మాట్లాడుతూ ``నేను గోల శీను అని ఓ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాను. 2006లో మా నాన్న‌గారికి ఇచ్చిన మాట కోసం గౌత‌మ‌బుద్ధ చిత్రాన్ని తీశాను. అవార్డులు కూడా చాలా వ‌చ్చాయి. టేబుల్ ప్రాఫిట్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత కొన్ని సినిమాల‌ను నిర్మించాను. కొంద‌రితో అసోసియేట్ అయి చేశాను. త్వ‌ర‌లో రెండు సినిమాల‌ను నిర్మిస్తాను. అందులో ఒక‌టి త‌రుణ్ భాస్క‌ర్‌తో ఉంటుంది. మ‌రొక‌టి వేరే షార్ట్ ఫిల్మ్ మేక‌ర్‌తో ఉంటుంది. న‌వంబ‌ర్ నుంచి నా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఉంటుంది. ద‌మ్మున్న స్క్రిప్ట్ ల‌ను నేను ఎంక‌రేజ్ చేస్తాన‌ని ఇంత‌కు ముందు చెప్పాను. `పెళ్లిచూపులు` అలాంటి ద‌మ్మున్న స్క్రిప్ట్`` అని అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved