pizza
Sunil interview (Telugu) about 2 Countries
నా కండ‌లు చూసి కాదండీ.. టైమింగ్ చూసి అవ‌కాశాలు వ‌చ్చాయ్‌! - సునీల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

27 December 2017
Hyderabad

క‌మెడియ‌న్‌గా కెరీర్ ప్రారంభించిన హీరోగా ట‌ర్న్ అయి నిల‌దొక్కుకున్న న‌టుడు సునీల్‌. మ‌ర‌లా క‌మెడియ‌న్‌గా న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. మంచి స్క్రిప్ట్ లు వ‌స్తే హీరోగా కంటిన్యూ అవుతాన‌ని అంటున్న సునీల్ న‌టించిన చిత్రం `2 కంట్రీస్‌`. మ‌హాల‌క్ష్మి ఆర్ట్స్ ప‌తాకంపై ఎన్‌.శంక‌ర్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో సినిమాను రూపొందించారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 29న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సునీల్ హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* 2 కంట్రీస్ ఎలా ఉండ‌బోతోంది?
- సినిమా చాలా బావుంటుందండీ. మ‌ల‌యాళంలో ఆల్రెడీ హిట్ చిత్రం. నాకు టైల‌ర్ మేడ్ పాత్ర ఇది. చూడ్డానికి చాలా బావుంటుంది. 95శాతం వినోదాత్మ‌కంగా సాగుతుంది. చివ‌రి ఐదు నిమిషాలు మాత్రం సెంటిమెంట్‌తో కంట‌త‌డిపెట్టిస్తుంది.

* మీ కెరీర్లో ఇది ఎన్నో రీమేక్ అండీ?
- అస‌లు ఈ కోణంలో ఆలోచించ‌నేలేదండీ. వ‌రుస‌గా లెక్కేస్తే నాలుగో రీమేక్ అందులో దిలీప్ న‌టించిన సినిమాల‌ను రెండున్నాయి. ఇది కూడా మ‌ల‌యాళంలో దిలీప్ న‌టించిన చిత్ర‌మే.

* మీ పాత్ర ఎలా ఉంటుంది?
- డ‌బ్బు కోసం వెంప‌ర్లాడే పాత్ర నాది. అలాగ‌ని ఎవ‌రినీ హ‌త్య‌లు చేయ‌ను. భారీ మోసాలు చేయ‌ను. చిన్నాచిత‌కా మోసాలు చేస్తుంటాను. అలాంటి వ్య‌క్తి ప్రేమ‌లో ప‌డితే, ఆ అమ్మాయి అత‌న్ని ఎలా మార్చింది అనేది కాన్సెప్ట్.

* మీకు గ‌త రెండు, మూడు సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు క‌దా..
- మూడు కాదండీ. రెండే. అవి కూడా స‌రైన రిలీజ్ టైమ్ చూసి ప్లాన్ చేసుకుని ఉంటే బావుండేది. కానీ ఎక్క‌డో తేడా జ‌రిగింది. అయినా థియేట‌ర్ వ‌సూళ్లు కూడా బాగానే వ‌చ్చాయి. మ‌నం వాటి గురించి ఎప్పుడూ చెప్ప‌లేదు కాబ‌ట్టి జ‌నాల‌కు తెలియ‌దు అంతే.

* మీరు సినిమా ప్రొడ‌క్ష‌న్‌లో, డైర‌క్ష‌న్‌లో వేలు పెడ‌తార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి..
- ఇప్పుడే కాదండీ. నా తొలి, మ‌లి సినిమాల నుంచి కూడా నేను సినిమాల విష‌యంలో వేలు, కాలు, చేయి పెడుతూనే ఉన్నాను. మ‌రి ఆ సినిమాలు హిట్ అయిన‌ప్పుడు ఈ మాట‌లు ఎందుకు రాలేదు? ఇప్పుడే ఎందుకు వ‌స్తున్నాయి? విజ‌యాన్నే కాదు, అప‌జ‌యాన్ని కూడా అంగీక‌రించ‌గ‌లిగిన మ‌న‌స్త‌త్వం అంద‌రికీ ఉండాలి.

అంతెందుకు `అందాల‌రాముడు` సినిమా స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ నాకోసం డైలాగులు రాశారు. కానీ అప్ప‌ట్లో ఆయ‌న రూ.2కోట్లు తీసుకునేవారు. కానీ నా కోసం ఫ్రీగా చేశాడు. మ‌రి ఆ స‌మ‌యంలో అలాంటి విష‌యాల‌న్నీ ఎందుకు గుర్తుకురాలేదు. ఎవ‌రూ ఎందుకు ప్ర‌చారం చేయ‌లేదు?

* ఒక‌ప్పటితో పోలిస్తే ఇప్పుడు హాస్య‌ప్ర‌ధాన‌మైన సినిమాలు త‌గ్గాయి క‌దా?
- చాలా త‌గ్గాయండీ. ఒక‌ప్పుడు జంధ్యాల‌గారు, బాపుగారు, ఈవీవీగారు.. ఇలా చాలా మంది ఉండేవారు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ ఉన్నాడు కానీ, అత‌ను చాలా పెద్ద వాళ్ల‌తో చేస్తున్నాడు. కాబ‌ట్టి వాటిని వ‌దులుకుని నాలాంటి వాళ్ల‌తో చేయ‌డాన్ని కూడా నేను ఒప్పుకోను.

* మీతో `బంతి` అనే సినిమాను కూడా చేస్తాన‌న్నారు క‌దా?
- అవునండీ. చేస్తాన‌న్నారు. కానీ ఇప్పుడు అత‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యాచ్ ఆడుతున్నాడు. అప్పుడెప్పుడో మాతో గ‌ల్లీ క్రికెట్ ఆడాడు క‌దా అని ఇప్పుడు నేను అత‌న్ని పిలిచి ఆడ‌మ‌న‌డం క‌రెక్ట్ కాదు. అస‌లు ఈ విష‌యంలో అత‌ను ఎంత లేట్‌గా స్పందిస్తే నాకు అంత మేలు. ఎందుకంటే అత‌ని మార్కెట్ అంత పెరుగుతుంద‌ని.

interview gallery*మీరు హీరో అయ్యాక పొందింది ఏంటి? పోగొట్టుకుంది ఏంటి?
- పోగొట్టుకుంది ఏమీ లేదండీ. ఎందుకంటే నేను ఇక్క‌డ అసిస్టెంట్ డ్యాన్స‌ర్‌గా చేశాను. అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా చేశాను. అక్క‌డి నుంచి క‌మెడియ‌న్ అయ్యాను. ఇప్పుడు హీరో అయ్యాను. హీరో కావ‌డం అనేది అంత తేలికైన వ్య‌వ‌హారం కాదు. హీరో కావ‌డం వ‌ల్ల నా ఫ్యామిలీతో ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించ‌గ‌లుగుతున్నాను. హీరోగా ఒక్క హిట్‌కొడితే చాలు.. కాస్త స్లోగా ఉన్న సినిమాల‌న్నిటినీ క‌లిపి లాగేయ‌వ‌చ్చు.

*మీతో న‌టించ‌మ‌ని చాలా మంది హీరోయిన్లు చెప్పార‌ట క‌దా?
- అలాంటిదేమీ లేదండీ. అయినా ఇందులో హీరోకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, హీరోయిన్ కీ అంతే ప్రాధాన్యం ఉంటుంది. కాబ‌ట్టి ఎవ‌రైనా ఇట్టే చేసేవారు. కానీ మా ద‌ర్శ‌కుడికి ఈ హీరోయిన్ న‌చ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ యుఎస్‌లో పుట్టిపెరిగిన అమ్మాయి. మా హీరోయిన్ కూడా అచ్చం అలాంటి అమ్మాయే. తెలుగు అమ్మాయి. యు.ఎస్‌.లో పుట్టిపెరిగింది.

* మీరు `సైరా`లో న‌టిస్తున్నార‌ని, ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాలో న‌టిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి..?
- నాకు కూడా న‌టించాల‌ని ఉంది. మీరు ఎవ‌రైనా తెలిస్తే చెప్పండి.

* `అజ్ఞాత‌వాసి`లోనూ న‌టిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి?
- ముందు అనుకున్నామండీ. కానీ ఆ పాత్ర ఎందుకో కుద‌ర‌లేదు.

* క‌మెడియ‌న్‌గా వ‌చ్చే ఏడాది వ‌రుస‌గా సినిమాలు చేస్తారా?
- అవునండీ. ఇప్ప‌టికే రెండు సినిమాలు ఓకే అయ్యాయి. హీరోగానూ కొన్ని ఉన్నాయి. వాట‌న్నిటినీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం.

* తాజాగా బ‌రువు బాగా పెరిగిన‌ట్టున్నారు?
- అవునండీ. పెరిగాను. కాక‌పోతే ఎన్‌.శంక‌ర్ కాస్త బుగ్గ‌లు పెరిగితే బావుంటుంద‌ని అన్నారు. ఆ మాట ప్ర‌కారం పెరిగా. ఎక్స‌ర్సైజులు చేస్తున్నాను కానీ, డైట్ మాత్రం పాటించ‌డం లేదు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved