`కంచె`తో మంచి సక్సెస్‌ను చవిచూశారు వరుణ్ తేజ్. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు పెద్దగా సంతృప్తి కలిగించలేదు. తాజాగా శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ఆయన నటించిన `ఫిదా` విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..
* ఈ సినిమా కథ గురించి చెప్పండి?
- శేఖర్‌కమ్ములగారి సినిమాల్లో కథ అంటూ పెద్దగా ఏమీ ఉండదు. చాలా సన్నటి థ్రెడ్‌మాత్రమే ఉంటుంది. కానీ ఎమోషన్స్ మాత్రం చక్కగా క్యారీ చేస్తారు. `ఫిదా` అలాంటి సినిమా అవుతుంది. తండ్రీ కూతురి మధ్య, అన్నదమ్ముల మధ్య, పరస్పర విరుద్ధమైన ఆలోచనలున్న అమ్మాయి - అబ్బాయి మధ్య జరిగే అంశాలను చాలా సున్నితంగా చూపించారు.
* ట్రైలర్‌కి ఎలాంటి స్పందన వస్తోంది?
- ఇటు దిల్‌రాజుగారి బ్యానర్‌లో నేను చేస్తున్న తొలి సినిమా ఇది. శేఖర్‌గారితోనూ తొలిసారి చూస్తున్నా. ట్రైలర్ రిలీజైన తర్వాత ఒక్కసారి శేఖర్ ఫ్యాన్స్ అందరూ బయటికి వచ్చేశారు. ఆ విషయాన్నే నేను ఆయనతో చెప్పా. ఆయనకు ఎప్పుడూ ఓ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఫ్యాన్స్.
* మీరు సినిమా చూశారా?
- లేదండీ.. మా పెదనాన్నగారితో కలిసి ఇవాళో, రేపో చూస్తాను.
* ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- మెడిసన్ చదివే అబ్బాయిగా నటించాను. రియల్ లైఫ్‌లో ఎలాగూ మెడిసన్ చేయలేదు. కానీ ఇందులో చేశా. ఈ సినిమా కోసం నిజామాబాద్ బాన్సువాడలో కొన్నాళ్లున్నా. చాలా వండర్‌ఫుల్ ఎక్స్ పీరియన్స్. రిఫ్రెషింగ్‌గా అనిపించింది.
* శేఖర్‌కమ్ములగారి హీరోలు స్పెషల్‌గా హీరోయిజాన్ని చూపించరేమో కదా?
- అలాంటిదేమీ లేదండీ. ఆ మాటకొస్తే కంచెలోనూ నాకు హీరోయిజమ్ పెద్దగా ఉండదు. ఈ సినిమాలో ఒక ఫైట్ ఉంటుంది. అది కూడా నన్ను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా కాదు.
* మెగా ఫ్యాన్స్ సంతృప్తి చెందుతారని అనుకుంటున్నారా?
- వాళ్ల గురించి నాకు తెలుసు. వాళ్లకు భారీ యాక్షన్ మాస్ మసాలా కన్నా, మంచి సినిమాలో చేస్తే చాలు. అందుకే అలా చేస్తున్నా. నాక్కూడా పర్సనల్‌గా మంచి యాక్షన్ సినిమాలంటే ఇష్టం. ఇంకా నా కెరీర్‌లో అలాంటివి కుదరడం లేదు. కుదిరితే తప్పకుండా చేస్తాను.
* కొణిదెల ప్రొడక్షన్స్ లో మీ సినిమా గురించి?
- చరణ్ అన్న రాత్రి అడిగారు. తప్పకుండా చేద్దామన్నా. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాం.
Varun Tej interviewgallery
* మీ నాన్నగారిని మరలా నిర్మాతగా నిలబెట్టాలని ఉందా?
- నిర్మాతగానే కాదు, నాన్న ఏం చేసినా నేను తోడుంటాను.
* శేఖర్ కమ్ముల సినిమాలు వేరుగా ఉంటాయిగా.. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు?
- ఆయనే కాదు.. ఏ దర్శకుడి దగ్గరకు వెళ్లినా నాకేం తెలుసో ఎప్పుడూ చెప్పను. వారికేం కావాలో తెలుసుకుని చేస్తాను. శేఖర్‌గారిలో క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది.
* మీ కాలు ఫ్రాక్చర్ వల్ల షూటింగ్ ఆగిందట కదా?
- అవునండీ. దాదాపు రెండు నెలలు ఆగింది. అందుకే ఇప్పుడు సినిమా తర్వాత సినిమా ప్లాన్ చేసుకుంటున్నా.
* ఇందులో హీరోయిన్ పవన్‌కల్యాణ్ ఫ్యాన్ కదా.. ఆయన మేనరిజమ్స్ ఏమైనా నేర్పించారా?
- ఒక సారి చేస్తుంది. కానీ ఆడియో ఫంక్షన్‌లో బాబాయ్ పేరు విన్న ప్రతిసారీ అభిమానులు అరుస్తుంటే `ఎవరు ఆయన... ఎందుకు ఇంత మంది ఇలా అరుస్తున్నారు` అని అడిగింది. నేను వివరంగా చెప్పాను.
* సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వాడకం గురించి అందరూ మాట్లాడుతున్నప్పుడు యంగ్‌స్టర్‌గా మీకేం అనిపిస్తుంది?
- నేను రెండువైపుల వారూ మాట్లాడే విషయాల్లో న్యాయాన్ని గమనిస్తుంటా.
* మీ తదుపరి సినిమాలు..?
- ఇంకో వారంలో వెంకీ సినిమా మొదలవుతుంది.