pizza
A view on Kanche by Madhurima Durga Srihari
You are at idlebrain.com > news today >
Follow Us

22 October 2015
Hyderabad

తెలుగు సినిమా మనకెప్పుడూ చూపించని రెండవ ప్రపంచ యుద్ధం, "స్వచ్ఛమయిన" రక్తం గల జర్మను జాతి కోసమంటూ హిట్లరు సృష్టించిన మారణహోమం, అదే సమయంలో మన తెలుగు దేశంలో కులాల చిచ్చుతో రగిలిన ఒక చిన్న ఊరు, ఆ ఊళ్ళో రెండు అందమయిన మనసులు, వారిద్దరి మధ్య కొన్ని ప్రేమలేఖలు. ప్రేమ, పగ, రాజకీయం, జాతి అహంకారం, సైనికుల వీరత్వం, దాసు గాడి పిరికితనం, సునిశితమైన హాస్యం, కొంచెం త్యాగం, కొంచెం పశ్చాత్తాపం. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా హీరో, హీరోయిను, విలను, జ్ఞానశేఖర్ గారి కేమెరా లోనుంచి ఎంతో కనులవిందుగా కనపడే ఓ పల్లెటూరు, 1930 లలో చెన్నపట్నం, 1940 లలో ఇటలీ, వాటికి తోడు అద్భుతంగా కుదిరిన చిరంతన్ భట్టు గారి సందర్భోచితమైన సంగీతం, వివరణ అవసరం లేని సిరివెన్నెల గారి సాహిత్యం. మనసుకి హత్తుకునే సరళమైన సంభాషణలూ, ఎక్కడా, ఏ విధంగానూ రాజీ పడకుండా తాననుకున్న కథను చాలా నిజాయితీగా తెరకెక్కించిన దర్శకుడి ప్రతిభా, ప్రయత్నం, ఇవన్నీ కలిపితే "కంచె" సినిమా. ప్రేక్షకుల అభిరుచులనీ, తెలివితేటలనూ గౌరవిస్తూ వారి అంచనాలను మించేలాగా, తాను నమ్మిన కథలనీ, విలువలనీ రాజీ పడకుండా నిబద్దతతో అందించే దర్శకులని చూస్తే భలే గర్వంగా అనిపిస్తుందిలే.

క్రిష్ ఊహించిన కథా, కథనాలు కళ్ళకు కట్టినట్టు కనిపించినా, తను ఊహించిన భావోద్వేగాలు మాత్రం ప్రేక్షకులకు పూర్తిగా చేరకుండా కొన్ని సన్నివేశాలలో ఏదో ఒక కంచె అడ్డుపడిందని అని నా అనుమానం. "గమ్యం" చూసిన చాలా రోజుల తర్వాత కూడా నేను "గాలి శీను"ని మర్చిపోలేకపోయాను. "వేదం" చివరిలో "ఏయ్ పటేలా అంతే" అంటూ అ ముసలాయన వేలు చూపిస్తూ తిడుతుంటే, హాల్లో జనాలంతా ఉద్వేగంగా ఒక ఐదు నిముషాలు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. క్రిష్ నుంచి వచ్చే ప్రతీ చిత్రాన్ని, సహజంగా అదే స్థాయిలో ఊహించుకుంటాము. "కంచె" లో కొన్ని కీలకమైన భావోద్వేగాలను రాబట్టుకునే ప్రయత్నంలో అక్కడక్కడా ఎందుకో దర్శకుడు కొంచెం తడబడ్డాడనిపించింది.

కులమత విద్వేషాలు అనేవి మనుషుల స్వార్థ పూరిత రాజకీయాల వలన కొనసాగుతున్నవి,నిజమే. ఒక అనామకుడైన హిట్లరు, అప్పటికే ఎంతో progressive ఆలోచనలు ఉన్న జర్మనీయులను అంత భయంకరమైన మారణ హోమానికి ఉసిగొల్పేంత విధంగా ఎలా ప్రభావితం చేయగలిగాడు? భారత దేశంలో ఉన్న ఆర్యన్లు తాము దేవుడి బిడ్డలమనీ, తమది స్వచ్చమైన జాతి అని, దేవుడు ఈ సమస్థ భూమండలాన్ని, అందులో ఉన్న మొక్కలనీ, జంతువులని, అలాగే "తక్కువ" జాతి మనుషులనీ తమ అవసరాల కోసమే సృష్టించాడని, కాకమ్మ కబురులు చెప్పి, వర్ణ వ్యవస్థని సృష్టించారు. దానికి అగ్ర భాగాన ఒక జాతి వారు కూర్చుని, మిగిలిన జాతుల వారిని తరతరాలుగా అణగదొక్కారు. ఇది బ్రిటిషు వాడి అభూత కల్పన కాదనడానికి సాక్ష్యం, బ్రిటిషు వాడి కన్నా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఉన్న మనుస్మృతి, బుద్దుడి చరిత్రలో కనపడే ఆధారాలు, ఇంకా మనం ఇప్పటికీ గుడ్డిగా కళ్ళకద్దుకుంటూ ప్రశ్నించకుండా వెనెకేసుకొచ్చే చాలా మత గ్రంథాలు. జర్మన్లకు పూర్వీకులు ఈ ఆర్యన్లు కాబట్టి, తాము కూడా ఆర్యన్లమేనని, కావున ఈ ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించే అధికారం వారికుందని హిట్లరు జర్మన్లను నమ్మించాడు. తన ఆర్యన్ కథకి ఆలంబనగా, స్వస్తికను తన పార్టీ చిహ్నంగా ప్రకటించాడు. వీటి గురించి సినిమాలో కొంచెం కూడా స్పృశించకుండా, స్వస్తిక యొక్క విలువ తెలియక హిట్లరు దానిని తప్పుగా వాడుకుంటున్నాడని పొడిపొడిగా చెప్పి వదిలేసారు. అది చాలా నిరాశ కలిగించింది.

ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా జరిగిన ప్రతీ దారుణమైన బీభత్సాలు, అణిచివేతల వెనక మనిషి స్వార్థమొక్కటే కాదు, ఆ స్వార్థాన్ని పెంచి పోషించిన అజ్ఞానం, దాని మూలంగా మొలకెత్తిన మూర్ఖత్వం ముఖ్యమైన కారణాలు. ఆ అజ్ఞానాన్ని పోగొట్టి, మనల్ని చైతన్యవంతుల్ని చేయగల అద్భుతమైన కళా సాధనాలలో సినిమాది అగ్ర స్థానం. కానీ ప్రెతొక్కడూ, మన బుర్రల్ని కట్టేసుకుని సినిమా ని చూడమనేవాడే. అరువు తెచ్చుకున్న సాంకేతికతతో, మన తెలుగు సినిమా స్థాయిని పెంచేద్దామనుకునేవాడే. ప్రేక్షకుడి ఆలోచనా స్థాయీ, విమర్శనాత్మక ధోరణి పెరగకుండా, యే భాషా సినిమా కూడా ఎదగలేదు. మనుషుల మధ్య బంధాలకి భాషతో సంబంధం లేదని ఈ సినిమాలో ఎంతో సునిశితంగా చెప్పిన క్రిష్, తన ప్రతీ సినిమాలో చూపిస్తుంది ఒక సగటు మనిషి కథే. రాతను అర్థం చేసుకోవడానికి భాష కావాలి కాని, మన కథని, మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉండే భావాలనీ, ఆవేశాలని తెర మీద చూసి అర్థం చేసుకోవడానికి మనిషయితే చాలు. "సామాన్య" ప్రేక్షకులకు "కొన్ని రకాల కథలు" చేరవేమోనని సందేహపడే దర్శకులే ఎక్కువగా ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో, సామాన్య ప్రేక్షకుడి మేధస్సుని నమ్మి కథలు రాసుకుని, క్రిష్ ఒక్కడే సినిమాని సినిమాగా తీస్తున్నాడు, ప్రేక్షకుల పరిణతిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.

- Madhurima DurgaSrihari


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved