pizza
Legend completes 100 days in 31 Centers
You are at idlebrain.com > news today >
Follow Us

4 July 2014
Hyderabad

31 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న నటసింహం బాలకృష్ణ 'లెజెండ్'
ఈ ఏడాదితో నటునిగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ

ఓ స్టార్ హీరో నటవారుసుడు సినిమాల్లో అడుగుపెడితే ఉండే అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇక తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో ఆకట్టుకుని, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అనిపించుకున్న నందమూరి తారక రామారావు వారసుడు బాలకృష్ణ రంగప్రవేశం అప్పుడు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో భారీ అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలకృష్ణ అనతి కాలంలోనే టాలీవుడ్‌లో అగ్ర హీరోగా ఎదిగారు. ఈ ఏడాదితో బాలకృష్ణ నటుడిగా రంగ్రపవేశం చేసి 40 ఏళ్లయ్యింది.

తాతమ్మ కలతో...
1974లో 14 ఏళ్ళ వయసులోనే బాలనటుడిగా 'తాతమ్మ కల' చిత్రంతో తెరంగేట్రం చేశారు బాలకృష్ణ. ఆ తరువాత 'రామ్‌ రహీం', ‘అన్నదమ్ముల అనుబంధం’ చిత్రాల్లో నటించి, తన నటవారసత్వాన్ని కొనసాగించారు. తన తండ్రి స్వీయ దర్శకత్వంలో వచ్చిన దాన వీర శూర కర్ణ, అక్బర్‌ సలీం అనార్కలి, శ్రీ మద్విరాట పర్వం, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం, శ్రీ మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి మెప్పించారు బాలకృష్ణ. ముఖ్యంగా శ్రీ మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రలో పోషించిన సిద్ధయ్య పాత్ర బాలకృష్ణలో ఎంత మంచి నటుడు ఉన్నాడో నిరూపించింది.

‘సాహసమే జీవితం’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారారు బాలకృష్ణ. పౌరణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటిస్తూ, ఎన్టీఆర్ కి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. మంగమ్మగారి మనవడు, కథానాయకుడు, బాబాయ్ అబ్బాయి, భలే తమ్ముడు, సీతారామ కళ్యాణం, అనుసూయమ్మగారి అల్లుడు బాలకృష్ణను స్టార్ హీరోగా నిలిపాయి. ఇక, ఆదిత్య 369 లాంటి సోసియేఫాంటసీ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో ఓ మైలురాయి. ఆ చిత్రం తరువాత వచ్చిన జానపద చిత్రం భైరవద్వీపం సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇక, సమరసింహారెడ్డి అయితే 1990లలో ఓ ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాత రెండేళ్లకు చేసిన నరసింహ నాయుడు అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను తిరగ రాసింది. తర్వాత లక్ష్మీనరసింహా, సింహా తదితర చిత్రాల్లో నటునిగా బాలయ్య ఏ స్థాయిలో విజృంభించారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక, ఇటీవలి కాలంలో 'శ్రీరామరాజ్యం'లో రామునిగా బాలయ్య ఒదిగిపోయిన వైనం చూసినవాళ్లు, నేటి తరంలో పౌరాణిక పాత్రలు చేయగల సత్తా ఉన్న నటుడు బాలకృష్ణే అని ప్రశంసించారు. రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తూ, 40ఏళ్లుగా నిరవధికంగా సినిమాలు చేస్తున్న బాలయ్య వంద చిత్రాలకు చేరవయ్యారు. ఈ నలభైఏళ్లల్లో చిన్న గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసిన ఘనత బాలయ్యది. ఇలాంటి రికార్డ్ ఏ కొంతమంది నటులకో మాత్రమే దక్కుతుంది.

'లెజెండ్' ఘనవిజయం
'సింహావంటి సంచలనాత్మక విజయం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం 'లెజెండ్'. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంటతో కలిసి సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించి, కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా ఘనవిజయానికి ప్రధాన కారణం బాలయ్య నటన. ఇక, ఇలాంటి పవర్ ఫుల్ మాస్ కమర్షియల్ మూవీస్ ని తీయడంలో బోయపాటి శ్రీను ప్రతిభే వేరు. బాలయ్య పాత్రల్లోని భిన్న కోణాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక, జగపతిబాబుని ప్రతినాయకుడిగా తీసుకోవాలనుకున్న బోయపాటి ఆలోచనను అభినందించాల్సిందే. అప్పటివరకు నాయకునిగా ఆకట్టుకున్న జగపతిబాబుని ప్రతినాయకునిగా ఆవిష్కరించడం చిన్న విషయం కాదు. జితేంద్ర పాత్రను జగపతిబాబు అద్భుతంగా చేశారు. కథానాయికలు రాధికా ఆప్టే, సొనాల్ చౌహాన్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే, సంభాషణలు ఓ హైలైట్. 'నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడు.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుతుంది' వంటి సంభాషణలు బాగా ఆకట్టుకున్నాయి. రామ్ ప్రసాద్ కెమెరా పనితనం ఓ ఎస్సెట్. sఇలా 'లెజెండ్'కి అన్నీ బాగా కుదిరాయి. అందుకే దేశ, విదేశాల్లో ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. రేపు (05.07.) 31 కేంద్రాల్లో ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంటోంది.

ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో బాలయ్య ఓ చిత్రంలో కథానాయకునిగా నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా బాద్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే, బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ ముందున్నది రెండే లక్ష్యాలు. ఒకటి సినిమాలు.. రెండోది ప్రజాసేవ. హిందూపురాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే బాలయ్య పలు ప్రణాళికలు వేశారు.

'లెజెండ్' వంద రోజుల కేంద్రాలు
1. వైజాగ్ - లీలామహల్
2. అనకాపల్లి - రాజా
3. కాకినాడ - ఆనంద్
4. రాజమండ్రి - కుమరి
5. ఏలూరు - సత్యనారాయణ
6. తణుకు - ప్రతాప్ కాంప్లెక్స్
7. విజయవాడ - అన్నపూర్ణ
8. గుడివాడ - బొమ్మరిల్లు
9. మచిలీపట్నం - సిరి వెంకట్
10. గుంటూరు - పల్లవి
11. తెనాలి - వీనస్
12. చిలకలూరిపేట - కె.ఆర్. ధియేటర్
13. వినుకొండ - కీర్తి
14. ఇంకొల్లు - రామకృష్ణ
15. నెల్లూరు - నర్తకి
16. కందుకూరు - కోటీశ్వర
17. కర్నూలు - ఆనంద్
18. నంధ్యాల - రామ్ నాథ్
19. ఆధోని - ద్వారకాశ్రీ
20. ఎమ్మిగనూరు - మినీ శివ
21. అనంతపూర్ - గౌరి
22. హిందూపూర్ - గురునాథ్
23. ధర్మవరం - వరలక్ష్మి కాంప్లెక్స్
24. గుంతకల్ - ఎస్ ఎల్ వి
25. కదిరి - మౌనిక
26. తిరుపతి - ప్రతాప్
27. వరంగల్ - సునిల్
28. తాడిపత్రి - దాదా (షిఫ్టింగ్)
29. నందికొట్టూరు - కృష్ణ (షిఫ్ట్)
30. ప్రొద్దుటూర్ - అర్చన (షిఫ్ట్)
31. శ్రీకాళహస్తి - శ్రీనివాస్ (షిఫ్ట్)


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved