29 July 2018
Hyderabad
అడివి శేష్ నటిస్తోన్న `గూఢచారి` చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెడుతున్నారు శోభిత ధూళిపాళ. ఆమె తెలుగమ్మాయి. ఈ సినిమా గురించి ఆమె శనివారం విలేకరులతో మాట్లాడారు.
* మీ గురించి చెప్పండి?
- మాది తెనాలి. నేను పెరిగిదంతా వైజాగ్‌లో. అక్కడ ప్లస్ టు చదివాక ముంబై వెళ్లాను. అక్కడే డిగ్రీ చేశాను. అప్పుడే మిస్ ఇండియాకు వెళ్లాను. సెలక్ట్ అయ్యాను. అటు నుంచి మోడలింగ్‌కి వెళ్లాను. ఆ తర్వాత అనురాగ్ కశ్యప్‌తో హిందీలో తొలి సినిమా చేశా. ఆడిషన్స్ కి వెళ్లిన నాలుగు గంటల్లో నేను ఓకే అన్నారు. పది రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశారు. కొన్నాళ్లకు కేన్స్ కి వెళ్లా. అప్పుడు అడివి శేష్ `గూఢచారి` గురించి చెప్పి ఫోన్ చేశారు. ఇప్పుడు కూర్చున్న ఇదే రూమ్‌లోనే కూర్చుని కథ విన్నా. నచ్చింది. మంచి వాళ్లతో పనిచేయడం ఆనందంగా అనిపించింది.
* అందరూ తెలుగు నుంచి హిందీకి వెళ్తారు. మీరు రివర్స్ లో వచ్చారు?
- ఎన్ని భాషల్లో నటించినా, చివరికి నేను తెలుగమ్మాయినే కదా. అందుకే తెలుగు సినిమా అవకాశం రాగానే ఓకే అనిపించింది. ఈ సినిమాకు ముందు నేను క్షణం చూశా. ఇప్పుడు తెలుగు సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. చాలా మంచి పేస్‌లో ఉన్నాం. అలాంటప్పుడు ఏ భాషలో చేస్తే ఏముంది? ఓ బైలింగ్వుల్ తరహా మలయాళ సినిమా కూడా చేశాను. అయితే అందులో నేను మలయాళం మాట్లాడను. హిందీలోనే మాట్లాడతా.
* హిందీ ఎప్పుడు నేర్చుకున్నారు?
- ముంబైకి వెళ్లినప్పుడు నేర్చుకున్నా. చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేదాన్ని. అన్నిట్లోనూ ఫస్ట్ మార్కులే వచ్చేవి. ఏదైనా కొత్తగా నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. భరతనాట్యం, కథక్ కూడా నేర్చుకున్నా.
* ఇంట్లో వాళ్లు ఏమంటున్నారు?
- మా ఇంట్లో వాళ్లకు సినిమాల గురించి పెద్దగా తెలియదు. నేను సరదాగా మిస్ ఇండియాకి వెళ్లాను. సెలక్ట్ అయ్యాను. అటు నుంచి జర్నీ ఇటు మళ్లింది. నేను కూడా నటిని అవుదామని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నాకు 25ఏళ్లు. చాలా ఆనందంగా నచ్చిన పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. హిందీలో ఇంకో రెండు సినిమాలకు సంతకాలు చేశా. అందులో ఒకటి షూటింగ్ జరుగుతోంది.
* తెలుగులో కంటిన్యూ చేస్తారా?
- మిస్ ఇండియా గెలిచినప్పుడే నాకు కొంతమంది అడిగారు. అయితే నేను అప్పుడు నటించాలనుకోలేదు కాబట్టి ఏమీ చెప్పలేదు. ఇప్పుడు గూఢచారి టీజర్ రిలీజ్ అయిన తర్వాత కూడా కొంతమంది అప్రోచ్ అవుతున్నారు.
* గూఢచారిలో లిప్‌లాక్ సీన్ ఉన్నట్టుంది. మీ వాళ్లు ఏమీ అనలేదా?
- తొల సినిమాలో కూడా ఇంటిమేట్ సీన్ ఒకటి ఉంది. ముందే చెప్తే చుట్టాలను సినిమాకు తీసుకెళ్లం కదా అని అన్నారు. చుట్టాలు సినిమా చూసినా `ఓ వచ్చిందా` అన్నట్టు ఉన్నారే కానీ, ఏమీ మాట్లాడలేదు. మా పేరెంట్స్ సపోర్ట్ ఉంది నాకు. వాళ్లు నన్ను ఎంతో నమ్మకపోతే డిగ్రీ కోసం ఇంకో పెద్ద సిటీకి పంపిస్తారా? నేనైనా నా పిల్లలను రేపు పంపిస్తానో లేదో తెలియదు.