pizza
Vamsi Paidipally interview about Oopiri
'ఊపిరి'తో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకున్నాను - వంశీ పైడిపల్లి
You are at idlebrain.com > news today >
Follow Us

23 March 2016
Hyderaba
d

"మున్నా, బృందావనం, ఎవడు" వంటి కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్స్ తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఊపిరి". నాగార్జున-కార్తీ హీరోలుగా నటించిన "ఊపిరి" చిత్రం "ది ఇన్ టచబుల్స్" అనే ఫ్రెంచ్ సినిమాకి రీమేక్. ఎమోషనల్ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తోంది. మార్చి 25న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లితో ఇంటర్వ్యూ....

రీమేక్ సినిమా చేయాలని.....
‘ఎవ‌డు’ సినిమా చేస్తున్న‌ప్పుడు ఫ్రెంచ్ మూవీ ఇన్ ట‌చ్ బుల్స్ మూవీ చూసాను. మెయిన్ పాత్రధారుల్లో ఒకరు వీల్ ఛైర్ లో కూర్చొని ఉన్నారు క‌దా సినిమా ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ...సినిమాని బిగినింగ్ నుంచి చివ‌రి వ‌ర‌కు అలా చూస్తుండిపోయాను. సినిమా పూర్తయిన తర్వాత నేను కుర్చీలోంచి లేవ‌లేక‌పోయాను.అప్పుడు కచ్చితంగా ఈ సినిమా చేయాల‌నుకున్నాను.

నాగార్జున క్యారెక్ట‌ర్ గురించి....
నాగార్జునగారు బిలియనీర్ పాత్రలో కనపడతారు.ఆయన పాత్ర కొన్ని పరిస్థితుల కారణంగా వీల్ ఛైర్ కి ప‌రిమితం కావ‌ల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఈ క్యారెక్ట‌ర్ కి సింప‌తి ఇష్టం ఉండ‌దు. వీల్ ఛైర్ లో కూర్చున్నప్పటికీ అత‌ని చుట్టూ ఎంట‌ర్ టైన్మెంట్ ఉంటుంది. ఒకే జీవితంలో రెండు జీవితాలు చూసిన వ్య‌క్తి క‌థ‌. ఈ సినిమాకి ఎందుకు క‌నెక్ట్ అవుతారు అంటే ఎవ‌రికైనా తోడు ఉండాలి. ప్ర‌తి ఒక్క‌రికి తోడు ఎవ‌రో ఒక‌రు ఉంటారు.ఆ తోడుతో బాధ పంచుకున్న‌ప్పుడు ఇచ్చే రిలీఫే ఊపిరి. ఇది రివేంజ్ క‌థ కాదు. మ‌న జీవితం లాంటి క‌థ‌. బంథాలు - బంధుత్వాలు ప్రాముఖ్య‌త తెలియ‌చెప్పే క‌థ. ఇది మ‌నంద‌రి క‌థ‌.


మనిషిలోని భావోద్వేగాల కలయిక..
ప్రతి మనిషిలోనూ చాలా ఎమోషన్స్ ఉంటాయి. సందర్భాన్ని బట్టి అవి బయటకు వస్తుంటాయి. అలాంటి పలు భావోద్వేగాల కలయికే "ఊపిరి". సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యక్తిని ఎక్కడో చూశామనే భావన కలుగుతుంది. సినిమాలో ఎటువంటి మలుపులూ ఉండవు. ఇది చాలా సింపుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్సజావుగా సాగే ఇద్దరి జీవితాల కలయికే "ఊపిరి".

మాతృక కంటే ఎంజాయ్ చేస్తారు.....
ఒరిజినల్ వెర్షన్ "ఇన్ టచబుల్స్" ఒక అద్భుతం. హాలీవుడ్ టాప్ 25 మూవీస్ ఇప్పటికీ అది ఒక స్థానంలో ఉంది. ఎంత గొప్ప సినిమా అయినప్పటికీ.. మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేయకపోతే మనవాళ్లు అంగీకరించరు. అందుకే తెలుగు, తమిళ నేటివిటీలకు తగ్గట్లుగా కథలో చాలా మార్పులు చేశాం. మాతృక కంటే తెలుగు సినిమాను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.

ఒక్క సీన్ కూడా మార్చొద్దని చెప్పారు..
తొలుత నాగార్జున గారి కోసం సెకండాఫ్ లో కొన్ని మార్పులు చేశాను. ఫస్టాఫ్ విన్నఆయన నా కోసం సెకండాఫ్ లో ఏమార్పులు అవసరం లేదు. ఏ కాన్ఫిడెన్స్ తో అయితే ఫస్టాప్ చెప్పావో అదే కాన్ఫిడెన్స్ తో సెకండాఫ్ చెప్పు చేంజస్ చేయవద్దు అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో మళ్లీ రెండు నెలలు కూర్చొని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి చెప్పాను ఆయన అప్పుడు ఒకే చేశారు.

Vamsi Paidipally interview gallery


ఎన్టీఆర్ గారే నాంది పలికారు...
ఈ కథను తొలుత ఎన్టీయార్ కు చెప్పాను. అయితే.. డేట్స్ కారణంగా చేయలేనని చెప్పడంతోపాటు నాగార్జునగారికి ఫోన్ చేసి "వంశీని పంపుతున్నాను బాబాయ్ తను చెప్పే కథ విను కానీ తిట్టొద్దు" అని చెప్పి పంపాడు. నాగార్జునగారు ఈ కథ వినగానే నేను చేయాలనుకున్న పాత్ర ఇది అని చెప్పారు. దాంతో నాకు చాలా హ్యపీగా అనిపించింది. నా జీవిత్రంలో ఎన్టీయార్ ఎప్పటికీ ఓ ఉత్తమ స్నేహితుడిగానే ఉంటాడు.

శృతి ఆ విషయంలో చాలా బాధపెట్టింది..
శృతిహాసన్ తో గొడవేం లేదు కానీ, అన్నీ సిద్ధం చేసుకుని షూటింగ్ కు రేపు వెళుతున్నామనే సమయంలో డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరదని చెప్పింది. అదే మాకు బాధ కలిగించింది. అయితే ఏదేమైనా తమన్నా డేట్స్ దొరకడం, తను అద్భుతంగా ఆ పాత్రలో నటించడం జరిగింది
సినిమా నుంచి తప్పుకొంది అనే బాధకంటే మరీ రెండు రోజుల ముందు "నో" చెప్పడం బాధ అనిపించింది.

వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా పండడం వల్లే..
నాగార్జున-కార్తీలు ఆన్ స్క్రీన్ లో ఎంత బాగా కలిసిపోయారో.. ఆఫ్ ది స్క్రీన్ లోనూ అదే స్థాయిలో కనెక్ట్ అయ్యారు. అందుకే సినిమా ఔట్ పుట్ అంత అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా ఔట్ పుట్ ఇంత అద్భుతంగా రావడంలో వాళ్ళిద్దరి సహకారం చాలా ఉంది.

ఆ సంఘటన కదిలించింది.....
నేను, సినిమాటోగ్రాఫర్ వినోద్ లోకేషన్స్ రెక్కీ కోసం ఫారిస్ వెళ్ళినప్పుడు ఒక రెస్టారెంట్ ను చూశాం. ఆ ప్లేస్ బాగుందని తొలుత ఓనర్ అయిన ఒక ముసలావిడని అడిగినప్పుడు మా యూనిట్ మెంబర్ ను తిట్టి పంపేసింది. ఆ తర్వాత "ది ఇన్ టచబుల్స్" ఇండియన్ వెర్షన్ రీమేక్ అని తెలియడంతో ఎక్కడ కావాలంటే అక్కడ షూట్ చేసుకోండి. ""ది ఇన్ టచబుల్స్" చూసిన తర్వాతే చనిపోవాలనుకొన్న నా కొడుకు తిరిగి మామూలు మనిషయ్యాడు" అని చెప్పింది. ఆవిడ చెప్పిన మాట నన్ను ఎంతగానో కదిలించింది. అలాగే.. ప్యారిస్ లోనూ "ది ఇన్ టచబుల్స్"కు ఇండియన్ వెర్షన్ షూటింగ్ అని తెలుసుకొన్న వాళ్ళందరూ ఎంతగానో హెల్ప్ చేశారు.

ఆ అవకాశం వస్తే వదులుకోను..
"ఊపిరి" సినిమా హిందీ వెర్షన్ రీమేక్ రైట్స్ ను కరణ్ జోహార్ గారు దక్కించుకొన్నారు. ఒకవేళ ఆయన అవకాశమివ్వాలే కానీ హిందీ వెర్షన్ కు తప్పకుండా దర్శకత్వం వహిస్తా.

కార్తీ వల్లే ఆ ఆలోచన వచ్చింది...
తొలుత "ఊపిరి"ని తమిళంలో తీయాలన్న ఆలోచన లేదు. అయితే తర్వాత "కార్తీ"ని సెలక్ట్ చేసుకోవడం.. తమిళ మేకింగ్ అప్పుడు కార్తీ ఎంతగానో సహకరించి ప్రతి విషయంలోనూ కేర్ తీసుకొని.. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లా పనిచేయడం వలనే తమిళ వెర్షన్ ను తీయగలిగాను.

నన్ను నేను ఆవిష్కరించుకున్నాను....
నాకు ఊపిరి సినిమా ఎంత ఇంపార్టెంటో మున్నా, బృందావ‌నం, ఎవ‌డు చిత్రాలు కూడా అంతే ఇంపార్టెంట్. కాక‌పోతే ఈ సినిమాతో న‌న్ను నేను తెలుసుకున్నాను. గ‌తంలో చేసిన త‌ప్పులు ఇక మీద‌ట చేయ‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్నాను. అలాగే ఈ సినిమా చేసిన త‌ర్వాత స‌హ‌నం పెరిగింది. నా లైఫ్ నే మార్చింది ఊపిరి. నిజంగా ఊపిరి నాకు ఒక వ‌రం.

ఇంత‌కీ..మీ ఊపిరి ఎవ‌రు..?
నాకు ఊపిరి అంటే మా ఫ్యామిలీ.

తదుపరి చిత్రం....
అక్కినేని అఖిల్ తో నా తదుపరి చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయి. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు "ఊపిరి" విడుదల తర్వాత తెలియజేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved