pizza
Vijay Deverakonda (Telugu) interview about NOTA
అంద‌రూ అటెన్ష‌న్ కోసం ప్ర‌య‌త్నిస్తుంటాం - విజ‌య్ దేవ‌ర‌కొండ‌
You are at idlebrain.com > news today >
Follow Us

4 October 2018
Hyderabad

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ‌రీన్ న‌టించిన చిత్రం `నోటా`. స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్‌పై కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. అక్టోబ‌ర్ 5న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంట‌ర్వ్యూ....

ఏంటి మళ్లీ గడ్డం పెంచుతున్నారు?
- డియర్‌ కామ్రేడ్‌కి గడ్డంతో 5 రోజుల షూటింగ్‌ ఉంది. అందువల్ల దాని గురించి పెంచా. ఎందుకంటే ఇకపై అంత పెంచడానికి టైమ్‌ దొరకదు కూడా. మొన్నటిదాకా గీత గోవిందం ప్రమోషన్స్‌లో ఉన్నా. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నా.

ప్రమోషన్లు అదే పనిగా చేయడం వల్ల విసుగొస్తోందా?
- అంటే ఇప్పుడు తెలుగు సినిమా ప్రమోషన్లు చేస్తే ఈ టైమ్‌కి ‘ఇక అయిపోయింది. ఇక నా వల్ల కాదు’ అని అనిపించేదేమో. కానీ ఇప్పుడు చెన్నైకి వెళ్లాలి. కానీ అక్కడ మళ్లీ మొదలుపెట్టాలి. కొచ్చిలో చేయాలి. నిన్న బెంగుళూరులో చేశా. నాకు తమిళ్‌ రాదు కాబట్టి చెన్నైలో ఇంగ్లిష్‌ మాట్లాడుతా. వాళ్లు నన్ను చాలా విషయాల గురించి అడుగుతుంటారు. అది కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.

రోజుకు ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు?
- వీడియో ఇంటర్వ్యూలు 8-9 చేస్తున్నా. రేపటితో సమాప్తం.

ఉన్నట్టుండి స్టార్‌ అయిపోయారు. ఇంత బిజీ అయ్యారు. ఈ స్పేస్‌ ఎలా ఉంది?
- అంటే ఆలోచించడానికి సమయం దొరకడం లేదు. ఒక రోజు కూర్చుని ‘అరే మొన్ననే సినిమా విడుదలైంది. హిట్‌ అయింది...’ అని ఇలా ఆలోచించకముందే మరలా ఇంకో ప్రమోషన్‌కి వెళ్లాల్సి వస్తుంది. సో.. అందువల్ల నేను పని వెంటే పడుతున్నా. పనిలోనే గడుపుతున్నా కానీ, ఎలా ఉంది అని ఆలోచించడం లేదు. ఈ మధ్య పబ్లిక్‌ మీట్‌లు చేసినప్పుడు కాస్త హ్యాపీగా అనిపించింది. అంత మంది ప్రజలను చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కాస్త భయంగానూ ఉంటుంది. అయినా బావుంటుంది.

బిజీ అయిపోవాలనే మీరు కోరుకున్నారా?
- బిజీ కావాలనేం కోరుకోలేదు కానీ, సినిమాలు చేయాలని మాత్రం అనుకున్నా. మరీ ఇంత నిద్ర లేకుండా సినిమాలు చేయాలని అసలు అనుకోలేదు. కానీ, యాక్టింగ్‌ అంటే నాకు ఇష్టం. చేయగలిగితే.. ఎంత మంచిగా ఉంటుందో... ఇప్పుడు అర్థమవుతుంది. ఒకప్పుడు ‘ఇక నాకు యాక్టింగ్‌ వద్దు... ఒక బ్యాకప్‌ కావాలి’ అని అనుకున్నా. రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లోనో, డైరక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోనో చేరుదామని అనుకున్నా. ఒక బ్యాకప్‌ ఆప్షన్‌ ప్రిపేర్‌ చేశా. ఆ ప్రాసెస్‌లో ఉండగానే అలా నటన మొదలైంది. ఎక్కడెక్కడికో వెళ్తున్నా.

కాంట్రవర్సీలు కూడా ఇబ్బందికరంగానే ఉంటున్నాయా?
- నేనే ఎందుకు దొరుకుతున్నా.. ‘నన్ను వదలండ్రా’ అన్నట్టుంది నా పరిస్థితి. ‘అరే.. నేనే దొరుకుతానా మీకు.. ఊరికే నన్నెందుకు ఏసుకుంటున్నారు’ అని నేనే చెబుదామని అనుకున్నా.

ఈ సినిమా గురించి కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు..
- ఇది కాంగ్రెస్‌ పార్టీ వాళ్లను అడగాలి. నన్ను కాదు. అయినా ఈ రోజు వచ్చిన కాంట్రవర్సీని నేను ఫీల్‌ కావడం లేదు. నాకు చాలా సిల్లీగా అనిపిస్తోంది.

కాంట్రవర్శీ స్టార్‌ అయినట్టున్నారుగా మీరు..?
- ఇందాక చెప్పినట్టు ఈ రోజుది పెద్ద అనిపించడం లేదు. కానీ ‘గీతగోవిందం’ అప్పుడు చాలా వణికిపోయా. అంటే అప్పుడు మీకు అసలు విషయం చెప్పలేదు. ‘అప్పుడు మొత్తం సినిమా వెళ్లిపోయింది’. ఏదైతే రిలీజ్‌ సినిమాలో ఉండదో... ఆ స్టఫ్‌ కూడా వెళ్లిపోయింది. మా ఫైనల్‌ సినిమా 2.10గంటలుంటే, 2.30 సన్నివేశాలు వెళ్లాయి. సినిమా విడుదలైన తర్వాత పైరసీ కావడం అలవాటు. నా చిన్నప్పటి నుంచీ మూడో రోజు నాలుగో రోజు పైరసీ వస్తుందనేది అలవాటు. కానీ మొత్తం సినిమా లీకైపోతే.. అసలు ప్రేక్షకులకు సినిమా చూసే అవకాశం ఉండదేమో, అసలు సినిమా థియేటర్‌కి రాదేమో.. ప్రేక్షకులు థియేటర్‌కి రారేమో.. అని అనిపించింది. కానీ ఆ సినిమా హిట్‌ అయింది. ఇప్పుడు కాస్త ఉపశమనం ఉంది. ‘గీత గోవిందం’ లాగానే ‘ట్యాక్సీవాలా’ కూడా లీక్‌ అయింది.

గీతగోవిందం లీక్‌ వల్ల ఇబ్బందేమీ కాలేదుగా?
- నిజమే. ఇబ్బందేం లేదు. ఆ విషయం ఇప్పుడు తెలుసు. అప్పుడు కాదు. అప్పట్లో వాళ్లు యాంటి పైరసీ సెల్‌ నుంచి చాలా ఎఫర్ట్‌ పెట్టి అవన్నీ తీయించేశారు. ఇప్పుడు కూడా నా ఫోన్‌ తీసుకుని చూస్తే యాంటీ పైరసీ గ్రూప్‌ ఒకటి ఉంటుంది. ప్రతి రోజూ 200-300 మెసేజ్‌లు ఉంటాయి. ‘గీతగోవిందం’ విడుదల సమయంలో అయితే మరీ ఉండేవి. ఫోన్‌ నాన్‌ స్టాప్‌గా కొట్టుకుంటూ ఉండేవి.

ఏమైనా వివాదాలు మీకు బాగా కలిసొస్తున్నాయి..
- కలిసొచ్చేట్టు చేసుకోవాలి ఇంక. అసలు ఇదంతా సర్వైవల్‌ కదా. నేను వాటిని అలా వదిలేయలేను. ఎవరో నన్నేదో అంటే నేను వాటిని అలానే ఎలా వదిలేయగలను. ఇది నా జీవితం. నేనే ఎదురీదాలి.

ఇప్పుడు ‘నోటా’ మీద ఉన్న కాంట్రవర్శీలు రిలీజ్‌ని ఎఫెక్ట్‌ చేస్తాయని అనుకుంటున్నారా?
- విడుదల ఎఫెక్ట్‌ అయితే ఇంకో రూ.20కకోట్లు కలెక్షన్‌ వచ్చేటట్టు చేస్తా. వాళ్లట్ల కాంట్రవర్సీలు చేస్తే.. నేను కూడా ఏదో ఒకటి చేస్తా.

చాలా ఎర్లీగా పొలిటికల్‌ స్టోరీ చేస్తున్నట్టు అనిపించిందా?
- ‘ఎ’ లిస్టర్స్‌ ఎందుకు పొలిటికల్‌ స్టోరీలు చేయరో నాకు తెలియదు. కానీ నాకు మాత్రం కథ ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. చేసేశా. నేను ఎ లిస్టర్‌ అయినా చేసేవాడిని. న్యూ కమర్‌ అయినా చేసేవాడిని. మనందరం జీవితంలో ఎదిగే క్రమంలో రాజకీయ నాయకులనో, రాజకీయాల్లో జరిగిన ఏదో ఒక ఘటననో ఒక ఐరన్‌ఓర్‌ స్కామ్‌, త్రీజీ స్కామ్‌, వరదలు వచ్చాయి. జనాలు చచ్చిపోయారు... అలాంటి సందర్భాల్లో ‘అసలు ఏంటిది? ఏమనుకుంటున్నారు వీళ్లు.. అసలు ఇదెలా జరిగింది?’ అని మనందరం అనుకునే ఉంటాం. మన ఇళ్లల్లోనో, లేకుంటే ఫ్రెండ్స్‌తోనో అనుకునే ఉంటాం. అలాంటి ఫ్రసే్ట్రషన్‌ని పెట్టడానికి నాకో ప్లాట్‌ఫార్మ్‌ దొరికింది. నేను విన్నప్పుడు నాకు నచ్చింది. ఈ పాత్ర నేనే చేయాలని నాకు ఆశ కలిగింది. ఇంకో రెండు, మూడు సినిమాలున్నా నేను ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చేవాడిని. ఎందుకంటే పొలిటికల్‌ అంశాలు ప్రజల్లోకి త్వరగా వెళ్లాలి. అదే ప్రేమ కథను నేను మరుసటి ఏడాది చేసినా పెద్ద తేడా ఉండదు. ‘నోటా’ కథ మనకన్నా తమిళనాడులో రాజకీయాలకు ఎక్కువగా కనెక్ట్‌ అయి ఉంది. దీన్ని ఎంత ఫాస్ట్‌గా చేస్తే అంత బెటర్‌ అని అనిపించింది.

మీకు రాజకీయాల మీద ఎలాంటి అవగాహన ఉంటుంది?
- నాకు ఎప్పుడూ రాజకీయాల మీద అవగాహన ఉంటుంది. రాజకీయాల మీద ఓ అభిప్రాయం కూడా ఉంటుంది. నేను కోరుకునే పాలన ఎలాంటిదంటే.. నేను షూటింగ్‌కి వెళ్లాలని రోడ్డు మీదకు వస్తే నేను గంటల తరబడి ట్రాఫిక్‌లో ఉండకూడదు. మా ఇంటికి నీళ్లు రావాలి. మాకు కరెంట్‌ కోత ఉండకూడదు. రోడ్ల మీద గుంతలు ఉండకూడదు. సిటీలో గాలి కాలుష్యం ఉండకూడదు. లా అండ్‌ ఆర్డర్‌ బావుండాలి. ఎవరైనా ఇలాంటివే కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు స్కామ్‌లు జరిగాయని చెప్పే అమౌంట్‌లను చూస్తే కళ్లు తిరుగుతాయి. అది భోఫోర్స్‌ కానీ, మరొకటి గానీ.. ఏదైనా కళ్లు తిరుగుతాయి. నార్మల్‌ ఇండియాలో పుట్టి, ఇండియన్‌లా ఆలోచిస్తే ‘అరే.. ఈ డబ్బంతా మన గురించి వాడితే ఇంకెంత బావుంటుంది’ అనే ఫీలింగ్‌ కలుగుతుంది. ‘ఇన్ని లక్షల కోట్లు స్కామ్‌ చేసి, ఒక్కడివి ఏం చేసుకుంటావురా.. ఎన్ని తరాలకు కూడబెడుతావురా’ అని అనిపిస్తుంది. నేనే పొలిటీషియన్‌ అయినా... అంతో ఇంతో పర్సెంటేజ్‌ కొడతా అని నా పీలింగ్‌. సినిమాల్లో కూడా మేనేజర్లు ఉంటారు. ఇప్పుడు నేను ప్రొడక్షన్‌ హౌస్‌ పెట్టా. ప్రతి సినిమాకూ మేనేజర్లకు 25-30 వేలు ఇస్తాం. ప్రతి సినిమాకూ కమిషన్లు, గిమిషన్లు వెళ్తాయి. అంతమాత్రాన మనం అప్‌సెట్‌ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను కూడా బతకాలిగా.. నా వాదన ఏంటంటే.. ‘నేను పెట్టే అమౌంట్‌లో పది శాతం నువ్వు తీసుకో.. 90 శాతం సినిమాకు పెట్టు’ అనేదే. అంటే అలా తీసుకోవడం ఓకేనా... అంటే ఇది ఓకే అని కాదు... కనీసం నా ఆలోచన గురించి చెబుతున్నా. ఎందుకంటే ఇది మానవ నైజం. ఎందుకంటే నేను ఏదన్నా నాకు ఓ ట్విస్ట్‌ ఉంటుంది. అలాంటి కాంట్రవర్శీలు రాదు.

సినిమా అంతా పొలిటికల్‌ కరెప్షన్‌ ఉంటుందా?
- సినిమా అంతా కాదు. ఒక సెటిల్డ్‌ లేయర్‌ ఉంటుంది.

ఇందులో మెసేజ్‌ ఉంటుందా?
- అలాంటిదేమీ కాదు. సినిమాకు ‘నోటా’ అనే టైటిల్‌ కలిసొచ్చింది. ఇందులో ‘నోటా’ అనే బటన్‌ గురించి మేం మాట్లాడటం లేదు. అయితే సినిమా ఏంటంటే ‘అరే.. ఎగ్జిస్టింగ్‌లో ఉన్నవాళ్లు మాకు నచ్చడం లేదు. మీ ఆప్షన్లు మాకు నచ్చడం లేదు’ అని చెప్పే ఉద్ధేశమే. సినిమా ఏంటంటే నాలాంటి అబ్బాయిని... ఏపీ ఎన్నికల్లోనో, తెలంగాణ ఎన్నికల్లోనో తీసుకెళ్లి బలవంతంగా నిలబెడితే, అప్పటిదాకా ఏదీ తెలియని, ఇష్టం లేని అబ్బాయి కూడా అప్పుడు నేర్చుకుని, ఓ వ్యక్తిగా ఎలా రియాక్ట్‌ అవుతాననేది సినిమా. ఒకసారి దిగాక ఎగ్జిస్టింగ్‌ పొలిటికల్‌ సిస్టమ్‌లో ఓ నార్మల్‌ బాయ్‌ ఎలా చేశాడనేది కథ.

లీడర్‌, భరత అనే నేను.. చిత్రాలకన్నా ఇది ఎలా డిఫరెంట్‌గా ఉంటుంది?
- కొన్ని విషయాల్లో వాటితో తప్పకుండా పోలికలు ఉండవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలన్నీ రాజకీయాల గురించి ప్రస్తావన ఉన్నవేగా. కానీ ఇది చాలా రియల్‌ స్పేస్‌ అన్నమాట. ఓ ఫిక్షనల్‌ కేరక్టర్‌ని, చాలా జరిగిన, ఎప్పటి నుంచో జరుగుతున్న ప్యాటర్న్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌లో పెడితే రియల్‌ బిహేవియర్‌ ఆఫ్‌ పొలిటీషియన్స్‌ మధ్య ఆ కేరక్టర్‌ ఏం చేశాడనేది కథ. నాకు రియల్‌ పాత్రలు ఇష్టం. రియల్‌గా చేయడం ఇష్టం. ఈ సినిమా చాలా రియల్‌గా ఉంటుంది.

తమిళ్‌ పీపుల్‌కి ఎక్కువ రీచ్‌ అవుతుందని చెప్పారు. అది ఏవిధంగా?
- కొన్ని డైరక్ట్‌ ఇన్సిడెంట్స్‌ ఉన్నాయి అక్కడివి.

ఈ సినిమాను పూర్తిగా తమిళ ప్రేక్షకుల కోసం చేశారా? తెలుగు ప్రేక్షకుల కోసం చేశారా?
- దీన్ని మేం కేవలం ప్రేక్షకుల కోసం చేశాం. ఇది ఓ మంచి కథ. ఈ సినిమా చేసేటప్పుడు నాకు తమిళ పాలిటిక్స్‌ గురించి ముక్క కూడా తెలవదు. అమ్మ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ తెలుసు కానీ, గ్రౌండ్‌ లెవల్లో ఏం జరుగుతుందో మాత్రం అసలు తెలియదు. కథ విన్నప్పుడు నాకు ఎక్స్‌ట్రీమల్లీ ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. పీపుల్‌ అలాగే ఉంటారుగా ఎక్కడైనా. ఆ లెవల్లో నేను కనెక్ట్‌ అయ్యా. పొలిటికల్‌ సిస్టమ్‌ ఎలా ఉంది.. ఈ సినిమాలో ఉన్న సన్నివేశాల వెనుక ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయని తెలుసుకోవడం మొదలుపెట్టా. ఈ స్టోరీని బీహార్‌లో అయినా, బాంబేలో అయినా... ఎక్కడైనా ఈ కథ పనికొస్తుంది.

జయలలిత గవర్నమెంట్‌లో జరిగిన అవినీతిని చూపించారని...
- సినిమాలో చూస్తే తెలుస్తుంది.

అమ్మ చనిపోయిన సన్నివేశాలను కూడా చూపించారని రూమర్లు వస్తున్నాయిగా..
- రూమర్ల గురించి ఏం మాట్లాడాలి..

ఓ సామాన్యుడు పొలిటీషియన్‌ అయ్యే పాత్ర చేశానన్నారు. మీరెలా చేయగలిగారు? మీ చేత దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ ఎలా చేయించారు?
- నాకు ఫస్టాఫ్‌ మొత్తం ముందే పంపించేశారు. చాలా సన్నివేశాల్లో మంచి కంటెంట్‌ ఉండేది. ఆ సన్నివేశాల గురించి వినేటప్పుడు, చేసేటప్పుడు ‘అరే నేనైతే ఇలా చేసేవాడినిగా’ అని అనుకున్నా. అదే విషయాన్ని ఆనంద్‌తో చెప్పేవాడిని. తెలుగులో అయితే నేనే ఇంప్రూవ్‌ చేసేవాడిని. కానీ తమిళ్‌లో వాళ్లకు చెప్పి, నేను రాయించాను.

మొన్న పబ్లిక్‌ మీటింగ్‌లో దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా అని ఎమోషనల్‌గా చెప్పారు..?
- ఇంతకు ముందు కూడా అర్జున్‌రెడ్డికి అలాగే చెప్పా. అప్పుడు నన్ను అందరూ ఏసుకున్నారుగా.

interview gallery



రెండు భాషల్లో చేయడం ఎలా ఉంది?
- చాలా కష్టమే. వాళ్లు నా దగ్గరకు వచ్చి తెలుగులో చేద్దామని అన్నారు. నేనే నాలుగు భాషలకూ రెలెవంట్‌ కాబట్టి చేద్దామనుకున్నా. అయినా అంత ధైర్యం చేయలేక ‘తెలుగు, తమిళ్‌’లో చేశాం. కావాలంటే తమిళ్‌ నేర్చుకుంటా అని చెప్పా. సత్యరాజ్‌గారు, నాజర్‌గారిని ప్రముఖంగా తీసుకుని మేం దీన్ని చేశాం. ఈ సినిమాను తమిళ్‌లో తెలుగు టచ్‌తో, తెలుగు యాడెడ్‌ వర్షన్‌తో చేశాం.

ప్రొడక్షన్‌ హౌస్‌ గురించి చెప్పండి?
- ముందుగా కూర్చుని ప్లాన్‌ చేసి చేసిందేమీ కాదు. ఓ రోజు ఎందుకో అనిపించిందని మొదలుపెట్టా. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఎందుకు పెట్టకూడదు? ఎందుకు పెట్టాలి’ అనే ఆలోచన నుంచి పుట్టిందే ప్రొడక్షన్‌ హౌస్‌. దేవరకొండకు నాదైన ఇంగ్లిష్‌ ట్రాన్స్‌లేషన్‌తో కింగ్‌ ఆఫ్‌ ద హిల్‌ అని పెట్టాను. అంతేగానీ, ఇంకేమీ కాదు. ‘పెళ్లిచూపులు’ సమయంలో నేను, తరుణ్‌ ఓ స్ర్కిప్ట్‌ని నమ్మాం. ఆ రోజుల్లో మమ్మల్ని నమ్మి రూ.60లక్షలను పెట్టేవారు లేరు. అది పెట్టినా, ఆ తర్వాత మళ్లీ విడుదల చేయడానికి ఎంత తిరిగాం. మేం నమ్మిన విషయం... బావుంటుందని తెలిసినా, మేం చాలా తిరిగాం. అప్పట్లో మాలో విషయం ఉన్నట్టు.. ఇప్పటివారిలో విషయం ఉంటే, తప్పకుండా ఎంకరేజ్‌ చేస్తాం. కాకపోతే నాకు నమ్మకం కుదరాలి.

మూడు పేజీల డైలాగ్‌ చెప్పారని ఉంది..?
- అవును. నిజమే. అది నాకు నెరేషన్‌ ఇచ్చినప్పుడే ఇంతింత డైలాగులు ఉన్నాయని చెప్పారు. దాని ప్రకారమే చెప్పాను. ఆ మూడు పేజీల డైలాగులను నేను తెలుగులో చెప్పలేదు. తమిళ్‌లో చెప్పాను. తెలుగులో డబ్బింగ్‌ మాత్రమే చెప్పా.

ఈ పాత్ర కోసం పొలిటికల్‌ లీడర్స్‌ని ఎవరినైనా ఫాలో అయ్యారా?
- మేం స్టైలింగ్‌ వేజ్‌ కేటీఆర్‌ను ఫాలో అయ్యాం. యాక్చువలీ డిటో టు డిటో ఆయన లుక్స్‌ కొన్ని దింపాం. నాకు వ్యక్తిగతంగా ఆయనంటే చాలా ఇష్టం. ఆయన యంగ్‌ పొలిటీషియన్‌గా ఉంటారు. మొత్తం ఖాదీ ఖాదీ అన్నట్టు కాకుండా, షర్ట్‌ వంటివి వేసుకుంటారు. అందుకే ఆయన్ని ఫాలో అయ్యాం.

మీకు నచ్చిన సీఎం ఎవరు?
- నాకు అంత ఎక్కువగా తెలియదు. నా చిన్నప్పుడు చంద్రబాబునాయుడు లీడర్‌షిప్‌ ఇష్టం. హైదరాబాద్‌లో సిటీ బూమ్‌ ఆయన హయాంలోనే వచ్చింది. ప్రభుత్వోద్యోగులు ఆయన హయాంలో చాలా కంప్లయింట్స్‌ ఇచ్చేవారు. అప్పుడే ‘చెక్‌ ఇన్‌.. చెక్‌ ఔట్‌’ వంటివి ప్రభుత్వ కార్యాలయాల్లో మొదలయ్యాయి. అప్పుడు చాలా మంది ప్రభుత్వోద్యోగులు తిట్టుకుంటూ హడావిడిపడుతూ వెళ్లేవారు. నేను ఆ విషయాలను గమనించేవాడిని. ఎవరైనా స్ట్రిట్‌గా ఉంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ సిస్టమ్‌ నాకు చాలా నచ్చుతోంది. లాటాఫ్‌ స్టెబిలిటీ ఉందిప్పుడు. కేటీఆర్‌ను కలిసిన తర్వాత ఆయన కేవలం ఫొటోలకు ఫోజులిచ్చే వ్యక్తి కాదని అర్థమైంది. ఆయనకే కొన్నిసార్లు కోపం వస్తుంటుంది. అలాంటి రాజకీయనాయకుడు నాకు కొత్త. ఎందుకంటే చాలా మంది రాజకీయనాయకులు ఏం చేసినా ఫొటోల కోసమే చేస్తున్నట్టుంటారు. ఉదాహరణకు ప్లాస్టిక్‌ మానేద్దామంటే ప్రెస్‌ని పిలిచి ప్లాస్టిక్‌ మానేద్దామని చెప్పి ఫొటోలు తీసుకుంటారు. మరుసటి రోజు ప్లాస్టిక్‌ బాటిల్‌లో తాగుతుంటారు. కానీ కేటీఆర్‌ అలాంటి పనులు చేయరు.దాన్ని మించి ఆలోచిస్తారు. ఫొటో కాదురా.. మనం దాన్ని మించి ఆలోచించాలి. ఆచరించాలి అని అంటారు. ఒకరోజు నేను, ఆయన మాత్రమే మా ఇంట్లో కూర్చుని ఉన్నాం. ‘అరే.. నువ్వు యాక్టర్‌వి కదా. ఖాదీ వసా్త్రలను ప్రమోట్‌ చేయొచ్చు కదా. కనీసం వారానికి ఒకసారైనా వేసుకోవాలి కదా.. షూటింగ్‌కి ప్లాస్టిక్‌ని అవాయిడ్‌ చెయ్‌. కాపర్‌ వాటిలో నీళ్లు తాగు. చాలా పెద్దది రాగిలో కొనుక్కో’ అని అన్నారు. ఇవన్నీ ప్రజలకు చెప్పడానికి మా చుట్టూ ఆ రోజు మీడియా లేదు. ఇదిగో ఈ రోజు మీరు ఇలా అడగడం వల్ల నేను ఇదంతా చెబుతున్నానంతే. అప్పుడు నాకు అనిపించిదంటే ఫొటోలకు ఫోజులివ్వడం కంటే, ఇంకేదో ఆలోచిస్తున్నారు. సిటీని, రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనే ఆలోచనలతో ఉన్నారు వాళ్లు. ఇవన్నీ చెప్పకూడదు నేను.

తెరాసకు మీరు సపోర్ట్‌ చేస్తారనే ఆలోచన ఉంది..?
- టీఆర్‌ఎస్‌ను తెలుగులో తెరాస అని అంటారా. నేను పోయిన సారి కూడా వాళ్లకే ఓటు వేశా. వాళ్లు బాగా చేస్తారని నమ్మకం ఉన్నన్నాళ్లూ వాళ్లకే వేస్తా. ఓటు నా వ్యక్తిగత విషయం.

నోటా సినిమా టీఆర్‌ఎస్‌కు సపోర్ట్‌ అయ్యేటట్టు ఉందని కొన్ని రాజకీయపార్టీలంటున్నాయి..?
- అసలు ఏ పొలిటికల్‌ పార్టీలు చేస్తున్నాయో తెలుసా.. గొడవలు. మా పార్టీకన్నా ‘నోటా’ బెటర్‌ ఆప్షన్‌ అని ఎక్కడ అనుకుంటారోనని భయపడుతుంటారో... వాళ్లన్నమాట. ‘మాకన్నా నోటా బెటర్‌ ఆప్షన్‌గా ఉందని’ భయపడేవారు ఈ రకాలుగా చేస్తున్నారేమో.

ఇదంతా అటెన్షన్‌ కోసమేనా?
- నా దృష్టిలో మనందరికీ అటెన్షన్‌ కావాలి. ఏదో ఒక రకంగా అటెన్షన్‌ కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. మనం చేసేదంతా ఇతరుల దృష్టిని ఆకట్టుకోవడానికే చేస్తుంటారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved