pizza
My Movie - Mithunam
మిథునం ... జీవిత సాగర మధనం
You are at idlebrain.com > news today >
Follow Us

శ్రీరస్తు శుభమస్తు.... శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకమ్... ఇక ఆకారం దాల్చనుంది కొత్త జీవితమ్... అంటూ ఆరుద్ర-బాపు గార్లు కలకాలం నిలిచిపోయేలా వర్నించారు..పెళ్లి ఘడియలని.

ఆనక పిల్లల్ని కని. పెద్ద చేసి, వారికి రెక్కలొచ్చి దూరతీరాలకు వెళ్ళిపోయాక, తిరిగి నవ దంపతుల వలె ..ఇంకా చెప్పాలంటే ..పసి దంపతులుగా మారే వైనమ్... మరింత హృద్యం గా ఈ మిధునం లో చూడొచ్చు. తనికెళ్ళ భరణి గారి చలవ... SP బాలసుబ్రమణ్యం, లక్ష్మిల నటనా చాతుర్యం మిథునానికి వెన్నుముక.

అమ్మా నాన్నలు.. పసి పిల్లలు
స్నానం చేస్తుంటే కళ్ళలో కుంకుడు కాయి పడిందంటూ మారాం చెయ్యటం, అలిగినప్పుడు చెట్టెక్కడం...దొంగతనం గా బెల్లం తినడం...అలా చేస్తూ వంటింట్లో ఉన్నవి కింద పడేస్తూ వంటి మీద వేసుకోవడం .. వైకుంటపాలి లో తొండి చేయడం. సీతాకోకచిలుక కోసం పంచె ఊడిపోయేలా పరుగులు తీయడం,ఎప్పుడో జరిగిన పెళ్లి లో లాంచనాల లోటు గురించి పదే పదే వెక్కిరించుకోవడం...అదేదో ద్రాక్షారామం సంభందం గురించి మొగుణ్ణి ఉడికించడం, దిష్ఠి బొమ్మలతో కొట్టుకోడం ఇలా ఒకటేంటి అన్ని వయసు మల్లినా మురిపించే పసి పిల్లల చేస్టలే.

ఘుమఘుమలొయ్..ఘుమఘుమలు...
ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర వంటది. ఆ ఇంటాయనకి పాపం తిండి యావ ఎక్కువ. పాపం అందుకే ఆ శ్రీమతి తన అమృతహస్తాలతొ నిరంతరం షడ్రసోపేతమైన వంటకాలు సిద్ధం చేస్తుంది . జొన్నవిత్తుల గారు రాసిన కాఫీ దండకం వింటే అమాంతం కాఫీ తాగాలాని మనసు లాగకపోతే అడగండి . పండగ పూట ప్రొద్దున్నే లేపి మాపటి దాక కడుపు మాడ్చావని మారాం చేస్తాడు అప్పలదాసు. పెళ్ళాం మౌనవ్రతం లో ఉన్నా సరే చారు ఇంగువ గురించి చెప్పి ఆమెని విసిగిస్తాడు. దొంగ బెల్లం కోసం ఆరాటం ... రాత్రి వేళ కూడా సెనగలు మామిడి తాండ్ర అంటూ అనుక్షణం తిండి గురించే పాపం ఆయన తపన. అందుకే అతని మనవడు అప్పడం తాత పొట్ట మీద ఏకంగా ఒక కార్టూన్ ఫిలిం తీసేస్తాడు. "ఆవకాయ మన అందరిది గోంగూర కూడా మనదేలే ... ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లు.. ఎందుకు పాస్తాలింకేందుకులే " అనే పాట వింటే అప్పుడే బొంచేసినా మళ్ళి ఆకలి వేస్తుంది. ఆఖరి లో బుజ్జి మొగుడి మీద వేసే విసురు " తిండి కలిగితే కండ కలుగునని గురజాడ వారు అన్నారు, అప్పాదాసు ఆ ముక్క పట్టుకుని ముప్పూటల తెగ తిన్నారు"

ఒకరికి ఒకరు...
ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ... పిల్లలంతా ఎం చెక్కా విదేశాలు లేక హైదరాబాదులకి చెక్కేస్తే ..పాపం మిగిలేది వారిద్దరే, వారికి తోడుగా ఎన్నో జ్ఞాపాకలు. ఖాళిగా కూర్చోకుండా సకలకళా వల్లబుని వలే తోట పని.ఽఅవు దూడల పని దూది ఏకడం లాంటివి చెయ్యటం అప్పదాసుకి ఇష్టం . ఒకసారి బావి లో దొరకిన పాత వస్తువుల్ని చూసుకుంటూ పిల్లల్ని గుర్తుకు తెచ్చుకుంటారు . వారు ఫోన్ చేసినపుడల్లా వారి ఊసులతో కళ్ళు తడుపుకుంటారు.

ఒక సారి పాత చీరలు చూపిస్తూ ...తన భార్య ఎ సందర్బం లో ఏ చీర కట్టుకుందో అప్పలదాసు చెపుతుంటే ఆమె తో పాటు మనకి ముచ్చటేస్తుంది. నేను లేకుండా ఒక్క దానివే స్వర్గానికి ఎలా వెళ్తావ్ అని ఆమె చిరని చేతికి కట్టుకునే ఆ పసితనం, తన కోసం అన్ని చేసే ఆవిడ కోసం చక్కగా చీర ఉతకడం జడ వెయ్యడం కాళ్ళు మర్దన చెయ్యడం లో ఆనందం ఆయనకే తెలుసు. ఆయన చేతికి రక్తం ఒస్తే ఆమె ఏడుస్తుంది . మొగుడికి తేలు కుడితే ఆమె వేసే మంత్రం ఏమిటో తెలుసా.. "వెంకటరమణా ఆయన నెప్పి నాకివ్వు స్వామీ" అని. ఆమెకి నిరంతరం ఒకటే తపన ఎక్కడ తను ముందు పైకి పొతే మొగుడు నానా అవస్త పడతాడేమో అని చివరగా బంగారం పోయి లక్క మిగిలిందని చెప్పే వైనం వారి బంధం ఒక్క విలువ కళ్ళకి కడుతుంది.

ఇదే పేరుతో వచ్చిన శ్రీరమణ గారి నవల ఈ చిత్రానికి స్పూర్తి. (విషయం ఏంటంటే ఇదే పుస్తకం ఆదారంగా మలయాళం లో 2000 లో "ఒరు చేరు పుంచిరి" అనే సినిమా తీసి బోలెడన్ని అవార్డులు కొట్టేసారు వారు. పోన్లే ఆలస్యం గా అయినా మన వాళ్ళు ఈ సినిమా తీసారు). అందుకే తనికెళ్ళ భరణి గారికి పాదాబివందనాలు( బోలెడన్ని అద్బుతః లు ) తప్పక చెయాలి. రాజేంద్రప్రసాద్ సినిమాటోగ్రఫి లో ఆ చిన్న ఇల్లే అత్యంత అందంగా కనిపించింది . స్వర వీణాపాణి సంగీతం అద్బుతః . ఇక నిర్మాతలకి ఒక పెద్ద థాంక్స్ చెప్దామా..!!

చివరగా (తెలిసొచ్చిన విషయాలు)...
రక్త సంబందీకుల గురించి అల్లాడి పోడం మానవ సహజమ్. కాని ఈ "పెళ్లి" అనే బంధంతో మన తోడుగ నిలిచే వారి కోసం తపించడం ఎంత సముచితమో తెలిపిందీ మిథునం. వేల ప్రేమ కథలు చెప్పలేని ప్రేమ-పెళ్లి లోని పరమార్ధం ఈ మిథునం వివరించింది.

మర్చిపోకుండా చూడండి
ఘుమఘుమ లాడే తెలుగు భోజనం ముందుంటే డైటింగ్ అంటూ కడుపు మాడ్చుకోకూడదు . అలాగే పదహారణాల తెలుగు సినిమా తీస్తే టైం లేదంటూ చూడకుండా ఉండకూడదు. థియేటర్ లో ఎలాగు చూడలేదు కనీసం యు ట్యూబ్ లో అయినా చూడాలి ఈ సినిమాని. ఇదిగో లింక్ .. అధ్బుతః

A review by Kumar Chakravarthy
kumarchakravarthy at gmail dot com

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved