pizza
Ramki interview
ఎలాంటి పాత్ర‌లైనా చేయ‌డానికి సిద్ధ‌మే- రామ్‌కీ
You are at idlebrain.com > news today >
Follow Us

9 July 2018
Hyderabad

`సిందూర‌పువ్వు` సినిమా చూసిన వారంద‌రికీ రామ్‌కీ గురించి త‌ప్ప‌కుండా తెలిసే ఉంటుంది. మ‌రికొంద‌రికి నిరోషా భ‌ర్త‌గా ప‌రిచ‌య‌మై ఉంటారు. ఆయ‌న తాజాగా `ఆర్ ఎక్స్ 100` చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా గురించి రామ్‌కీ సోమ‌వారం ఉద‌యం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...
* సిందూర‌పువ్వు స‌మ‌యంలో చూసిన‌ట్టే ఉన్నారు?
- హా హా హా థాంక్సండీ. దేవుడికి థాంక్స్ చెప్పాలి. అంతా ఆయ‌న ద‌యే.

* ఫిట్‌నెస్ కోసం మీరేం చేస్తారు?
- రెగ్యుల‌ర్ ధ్యానం, యోగా, వెజిటేరియ‌న్‌ని.

* సినిమాలు త‌గ్గించిన‌ట్టున్నారు?
- అలాగ‌నేం కాదండీ. మంచి క‌థ‌లున్న సినిమాల‌ను ఎంపిక చేసుకోవాల‌ని అనుకుంటున్నాను. `ఆక‌తాయి` అలాంటి సినిమానే. ఆర్ ఎక్స్ 100 కూడా అలాంటి సినిమా.

* ఆర్ ఎక్స్ 100 ఎలా సెట్ అయింది?
- ఈ చిత్ర ద‌ర్శ‌కుడు అజ‌య్, నిర్మాత చెన్నైకి వ‌చ్చి క‌థ చెప్పారు. హీరోని గైడ్ చేసే పాత్ర నాది. విన‌గానే న‌చ్చింది. స‌రేన‌ని అంగీక‌రించాను. వాళ్లు నాకు ఆ రోజు ఏం చెప్పారో, వాటిని 100 శాతం సెట్లో చూపించారు. చాలా గౌర‌వంగా చూసుకున్నారు. అనుకున్న డ‌బ్బుల‌ను నిర్మాత చాలా ముందే ఇచ్చేశారు.

* ఈ సినిమాను త‌మిళ్‌లో మీరు తీసుకుంటున్నార‌ని వార్త‌లొచ్చాయే?
- నిజ‌మేనండీ. నేను ఈ నిర్మాత‌ను త‌మిళ డ‌బ్బింగ్ రైట్స్ ఇవ్వ‌మ‌ని అడిగాను. నాకు క‌థ చాలా బాగా న‌చ్చింది. ద‌ర్శ‌కుడు చాలా బాగా చిత్రీక‌రించారు. ఆర్టిస్టులు ఏం చేయాలో, ఎలా చేయాలో ఒక విజ‌న్ ఉన్న ద‌ర్శ‌కుడు అత‌ను. కార్తీక్ తొలి సినిమా అయినా 10 చిత్రాలు అనుభ‌వం ఉన్న‌వాడిలా న‌టించాడు. ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ ఉన్నాయి. అంతా న‌చ్చి అడిగాను. నిర్మాత ఇంకా ఏమీ చెప్ప‌లేదు. నేనే కాదు, ఈ సినిమా ట్రైల‌ర్ చూసి ఇంకో న‌లుగురు ఐదుగురు త‌మిళ నిర్మాత‌లు కూడా ఈ సినిమా గురించి ఎంక్వ‌య‌రీ చేశారు.

* తెలుగు బాగా మాట్లాడుతున్నారే.. ఎలా సాధ్యం?
- నా ఫ్రెండ్స్ లో చాలా మంది తెలుగువారున్నారు. వారి కార‌ణంగా తెలుగు వ‌చ్చు. అంతెందుకు రావు ర‌మేశ్ కూడా నాకు చెన్నై నుంచి మంచి ఫ్రెండ్‌. ఆయన త‌మిళ్ మాట్లాడితే ఆయ‌న్ని త‌మిళియ‌న్ అనే అనుకుంటారు. అంత స్ప‌ష్టంగా మాట్లాడ‌తారు.

* నెక్స్ట్ మీరు సినిమాలు తీసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట క‌దా?
- ఆలోచ‌న‌లు ఉన్నాయి. నా ద‌గ్గ‌ర ఉన్న‌వ‌న్నీ యూత్‌ఫుల్ క‌థ‌లు, హార‌ర్ క‌థ‌లు. అవి ఎవ‌ర్‌గ్రీన్ కదా. ఇప్పుడు ఫ్యామిలీ క‌థ‌ల‌కు థియేట‌ర్ల‌లో ప్లేస్ ఉండ‌ట్లేదు. నాకు వ‌చ్చిన డేటా ప్ర‌కారం ఒక సినిమా జీవితం శుక్ర‌, శ‌ని, ఆదివారాలు మాత్ర‌మే. అందులోనూ 30 ఏళ్ల లోపున్న వాళ్లే సినిమా థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. 30 దాటిన వాళ్లు టాస్‌మార్క్ ల వైపు అడుగులు వేస్తున్నారు. పెద్ద‌వాళ్ల‌యితే టీవీల్లో చూస్తున్నారు. ఒక‌ప్పుడు వెండితెర‌ను ఏలిన ఎమోష‌న్స్ అన్నీ, ఇప్పుడు బుల్లితెర‌ను ఆక్ర‌మించేశాయి. అందుకే సినిమా చేయాలంటే ఆలోచ‌న‌లో ప‌డుతున్నాం. పైగా త‌మిళ‌నాడులో మాకు పైర‌సీ దెబ్బ చాలా ఉంది. అది కూడా మాకు స‌వాలు విసిరి, మా క‌న్నా ముందు పైర‌సీల‌ను విడుద‌ల చేస్తున్నారు.

* వాళ్ల‌ను ఎందుకు ప‌ట్టుకోలేక‌పోతున్నారు? ఏంటి ప‌రిష్కారం?
- అది ఇక్క‌డ జ‌రిగే చౌర్యం కాదు. ఇప్పుడు అంత‌ర్జాతీయంగా సినిమాను విడుద‌ల చేస్తున్నాం. అలాంట‌ప్పుడు కంటెంట్‌ను విదేశాల‌కు నాలుగు రోజుల ముందే పంపించాల్సి ఉంటుంది. ఆ నాలుగు రోజుల్లో మ‌న ద‌గ్గ‌ర లేని కంటెంట్ ఎప్పుడైనా ఎక్క‌డైనా చౌర్యం కావ‌చ్చు. మ‌న చేతిలో లేని విష‌యాల‌వి.

* మ‌ధ్య‌లో సినిమాల‌కు గ్యాప్ ఎందుకు తీసుకున్నారు?
- నాకు కెమెరా వెనుక ఉన్న విష‌యాల మీద చాలా ఆస‌క్తి. అందుకే ప్రొడ‌క్ష‌న్‌, డైర‌క్ష‌న్ అని మూడేళ్లు సీరియ‌ల్స్ మీద వెళ్లాను. తిరిగి వ‌చ్చేయ‌వ‌చ్చు క‌దా అని వెళ్తే... నేను వ‌చ్చేస‌రికి ఇక్క‌డ మొత్తం సీనే మారిపోయింది. (న‌వ్వుతూ).

* త‌మిళ సినిమాల్లోనూ రాజ‌కీయాలు ఉన్న‌ట్టున్నాయి క‌దా?
- శాటిలైట్ గురించి చ‌ర్చ జ‌రుగుతుంది. సోష‌ల్ మీడియా పెరిగాక ఏ హీరో కూడా సినిమాకు టైటిల్ పెట్టాలంటే ఆలోచిస్తున్నారు. అందుకే ఆయా హీరోల సినిమాలకు ప‌క్క‌న నెంబ‌ర్లు క‌నిపిస్తున్నాయి. అడుగ‌డుగునా ఇలాంటివి ఉంటూనే ఉన్నాయి.

* మీకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న ఉందా?
- లేదండీ. కానీ భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం క‌దా.

* ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ రాజ‌కీయాల్లోకి రావ‌డం ప‌ట్ల మీ అభిప్రాయం?
- ఇద్ద‌రూ మంచి చేయాల‌న్న ఆలోచ‌న‌తోనే వ‌స్తున్నారు. ఇద్ద‌రికీ అభిమానులున్నారు. కాక‌పోతే ఇన్నాళ్లుగా అభిమానులుగా ఉన్న వాళ్లు ఇక‌పై ప్ర‌జ‌లుగా మారుతారు. ప్ర‌జ‌ల్లో ఎంత‌మంది ఎవ‌రి వైపు ఉంటార‌నేది ఆస‌క్తిక‌రం. వేచి చూడాల్సిందే.

* తెలుగు సినిమాల్లో మార్పు గ‌మ‌నించారా?
- అబ్బో చాలానే ఉంది. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌ల్లో చాలా మంది ద‌ర్శ‌కులు... వ‌ర్మ‌తో పాటు ఎంతోమంది త‌మిళ సినిమాల షూటింగ్‌ల‌కు వ‌చ్చిన అక్క‌డ వాడుతున్న టెక్నాల‌జీని చూసేవారు. కానీ ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న టెక్నాల‌జీని ప్ర‌పంచం మొత్తం త‌లెత్తి చూస్తోంది.

* నిరోషా ఎలా ఉన్నారు?
- చాలా బావున్నారు. వ‌రుస‌గా సీరియ‌ల్స్ చేస్తున్నారు. త్వ‌ర‌లో మేమిద్ద‌రం క‌లిసి ఓ ప్రొడ‌క్ష‌న్ చేయ‌బోతున్నాం.

* మీ ఇద్ద‌రి ప‌రిచ‌యం ప్రేమ‌గా, పెళ్లిగా ఎలా మారింది?
- నేను ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన ఏడాది 1987. మా ఇంట్లో అంత‌కు ముందు ఎవ‌రూ న‌టులు లేరు. వ‌చ్చిన త‌ర్వాత ప‌ది సినిమాలు చేస్తే అందులో 8 సూప‌ర్ డూప‌ర్ హిట్లు. వాటిలో సిందూర‌పువ్వు ఒక‌టి. ఆ సినిమా త‌ర్వాత మా పెయిర్ హిట్ అయింది. వ‌రుస‌గా ఎనిమిది సినిమాలు చేశాం. అది కూడా ఒక సినిమా సెట్స్ మీద ఉండ‌గానే ఇంకో సినిమా చేసేవాళ్లం. ఇంటికెళ్ల‌డం సూట్‌కేస్‌లు స‌ర్దుకోవ‌డం లొకేష‌న్ల‌కు ప్ర‌యాణం చేయ‌డం... ఇలా ఎనిమిది సినిమాలు ఇద్ద‌రం క‌లిసి చేసేస‌రికి అదే ప్రేమయింది. ఆ వెంట‌నే పెళ్ల‌యింది. అదీ మా స్టోరీ.

* తెలుగులో ఇంకేమైనా సినిమాలు చేస్తున్నారా?
- ఎవ‌రో అడుగుతున్నారు. ఇంకా ఏవీ సంత‌కం చేయ‌లేదు. కానీ తెలుగు నిర్మాత‌లు ఆర్టిస్టుల‌ను చాలా బాగా చూసుకుంటారు. మాట్లాడుకున్న మొత్తాన్ని జాగ్ర‌త్త‌గా ఇచ్చేస్తారు. ఫ‌లానా పాత్ర చేయాల‌ని కూడా నేనేం అనుకోవ‌డం లేదు. నాకు సూట్ అయ్యే అన్ని పాత్ర‌ల‌ను చేస్తాను. తెలుగులో డైలాగ్‌లు కూడా ప‌ర్ఫెక్ట్ గా చెబుతాను.
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved