pizza
Sharwanand interview (Telugu) about Mahanubhavudu
ఆ సినిమా విషయంలో కాస్త బాధపడ్డాను - శర్వానంద్‌
You are at idlebrain.com > news today >
Follow Us

1 October 2017
Hyderabad

శర్వానంద్‌, మెహరీన్‌ జంటగా యు.వి.క్రియేషన్స్‌ బేనర్‌పై రూపొందిన చిత్రం 'మహానుభావుడు'. మారుతి దర్శకుడు. వంశీ, ప్రమోద్‌ నిర్మాతలు. దసరా సందర్భంగా సినిమా సెప్టెంబర్‌ 29న విడుదలైంది. ఈ సందర్భంగా హీరో శర్వానంద్‌ ఇంటర్వ్యూ విశేషాలు

ఆనందంగా ఉంది...
- ఈ ఏడాది సంక్రాంతి, దసరా పండుగలు నాకు బాగా కలిసొచ్చాయి. 'మహానుభావుడు' విడుదల కావడం హ్యాపీగా ఉంది. సినిమా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా నచ్చింది. థియేటర్స్‌ కూడా పెరిగాయి.

కథలనే నమ్మాను...
- ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నింటినీ కథను నమ్మే చేశాను. ఈ సినిమా విషయంలో కూడా అంతే. అయితే 'మహానుభావుడు' క్యారక్టరైజేషన్‌తో కూడిన సినిమా. ఇప్పటి వరకు నేను క్యారక్టరైజేషన్‌తో ఏ సినిమా చేయలేదు. ఓసీడీ అనేది చిన్న పాయింటే అయినా మారుతిగారు దాని చుట్టూ అల్లిన కథ, సన్నివేశాలు ఎంతో బావున్నాయి. ఆయన నేరషన్‌ ఇచ్చినప్పుడే నేను సినిమాను ఎంజాయ్‌ చేశాను. ఓసీడీని తెలుగులో చెప్పాలంటే చాదస్తం. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం. ఇలాంటి లక్షణం ఉండే వ్యక్తులను మన ఇళ్లల్లో కానీ, మన చుట్టు పక్కలగానీ గమనించవచ్చు. నా స్నేహితుల్లో కూడా ఇద్దరు, ముగ్గురున్నారు.

పెద్ద కాంప్లిమెంట్‌....
- నేను పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తానని చెప్పడం మారుతిగారు నాకు ఇచ్చిన పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తాను. ఇక క్యారెక్టర్స్‌ విషయానికి వస్తే, నేను నా దర్శకులు ఏం చెబితే అది ఫాలో అయిపోతాను. ఎందుకంటే ఒక డైరెక్టర్‌ కథ రాసుకున్నప్పుడు, క్యారెక్టర్‌ ఎలా ఉండాలనేదాని గురించి క్లియర్‌గా రాసుకుంటాడు. కాబట్టి వాళ్లను ఫాలో అయితే మంచిదే. మారుతిగారు సీన్‌ పేపర్‌ రాసుకున్నప్పుడు చాలా క్లియర్‌గా ఉంటుంది. ఆ సీన్‌ను సెట్స్‌లో చేస్తున్నప్పుడు ఇంకా బెటర్‌మెంట్‌గా రావడానికి ప్రయత్నిస్తారు. ఈ సినిమా ఇంత బాగా ఉందని అందరూ అంటున్నారు. క్రెడిట్‌ మారుతిగారికే దక్కుతుంది. ప్రతి సీన్‌ను ఎంతో ఎంటైర్‌టైనింగ్‌గా రాసుకున్నారు. కామెడీని డైరెక్ట్‌ చేయడమన్నా, అందులో నటించడమన్నా, మేజిక్‌ వర్కవుట్‌ అయితేనే సాధ్యమవుతుంది.

నేను ఆలోచించలేదు...
- ఈ సినిమాను మారుతిగారు డైరెక్ట్‌ చేసిన భలే భలే మగాడివోయ్‌తో పోల్చుతున్నారు. కానీ నేను దాని గురించి ఆలోచించలేదు. ఫార్ములా కథ కాబట్టే ఈ పోలికలు వచ్చుంటాయి. అయితే ఫైనల్‌గా సినిమా ప్రేక్షకులకు నచ్చిందా? లేదా? అనేదే ముఖ్యం.

టెన్షన్‌ లేదు....
- రెండు పెద్ద సినిమాల మధ్యలో ఈ సినిమా విడుదలైందనే టెన్షన్‌ లేదు. ఎందుకంటే పండగ అంటే నాలుగైదు రోజులు సెలవులు ఉంటాయి. ప్రేక్షకులు అన్నీ సినిమాలు చూడాలనుకుంటారు. అలాగే ఈ దసరాకి విడుదలైన మూడు సినిమాలు మూడు జోనర్స్‌కి చెందినవి. మేం ఎంటర్‌టైన్‌మెంట్‌ను నమ్మి ప్రేక్షకుల ముందుకు వచ్చాం కాబట్టి ఎలాంటి టెన్షన్‌ అనిపించలేదు.

అది ఆశీర్వాదం....
- ప్రభాస్‌ అన్న..కాబోయే సూపర్‌స్టార్‌ అని చెప్పడం, ఆయన అందించిన ఆశీర్వాదంగా భావించాను. సినిమా ఇండస్ట్రీలో నా స్థానం ఏంటి? అని పెద్దగా ఆలోచించలేదు. నా కెరీర్‌ స్టార్టింగ్‌ నుండి నా సినీ ప్రయాణంలో జరిగిన ప్రాసెస్‌ను ఎంజాయ్‌ చేస్తూ వచ్చాను. అయితే దేవుడి దయవల్ల మంచి కథలతో దర్శకులు నా వద్దకు వస్తున్నారు.

Sharwanand interview gallery

ప్రభాస్‌ సినిమా చూశారా?
- ఆయన 'సాహో' సినిమా షూటింగ్‌లో బిగా ఉన్నారు. ఇంకా చూడలేదు.

నిర్మాతల గురించి...
- నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు నాకు మంచి స్నేహితులు. వీరితో కలిసి రన్‌రాజా రన్‌, ఎక్స్‌ప్రెస్‌రాజా, ఇప్పుడు మహానుభావుడు సినిమాలు చేశాను. వీరితో చేసిన ప్రతిసారి నా గ్రాఫ్‌ పెరుగుతూనే వచ్చింది.

రెండు కోరుకుంటాను...
- ఒక నటుడిగా సినిమాకు వసూళ్లతో పాటు పేరు కూడా రావాలని కోరుకుంటాను. అన్నీ సార్లు ఈక్వేషన్స్‌ కుదరవు. 'రాధ' సినిమా విషయంలో అదే జరిగింది. రొటీన్‌ కమర్షియల్‌ ఫార్ములా కాబట్టి అలాంటి సినిమా శర్వాకు అవసరమా అని కూడా అన్నారు. కొత్త కథలతో సినిమాలు చేయాలనే నిర్ణయం తీసుకున్నాను.

కాస్తా బాధపడ్డా...
- సందీప్‌ వంగా 'అర్జున్‌రెడ్డి' కథను ముందు నాకే చెప్పాడు. సందీప్‌ ఆ సినిమాను తనే నిర్మిస్తానని అన్నాడు. అయితే దర్శకుడిపై నిర్మాణ బాధ్యతలు ఉండకూడదని భావించి అశ్వనీదత్‌, కేశినేని నానితో పాటు మరికొందరి ప్రొడ్యూసర్స్‌ వద్దకు ఆ కథను పంపాను. వాళ్లు రిస్క్‌ అని భయపడ్డారు. వెనక్కి తగ్గారు. సినిమా హిట్‌ అయిన తర్వాత అలాంటి కథలు వస్తే చెప్పమని అంటున్నారు. అర్జున్‌ రెడ్డి మిస్‌ అయినందుకు నేను కాస్త బాధపడ్డాను. కానీ సినిమా చూశాక, విజయ్‌ దేవరకొండ చేయడమే కరెక్ట్‌ అనిపించింది.

తదుపరి చిత్రాలు...
- సుధీర్‌వర్మ, ప్రకాష్‌ కోవెలమూడిలతో నెక్ట్స్‌ మూవీస్‌ ఉంటాయి. అయితే వాటి గురించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved